Korukanti Chander
-
అవిశ్వాస తీర్మానం.. జోక్యం చేసుకున్న కోరుకంటి చందర్
పెద్దపల్లి: రామగుండం మున్సిపల్ కార్పొరేషన్లో బీఆర్ఎస్కు చెందిన మేయర్, డిప్యూటీ మేయర్‌కు అసమ్మతి సెగ రోజుకోతీరులో వెంటాడుతోంది. సొంత పార్టీ కార్పొరేటర్ల నుంచే వ్యతిరేకత ఎదురవుతుండడంతో ఏం చేయాలో తోచక పార్టీ పెద్దలు తలలు పట్టుకుంటున్నారని తెలుస్తోంది. అసమ్మతి కార్పొరేటర్లు ఆదివారం మరోసారి భేటీ అయ్యారని తెలిసింది. మేయర్, డిప్యూటీ మేయర్‌పై అవిశ్వాస తీర్మానం ప్రవేశ పెట్టడానికి సుమారు 26 మంది సంతకాలు చేశారని, ఇదే విషయాన్ని అసమ్మతి వర్గంలోని కొందరు కార్పొరేటర్లు వెల్లడిస్తున్నారు. సోమవారం లేదా మంగళవారం కలెక్టర్‌కు అవిశ్వాస తీర్మానం పత్రాలు అందజేయాలని నిర్ణయించుకున్నారని తెలిసింది. ఆ తర్వాత నేరుగా క్యాంపు కోసం గజ్వే ల్ సమీపంలోని ఓ రిసార్ట్‌కు వెళ్లడానికి ప్రణాళిక సిద్ధం చేసుకున్నారని సమాచారం. అయితే, కలెక్టరుకు నోటీసు ఇచ్చాకే వివరాలు వెల్లడిస్తామని అసంతృప్తి కార్పొరేటర్లు చెబుతున్నారు. అప్పుడు మౌనం.. రామగుండం మాజీ ఎమ్మెల్యే, బీఆర్ఎస్ జిల్లా అధ్యక్షుడు కోరుకంటి చందర్ స్పందించి అసంతృప్తి కార్పొరేటర్లతో గతనెలలో నేరుగా సమావేశమయ్యారు. అవిశ్వాస తీర్మానం ప్రవేశ పెట్ట వద్దని అందరికీ ఆయన నచ్చజెప్పారు. ఆ తర్వాత మౌనం వహించిన అసంతృప్తి కార్పొరేటర్లు.. ఇప్పుడు మళ్లీ అవిశ్వాస తీర్మానాన్ని తెరపైకి తీసుకొచ్చారు. అవిశ్వాస తీర్మానానికి అందరూ కట్టుబడి ఉన్నారని, 26 మంది ఇప్పటికే సంతకాలు చేశారని, వారందరినీ క్యాంపుకు తరలించడానికి రంగం సిద్ధం చేశారని సంకేతాలు ఇచ్చారు. మరోసారి జోక్యం చేసుకున్న కోరుకంటి చందర్.. శనివారం బీఆర్ఎస్ కార్పొరేటర్లతో టెలికాన్ఫరెన్స్ నిర్వహించారని తెలిసింది. అవిశ్వాసం తీర్మానం, క్యాంపు రాజకీయాలు వద్దని విజ్ఞప్తి చేశారని సమాచారం. బీఆర్ఎస్ పార్టీ ఆదేశాలను ధిక్కరిస్తే విప్ జారీచేయాల్సి వస్తుందని పార్టీ జిల్లా అధ్యక్షుడు అందరికీ నచ్చజెప్పారని సమాచారం. అయినా కార్పొరేటర్లు అవిశ్వాస తీర్మానానికే పట్టుపడుతున్నట్టు ప్రచారం సాగుతోంది. రెండ్రోజుల్లో ఈ ఉత్కంఠకు తెరపడే అవకాశాలు ఉన్నాయి. ఇవి చదవండి: ఎట్టకేలకు షబ్బీర్ అలీ సీనియారిటీకి దక్కిన గుర్తింపు.. -
ప్రచారంలో ప్రజల నుండి మంచి స్పందన వస్తుంది: కోరుకంటి చందర్
-
నేను చేసిన అభివృద్ధే నన్ను గెలిపిస్తుంది: ఎమ్మెల్యే కోరుకంటి చందర్
-
బీఆర్ఎస్లో రసవత్తర రాజకీయం.. కందులకు కవిత అభయహస్తం!
స్వపక్షమా, ప్రతిపక్షమా అనవసరం. ఏ పార్టీ నుంచి గెలిచినా మనకు లాయల్‌గా ఉంటారా.. అవసరమైతే మనవైపు మొగ్గేవాళ్లేనా అనేదే కొత్త తరహా రాజకీయం. తెలంగాణాలో అలాంటి రాజకీయాలకు కేరాఫ్‌గా మారుతోంది రామగుండం. ఈ క్రమంలో గత ఎన్నికల తర్వాత జరిగిన సేమ్ సీనే మళ్లీ రిపీట్ అవుతుందా అన్నది రామగుండం రాజకీయాల్లో ఆసక్తికరంగా మారింది. తెలంగాణలో రామగుండం రాజకీయాలు కొద్దిగా భిన్నంగా కనిపిస్తాయి. అందుకు గత ఎన్నికలే ఓ ఉదాహరణ అయితే.. ఈ ఎన్నికల్లో కూడా అదే సీన్ పునరావృతమయ్యే అవకాశాలు కనిపించడమే అందుకు కారణం. గత ఎన్నికల్లో రామగుండం అధికార బీఆర్ఎస్ అభ్యర్థిగా సోమారపు సత్యనారాయణ బరిలోకి దిగినా.. ఏఐఎఫ్బీ నుంచి సింహం గుర్తుపై ప్రస్తుత సిట్టింగ్ ఎమ్మెల్యే కోరుకంటి చందర్ పోటీలో ఉండి గెల్చారు. కానీ, ఆయన ఆ తర్వాత పూర్తిగా గులాబీ కండువా కప్పుకుని బీఆర్ఎస్ ఎమ్మెల్యే తరహాలో మారిపోయారు. అంతేకాదు, సోమారపుపై నాడున్న వ్యతిరేకత.. చందర్‌పై ఉన్న సానుభూతి పవనాల నేపథ్యంలో అధికార బీఆర్ఎస్ పెద్దలు కూడా రాజకీయంలో భాగంగా చందర్‌ను ఒకింత ప్రోత్సహించినట్టుగా కూడా వార్తలు గుప్పుమన్నాయి. ఈ విషయంలో ఇప్పటికీ ప్రస్తుత బీజేపీ నేత సోమారపు సత్యనారాయణలో ఒకింత బాధ కనిపిస్తూనే ఉంటుంది. కేసీఆర్ లిస్ట్ ఫైనల్ కాదు.. గత ఎన్నికల్లో సిట్టింగ్ ఉండగా.. బూమ్‌లో ఉన్న మరో నేతను ప్రోత్సహించినట్టే ఈసారి కూడా జరుగబోతుందా అన్నదే ఇప్పుడు ఉత్కంఠ రేపుతున్న అంశం. చాలామంది సిట్టింగ్ ఎమ్మెల్యేలనే మళ్లీ కేసీఆర్ అభ్యర్థులుగా ప్రకటించినా.. బీఫామ్ ఇచ్చేనాటికి పరిస్థితుల్లో మార్పు ఉండొచ్చన్న చర్చ జరుగుతోంది. ఈ క్రమంలో అభ్యర్థులుగా ప్రకటించినవారు.. గులాబీబాస్ ప్రకటన తర్వాత నియోజకవర్గాల్లో ఎలా ఉంటున్నారు.. అందరినీ కలుపుకుపోతున్నారా అనేది అంతర్గత సర్వేలు ఇంకా కొనసాగుతూనే ఉన్నాయి. ఇప్పటికే రామగుండం ఎమ్మెల్యే కోరుకంటి చందర్‌పై అసంతృప్త నేతలు పెద్దఎత్తున తిరుగుబావుటా ఎగురేయడం.. ఏకంగా రెండుసార్లు ఇద్దరు మంత్రులు కేటీఆర్, కొప్పుల ఈశ్వర్ చర్చలు జరిపితేనేగానీ.. ఓ కొలిక్కి రావడం జరిగింది. సింహం గుర్తు కలిసొచ్చేనా? అయితే, అదంతా తాత్కాలికమేనని.. ఇంకా నివురుగప్పిన నిప్పులాగా సిట్టింగ్ చందర్‌పై అసంతృప్తి అలాగే ఉందనే చర్చ ఉంది. అసంతృప్త నేతల వైఖరీ రామగుండంలో ఇంకా అలాగే కనిపిస్తోంది. ఈ క్రమంలో అసంతృప్త నేతల్లో కీలకంగా వ్యవహరిస్తున్న పాలకుర్తి జెడ్పీటీసీ కందుల సంధ్యారాణి ఈసారి చందర్‌కు సపోర్ట్ చేసే పరిస్థితే లేదని తేల్చేశారు. తాను ఇండిపెండెంట్‌గా లేకుంటే, అవకాశం దొరికితే గతంలో ప్రస్తుత సిట్టింగ్‌కు సెంటిమెంట్‌గా కలిసివచ్చిన సింహం గుర్తుపైనైనా పోటీ చేయాలని ఆమె ఉవ్విళ్లూరుతున్నారు. ఈ క్రమంలో అకేషన్నూ తనకనుకూలంగా మార్చుకుంటూ ముందుకెళ్తున్న కందుల సంధ్యారాణి.. రాఖీ పండుగ నేపథ్యంలో కార్మికసంఘాల నాయకులు, కార్మికులకు పెద్దఎత్తున రాఖీలు కట్టి సోదర భావం సెంటిమెంట్‌నూ రగిల్చారు. ఈ నేపథ్యంలో.. కందులకు కవిత అండదండలు కూడా ఉన్నట్టుగా ప్రచారం ఇప్పుడు ఊపందుకుంది. కందులకు కవిత హామీ.. రామగుండం వంటి కార్మిక క్షేత్రంలో అధికారాన్ని అస్సలు విడిచిపెట్టుకోవడానికి అధికారపార్టీ సిద్ధంగా లేనట్టే కనిపిస్తోంది. ఇప్పటికే కాంగ్రెస్‌లో రామగుండం కీలక నాయకులుగా వ్యవహరిస్తున్న బాబర్ సలీమ్ పాషా, హెచ్ఎమ్ఎస్ కీలక నేతైన రియాజ్ అహ్మద్ వంటివాళ్లనూ తమవైపు లాక్కోవడానికి అన్ని ప్రయత్నాలూ చేస్తోంది. మరోవైపు సిట్టింగ్ చందర్‌పై అసమ్మతి నేతలు వ్యక్తం చేసిన అసంతృప్తే ఇంకా కనిపిస్తే.. సమాంతరంగా అదే స్థాయిలో ప్రజామోదం ఉన్న నేతలను ప్రోత్సహించేందుకూ అధికార బీఆర్ఎస్ సిద్ధంగా ఉండి.. గత ఎన్నికల సీన్‌ను రిపీట్ చేసేందుకు యత్నిస్తోందనే టాక్ నడుస్తోంది. ఈ క్రమంలోనే ఇప్పుడు ఎమ్మెల్యేతో పోటీ పడుతూ సై అంటే సై అంటున్న కందుల సంధ్యారాణికి కవిత అభయహస్తమిచ్చిందని.. ఎక్కడా ఎమ్మెల్యేపైగానీ, పార్టీపైగానీ అనుచిత వ్యాఖ్యలు చేయకుండా నీ ప్రచారం నువ్వు చేసుకుపో అని భరోసా ఇచ్చినట్టుగా ఒక ప్రచారమైతే జరుగుతోంది. దీంతో రామగుండం రాజకీయం మొత్తం రాష్ట్రంలోనే ఓ భిన్నమైన ఒరవడితో సాగుతుండటం ఇప్పుడు ఆసక్తిని రేకెత్తిస్తోంది. -
గులాబీలో సీటు హీటు.. కేటీఆర్, కవిత మధ్య పొలిటికల్ పోరు!
