రాలిన గులాబీ రేకు | Korukanti Chander Resigned To TRS Party Saying That Party Isn't Giving Him Priority | Sakshi
Sakshi News home page

రాలిన గులాబీ రేకు

Published Wed, Jul 10 2019 1:47 PM | Last Updated on Wed, Jul 10 2019 2:47 PM

Korukanti Chander Resigned To TRS Party Saying That Party Isn't Giving Him Priority - Sakshi

సోమారపు సత్యనారాయణ

సాక్షి, కరీంనగర్‌: ఒకే ఒరలో రెండు కత్తులు ఇమడవు అనే నానుడి రామగుండం టీఆర్‌ఎస్‌లో రుజువైంది. ఎమ్మెల్యే, మాజీ ఎమ్మెల్యేల మధ్య ఆధిపత్యం కోసం సాగిన పోరు పార్టీకి రాజీనామా చేయడంతో సంపూర్ణమైంది. సిట్టింగ్‌ ఎమ్మెల్యే కోరుకంటి చందర్, మాజీ ఎమ్మెల్యే, ఆర్టీసీ మాజీ చైర్మన్‌ సోమారపు సత్యనారాయణ మధ్య టీఆర్‌ఎస్‌లో దాదాపు పదేళ్లుగా నడుస్తున్న రాజకీయ వైరం చివరికి రాజీనామాలతో ముగిసినట్లయింది.

తనకు పార్టీ ప్రాధాన్యత ఇవ్వడం లేదని, అందుకే రాజీనామా చేసి, రాజకీయాలకు దూరమవుతున్నట్లు ఆయన మంగళవారం ప్రకటించారు. కరీంనగర్‌ ఉమ్మడి జిల్లాలో టీఆర్‌ఎస్‌ పార్టీకి తాజా మాజీ ఎమ్మెల్యే, మాజీ ఆర్టీసీ చైర్మన్‌ స్థాయి నాయకుడు రాజీనామా చేయడం మొదటిది కావడం గమనార్హం.

సిట్టింగ్‌ ఎమ్మెల్యే అయిన తనపై సమాజ్‌వాది ఫార్వర్డ్‌బ్లాక్‌ నుంచి పోటీ చేసి గెలిచిన కోరుకంటి చందర్‌ను టీఆర్‌ఎస్‌లోకి తీసుకోవడంతోనే తీవ్ర మనస్తాపానికి గురైన సత్యనారాయణ తరువాత జరిగిన పరిణామాలను జీర్ణించుకోలేక పోయారు. అదే అదనుగా కోరుకంటి చందర్‌ నియోజకవర్గంలో టీఆర్‌ఎస్‌ పార్టీని తన ఆధీనంలోకి తెచ్చుకొని తొలి విజయం సాధించారు. తనకన్నా ముందు రెండు పర్యాయాలు ఎమ్మెల్యేగా, తెలంగాణ రాష్ట్ర ఆర్టీసీ చైర్మన్‌గా పనిచేసిన సోమారపు సత్యనారాయణకు కనీసం పార్టీ సభ్యత్వం సైతం ఇవ్వకుండా రాజీనామా చేసే పరిస్థితి తీసుకొచ్చి తన పూర్తి ఆధిపత్యాన్ని చాటుకున్నారు.

2009 నుంచే కోరుకంటి వర్సెస్‌ సోమారపు 
2009 అసెంబ్లీ ఎన్నికల్లో మహాకూటమి నుంచి టీఆర్‌ఎస్‌ టికెట్టు కోరుకంటి చందర్‌కే దక్కింది. పొత్తు ధర్మాన్ని విస్మరించి టీడీపీ చివరి నిమిషంలో సోమారపు సత్యనారాయణకు బీఫారం ఇచ్చింది. సమయానికి బీఫారం సమర్పించని కారణంగా సోమారపు సత్యనారాయణ ఇండిపెండెంట్‌గా చంద్రబాబు ఫొటోలు, పసుపు కండువాలతో ప్రచారం నిర్వహించి విజయం సాధించారు. అంతకుముందు రామగుండం మునిసిపాలిటీ చైర్మన్‌గా సోమారపు చేసిన అభివృద్ధి అప్పట్లో ఆయన విజయానికి దోహదపడింది. ఇండిపెండెంట్‌గా గెలిచిన సోమారపు సత్యనారాయణ వెంటనే కాంగ్రెస్‌కు మద్దతు పలికారు. వైఎస్‌ మరణానంతరం మారిన రాజకీయ పరిస్థితుల నేపథ్యంలో టీఆర్‌ఎస్‌లో చేరారు.

