స్వపక్షమా, ప్రతిపక్షమా అనవసరం. ఏ పార్టీ నుంచి గెలిచినా మనకు లాయల్‌గా ఉంటారా.. అవసరమైతే మనవైపు మొగ్గేవాళ్లేనా అనేదే కొత్త తరహా రాజకీయం. తెలంగాణాలో అలాంటి రాజకీయాలకు కేరాఫ్‌గా మారుతోంది రామగుండం. ఈ క్రమంలో గత ఎన్నికల తర్వాత జరిగిన సేమ్ సీనే మళ్లీ రిపీట్ అవుతుందా అన్నది రామగుండం రాజకీయాల్లో ఆసక్తికరంగా మారింది.
తెలంగాణలో రామగుండం రాజకీయాలు కొద్దిగా భిన్నంగా కనిపిస్తాయి. అందుకు గత ఎన్నికలే ఓ ఉదాహరణ అయితే.. ఈ ఎన్నికల్లో కూడా అదే సీన్ పునరావృతమయ్యే అవకాశాలు కనిపించడమే అందుకు కారణం. గత ఎన్నికల్లో రామగుండం అధికార బీఆర్ఎస్ అభ్యర్థిగా సోమారపు సత్యనారాయణ బరిలోకి దిగినా.. ఏఐఎఫ్బీ నుంచి సింహం గుర్తుపై ప్రస్తుత సిట్టింగ్ ఎమ్మెల్యే కోరుకంటి చందర్ పోటీలో ఉండి గెల్చారు. కానీ, ఆయన ఆ తర్వాత పూర్తిగా గులాబీ కండువా కప్పుకుని బీఆర్ఎస్ ఎమ్మెల్యే తరహాలో మారిపోయారు. అంతేకాదు, సోమారపుపై నాడున్న వ్యతిరేకత.. చందర్‌పై ఉన్న సానుభూతి పవనాల నేపథ్యంలో అధికార బీఆర్ఎస్ పెద్దలు కూడా రాజకీయంలో భాగంగా చందర్‌ను ఒకింత ప్రోత్సహించినట్టుగా కూడా వార్తలు గుప్పుమన్నాయి. ఈ విషయంలో ఇప్పటికీ ప్రస్తుత బీజేపీ నేత సోమారపు సత్యనారాయణలో ఒకింత బాధ కనిపిస్తూనే ఉంటుంది.
కేసీఆర్ లిస్ట్ ఫైనల్ కాదు..
గత ఎన్నికల్లో సిట్టింగ్ ఉండగా.. బూమ్‌లో ఉన్న మరో నేతను ప్రోత్సహించినట్టే ఈసారి కూడా జరుగబోతుందా అన్నదే ఇప్పుడు ఉత్కంఠ రేపుతున్న అంశం. చాలామంది సిట్టింగ్ ఎమ్మెల్యేలనే మళ్లీ కేసీఆర్ అభ్యర్థులుగా ప్రకటించినా.. బీఫామ్ ఇచ్చేనాటికి పరిస్థితుల్లో మార్పు ఉండొచ్చన్న చర్చ జరుగుతోంది. ఈ క్రమంలో అభ్యర్థులుగా ప్రకటించినవారు.. గులాబీబాస్ ప్రకటన తర్వాత నియోజకవర్గాల్లో ఎలా ఉంటున్నారు.. అందరినీ కలుపుకుపోతున్నారా అనేది అంతర్గత సర్వేలు ఇంకా కొనసాగుతూనే ఉన్నాయి. ఇప్పటికే రామగుండం ఎమ్మెల్యే కోరుకంటి చందర్‌పై అసంతృప్త నేతలు పెద్దఎత్తున తిరుగుబావుటా ఎగురేయడం.. ఏకంగా రెండుసార్లు ఇద్దరు మంత్రులు కేటీఆర్, కొప్పుల ఈశ్వర్ చర్చలు జరిపితేనేగానీ.. ఓ కొలిక్కి రావడం జరిగింది.