కోల్ బెల్ట్ ఏరియా నుంచి ఎమ్మెల్సీ కల్వకుంట్ల కవిత బరిలోకి దిగనున్నారా?. ఎమ్మెల్యేను మార్చాల్సిందే అంటున్న రామగుండం అసమ్మతి నేతలు కవితకు జై కొడుతున్నారా?. ఎమ్మెల్సీ కవితను బరిలో దించండి లేదా మాలో ఒకరికి సీటివ్వండని కోరుతున్న అసమ్మతి నేతల మాట కేసీఆర్ వింటారా?. సిట్టింగ్ ఎమ్మెల్యే మంత్రి కేటీఆర్‌ను నమ్ముకుంటే.. అసమ్మతి నేతలు ఆయన సోదరి కవితను నమ్ముకున్నారా?. బొగ్గుబావుల్లో పరోక్షంగా అన్నాచెల్లెళ్ల పోరుకు తెరలేవనుందా?. అసలు రామగుండం గులాబీ కోటలో ఏం జరుగుతోంది?.. రామగుండం అంటే నిప్పుల కొలిమిలా ఉంటుంది. అక్కడి రాజకీయాలు కూడా కొద్ది రోజుల నుంచి వేసవిని మించి మించి హీటెక్కుతున్నాయి. అధికార బీఆర్ఎస్ పార్టీలోని అంతర్గత సంక్షోభం తారాస్థాయికి చేరింది. సిట్టింగ్ ఎమ్మెల్యే కోరుకంటి చందర్‌పై.. అసమ్మతి వర్గం తిరుగుబాటు జెండా ఎగురేసింది. తెలంగాణ బొగ్గు గని కార్మిక సంఘం ప్రధాన కార్యదర్శి మిరియాల రాజిరెడ్డి మరో నలుగురు నాయకులు ఈ ఎమ్మెల్యే మాకొద్దంటూ ఉద్యమం లేవదీసారు. ముచ్చటగా మూడోసారి కేసీఆర్‌నే సీఎం చేయాలంటూ ప్రజా ఆశీర్వాద యాత్ర చేపట్టిన అసమ్మతి నేతలు.. తమ యాత్రలో ఎక్కడా సిట్టింగ్ ఎమ్మెల్యే కోరుకంటి చందర్ ఫోటో లేకుండా చేశారు. అదే సమయంలో జన చైతన్యయాత్ర పేరిట సిట్టింగ్ ఎమ్మెల్యే చందర్ కూడా పాదయాత్ర ప్రారంభించారు. ఇరువర్గాల మధ్య రామగుండం కేంద్రంగా బాహాబాహీకి తెరలేచి ఉద్రిక్తతకూ దారితీసింది. నేతలు ఫైర్.. పార్టీ అంతర్గత రాజకీయాలు అధిష్ఠానానికి తలబొప్పి కట్టిస్తున్నాయి. ఈ క్రమంలో మంత్రి కొప్పుల ఈశ్వర్ ఆధ్వర్యంలో.. పార్టీ నాయకత్వం అసమ్మతి నేతలతో ఓ సమావేశాన్ని నిర్వహించింది. కొప్పుల ఎంత నచ్చజెప్పినా చల్లబడని నేతలు.. మంత్రి కేటీఆర్‌తో సమావేశమయ్యేందుకు హైదరాబాద్ బాట పట్టారు. కానీ, అక్కడ కేటీఆర్ సమయం ఇవ్వకపోవడంతో ఆ భేటీ జరగలేదు. దీంతో మరోసారి అసమ్మతి నేతలంతా ఏకంగా రామగుండంలో ఓ ప్రెస్‌మీట్ పెట్టి.. ఈ ఎమ్మెల్యే మాకొద్దంటూ మీడియా ముఖంగా ప్రకటించేశారు. చందర్‌కు కేటీఆర్ అండ.. తెలంగాణ బొగ్గు గని సంఘం గౌరవ అధ్యక్షురాలిగా ఉన్న ఎమ్మెల్సీ కల్వకుంట్ల కవితను రామగుండం నుంచి బరిలోకి దింపితే గెలిపించుకుంటామని అసమ్మతి నేతలు ప్రకటించారు. లేదంటే, తమలో ఎవరైనా ఒకరికి టిక్కెట్ ఇవ్వాలని అధిష్ఠానాన్ని డిమాండ్ చేశారు. అసమ్మతి నేతల్ని సిట్టింగ్ ఎమ్మెల్యే లైట్ తీసుకుంటున్నారు. మంత్రి కేటీఆర్ అండదండలున్న చందర్ ఆయన ఆశీస్సులతోనే ముందుకెళ్లాలని.. మళ్లీ టిక్కెట్ సాధించుకునేందుకు తన ప్రయత్నాలు తాను చేస్తున్నారు. మరోవైపు అసమ్మతి నేతలు మాత్రం మంత్రి కేటీఆర్ సోదరి ఎమ్మెల్సీ కవితను నమ్ముకున్నారు. కవిత సాహసం చేస్తారా?.. కేసీఆర్ తనయ ఎమ్మెల్సీ కవిత.. నిజామాబాద్ అర్బన్, బోధన్, కామారెడ్డి, జగిత్యాల నియోజకవర్గాల్లో ఎక్కడినుంచైనా బరిలోకి దిగొచ్చంటూ ఇప్పటికే ప్రచారం జరుగుతోంది. తాజాగా రామగుండం అసమ్మతి నేతల ప్రకటనతో.. కోల్ బెల్ట్ ఏరియా నుంచే ఎన్నికల బరిలోకి దిగుతారా అన్న చర్చ మొదలైంది. అయితే తెలంగాణ బొగ్గు గని సంఘంకు కూడా కార్మికుల నుంచి కొంత వ్యతిరేకత ఏర్పడిన నేపథ్యంలో.. అలాంటి సాహసం కవిత చేస్తారా అనే అనుమానం కలుగుతోంది. మొత్తంగా రామగుండం బరిలో నిలిచే అధికారపార్టీ అభ్యర్థి ఎవరనే ఉత్కంఠ కనిపిస్తోంది. సిట్టింగ్ ఎమ్మెల్యేకే సీటిస్తారా? లేక అసమ్మతి నేతల పంతం నెగ్గుతుందా అనే చర్చ సాగుతోంది. ఇది కూడా చదవండి: కేసీఆర్ సర్కార్‌పై బీజేపీ నేతల సంచలన ఆరోపణలు -
కేటీఆర్ పేషీలో ‘రామగుండం’ పంచాయితీ
సాక్షి, హైదరాబాద్: తెలంగాణ అసెంబ్లీ ఎన్నికలు దగ్గర పడే కొద్దీ.. టికెట్ల లొల్లి ముదురుతోంది. అధికార పక్షం బీఆర్ఎస్లో నిజయోకవర్గాల వారీగా అసమ్మతి సెగలు ఒక్కొక్కటి బయటపడతున్నాయి. రాజధానికి చేరి.. అధిష్టానాన్ని ఉక్కిరి బిక్కిరి చేస్తున్నాయి. ఈ క్రమంలో పెద్దపల్లి జిల్లా రామగుండం అసమ్మతి నేతలు మంత్రి కేటీఆర్‌తో శుక్రవారం భేటీ అయ్యారు. అసెంబ్లీ కేటీఆర్ పేషీలోనే గంటల తరబడి వీళ్ల సమావేశం జరిగింది. రామగుండం ఎమ్మెల్యే కోరుకంటి చందర్ పై అసమ్మతి నేతలు కేటీఆర్‌కు ఫిర్యాదు చేశారు. కోరుగంటి చందర్‌కు ఎట్టి పరిస్థితుల్లో టికెట్ ఇవ్వొద్దని కేటీఆర్‌కు చెప్పారు వాళ్లు. కావాలనుకుంటే జిల్లా అధ్యక్షునిగా కోరుకంటి కొనసాగినా పర్వాలేదని.. కానీ, ఎమ్మెల్యే టికెట్ మాత్రం వేరేవాళ్లకు ఇవ్వాలని అసమ్మతి నేతలు కేటీఆర్‌ను కోరారు. ఈ తరుణంలో అధ్యక్షుడిగా కోరుకంటి ఉంటే మీకు ఓకేనా? అని అసమ్మతి నేతల్ని కేటీఆర్ అడగడం గమనార్హం. అయితే.. కలిసి పనిచేయాలా? వద్దా? అనేది కోరుకంటిపై ఆధారపడి ఉంటుందని అసమ్మతి నేతలు కేటీఆర్‌కు బదులిచ్చినట్లు సమాచారం. అంతేకాదు అధిష్టాన నిర్ణయంపైనే తమ రాజకీయ భవిష్యత్ ఉంటుందని కూడా వాళ్లు తేల్చి చెప్పినట్లు తెలుస్తోంది. ‘‘పార్టీకి నష్టం కలిగించే పనులు చేయొద్దంటూ అసంతృప్తి నేతలకు సూచిస్తూనే.. సర్వేలు ఎవరికి అనుకూలంగా ఉంటే వారికే టికెట్ ఇస్తాం. ఎమ్మెల్యే కాబట్టి ఆయనతో మాట్లాడితే నాకు ఆయన దగ్గర అనుకుంటే ఎలా?’’ అని అసమ్మతి నేతలను ఆయన ప్రశ్నించారు. అయితే.. ఎమ్మెల్యే తమపై కేసులు పెట్టి వేధించాడని నేతలు చెప్పగా.. సొంత పార్టీ నేతలపై ఎమ్మెల్యే కేసులు పెట్టి వేధించిన విషయం తనకు తెలువదన్న కేటీఆర్ వాళ్లతో అన్నట్లు తెలుస్తోంది. ఈ క్రమంలో.. పార్టీకి వ్యతిరేకంగా ప్రెస్ మీట్స్ పెట్టొద్దని ఆయన అసమ్మతి నేతలకు సూచించారు. ఇక.. అసమ్మతి నేతలతో పాటు ఎమ్మెల్యే కోరుకంటి చందర్తోనూ కేటీఆర్ భేటీ అయ్యి ఈ పరిణామాలపై చర్చించారు. ఆపై ‘‘నేను చెప్పాల్సింది చెప్పిన.. ఏ నిర్ణయం తీసుకున్నా పార్టీ కోసమే పనిచేస్తా.. అంటూ ఎమ్మెల్యే కోరుకంటి వ్యాఖ్యానించడం గమనార్హం. కేటీఆర్‌తో భేటీ అనంతరం.. మంత్రి కొప్పుల ఈశ్వర్తోనూ రామగుండం అసమ్మతి నేతలు భేటీ కావడం గమనార్హం. ఇదీ చదవండి: తెలంగాణలో కులగజ్జి, మతపిచ్చి లేదు -
గులాబీ కోటలో కొత్త టెన్షన్.. ఆ ఐదు సెగ్మెంట్లలో ఏం జరుగుతోంది?
