స్వతంత్రుల జోరు | independents candidates hawa in elections | Sakshi
Sakshi News home page

స్వతంత్రుల జోరు

Published Mon, Apr 21 2014 4:07 AM | Last Updated on Tue, May 29 2018 4:06 PM

independents candidates hawa in elections

ఆనవాయితీగా ఆ రెండు సెగ్మెంట్లలో ఇండిపెండెంట్లదే హవా కొనసాగుతోంది. ఈసారి కూడా అక్కడ బరిలో ఉన్న స్వతంత్రులు ప్రధాన పార్టీల అభ్యర్థులకు ముచ్చెమటలు పుట్టిస్తున్నారు. హోరాహోరీగా ప్రచారంలో తలపడుతున్నారు. జిల్లాలోని మొత్తం అసెంబ్లీ స్థానాల్లో 60 మంది ఇండిపెండెంట్లు, లోక్‌సభ స్థానాల్లో 11 మంది ఇండిపెండెంట్లు పోటీలో ఉన్నారు. వీరిలో ఎక్కువ మంది నామ్‌కే వాస్తేగా బరిలో నిలిచినప్పటికీ... రామగుండం, కోరుట్ల నియోజకవర్గాల్లో స్వతంత్రుల పోరు అందరి దృష్టిని ఆకర్షిస్తోంది.

సాక్షి ప్రతినిధి, కరీంనగర్ : రామగుండం నియోజకవర్గంలో ప్రధాన పార్టీలకు మించి ఇండిపెండెం ట్ల ప్రచారం హోరెత్తుతోంది. ప్రధాన పార్టీ ల టిక్కెట్లు ఆశించి భంగపడ్డ నేతలు నలుగురు అక్కడ ఇండిపెండెంట్లుగా పోటీలో ఉండటం గమనార్హం.కాంగ్రెస్ రెబల్‌గా కౌశిక హరి, టీఆర్‌ఎస్ టిక్కెట్టు ఆశించిన కోరుకంటి చందర్, ఇటీవలే టీడీపీని వీడిన గోపు ఐలయ్యయాదవ్, వైఎస్సార్‌సీపీని వీడిన మక్కాన్‌సింగ్ అక్కడ ప్రధాన పార్టీలకు ధీటుగా ఎన్నికల్లో తలపడుతున్నారు.ఈ నియోజకవర్గంలో ఇండిపెండెంట్లను గెలిపించే ఆనవాయితీ ఉండటంతో.. ఇక్కడి పోటీ ఉత్కంఠ రేపుతోంది.
     
2009 ఎన్నికలోనూ ఇక్కడి ఓటర్లు ఇండిపెండెంట్ అభ్యర్థికి పట్టం కట్టారు. ఆఖరి నిమిషంలో టీడీపీ టిక్కెట్టు తెచ్చుకున్న సోమారపు సత్యనారాయణ గడువులోగా బీ ఫారమ్ సమర్పించకపోవటంతో టీవీ గుర్తుపై ఇండిపెండెంట్‌గా పోటీలో నిలిచి విజయం సాధించారు.
     
పునర్విభజనకు ముందు ఉన్న మేడారం (ఎస్సీ), కొత్తగా ఏర్పడ్డ రామగుండం నియోజకవర్గానికి ఇప్పటివరకు మొత్తం 12సార్లు ఎన్నికలు జరిగితే మూడుసార్లు స్వతంత్ర అభ్యర్థులు విజయం సాధించారు.
     
1962లో స్వతంత్ర అభ్యర్థి ఎం.రాంగోపాల్‌రెడ్డి, 1994లో టీడీపీ టిక్కెట్ దక్కకపోవటంతో స్వతంత్ర అభ్యర్థిగా పోటీ చేసిన గని కార్మికుడు మాలెం మల్లేశంను ఇక్కడి ఓటర్లు గెలిపించారు. దీంతో ఇక్కడ ఇండిపెండెట్ల పోటీ ప్రధాన పార్టీలకు సవాలు విసురుతోంది.
     