తెలంగాణ రాష్ట్ర ఆవిర్భావం తరువాత 2014లో జరిగిన ఎన్నికల్లో సిట్టింగ్‌ ఎమ్మెల్యేగా సోమారపు సత్యనారాయణకే టికెట్టు రాగా, 2009లో టీఆర్‌ఎస్‌ నుంచి పోటీ చేసి ఓడిపోయిన కోరుకంటి చందర్‌ ‘సింహం’ గుర్తు మీద ఎస్‌ఎఫ్‌బీ పార్టీ నుంచి పోటీ చేసి స్వల్ప తేడాతో ఓడిపోయారు. తరువాత చందర్‌ టీఆర్‌ఎస్‌ నేతలతో సంబంధాలు కొనసాగించినప్పటికీ, పార్టీలో అధికారికంగా చేర్చుకునేందుకు సోమారపు ఇష్టపడలేదు. సభ్యత్వ నమోదు కార్యక్రమంలో పార్టీ సభ్యత్వం కూడా ఇవ్వలేదు. ఈ నేపథ్యంలో 2018 అసెంబ్లీ ఎన్నికల్లో మరోసారి టీఆర్‌ఎస్‌ అభ్యర్థిగా పోటీ చేసిన సత్యనారాయణ భారీ తేడాతో ఓడిపోయారు. గెలిచిన కోరుకంటి చందర్‌ టీఆర్‌ఎస్‌లో చేరడంతో సీన్‌ రివర్స్‌ అయింది. 

మేయర్‌పై అవిశ్వాసం సమయంలోనే రాజకీయ సన్యాసం
రామగుండం కార్పొరేషన్‌ మేయర్‌గా çతొలుత ఎన్నికైన కొంకటి లక్ష్మినారాయణను గద్దె దింపేందుకు మాజీ ఎమ్మెల్యే సోమారపు సత్యనారాయణ చేసిన రాజకీయం అప్పట్లో రాష్ట్ర వ్యాప్తంగా చర్చనీయాంశమైంది. మేయర్‌పై అప్పటి ఎమ్మెల్యే సోమారపు సత్యనారాయణ అవిశ్వాస తీర్మానం పెట్టించగా, అధిష్టానం జోక్యం చేసుకొని విరమించుకోమని సూచించింది. అధిష్టానం ఆదేశాలను సైతం ధిక్కరించిన ఆయన అవసరమైతే పార్టీకి రాజీనామా చేసి రాజకీయ సన్యాసం తీసుకుంటానని చెప్పి దుమారం లేపారు.

స్వయంగా కేటీఆర్‌ జోక్యం చేసుకొని హైదరాబాద్‌ పిలిపించుకుని బుజ్జగించారు. దీంతో తాను రాజకీయ సన్యాసం వాయిదా వేసుకున్నట్లు ప్రకటించారు. మేయర్‌పై అవిశ్వాసం పెట్టి పంతం నెగ్గించుకున్నారు. అప్పటి నుంచే సోమారపు తీరు పట్ల అధిష్టానం కొంత అసంతృప్తితో ఉన్నా, అసెంబ్లీ ఎన్నికల్లో ఓడిపోవడంతో గెలిచిన చందర్‌కు ప్రాధాన్యత ఇచ్చింది. 

ఓటమి తరువాత పార్టీ తీరుపై కినుక..
రామగుండంలో కోరుకంటి చందర్‌ గెలుపు తరువాత తనను పార్టీ పట్టించుకోకపోవడంతో మాజీ ఎమ్మెల్యే కినుక వహించారు.. ఈ క్రమంలో ఎంపీ ఎన్నికల్లో సరైన ప్రాతినిధ్యం లభించకపోవడంతో పార్టీకి దూరంగా ఉన్నారు. ఆ తర్వాత జరిగిన జెడ్పీటీసీ ఎంపీటీసీ ఎన్నికల్లో పార్టీకి వ్యతిరేకంగా పని చేసినట్లు ఎమ్మెల్యే కోరుకంటి చందర్‌ అధిష్టానానికి ఫిర్యాదు చేశారు. ఈ క్రమంలో కార్పొరేషన్‌ ఎన్నికల పక్రియ ప్రారంభం కావడంతో పార్టీకి రాజీనామా చేసి ప్రత్యామ్నాయ ఆలోచనలో పడ్డారు. 

అనుచరులు ఇప్పటికే బీజేపీలో.. 
తన వర్గంగా పనిచేసిన మాజీ డిప్యూటీ మేయర్‌ ముప్పిడి సత్యప్రసాద్‌ బీజేపీ తీర్థం తీసుకున్నారు. గతంలో డిప్యూటీ మేయర్‌గా కొనసాగిన సాగంటి శంకర్‌పై అవిశ్వాసం పెట్టి సత్యప్రసాద్‌ను డిప్యూటీ మేయర్‌గా గెలిపించారు. సత్యప్రసాద్‌ బీజేపీలో చేరడంతో మాజీ ఎమ్మెల్యే ఆలోచన కూడా అదేవిధంగా ఉంటుందని భావిస్తున్నారు. అలాగే రామగుండం కార్పొరేషన్‌లో బీజేపీ బలపడేందుకు పార్టీ జాతీయ నాయకత్వం దృష్టి సారించిన నేపథ్యంలో సోమారపు తీసుకునే నిర్ణయం కీలకంగా మారనుందనే చర్చ సాగుతోంది.    

No comments yet. Be the first to comment!
Add a comment
Advertisement

Related News By Category

Related News By Tags

Advertisement
 
Advertisement
Advertisement