ఉమ్మడి కరీంనగర్ జిల్లా గులాబీ పార్టీకి కంచుకోటగా మారింది. ప్రత్యర్థులకు ఆనవాళ్ళు కూడా లేకుండా చేశాయి బీఆర్ఎస్ శ్రేణులు. కానీ ఇప్పుడు పార్టీలోనే ప్రత్యర్థులు తయారయ్యారు. ముఖ్యంగా అయిదు సెగ్మెంట్లలో గులాబీ పార్టీ నేతలు కుమ్ములాడుకుంటున్నారు. ప్రతిపక్షాలు లేని కొరతను సొంత పార్టీ వారే తీరుస్తున్నారు. నియోజకవర్గాల్లో రణరంగాన్ని సృష్టిస్తున్నారు. ఇంతకీ ఆ ఐదు సెగ్మెంట్ల కథేంటీ... ఉత్తర తెలంగాణలో కీలకమైన ఉమ్మడి కరీంనగర్ జిల్లాలోని ఐదు నియోజవర్గాల్లో గులాబీ పార్టీలో అంతర్గత కలహాలు రోజు రోజుకు ముదురుతున్నాయి. రామగుండం నియోజకవర్గంలో ఫార్వర్డ్ బ్లాక్ గుర్తుపై గెలిచిన కోరుకంటి చందర్ తర్వాతి కాలంలో కారెక్కి విహరిస్తున్నారు. వచ్చే ఎన్నికల్లో చందర్‌కు సీటిస్తే మద్దతిచ్చే ప్రసక్తి లేదని ఆయన వ్యతిరేకులు గులాబీ పార్టీ నాయకత్వానికి తేల్చి చెప్పేశారు. బీఆర్ఎస్కు చెందిన పలువురు నేతలు కోరుకంటి చందర్‌కు వ్యతిరేకంగా గళం విప్పుతున్నారు. కేసీఆర్‌ను మళ్ళీ సీఎం చేయాలంటూ ఆశయసాధన పేరుతో యాత్ర చేస్తున్న అసమ్మతి నేతలు ఎమ్మెల్యే ఫోటోను మాత్రం పెట్టలేదు. మరోవైపు ఎమ్మెల్యే వర్గం కూడా పాదయాత్ర నిర్వహించగా.. రెండు వర్గాలు రామగుండంలో వీధిపోరాటానికి దిగాయి. చదవండి: డోలాయమానంలో గడల శ్రీనివాసరావు రాజకీయ భవిష్యత్ నిర్వేదంతో సిట్టింగ్ ఎమ్మెల్యే రాజన్న కొలువై ఉన్న వేములవాడలోనూ గులాబీ పార్టీలో గ్రూప్‌లు ఏర్పడి కుమ్ములాడుకుంటున్నాయి. నియోజకవర్గంలో రెండు పార్టీ ఆఫీసులతో భిన్నమైన పరిస్థితి కొనసాగుతోంది. సిట్టింగ్ ఎమ్మెల్యే చెన్నమనేని రమేష్ బాబు టిక్కెట్‌కు చల్మెడ లక్ష్మీనర్సింహారావు అడ్డుపడుతున్నారు. కొద్దికాలంగా రమేష్ బాబు వర్సెస్ చల్మెడ ఎపిసోడ్ వేములవాడ రాజకీయాల్ని రసవత్తరంగా మార్చాయి. ఇద్దరి మధ్యా ఉప్పునిప్పూ అన్నట్టుగా రాజకీయం నడుస్తోంది. ఈ క్రమంలో ఈసారి రమేష్ బాబు టికెట్‌కు గండి కొట్టి.. చల్మెడకే కన్ఫర్మ్ అనే టాక్ వేములవాడలో చాలా రోజులుగా నడుస్తోంది. టికెట్ రాదేమోనన్న నిర్వేదంతో పాటు.. పార్టీలోని ప్రత్యర్థులపై అక్కసు, ఆక్రోశమూ సిట్టింగ్ ఎమ్మెల్యే రమేష్ బాబు మాటల్లో కనిపిస్తోంది. తనను ధిక్కరించిన ఈటల రాజేందర్‌కు ఈసారి ఎలాగైనా చెక్ పెట్టాలని గులాబీ బాస్ కేసీఆర్ పట్టుదలతో ఉన్నారు. ఈటలతో యుద్ధానికి పంపిన ఎమ్మెల్యే కౌశిక్‌రెడ్డి నిత్యం వివాదాలతో సహవాసం చేస్తూ కేసీఆర్ ఆశల్ని తుంచేస్తున్నారు. కౌశిక్‌రెడ్డిని నియోజకవర్గ ఇంఛార్జ్‌గా తొలగించాలంటూ మార్కెట్ కమిటీ మాజీ చైర్మన్ తుమ్మేటి సమ్మిరెడ్డి వంటివారు మీడియా ముందుకు రావడం.. ఆయనకు షోకాజ్ నోటీసులు జారీ చేస్తే.. మరింత రెబల్‌గా సమ్మిరెడ్డి మాట్లాడిన తీరు ఇప్పుడు హుజూరాబాద్ రాజకీయాల్లో బీఆర్ఎస్ పరిస్థితిని కళ్లకు కడుతోంది. అంతేకాదు కొందరు సర్పంచులు, ఎంపీటీసీలు కూడా కౌశిక్‌కు వ్యతిరేకంగా మీటింగ్స్ ఏర్పాటు చేసుకోవడం కూడా చర్చనీయాంశంగా మారింది. దీంతో హుజూరాబాద్‌లో అభ్యర్థెవ్వరన్న ప్రశ్నలతో పాటు.. ఎవరు అభ్యర్థిగా బరిలో ఉన్నా.. మిగిలిన వర్గాలు ఎంతవరకూ మద్దతిస్తాయన్నది కూడా సందేహమే. ఇక పెద్దపెల్లి ఎమ్మెల్యే దాసరి మనోహర్ రెడ్డి తీరుపై కూడా పార్టీలో అంతర్గతంగా అసహనం వ్యక్తమవుతోంది. మున్సిపల్ మాజీ చైర్ పర్సన్ రాజయ్య ఎమ్మెల్యేకు వ్యతిరేకంగా ఓ ప్రెస్‌మీట్ నిర్వహించారు. ఎమ్మెల్యే దాసరి తీరుపై అలిగి ఆయన కీలక అనుచరుడైన ఉప్పు రాజ్ కుమార్ పార్టీనుంచే బయటకు వెళ్ళిపోయాడు. అయితే అతణ్ని బ్రతిమాలి మళ్ళీ పార్టీలోకి తీసుకువచ్చారు. చదవండి: ఎల్లారెడ్డిలో కాంగ్రెస్, బీఆర్ఎస్ పోటాపోటీ... స్థానిక సంస్థల ఎమ్మెల్సీగా ఉన్న భానుప్రసాద్ రావు కూడా ఈసారి టిక్కెట్ కోసం తీవ్రంగా ప్రయత్నిస్తున్నారు. ఎమ్మెల్యే దాసరి మనోహర్ రెడ్డీతో ఎమ్మెల్సీ భానుప్రసాద్‌కు సఖ్యత లేకపోవడం వల్ల ఆయనకు ప్రత్యర్థులు పెరిగిపోతున్నారు. ఈసారి బీసీలకే పెద్దపెల్లి టిక్కెట్ ఇవ్వాలన్న డిమాండ్ తెరపైకి రావడంతో పాటు.. సామాజిక సమీకరణలు కూడా పార్టీకి తలబొప్పి కట్టిస్తున్నాయి. జూలపల్లి జెడ్పీటీసి లక్ష్మణ్ కేసీఆర్ సేవాదళం పేరుతో కార్యక్రమాలు చేస్తూ.. ఎమ్మెల్యే దాసరిపై కనిపించని యుద్ధం చేస్తున్నారు. జూలపల్లి జడ్పీటీసీ కూడా పెద్దపల్లి టికెట్ కోసం ప్రయత్నిస్తున్నారు. చొప్పదండి నియోజకవర్గంలోనూ ఇదే పరిస్థితి. పైకి సిట్టింగ్ ఎమ్మెల్యేకే టిక్కెట్ అని ప్రచారం జరుగుతున్నా..వెనుక పెద్ద పెద్ద గోతులు తవ్వుతున్నట్టు టాక్ నడుస్తోంది. ఎమ్మెల్యేగా ఎన్నికయ్యాక ఎవ్వరినీ కలుపుకుపోలేని ఆయన తీరు, అవినీతి, అక్రమాల ఆరోపణలతో ఈసారి సిట్టింగ్ ఎమ్మెల్యే సుంకె రవిశంకర్‌కు టిక్కెట్ వస్తుందా, రాదా అనే చర్చ జరుగుతోంది. రవిశంకర్‌కు టిక్కెట్ ఇస్తే పార్టీ పరంగానే మద్దతు లభించని పరిస్థితులు కనిపిస్తున్నాయి. పైగా చొప్పదండిలో పోటీకి రెండు మూడు పేర్లను నియోజకవర్గ నేతలు తెరపైకి తెస్తున్నారు. మొత్తంగా ఈ ఐదు నియోజకవర్గాల్లో ప్రస్తుతం అధికార బీఆర్ఎస్ పరిస్థితి నివురుగప్పిన నిప్పులా మారింది. క్యాడర్ బలంగా ఉన్నా.. లీడర్స్ మధ్య సమన్వయం లేకపోవడంతో రాబోయే రోజుల్లో ఇక్కడి గులాబీ కోటకు ప్రమాదమే అన్న సంకేతాలు వెలువడుతున్నాయి. మరి గులాబీ బాస్ తన కోటకు మరమ్మతులు చేస్తారా? రాబోయే ప్రమాదాన్ని నివారిస్తారా? వేచి చూడాల్సిందే. -
Karimnagar: ఉగాది వేళ.. జాతకాల్లో అదృష్టం వెతుక్కుంటున్న నేతలు