సింహం గుర్తు కలిసొచ్చేనా?
అయితే, అదంతా తాత్కాలికమేనని.. ఇంకా నివురుగప్పిన నిప్పులాగా సిట్టింగ్ చందర్‌పై అసంతృప్తి అలాగే ఉందనే చర్చ ఉంది. అసంతృప్త నేతల వైఖరీ రామగుండంలో ఇంకా అలాగే కనిపిస్తోంది. ఈ క్రమంలో అసంతృప్త నేతల్లో కీలకంగా వ్యవహరిస్తున్న పాలకుర్తి జెడ్పీటీసీ కందుల సంధ్యారాణి ఈసారి చందర్‌కు సపోర్ట్ చేసే పరిస్థితే లేదని తేల్చేశారు. తాను ఇండిపెండెంట్‌గా లేకుంటే, అవకాశం దొరికితే గతంలో ప్రస్తుత సిట్టింగ్‌కు సెంటిమెంట్‌గా కలిసివచ్చిన సింహం గుర్తుపైనైనా పోటీ చేయాలని ఆమె ఉవ్విళ్లూరుతున్నారు. ఈ క్రమంలో అకేషన్‌నూ తనకనుకూలంగా మార్చుకుంటూ ముందుకెళ్తున్న కందుల సంధ్యారాణి.. రాఖీ పండుగ నేపథ్యంలో కార్మికసంఘాల నాయకులు, కార్మికులకు పెద్దఎత్తున రాఖీలు కట్టి సోదర భావం సెంటిమెంట్‌నూ రగిల్చారు. ఈ నేపథ్యంలో.. కందులకు కవిత అండదండలు కూడా ఉన్నట్టుగా ప్రచారం ఇప్పుడు ఊపందుకుంది.
కందులకు కవిత హామీ..
రామగుండం వంటి కార్మిక క్షేత్రంలో అధికారాన్ని అస్సలు విడిచిపెట్టుకోవడానికి అధికారపార్టీ సిద్ధంగా లేనట్టే కనిపిస్తోంది. ఇప్పటికే కాంగ్రెస్‌లో రామగుండం కీలక నాయకులుగా వ్యవహరిస్తున్న బాబర్ సలీమ్ పాషా, హెచ్ఎమ్ఎస్ కీలక నేతైన రియాజ్ అహ్మద్ వంటివాళ్లనూ తమవైపు లాక్కోవడానికి అన్ని ప్రయత్నాలూ చేస్తోంది. మరోవైపు సిట్టింగ్ చందర్‌పై అసమ్మతి నేతలు వ్యక్తం చేసిన అసంతృప్తే ఇంకా కనిపిస్తే.. సమాంతరంగా అదే స్థాయిలో ప్రజామోదం ఉన్న నేతలను ప్రోత్సహించేందుకూ అధికార బీఆర్ఎస్ సిద్ధంగా ఉండి.. గత ఎన్నికల సీన్‌ను రిపీట్ చేసేందుకు యత్నిస్తోందనే టాక్ నడుస్తోంది. ఈ క్రమంలోనే ఇప్పుడు ఎమ్మెల్యేతో పోటీ పడుతూ సై అంటే సై అంటున్న కందుల సంధ్యారాణికి కవిత అభయహస్తమిచ్చిందని.. ఎక్కడా ఎమ్మెల్యేపైగానీ, పార్టీపైగానీ అనుచిత వ్యాఖ్యలు చేయకుండా నీ ప్రచారం నువ్వు చేసుకుపో అని భరోసా ఇచ్చినట్టుగా ఒక ప్రచారమైతే జరుగుతోంది. దీంతో రామగుండం రాజకీయం మొత్తం రాష్ట్రంలోనే ఓ భిన్నమైన ఒరవడితో సాగుతుండటం ఇప్పుడు ఆసక్తిని రేకెత్తిస్తోంది.
Comments
Please login to add a commentAdd a comment