తెలంగాణ ఉద్య మ సమయంలో టీఆర్‌ఎస్‌లో చేరిన సి ట్టింగ్ ఎమ్మెల్యే సోమారపు సత్యనారాయణ ఈసారి పార్టీ అభ్యర్థిగా బరిలో ఉన్నారు. గత ఎన్నికల్లో ఆయనతో పోటాపోటీ పడ్డ ప్రత్యర్థులిద్దరూ ఈసారి ఇండిపెండెట్లుగా బరిలో నిలువటం గమనా ర్హం. అప్పటి పీఆర్‌పీ ప్రత్యర్థి కౌశికహరి, టీఆర్‌ఎస్ అభ్యర్థి కోరుకంటి చందర్ ఈ సారి ఇండిపెండెంట్లుగా పోటీలో ఉన్నా రు. వీరికి తోడు కాంగ్రెస్ అ భ్యర్థి బాబ ర్‌సలీంపాషా, బీజేపీ తరఫున గుజ్జుల రామకృష్ణారెడ్డి తలపడుతున్నారు.
     
కోరుట్లలోనూ ఇండిపెండెంట్ల ప్రభావం ఆసక్తి రేపుతోంది. పునర్విభజనకు ముందు మెట్‌పల్లి అసెంబ్లీ సెగ్మెంట్ పరిధిలో 1952 నుంచి 13సార్లు, కోరుట్ల సెగ్మెంట్‌లో రెండుసార్లు ఎన్నికలు జరిగాయి.
     
మెట్‌పల్లి సెగ్మెంట్‌లో రెండుసార్లు స్వతంత్ర అభ్యర్థులు ఎన్నికయ్యారు. బుగ్గారం సెగ్మెంట్‌లో 12సార్లు ఎన్నికలు జరిగితే నాలుగుసార్లు ఇండిపెండెంట్ అభ్యర్థులు గెలుపొందారు.
     
మెట్‌పల్లిలో 1952లో స్వతంత్ర అభ్యర్థి గంగుల భూమయ్య, 1967లో సీహెచ్.సత్యనారాయణరావు ఇండిపెండెంట్‌గా పోటీ చేసి గెలుపొందారు. బుగ్గారం నియోజకవర్గంలో 1957లో ఇండిపెండెంట్‌గా పోటీ చేసిన  మోహన్‌రెడ్డి, 1962లో ఏనుగు నారాయణరెడ్డి, 1972లో గెలిచిన జె.దామోదర్‌రావు ఇండిపెండెట్లుగా పోటీ చేసినవారే.
     
1989లో కాంగ్రెస్ టికెట్ ఆశించి భంగపడ్డ జువ్వాడి రత్నాకర్‌రావు స్వతంత్రునిగా పోటీకి దిగి.. టీడీపీ అభ్యర్థి వెంకటేశ్వరరావుపై విజయం సాధించారు.
     
తండ్రి తరహాలోనే ఈసారి కాంగ్రెస్ టిక్కెట్టు ఆశించి భంగపడ్డ జువ్వాడి తనయుడు నర్సింగరావు ఇండిపెండెంట్‌గా పోటీకి నిలిచారు. అక్కడ పోటీలో ఉన్న ప్రధాన అభ్యర్థులతో సమ ఉజ్జీగా ఎన్నికల్లో తలపడుతున్నారు. కోరుట్లలో కాంగ్రెస్ నుంచి కొమిరెడ్డి రాములు, టీఆర్‌ఎస్ అభ్యర్థిగా సిట్టింగ్ ఎమ్మెల్యే విద్యాసాగర్‌రావు, బీజేపీ అభ్యర్థి సురభి భూంరావు పోటీలో ఉన్నారు.

Advertisement

Related News By Category

Related News By Tags

Advertisement
 
Advertisement
Advertisement