సాక్షి, కరీంనగర్: తెలుగువారి కొత్త సంవత్సరాది ఉగాది. శోభకృత్ నామ సంవత్సరం సందర్భంగా ప్రతీ ఒక్కరూ తమ జాతకాన్ని కొత్త పంచాంగంలో వెతుక్కుంటున్నారు. ఈ ఉగాది సాధారణ ప్రజల కంటే.. రాజకీయ నాయకులకు ఎంతో కీలకమైంది. అధికారంలో ఉన్న ఎమ్మెల్యేలు, ప్రతిపక్షంలో ఉన్న ప్రత్యర్థులు, ఈసారి ఎన్నికల బరిలో తమ అదృష్టాన్ని పరీక్షించుకుందామనుకునే ఆశావహులు ఆసక్తిగా ఎదురుచూస్తున్నారు. ఉమ్మడి జిల్లాలోని 12 నియోజకవర్గాల్లో అధికార–ప్రతిపక్ష నేతలంతా నూతన పంచాంగంలో తమ జాతకాలలో ఆదాయ వ్యయాల మాట ఎలా ఉన్నా.. రాజ్యపూజ్యంపైనే కన్నేశారు. అవమానాల మాట పక్కనబెట్టి.. రాజ్యపూజ్యం దక్కుతుందా? లేదా అన్న అంశంపైనే ప్రధానంగా దృష్టి కేంద్రీకరిస్తున్నారు. అన్ని నియోజకవర్గాల్లో రాజకీయ పరిస్థితిని ఒకసారి పరిశీలిస్తే.. కరీంనగర్: బీఆర్ఎస్ మంత్రి గంగుల కమలాకర్ తీగల వంతెన, ఎమ్మారెఫ్, స్మార్ట్ సిటీ పనులతో కరీంనగర్‌పై ఫోకస్ పెట్టారు. హిందుత్వం, మార్పు అన్న ఎజెండాతో బీజేపీ రాష్ట్ర అధ్యక్షుడు బండి సంజయ్ నుంచి పోటీ ఎదరవనుంది. బీజేపీ నుంచి కొత్త జయపాల్‌రెడ్డి కూడా ప్రయత్నాలు చేస్తున్నారని సమాచారం. కాంగ్రెస్ నుంచి మాజీ మంత్రి ఎమ్మెస్సార్ మనవడు రోహిత్, నగరాధ్యక్షుడు కోమటిరెడ్డి నరేందర్‌రెడ్డి టికెట్ ఆశిస్తున్నారు. వైస్సార్టీపీ నుంచి డాక్టర్ నగేశ్ బరిలో నిలవనున్నారు. చొప్పదండి: ప్రస్తుతం ఎమ్మెల్యే రవిశంకర్ (బీఆర్ఎస్)కు ఇంటిపోరు తప్పేలా లేదు. అదేపార్టీ నుంచి గజ్జెల కాంతం, కత్తెరపాక కొండయ్య, కార్పొరేటర్ కంసాల శ్రీనివాస్ టికెట్ రేసులో ఉన్నారు. ఈసారి మేడిపల్లి సత్యం (కాంగ్రెస్) నుంచి గట్టి పోటీ ఇవ్వనున్నారు. బీజేపీ నుంచి బొడిగె శోభ, సుద్దాల దేవయ్యల మధ్య తీవ్ర పోటీ నెలకొంది. వైఎస్సార్టీపీ నుంచి అక్కెనపల్లి కుమార్ బరిలో నిలవనున్నారు. మానకొండూరు: ఇక్కడ నుంచి రెండుసార్లు ఎమ్మెల్యేగా గెలిచిన రసమయి బాలకిషన్‌కు ఈసారి ఇంటి పోరు తీవ్రంగానే ఉంది. మాజీ ఎమ్మెల్యే ఆరెపల్లి మోహన్, ఇక్కడే నుంచే పోటీ చేసిన ఓరుగంటి ఆనంద్ కూడా టికెట్ కోసం ప్రయత్నిస్తున్నారు. కాంగ్రెస్ నుంచి కవ్వంపల్లి సత్యనారాయణ, బీజేపీ గడ్డం నాగరాజు, దరువు ఎల్లన్న బరిలో నిలవనున్నారు. హుజూరాబాద్: గత ఎన్నికల్లో బీఆర్ఎస్ నుంచి గెలిచిన ఈటల రాజేందర్ ప్రస్తుతం బీజేపీలో ఉన్నారు. బీఆర్ఎస్ విప్, ఎమ్మెల్సీ పాడి కౌశిక్‌రెడ్డి ఈసారి బరిలో దిగనున్నారు. కాంగ్రెస్ నుంచి ఎన్ఎస్యూఐ రాష్ట్ర అధ్యక్షుడు బల్మూరి వెంకట్ తన అదృష్టాన్ని పరీక్షించుకోనున్నారు. సిరిసిల్ల: ఇక్కడ నుంచి ప్రాతినిధ్యం వహిస్తున్న మంత్రి కేటీఆర్‌కు ప్రత్యర్థులు పెద్దగా లేరు. కాంగ్రెస్ నుంచి కె.కె.మహేందర్‌రెడ్డి మినహా ఇక్కడ ఆయనకు గట్టి వైరిపక్షం కానరావడం లేదు. ఈసారి బీజేపీ మాత్రం సెలబ్రెటీని రంగంలోకి దించుతారన్న ప్రచారం సాగుతోంది. రామగుండం: ప్రస్తుతం ఎమ్మెల్యే కోరుకంటి చందర్‌కు, ఈసారి కాంగ్రెస్ నేత ఠాకూర్ మక్కాన్ సింగ్ (కాంగ్రెస్) గట్టి పోటీ ఎదురవనుంది. వీరితోపాటు సీనియర్ నేత మాజీ ఎమ్మెల్యే సోమారపు సత్యనారాయణ (బీజేపీ) కూడా బరిలో ఉండటంతో పోరు రసవత్తరంగా మారనుంది. వేములవాడ: ప్రస్తుత ఎమ్మెల్యే చెన్నమనేని రమేశ్ (బీఆర్ఎస్)కు చిరకాల ప్రత్యర్థి ఈసారి కాంగ్రెస్ నేత ఆది శ్రీనివాస్ నుంచి గట్టి పోటీ ఎదురయ్యే అవకాశాలు కనిపిస్తున్నాయి. బీజేపీ నుంచి చెన్నమనేని విద్యాసాగర్ రావు కుమారుడు వికాస్ పేరు వినిపిస్తుండగా.. తాను స్వతంత్రంగానైనా పోటీచేస్తానని అదే పార్టీ నేత తుల ఉమ ఇప్పటికే ప్రకటించారు. ఎన్నారైలు గోలి మోహన్ (ఇప్పటికే నియోజకవర్గంలో పర్యటిస్తున్నారు), మరో ఎన్నారై తోట రాంకుమార్ కూడా బరిలో నిలిచేందుకు ఆసక్తిగా ఉన్నారు. జగిత్యాల: డాక్టర్ సంజయ్ ఇప్పటికే వరుసగా గ్రామాల్లో పర్యటిస్తూ.. పల్లె నిద్ర పేరుతో ప్రజలకు చేరవవుతున్నారు. ఇక మాజీ మంత్రి, ఎమ్మెల్సీ జీవన్‌రెడ్డి (కాంగ్రెస్) కూడా పోటాపోటీగా పర్యటనలు చేస్తున్నారు. ఇటీవల భోగశ్రావణి బీజేపీ నుంచి బరిలోకి దిగేందుకు ఆసక్తిగా ఉన్నారు. కోరుట్ల: ప్రస్తుత ఎమ్మెల్యే కల్వకుంట్ల విద్యాసాగర్ రావు(బీఆర్ఎస్) వరుసగా అభివృద్ధి పనులు, శంకుస్థాపనలు అంటూ పర్యటిస్తున్నారు. ఈసారి జువ్వాడి నర్సింగరావు (కాంగ్రెస్) గట్టి పోటీ ఇచ్చేందుకు సంసిద్ధంగా ఉన్నారు. మార్పులు జరిగితే వీరిద్దరు కుమారులను బరిలో దింపుతారన్న ప్రచారం కూడా జరుగుతోంది. ధర్మపురి: ఇక్కడ నుంచి ప్రాతినిధ్యం వహిస్తున్న మంత్రి కొప్పుల ఈశ్వర్ (బీఆర్ఎస్)కు ఈసారి గట్టి పోటీ ఉంది. ఇక్కడ నుంచి అడ్లూరి లక్ష్మణ్ (కాంగ్రెస్), మాజీ ఎంపీ గడ్డం వివేక్ (బీజేపీ) కూడా బరిలోకి దిగుతారని ప్రచారం సాగుతోంది. పెద్దపల్లి: ప్రస్తుత ఎమ్మెల్యే మనోహర్‌రెడ్డి (బీఆర్ఎస్)కి సొంత పార్టీ నుంచే తీవ్ర పోటీ ఉంది. ఎమ్మెల్యే టికెట్ కోసం.. సొంత పార్టీకే చెందిన ఎన్నారై నల్ల మనోహర్‌రెడ్డి, జెడ్పీటీసీ బొద్దుల లక్ష్మణ్ తీవ్రంగా ప్రయత్నిస్తున్నారు. కాంగ్రెస్ నేత విజయరమణారావు నుంచి వీరికి గట్టి పోటీ ఎదురవనుంది. బీజేపీ నుంచి గుజ్జుల రామక్రిష్ణారెడ్డి, దుగ్యాల ప్రదీప్‌రావు, గొట్టిముక్కల సురేశ్‌రెడ్డి టికెట్ ఆశిస్తున్నారు. బీఎస్పీ నుంచి దాసరి ఉష బరిలో ఉన్నారు. మంథని: ప్రస్తుత ఎమ్మెల్యే శ్రీధర్‌బాబు (కాంగ్రెస్)కు, పుట్ట మధు (బీఆర్ఎస్)కు ఈసారి హోరాహోరీ పోరు నడవనుంది. ఇక్కడ వీరిద్దరు మినహా మూడో పార్టీ అభ్యర్థులెవరూ ఇంతవరకూ ఆసక్తి చూపలేదు. -
‘సింగరేణి’ సమస్యల పరిష్కారానికి రాజీనామాకు సిద్ధం
సాక్షి, పెద్దపల్లి: సింగరేణి కాంట్రాక్టు కార్మికుల సమస్యల పరిష్కారానికి రాజీనామాకు సిద్ధమని రామగుండం ఎమ్మెల్యే కోరుకంటి చందర్ అన్నారు. సింగరేణిలో 8 రోజులుగా సమ్మె చేస్తున్న కాంట్రాక్టు కార్మికులకు మద్దతుగా శుక్రవారం నిర్వహించిన జీఎం కార్యాలయం ముట్టడిలో చందర్ పాల్గొన్నారు. ఈ సందర్భంగా మాట్లాడుతూ ‘ఎమ్మెల్యే పదవి గొప్పదేమీ కాదు. మీరందరూ మద్దతిస్తే గెలిచిన వ్యక్తిని. ఈ రోజు చెప్తే ఈ రోజే రాజీనామా చేసేవాడిని. సింగరేణి కాంట్రాక్టు కార్మికుల సమస్యల పరిష్కారానికి అవసరమైతే ఎమ్మెల్యే పదవిని అయినా త్యాగం చేస్తా. కార్మికులు చేస్తున్న ఉద్యమానికి అండగా నిలబడతా’ అని ప్రకటించారు. సింగరేణి కాంట్రాక్టు కార్మికుల డిమాండ్లు చట్టబద్ధమైనవని, ఈ ఉద్యమానికి అందరూ మద్దతుగా నిలవాలని కోరారు. సమస్య పరిష్కారం అయ్యేంతవరకు కార్మికులు విధుల్లోకి వెళ్లవద్దని చందర్ సూచించారు. రాష్ట్రవ్యాప్తంగా ఉపఎన్నికల ప్రభావం కొనసాగుతున్న సందర్భంలో ఎమ్మెల్యే రాజీనామా ప్రకటన నియోజకవర్గంలో హాట్‌టాపిక్‌గా మారింది. -
ఆర్ఎఫ్సీఎల్ కథ కంచికేనా..? బాధితులకు డబ్బులు అందుతాయా!
