కోల్ బెల్ట్ ఏరియా నుంచి ఎమ్మెల్సీ కల్వకుంట్ల కవిత బరిలోకి దిగనున్నారా?. ఎమ్మెల్యేను మార్చాల్సిందే అంటున్న రామగుండం అసమ్మతి నేతలు కవితకు జై కొడుతున్నారా?. ఎమ్మెల్సీ కవితను బరిలో దించండి లేదా మాలో ఒకరికి సీటివ్వండని కోరుతున్న అసమ్మతి నేతల మాట కేసీఆర్ వింటారా?. సిట్టింగ్ ఎమ్మెల్యే మంత్రి కేటీఆర్‌ను నమ్ముకుంటే.. అసమ్మతి నేతలు ఆయన సోదరి కవితను నమ్ముకున్నారా?. బొగ్గుబావుల్లో పరోక్షంగా అన్నాచెల్లెళ్ల పోరుకు తెరలేవనుందా?. అసలు రామగుండం గులాబీ కోటలో ఏం జరుగుతోంది?..
రామగుండం అంటే నిప్పుల కొలిమిలా ఉంటుంది. అక్కడి రాజకీయాలు కూడా కొద్ది రోజుల నుంచి వేసవిని మించి మించి హీటెక్కుతున్నాయి. అధికార బీఆర్ఎస్ పార్టీలోని అంతర్గత సంక్షోభం తారాస్థాయికి చేరింది. సిట్టింగ్ ఎమ్మెల్యే కోరుకంటి చందర్‌పై.. అసమ్మతి వర్గం తిరుగుబాటు జెండా ఎగురేసింది. తెలంగాణ బొగ్గు గని కార్మిక సంఘం ప్రధాన కార్యదర్శి మిరియాల రాజిరెడ్డి మరో నలుగురు నాయకులు ఈ ఎమ్మెల్యే మాకొద్దంటూ ఉద్యమం లేవదీసారు. ముచ్చటగా మూడోసారి కేసీఆర్‌నే సీఎం చేయాలంటూ ప్రజా ఆశీర్వాద యాత్ర చేపట్టిన అసమ్మతి నేతలు.. తమ యాత్రలో ఎక్కడా సిట్టింగ్ ఎమ్మెల్యే కోరుకంటి చందర్ ఫోటో లేకుండా చేశారు. అదే సమయంలో జన చైతన్యయాత్ర పేరిట సిట్టింగ్ ఎమ్మెల్యే చందర్ కూడా పాదయాత్ర ప్రారంభించారు. ఇరువర్గాల మధ్య రామగుండం కేంద్రంగా బాహాబాహీకి తెరలేచి ఉద్రిక్తతకూ దారితీసింది.
నేతలు ఫైర్..
పార్టీ అంతర్గత రాజకీయాలు అధిష్ఠానానికి తలబొప్పి కట్టిస్తున్నాయి. ఈ క్రమంలో మంత్రి కొప్పుల ఈశ్వర్ ఆధ్వర్యంలో.. పార్టీ నాయకత్వం అసమ్మతి నేతలతో ఓ సమావేశాన్ని నిర్వహించింది. కొప్పుల ఎంత నచ్చజెప్పినా చల్లబడని నేతలు.. మంత్రి కేటీఆర్‌తో సమావేశమయ్యేందుకు హైదరాబాద్ బాట పట్టారు. కానీ, అక్కడ కేటీఆర్ సమయం ఇవ్వకపోవడంతో ఆ భేటీ జరగలేదు. దీంతో మరోసారి అసమ్మతి నేతలంతా ఏకంగా రామగుండంలో ఓ ప్రెస్‌మీట్ పెట్టి.. ఈ ఎమ్మెల్యే మాకొద్దంటూ మీడియా ముఖంగా ప్రకటించేశారు.
చందర్‌కు కేటీఆర్ అండ..
తెలంగాణ బొగ్గు గని సంఘం గౌరవ అధ్యక్షురాలిగా ఉన్న ఎమ్మెల్సీ కల్వకుంట్ల కవితను రామగుండం నుంచి బరిలోకి దింపితే గెలిపించుకుంటామని అసమ్మతి నేతలు ప్రకటించారు. లేదంటే, తమలో ఎవరైనా ఒకరికి టిక్కెట్ ఇవ్వాలని అధిష్ఠానాన్ని డిమాండ్ చేశారు. అసమ్మతి నేతల్ని సిట్టింగ్ ఎమ్మెల్యే లైట్ తీసుకుంటున్నారు. మంత్రి కేటీఆర్ అండదండలున్న చందర్ ఆయన ఆశీస్సులతోనే ముందుకెళ్లాలని.. మళ్లీ టిక్కెట్ సాధించుకునేందుకు తన ప్రయత్నాలు తాను చేస్తున్నారు. మరోవైపు అసమ్మతి నేతలు మాత్రం మంత్రి కేటీఆర్ సోదరి ఎమ్మెల్సీ కవితను నమ్ముకున్నారు.
కవిత సాహసం చేస్తారా?..
కేసీఆర్ తనయ ఎమ్మెల్సీ కవిత.. నిజామాబాద్ అర్బన్, బోధన్, కామారెడ్డి, జగిత్యాల నియోజకవర్గాల్లో ఎక్కడినుంచైనా బరిలోకి దిగొచ్చంటూ ఇప్పటికే ప్రచారం జరుగుతోంది. తాజాగా రామగుండం అసమ్మతి నేతల ప్రకటనతో.. కోల్ బెల్ట్ ఏరియా నుంచే ఎన్నికల బరిలోకి దిగుతారా అన్న చర్చ మొదలైంది. అయితే తెలంగాణ బొగ్గు గని సంఘంకు కూడా కార్మికుల నుంచి కొంత వ్యతిరేకత ఏర్పడిన నేపథ్యంలో.. అలాంటి సాహసం కవిత చేస్తారా అనే అనుమానం కలుగుతోంది. మొత్తంగా రామగుండం బరిలో నిలిచే అధికారపార్టీ అభ్యర్థి ఎవరనే ఉత్కంఠ కనిపిస్తోంది. సిట్టింగ్ ఎమ్మెల్యేకే సీటిస్తారా? లేక అసమ్మతి నేతల పంతం నెగ్గుతుందా అనే చర్చ సాగుతోంది.
ఇది కూడా చదవండి: కేసీఆర్ సర్కార్‌పై బీజేపీ నేతల సంచలన ఆరోపణలు
Comments
Please login to add a commentAdd a comment