సాక్షి, కరీంనగర్: రామగుండం ఫెర్టిలైజర్స్ కర్మాగారంలో ఉద్యోగాల పేరుతో కోట్లు దండుకున్న నలుగురు దళారులను పోలీసులు ఇటీవల అరెస్టు చేసి జైలుకు తరలించారు. ఈ క్రమంలో ఆర్ఎఫ్సీఎల్ బాధితులకు డబ్బులు అందుతాయా..? లేదా..? అనే అనుమానాలు వ్యక్తమవుతున్నాయి. రామగుండం ఎమ్మెల్యే కోరుకంటి చందర్ బాధితులతో రెండురోజులపాటు మాట్లాడి భరోసా కల్పించారు. కర్మాగారంలో శాశ్వత ఉద్యోగాల పేరుతో సుమారు రూ.45 కోట్లు వసూలు చేసినట్లు సమాచారం. ఒక్కొక్కరి నుంచి రూ.5లక్షల నుంచి రూ.12 లక్షల వరకు వసూలు చేసిన దళారులు.. బాధితుల వద్ద ఎలాంటి పత్రాలూ లేకుండా జాగ్రత్త పడ్డారు. కేవలం నోటిమాట ఆధారంగానే బాధితులు రూ.లక్షలు దళారుల చేతిలో పోశారు. దీంతో కార్మికుల్లో కొత్త ఆందోళన మొదలైంది. ఈ క్రమంలో కొందరు “మీకు ఉద్యోగం కల్పించాం.. డబ్బులిచ్చేది లేదు..’ అని బాధితులతో గొడవకు దిగుతున్న సందర్భాలూ ఉన్నాయి. వారం క్రితం ఓ ప్రైవేట్ ఫంక్షన్ హాల్లో దళారిపై పెట్రోల్ పోసేందుకు ఓ వ్యక్తి ప్రయత్నించాడు. తాజాగా శుక్రవారం ముంజ హరీశ్ బావిలో దూకి ఆత్మహత్య చేసుకున్నాడు. దీంతో పోలీసులు దళారులుగా ఉన్న నలుగురుపై కేసు నమోదు చేసి జైలుకు పంపించారు. చదవండి: కు.ని.ఆపరేషన్‌తో నలుగురు మృతి.. ఇంతకూ ట్యూబెక్టమీ అంటే ఏంటి? దళారులు ఎంతమంది..? ఆర్ఎఫ్సీఎల్ ఉద్యోగ నియామకంలో ఎంతమంది దళారులు, మధ్యవర్తులు ఉన్నారనే అంశం చర్చనీయాంశంగా మారింది. కొత్త కాంట్రాక్టర్ కార్మికులను తొలగించడంతో మోసపోయామని గ్రహించిన కార్మికులు ఏడు నెలలుగా పోరాటం చేస్తున్నారు. అధికార పార్టీ నాయకులు, కార్యకర్తల ప్రమేయం ఉండడంతో అధికారులు చర్యలు చేపట్టడంలో జాప్యం చేశారని ప్రతిపక్ష నాయకులు ఆరోపిస్తున్నారు. పర్మినెంట్ హమాలి పేరుతో నగదు దండుకున్న కార్మిక సంఘం నాయకుడిపై ఇప్పటివరకూ కేసు నమోదు కాలేదు. వీరితోపాటు మరికొందరు అధికార, ప్రతిపక్ష నాయకులు, కార్యకర్తలు ఉన్నారని ప్రచారం జపరుగుతోంది. ఎవరు చెల్లిస్తారు..? బాధితులకు ఇప్పుడు నగదు ఎవరు చెల్లిస్తారనే వ్యవహారంలో స్పష్టత లేకుండా పోయింది. రెండు రోజులుగా కోరుకంటి చందర్ తన క్యాంపు కార్యాలయంలో బాధితులతో సమావేశం నిర్వహించారు. ప్రధాన దళారులు అధికార పార్టీ నాయకులు కావడంతో బాధితులకు నగదు చెల్లించేలా కృషి చేస్తారో లేదో.. వేచి చూడాల్సి ఉంది. -
న్యాయం చేయలేకపోతే రాజీనామా చెయ్..
సాక్షి, పెద్దపల్లి: ఆర్ఎఫ్సీఎల్ బాధితులకు న్యాయం చేయలేకపోతే ఎమ్మెల్యే పదవికి కోరుకంటి చందర్ రాజీనామా చేయాలని కాంగ్రెస్ రామగుండం నియోజకవర్గ ఇన్చార్జి మక్కాన్‌సింగ్ డిమాండ్ చేశారు. పెద్దపల్లి జిల్లాలో ఆర్ఎఫ్ïసీఎల్ కాంట్రాక్టు కార్మికుని మృతికి నిరసనగా.. బాధితులకు న్యాయం చేయాలంటూ ఆదివారం గోదావరిఖని మెయిన్ చౌరస్తాలో కాంగ్రెస్ శ్రేణులు రాస్తారోకో నిర్వహించాయి. పోలీసులు నిరసనకారులను అరెస్టు చేసి గోదావరిఖని వన్‌టౌన్ పోలీస్‌స్టేషన్‌కు తరలించారు. ఈ సందర్భంగా మక్కాన్ సింగ్ విలేకరులతో మాట్లాడుతూ.. మృతుని కుటుంబానికి రామగుండం ఎమ్మెల్యే కోరుకంటి చందర్ రూ.కోటి ఎక్స్‌గ్రేషియా చెల్లించాలని, కుటుంబంలో ఒకరికి ఉద్యోగం కల్పించాలని డిమాండ్ చేశారు. బాధితులు ఎవరెవరికి ఎంతెంత డబ్బులు ఇచ్చి మోసపోయారో తెలిపినప్పటికీ ఎమ్మెల్యే ఎలాంటి చర్యలు తీసుకోకపోవడంతోనే కార్మికుడు హరీశ్ ఆత్మహత్య చేసుకున్నాడని విమర్శించారు. దీనికి ఎమ్మెల్యే, మంత్రి కొప్పుల ఈశ్వర్ పూర్తి బాధ్యత వహిస్తూ బాధితులకు డబ్బులు తిరిగి చెల్లించాలని డిమాండ్ చేశారు. -
రామగుండం ఎమ్మెల్యే చందర్‌కు కరోనా
సాక్షి, పెద్దపల్లి : ఉమ్మడి కరీంనగర్ జిల్లా రామగుండం ఎమ్మెల్యే కోరుకంటి చందర్‌కు కరోనా సోకింది. సింగరేణి వనమహత్సోవంలో పాల్గొన్న కోరుకంటి చందర్, రామగుండం మేయర్ డా. అనిల్‌లకు కరోనా లక్షణాలు బయటపడ్డాయి. దీంతో గత వారం రోజులుగా మేయర్ హోం ఐసోలేషన్‌లో ఉంటున్నారు. అయితే ఎమ్మెల్యే చందర్ కరోనా పరీక్షలు చేయించుకోగా ఆయనకు పాజిటివ్ అని నిర్ధారణ అయ్యింది. ప్రస్తుతం హైదరాబాద్ గచ్చిబౌలిలోని ఓ పైవేటు ఆస్పత్రిలో ఆయన చికిత్స పొందుతున్నారు. (ప్రముఖులపై కరోనా పంజా) ఇప్పటికే తెలంగాణలోని అధికార పార్టీకి చెందిన అనేక మంది ఎమ్మెల్యేలు కరోనా బారిన పడిన విషయం తెలిసిందే. పటాన్ చెరూ ఎమ్మెల్యే మహిపాల్ రెడ్డి కూడా కరోనా బారిన పడిన విషయం తెలిసిందే. ఆయన హైదరాబాద్ అపోలో ఆస్పత్రిలో చేరి చికిత్స పొందుతున్నారు. ఇటీవలే ఆర్మూర్ ఎమ్మెల్యే జీవన్ రెడ్డి, ఎమ్మెల్సీ నారదాసు లక్ష్మణరావుకి కూడా కరోనా పాజిటివ్ అని తేలింది. ఎమ్మెల్యేలు ముత్తిరెడ్డి యాదగిరిరెడ్డి, గొంగిడి సునీత, బాజిరెడ్డి గోవర్ధన్, బిగాల గణేశ్ గుప్తాతో పాటు తెలంగాణ హోంమంత్రి మహమూద్ అలీ కరోనా బారిన పడి కోలుకున్నారు.(కరోనా టీకాపై ఓ గుడ్‌న్యూస్) -
రాలిన గులాబీ రేకు
సాక్షి, కరీంనగర్: ఒకే ఒరలో రెండు కత్తులు ఇమడవు అనే నానుడి రామగుండం టీఆర్ఎస్లో రుజువైంది. ఎమ్మెల్యే, మాజీ ఎమ్మెల్యేల మధ్య ఆధిపత్యం కోసం సాగిన పోరు పార్టీకి రాజీనామా చేయడంతో సంపూర్ణమైంది. సిట్టింగ్ ఎమ్మెల్యే కోరుకంటి చందర్, మాజీ ఎమ్మెల్యే, ఆర్టీసీ మాజీ చైర్మన్ సోమారపు సత్యనారాయణ మధ్య టీఆర్ఎస్లో దాదాపు పదేళ్లుగా నడుస్తున్న రాజకీయ వైరం చివరికి రాజీనామాలతో ముగిసినట్లయింది. తనకు పార్టీ ప్రాధాన్యత ఇవ్వడం లేదని, అందుకే రాజీనామా చేసి, రాజకీయాలకు దూరమవుతున్నట్లు ఆయన మంగళవారం ప్రకటించారు. కరీంనగర్ ఉమ్మడి జిల్లాలో టీఆర్ఎస్ పార్టీకి తాజా మాజీ ఎమ్మెల్యే, మాజీ ఆర్టీసీ చైర్మన్ స్థాయి నాయకుడు రాజీనామా చేయడం మొదటిది కావడం గమనార్హం. సిట్టింగ్ ఎమ్మెల్యే అయిన తనపై సమాజ్‌వాది ఫార్వర్డ్‌బ్లాక్ నుంచి పోటీ చేసి గెలిచిన కోరుకంటి చందర్‌ను టీఆర్ఎస్లోకి తీసుకోవడంతోనే తీవ్ర మనస్తాపానికి గురైన సత్యనారాయణ తరువాత జరిగిన పరిణామాలను జీర్ణించుకోలేక పోయారు. అదే అదనుగా కోరుకంటి చందర్ నియోజకవర్గంలో టీఆర్ఎస్ పార్టీని తన ఆధీనంలోకి తెచ్చుకొని తొలి విజయం సాధించారు. తనకన్నా ముందు రెండు పర్యాయాలు ఎమ్మెల్యేగా, తెలంగాణ రాష్ట్ర ఆర్టీసీ చైర్మన్‌గా పనిచేసిన సోమారపు సత్యనారాయణకు కనీసం పార్టీ సభ్యత్వం సైతం ఇవ్వకుండా రాజీనామా చేసే పరిస్థితి తీసుకొచ్చి తన పూర్తి ఆధిపత్యాన్ని చాటుకున్నారు. 2009 నుంచే కోరుకంటి వర్సెస్ సోమారపు 2009 అసెంబ్లీ ఎన్నికల్లో మహాకూటమి నుంచి టీఆర్ఎస్ టికెట్టు కోరుకంటి చందర్‌కే దక్కింది. పొత్తు ధర్మాన్ని విస్మరించి టీడీపీ చివరి నిమిషంలో సోమారపు సత్యనారాయణకు బీఫారం ఇచ్చింది. సమయానికి బీఫారం సమర్పించని కారణంగా సోమారపు సత్యనారాయణ ఇండిపెండెంట్‌గా చంద్రబాబు ఫొటోలు, పసుపు కండువాలతో ప్రచారం నిర్వహించి విజయం సాధించారు. అంతకుముందు రామగుండం మునిసిపాలిటీ చైర్మన్‌గా సోమారపు చేసిన అభివృద్ధి అప్పట్లో ఆయన విజయానికి దోహదపడింది. ఇండిపెండెంట్‌గా గెలిచిన సోమారపు సత్యనారాయణ వెంటనే కాంగ్రెస్‌కు మద్దతు పలికారు. వైఎస్ మరణానంతరం మారిన రాజకీయ పరిస్థితుల నేపథ్యంలో టీఆర్ఎస్లో చేరారు. తెలంగాణ రాష్ట్ర ఆవిర్భావం తరువాత 2014లో జరిగిన ఎన్నికల్లో సిట్టింగ్ ఎమ్మెల్యేగా సోమారపు సత్యనారాయణకే టికెట్టు రాగా, 2009లో టీఆర్ఎస్ నుంచి పోటీ చేసి ఓడిపోయిన కోరుకంటి చందర్ ‘సింహం’ గుర్తు మీద ఎస్ఎఫ్బీ పార్టీ నుంచి పోటీ చేసి స్వల్ప తేడాతో ఓడిపోయారు. తరువాత చందర్ టీఆర్ఎస్ నేతలతో సంబంధాలు కొనసాగించినప్పటికీ, పార్టీలో అధికారికంగా చేర్చుకునేందుకు సోమారపు ఇష్టపడలేదు. సభ్యత్వ నమోదు కార్యక్రమంలో పార్టీ సభ్యత్వం కూడా ఇవ్వలేదు. ఈ నేపథ్యంలో 2018 అసెంబ్లీ ఎన్నికల్లో మరోసారి టీఆర్ఎస్ అభ్యర్థిగా పోటీ చేసిన సత్యనారాయణ భారీ తేడాతో ఓడిపోయారు. గెలిచిన కోరుకంటి చందర్ టీఆర్ఎస్లో చేరడంతో సీన్ రివర్స్ అయింది. మేయర్‌పై అవిశ్వాసం సమయంలోనే రాజకీయ సన్యాసం రామగుండం కార్పొరేషన్ మేయర్‌గా çతొలుత ఎన్నికైన కొంకటి లక్ష్మినారాయణను గద్దె దింపేందుకు మాజీ ఎమ్మెల్యే సోమారపు సత్యనారాయణ చేసిన రాజకీయం అప్పట్లో రాష్ట్ర వ్యాప్తంగా చర్చనీయాంశమైంది. మేయర్‌పై అప్పటి ఎమ్మెల్యే సోమారపు సత్యనారాయణ అవిశ్వాస తీర్మానం పెట్టించగా, అధిష్టానం జోక్యం చేసుకొని విరమించుకోమని సూచించింది. అధిష్టానం ఆదేశాలను సైతం ధిక్కరించిన ఆయన అవసరమైతే పార్టీకి రాజీనామా చేసి రాజకీయ సన్యాసం తీసుకుంటానని చెప్పి దుమారం లేపారు. స్వయంగా కేటీఆర్ జోక్యం చేసుకొని హైదరాబాద్ పిలిపించుకుని బుజ్జగించారు. దీంతో తాను రాజకీయ సన్యాసం వాయిదా వేసుకున్నట్లు ప్రకటించారు. మేయర్‌పై అవిశ్వాసం పెట్టి పంతం నెగ్గించుకున్నారు. అప్పటి నుంచే సోమారపు తీరు పట్ల అధిష్టానం కొంత అసంతృప్తితో ఉన్నా, అసెంబ్లీ ఎన్నికల్లో ఓడిపోవడంతో గెలిచిన చందర్‌కు ప్రాధాన్యత ఇచ్చింది. ఓటమి తరువాత పార్టీ తీరుపై కినుక.. రామగుండంలో కోరుకంటి చందర్ గెలుపు తరువాత తనను పార్టీ పట్టించుకోకపోవడంతో మాజీ ఎమ్మెల్యే కినుక వహించారు.. ఈ క్రమంలో ఎంపీ ఎన్నికల్లో సరైన ప్రాతినిధ్యం లభించకపోవడంతో పార్టీకి దూరంగా ఉన్నారు. ఆ తర్వాత జరిగిన జెడ్పీటీసీ ఎంపీటీసీ ఎన్నికల్లో పార్టీకి వ్యతిరేకంగా పని చేసినట్లు ఎమ్మెల్యే కోరుకంటి చందర్ అధిష్టానానికి ఫిర్యాదు చేశారు. ఈ క్రమంలో కార్పొరేషన్ ఎన్నికల పక్రియ ప్రారంభం కావడంతో పార్టీకి రాజీనామా చేసి ప్రత్యామ్నాయ ఆలోచనలో పడ్డారు. అనుచరులు ఇప్పటికే బీజేపీలో.. తన వర్గంగా పనిచేసిన మాజీ డిప్యూటీ మేయర్ ముప్పిడి సత్యప్రసాద్ బీజేపీ తీర్థం తీసుకున్నారు. గతంలో డిప్యూటీ మేయర్‌గా కొనసాగిన సాగంటి శంకర్‌పై అవిశ్వాసం పెట్టి సత్యప్రసాద్‌ను డిప్యూటీ మేయర్‌గా గెలిపించారు. సత్యప్రసాద్ బీజేపీలో చేరడంతో మాజీ ఎమ్మెల్యే ఆలోచన కూడా అదేవిధంగా ఉంటుందని భావిస్తున్నారు. అలాగే రామగుండం కార్పొరేషన్లో బీజేపీ బలపడేందుకు పార్టీ జాతీయ నాయకత్వం దృష్టి సారించిన నేపథ్యంలో సోమారపు తీసుకునే నిర్ణయం కీలకంగా మారనుందనే చర్చ సాగుతోంది. -
‘బాల్క సుమన్‌ను నిందించడం సరికాదు’
సాక్షి, పెద్దపల్లి : రామగుండం మాజీ ఎమ్మెల్యే, ఆర్టీసీ మాజీ చైర్మన్ సోమారపు సత్యనారాయణ టీఆర్ఎస్ పార్టీకి రాజీనామా చేశారు. సోమారపుతోపాటు ఆయన అనుచరులు కూడా పార్టీని వీడారు. అసెంబ్లీ ఎన్నికల్లో తన ఓటమి కోసం చెన్నూరు ఎమ్మెల్యే బాల్క సుమన్ పనిచేశారని ఆరోపించారు. కాగా సత్యనారాయణ ఆరోపణలపై రామగుండం ఎమ్మెల్యే కోరుకంటి చందర్ తీవ్రస్థాయిలో ధ్వజమెత్తారు. అవకాశవాద రాజకీయాలు చేస్తూ పార్టీని దిగజార్చాలని చూస్తున్నారని మండిపడ్డారు. ఆయన ఓటమికి కారణం బాల్కసుమన్ అనడం సరికాదని హితవు పలికారు. ఎమ్మెల్యేగా ఉన్నప్పుడు తెలంగాణ ఉద్యమకారులు, టీఆర్ఎస్ నాయకులను సత్యనారాయణ అణదొక్కారని ఆగ్రహం వ్యక్తం చేశారు. వయసు పెరిగేకొద్దీ ఆయన బాలఖాళిలోకి వెళ్తున్నారని చురకలంటించారు. కొడుకుని రాజకీయాల్లోకి తెచ్చేందుకే సత్యనారాయణ పార్టీని వ్యతిరేకిస్తున్నారని విమర్శించారు. ఇటీవల జరిగిన సర్పంచ్ ఎన్నికల్లో కూడా ఆయన టీఆర్ఎస్కు వ్యతిరేకంగా పనిచేశారని ఆరోపించారు. టీఆర్ఎస్ పార్టీ ఆయనకు సముచిత న్యాయం చేసిందన్నారు. (చదవండి : టీఆర్ఎస్కు సీనియర్ నేత గుడ్ బై) -
ఆనందంలో చిందేసిన ఎంపీ, ఎమ్మెల్యే..
పెద్దపల్లి : జిల్లా జెడ్పీ చైర్మన్‌గా మాజీ ఎమ్మెల్యే పుట్ట మధు ఎన్నిక కావడంపై టీఆర్ఎస్ శ్రేణులు ఆనందంలో మునిగిపోయాయి. దీంతో జిల్లాలోని పార్టీ కార్యకర్తలతో పాటు ప్రజాప్రతినిధులు కూడా సంబరాల్లో సందడి చేశారు. ఎన్నిక అనంతరం పట్టణంలో విజయోత్సవ ర్యాలీ నిర్వహించారు. ఈ ర్యాలీలో పాల్గొన్న పెద్దపల్లి ఎంపీ వెంటేశ్ నేత, రామగుండం ఎమ్మెల్యే కోరుకంటి చందర్‌లు ఆనందోత్సహంలో మునిగిపోయారు. వాహనంపై నుంచే కాలు కదుపుతూ చిన్నగా చిందేశారు. ప్రస్తుతం ఇందుకు సంబంధించిన వీడియో సోషల్ మీడియాలో వైరల్‌గా మారింది. గత శాసనసభ ఎన్నికల్లో మంథని నియోజవర్గం నుంచి పోటీ చేసిన పుట్ట మధు ఓడిపోయారు. ఆ తర్వాత కొద్ది రోజులకే సీఎం కేసీఆర్ పెద్దపల్లి జెడ్పీ చైర్మన్ టీఆర్ఎస్ అభ్యర్థిగా పుట్ట మధు పేరును ఖరారు చేశారు. ఇటీవల పరిషత్ ఎన్నికల్లో టీఆర్ఎస్ విజయ దుందుభి మోగించడంతో.. పుట్ట మధు పెద్దపల్లి జెడ్పీ చైర్మన్‌గా ఏకగ్రీవంగా ఎన్నికయ్యారు. -
ప్రజాసేవలో ‘విజయ’ను చూస్తున్నా: ఎమ్మెల్యే చందర్
సాక్షి ప్రతినిధి, కరీంనగర్: సాధారణ సింగరేణి బొగ్గు కార్మికుడి కొడుకు.. పీజీ చదివినా ఉద్యోగం లేని జీవితం.. వెరసి ఆర్థిక ఇబ్బందులు.. అదే సమయంలో మేన మరదలితో వివాహం.. ఆ వివాహంతో దొరికిన తోడు కష్టసుఖాల్లో ఆలంబనగా నిలిచింది. ఇంట్లో ఖాళీగా కూర్చోలేక ఆటో నడిపినా... కేబుల్ టీవీ ఆపరేటర్‌గా నిలదొక్కుకున్నా... చివరికి రాజకీయాల్లోకి వచ్చి తెలంగాణ ఉద్యమకారుడిగా... కార్పొరేటర్‌గా గెలిచినా... ఆ తాళి కట్టిన తోడే కష్టసుఖాల్లో నీడగా నిలిచింది. ఆమె కోరుకంటి విజయ. రామగుండం శాసనసభ్యుడు కోరుకంటి చందర్ సతీమణి. రాజకీయంగా ఎదిగిన కోరుకంటి చందర్ ఎమ్మెల్యేగా పోటీ చేసి రెండు సార్లు ఓడిపోయినా వెంట ఉండి ధైర్యం చెప్పిన ఆమె... తీరా ఎమ్మెల్యేగా గెలిచే సమయంలో క్యాన్సర్ బారిన పడి అనంత లోకాలకేగింది. ఆమె లేని లోటును ప్రజలకు సేవ చేయడం ద్వారా తీర్చుకుంటున్నట్లు చెబుతున్న ఎమ్మెల్యే కోరుకంటి చందర్‌తో ‘సాక్షి’ పర్సనల్ టైం ఇంటర్వ్యూ... సాక్షి: మాతృదినోత్సవం రోజు అమ్మలను సన్మానించే కార్యక్రమం చేపడుతున్నారట. ఎప్పటి నుంచి? చందర్: సింగరేణి ఏరియాలో నేను చాలా మందిని చూశాను. పెద్దయ్యాక తల్లిదండ్రులను గౌరవించకపోవడాన్ని. అమ్మ మీద ప్రేమ, గౌరవం కల్పించాలనే ఉద్దేశంతో మాతృ దినోత్సవం సందర్భంగా గత సంవత్సరం సింగరేణి స్టేడియంలో వేదిక ఏర్పాటు చేసి 2018 మంది తల్లులకు వారి పిల్లలతో పాదపూజ, సన్మానం చేయించే కార్యక్రమం చేపట్టాను. ఈ సంవత్సరం కూడా ఆదివారం(12వ తేదీ) స్టేడియంలో 2019 మంది మాతృమూర్తులకు సన్మానం చేయిస్తున్నాను. సన్మానం చేసిన వారికి వెండి నాణెం బహుమానంగా ఇస్తున్నాను. సాక్షి: ఎమ్మెల్యే కావాలనే కోరిక పదేళ్ల తరువాత తీరింది. పార్టీ టికెట్టు ఇవ్వకున్నా... వేరే పార్టీ గుర్తు మీద పోటీ చేసి గెలిచారు. పదవి కోసం వచ్చిన పట్టుదలా? చందర్: చిన్నప్పటి నుంచి అనుకున్నది సాధించాలనే పట్టుదల నాకుంది. చదువులో గానీ, జీవన పోరాటంలో గానీ అదే పట్టుదలతో లక్ష్యాన్ని సాధించాను. ఎమ్మెల్యే విషయంలో సైతం రెండుసార్లు దక్కకుండా పోయిన పదవిని ప్రజల ఆశీస్సులతోనే సాధించాను. 2009లో టీఆర్ఎస్ అభ్యర్థిగా పోటీ చేసి ఓడిపోయాను. రెండోసారి 2014లో పార్టీ టికెట్టు ఇవ్వకపోతే సింహం గుర్తు మీద పోటీ చేసి, స్వల్ప ఓట్ల తేడాతో ఓడాను. ఈసారి కూడా నాకు టికెట్టు ఇవ్వలేదు. దాంతో ఎలాగైనా గెలిచి, టీఆర్ఎస్లో చేరాలనే మరోసారి ‘సింహం’ గుర్తు మీద పోటీ చేసి విజయం సాధించాను. నా పట్టుదలతోపాటు నా భార్య దివంగత విజయ ప్రోత్సాహం నా విజయాలకు కారణం. సాక్షి: ఎన్నికల సమయంలో విజయమ్మ మరణం మీ ఆత్మస్థయిర్యాన్ని దెబ్బతీసిందా? చందర్: విజయ నాలో సగం. నాకు సర్వస్వం. నా కష్టసుఖాల్లో వెన్నంటి ఉంది. ఆమెకు క్యాన్సర్ అనే విషయం 2016 జనవరిలో తెలిసింది. అప్పటి నుంచి హైదరాబాద్‌లో చికిత్స చేయిస్తున్నాను. కోలుకుంటుందనే భావించాను. ఊపిరితిత్తుల క్యాన్సర్ నాలుగో దశకు చేరడంతో ఆమె మాకు దూరమైంది. సరిగ్గా నా ఎన్నికల ప్రచారం సమయంలో జరిగిన సంఘటన. నేను చాలా కుంగిపోయాను. ప్రచారానికి కూడా వెళ్లలేదు. ప్రజలు, నా స్నేహితులు, బంధువులు నా వెంట నిలిచారు. నన్ను గెలిపించుకున్నారు. నేను ఎమ్మెల్యే కావాలని కలలు కన్న ఆమె తీరా నేను గెలిచేనాటికి లేకుండా పోవడం విధి ఆడిన నాటకం. సాక్షి: సింగరేణి కార్మికుడి కొడుకుగా మీ చిన్ననాటి జీవితం ఎలా సాగింది? చందర్: మా నాన్న మల్లయ్య జూలపల్లి దగ్గర్లోని తులసిపల్లె నుంచి సింగరేణి జనరల్ మజ్దూర్ కార్మికుడిగా గోదావరిఖని వచ్చాడు. నాకు ఒక అక్క, ఇద్దరు చెల్లెళ్లు. చిన్ననాటి నుంచి ఇక్కడే పెరిగాను. డిగ్రీ, పీజీ గోదావరిఖనిలోనే. మా నాన్న సంపాదన కుటుంబపోషణకే సరిపోయేది. మా అక్క, చెల్లెళ్ల పెళ్లిళ్లు జరపడమే కష్టంగా గడిచిన పరిస్థితి. ఆర్థిక ఇబ్బందులు వెంటాడేవి. పీజీ అయ్యాక మేన మరదలు విజయతో పెళ్లయింది. ఉద్యోగం లేకపోవడంతో మూడు నెలలు గోదావరిఖనిలో ఆటో నడిపాను. తరువాత కేబుల్ టీవీ రంగంలోకి దిగాను. దాంతో ఆర్థిక కష్టాలు గట్టెక్కాయి. అదే సమయంలో పాపులర్ టీవీ పేరుతో లోకల్ టీవీ ఛానెల్‌ను కూడా నిర్వహించాను. సాక్షి: ఎమ్మెల్యేగా పోటీ చేసి రెండుసార్లు ఓడిపోయారు. మళ్లీ మూడోసారి పోటీ చేసి గెలిచారు. ఆర్థికంగా చేయూత ఇచ్చిందెవరు? చందర్: కేబుల్ టీవీ ఆపరేటర్‌గా సంపాదించిన డబ్బులు నా రాజకీయ ఖర్చులకు సరిపోయేవి. ఎమ్మెల్యేగా పోటీ చేసిన ప్రతిసారి నా మిత్రులు నాకు అన్ని రకాల సహకరించారు. అయినా అప్పులయ్యాయి. 2009లో ఓడిపోయిన తరువాత గౌతం నగర్లో ఇల్లు ఆమ్మేశాను. నాకు ఖర్చులకు అవసరమైతే నా భార్య నగలు తాకట్టు పెట్టి డబ్బులు తెచ్చిచ్చేది. కష్ట నష్టాలు ఎదురైనా నా భార్య తోడు ఉంది. ఈసారి ఎన్నికల్లో సాధారణ ఖర్చులకు కూడా నా దగ్గర డబ్బులు లేవు. నా ప్రత్యర్థి కోట్లు కుమ్మరించాడు. అయినా రామగుండం ప్రజల అభిమానం, ఆశీస్సులతో ఈసారి ఎమ్మెల్యేగా ఎన్నికయ్యాను. సాక్షి: ఎమ్మెల్యే అయినా... గోదావరిఖని తిలక్‌నగర్‌లోని ఇరుకు సందుల్లోని చిన్న ఇంట్లోనే ఉంటున్నారు? ఎన్టీపీసీ, సింగరేణి క్వార్టర్స్ ఉన్నాయి కదా? చందర్: నేను పుట్టి పెరిగిన ఇల్లు అది. బస్తీవాళ్లు, చుట్టుపక్కల వాళ్లతో ఉన్న బంధాలు ఇక్కడి నుంచి వెళ్లనివ్వవు. కులమతాలకు అతీతంగా వావి వరుసలతో పిలుచుకుంటాం. ఈ ఇంటితో, ప్రాంతంతో ఉన్న అనుబంధంతోనే నేనెక్కడికి వెళ్లను. ఎన్టీపీసీ, సింగరేణి క్వార్టర్స్‌కు వెళితే ప్రజలతో దూరం పెరుగుతుంది. ఇంట్లో, క్యాంపు కార్యాలయంలో నిత్యం ప్రజలకు అందుబాటులో ఉంటా. సాక్షి: కేబుల్ ఆపరేటర్‌గా డబ్బులు సంపాదిస్తున్న సమయంలో రాజకీయాల్లోకి ఎందుకు వచ్చారు? చందర్: నేను రాజకీయాల్లోకి రావడానికి ఇనిస్పిరేషన్ మంత్రి కొప్పుల ఈశ్వర్. నాకు తోబుట్టువు వంటి వారు. 1994 ప్రాంతంలో ఆయన టీడీపీలో కీలక నాయకుడిగా ఉన్నప్పుడు ప్రజలతో, కార్మికులతో ఆయనకున్న సంబంధాలు చూసి స్ఫూర్తి పొందా. నేను ఆయన వెంటే టీడీపీలో చేరి రాజకీయ ఓనమాలు దిద్దుకున్నా. కార్మికుల హక్కుల కోసం సాగిన ఉద్యమాల్లో ఈశ్వరన్నతో కలిసి పనిచేశా. ఆయన 1994లో ఎమ్మెల్యేగా పోటీ చేసినప్పుడు వెంట ఉన్నా. 2004లో టీఆర్ఎస్లోకి వచ్చినప్పుడు ఆయనతోపాటు టీఆర్ఎస్లో చేరా. టీఆర్ఎస్లో తెలంగాణ కోసం ఉద్యమ నాయకుడిగా ఈశ్వరన్న స్ఫూర్తితో ఎన్నో కార్యక్రమాల్లో పాల్గొన్నా. 45 రోజులు జైలుకు వెళ్లిన. నా మీద పీడీ యాక్ట్ కూడా పెట్టారు. పోలీసులకు దొరకలేదనుకోండి. సాక్షి: ఫార్వర్డ్ బ్లాక్ నుంచి గెలిచి టీఆర్ఎస్లో చేరిన తరువాత మీకెలా ఉంది? చందర్: సింహం గుర్తు కోసం ఫార్వర్డ్ బ్లాక్ నుంచి పోటీ చేశా. 2014లో కూడా నా గుర్తు అదే. గెలిచిన తరువాత యువనేత కేటీఆర్‌ను కలిసి పార్టీలో చేరా. కేసీఆర్ నాయకత్వం అంటే నాకిష్టం. ఆయన నేతృత్వంలో పనిచేయడం నాగ్గావాలి. కేటీఆర్ సమయస్ఫూర్తి, నాయకత్వ లక్షణాలు మాలాంటి యువ నాయకులకు స్ఫూర్తిదాయకం. కేసీఆర్, కేటీఆర్ ఇద్దరూ నాకు ప్రాధాన్యత ఇచ్చారు. నేను ఏ పదవుల కోసమో టీఆర్ఎస్లో చేరలేదు. టీఆర్ఎస్ అంటే నాకు రాజకీయ జీవితాన్నిచ్చిన పార్టీ. సాక్షి: మీ పిల్లలేం చేస్తున్నారు? చందర్: మాకు ఇద్దరు పిల్లలు. అమ్మాయి ఉజ్వల బయో టెక్నాలజీలో ఇంజనీరింగ్ పూర్తి చేసింది. 2015 డిసెంబర్లో పెళ్లయింది. కొడుకు మణిదీప్, మైనింగ్ డిప్లొమా చదివాడు. వాళ్ల అమ్మ చనిపోయిన తరువాత నా కూతురు నన్ను కంటికి రెప్పలా కాపాడుకుంటుంది. అల్లుడు చాలా మంచోడు. ఇంజనీర్. ప్రస్తుతం నా దగ్గరే ఉంటున్నారు. అమ్మ నాన్న కూడా నాతోనే ఉంటారు. నా భార్య పేరిట విజయమ్మ చారిటబుల్ ట్రస్ట్ ఏర్పాటు చేశాను. మహిళా సాధికారికత, శిక్షణ కోసం కార్యక్రమాలు చేపడుతున్నా. -
90కి చేరిన టీఆర్ఎస్ బలం
సాక్షి, హైదరాబాద్: రాష్ట్ర అసెంబ్లీ ఎన్నికల్లో స్వతంత్ర అభ్యర్థులుగా గెలిచిన ఇద్దరు ఎమ్మెల్యేలు టీఆర్ఎస్లో చేరారు. రామగుండం ఎమ్మెల్యే కోరుకుంటి చందర్, వైరా ఎమ్మెల్యే లావుడ్య రాములు నాయక్ బుధవారం కేటీఆర్‌ను కలిసి టీఆర్ఎస్కు మద్దతు ఇస్తున్నట్లు ప్రకటించారు. టీఆర్ఎస్ టికెట్ దక్కకపోవడంతో కోరుకంటి చందర్ రామగుండంలో ఆలిండియా ఫార్వర్డ్ బ్లాక్ తరఫున పోటీ చేసి టీఆర్ఎస్ అభ్యర్థి సోమారపు సత్యనారాయణపై గెలిచారు. 2009లో స్వతంత్ర అభ్యర్థిగా పోటీ చేసిన సోమారపు టీఆర్ఎస్ అభ్యర్థిగా పోటీ చేసిన కోరుకుంటి చందర్‌పై గెలుపొందారు. అనంతరం సత్యనారాయణ టీఆర్ఎస్లో చేరారు. ఇప్పుడు కోరుకంటి చందర్ విషయంలోనూ ఇదే జరిగింది. వైరా నుంచి కాంగ్రెస్ టికెట్ దక్కపోవడంతో రాములు నాయక్ స్వతంత్ర అభ్యర్థిగా పోటీ చేసి గెలుపొందారు. అసెంబ్లీ రద్దుకు ముందు టీఆర్ఎస్ పార్టీకి 90 మంది ఎమ్మెల్యేలు ఉన్నారు. ముందస్తు ఎన్నికల్లో టీఆర్ఎస్ 88 స్థానాల్లో విజయం సాధించింది. ఇప్పుడు ఈ ఇద్దరు ఎమ్మెల్యేలు టీఆర్ఎస్లో చేరాలని నిర్ణయించుకోవడంతో ఎమ్మెల్యేల సంఖ్య 90కి చేరింది. కేసీఆర్ మా నాయకుడు: చందర్ ‘ఉద్యమ సమయంలో కాంగ్రెస్ పీడీ యాక్టులతో ఇబ్బంది పెట్టిన వెనకడుగు వేయలేదు. నాటి నుంచి నేటి వరకు మా నాయకుడు కేసీఆరే.. నాకు రాజకీయ జన్మనిచ్చింది కేసీఆరే. నిరుద్యోగ వ్యవస్థను నిర్మూలించడమే లక్ష్యంగా పనిచేస్తున్న కేటీఆర్‌ను కలిసి నా మద్దతు తెలిపా. టీఆర్ఎస్ ప్రభుత్వంతో కలిసి పనిచేస్తా’అని చందర్ అన్నారు. -
గులాబీ గూటికి స్వతంత్ర ఎమ్మెల్యే
సాక్షి, కరీంనగర్ : రామగుండం అసెంబ్లీ స్థానం నుంచి స్వతంత్ర అభ్యర్థిగా పోటీచేసి గెలుపొందిన కోరకంటి చందర్ టీఆర్ఎస్కు మద్దతు ప్రకటించారు. టీఆర్ఎస్ నుంచి టికెట్ ఆశించిన చందర్ సీటు దక్కకపోవడంతో ఫార్వర్డు బ్లాక్ నుంచి పోటీచేసి టీఆర్ఎస్ అభ్యర్థి సోమవరపు సత్యనారయణపై విజయం సాధించిన విషయం తెలిసిందే. రేపు (గురువారం) మధ్యాహ్నం కేసీఆర్ సీఎంగా ప్రమాణ స్వీకారం చేయనున్న నేపథ్యంలో ఆయన మాట్లాడుతూ.. టీఆర్ఎస్ తనకు మాతృసంస్థ అని అన్నారు. కేసీఆర్ నాయకత్వంలోనే తాను పనిచేస్తానని, టీఆర్ఎస్ ఎమ్మెల్యేగానే కొనసాగుతానని చందర్ తెలిపారు. కాగా ఎన్నికల వరకు కూడా ఆయన టీఆర్ఎస్లోనే కొనసాగిన విషయం తెలిసిందే. ఈ మేరకు బుధవారం కేసీఆర్‌ను ఆయన కలిసి మద్దతు తెలిపారు. దీంతో టీఆర్ఎస్ బలం 88 స్థానాల నుంచి 89కి చేరింది. గత ఎన్నికల్లో కూడా టీఆర్ఎస్ రెబల్‌గా పోటీచేసిన చందర్ సత్యనారాయణపై స్వల్ప ఓట్ల తేడాతో ఓటమిచెందారు. కాగా తెలంగాణ అసెంబ్లీ ఎన్నికల్లో రామగుండం, వైరా స్థానాల్లో ఇండిపెండెంట్ అభ్యర్థులు గెలుపొందిన విషయం తెలిసిందే.