సాక్షి, హైదరాబాద్: తెలంగాణ అసెంబ్లీ ఎన్నికలు దగ్గర పడే కొద్దీ.. టికెట్ల లొల్లి ముదురుతోంది. అధికార పక్షం బీఆర్‌ఎస్‌లో నిజయోకవర్గాల వారీగా అసమ్మతి సెగలు ఒక్కొక్కటి బయటపడతున్నాయి. రాజధానికి చేరి.. అధిష్టానాన్ని ఉక్కిరి బిక్కిరి చేస్తున్నాయి. ఈ క్రమంలో పెద్దపల్లి జిల్లా రామగుండం అసమ్మతి నేతలు మంత్రి కేటీఆర్‌తో శుక్రవారం భేటీ అయ్యారు. అసెంబ్లీ కేటీఆర్ పేషీలోనే గంటల తరబడి వీళ్ల సమావేశం జరిగింది.
రామగుండం ఎమ్మెల్యే కోరుకంటి చందర్ పై అసమ్మతి నేతలు కేటీఆర్‌కు ఫిర్యాదు చేశారు. కోరుగంటి చందర్‌కు ఎట్టి పరిస్థితుల్లో టికెట్ ఇవ్వొద్దని కేటీఆర్‌కు చెప్పారు వాళ్లు. కావాలనుకుంటే జిల్లా అధ్యక్షునిగా కోరుకంటి కొనసాగినా పర్వాలేదని.. కానీ, ఎమ్మెల్యే టికెట్ మాత్రం వేరేవాళ్లకు ఇవ్వాలని అసమ్మతి నేతలు కేటీఆర్‌ను కోరారు. ఈ తరుణంలో అధ్యక్షుడిగా కోరుకంటి ఉంటే మీకు ఓకేనా? అని అసమ్మతి నేతల్ని కేటీఆర్ అడగడం గమనార్హం.
అయితే.. కలిసి పనిచేయాలా? వద్దా? అనేది కోరుకంటిపై ఆధారపడి ఉంటుందని అసమ్మతి నేతలు కేటీఆర్‌కు బదులిచ్చినట్లు సమాచారం. అంతేకాదు అధిష్టాన నిర్ణయంపైనే తమ రాజకీయ భవిష్యత్ ఉంటుందని కూడా వాళ్లు తేల్చి చెప్పినట్లు తెలుస్తోంది.
‘‘పార్టీకి నష్టం కలిగించే పనులు చేయొద్దంటూ అసంతృప్తి నేతలకు సూచిస్తూనే.. సర్వేలు ఎవరికి అనుకూలంగా ఉంటే వారికే టికెట్ ఇస్తాం. ఎమ్మెల్యే కాబట్టి ఆయనతో మాట్లాడితే నాకు ఆయన దగ్గర అనుకుంటే ఎలా?’’ అని అసమ్మతి నేతలను ఆయన ప్రశ్నించారు. అయితే.. ఎమ్మెల్యే తమపై కేసులు పెట్టి వేధించాడని నేతలు చెప్పగా.. సొంత పార్టీ నేతలపై ఎమ్మెల్యే కేసులు పెట్టి వేధించిన విషయం తనకు తెలువదన్న కేటీఆర్ వాళ్లతో అన్నట్లు తెలుస్తోంది. ఈ క్రమంలో.. పార్టీకి వ్యతిరేకంగా ప్రెస్ మీట్స్ పెట్టొద్దని ఆయన అసమ్మతి నేతలకు సూచించారు.
ఇక.. అసమ్మతి నేతలతో పాటు ఎమ్మెల్యే కోరుకంటి చందర్‌తోనూ కేటీఆర్ భేటీ అయ్యి ఈ పరిణామాలపై చర్చించారు. ఆపై ‘‘నేను చెప్పాల్సింది చెప్పిన.. ఏ నిర్ణయం తీసుకున్నా పార్టీ కోసమే పనిచేస్తా.. అంటూ ఎమ్మెల్యే కోరుకంటి వ్యాఖ్యానించడం గమనార్హం. కేటీఆర్‌తో భేటీ అనంతరం.. మంత్రి కొప్పుల ఈశ్వర్‌తోనూ రామగుండం అసమ్మతి నేతలు భేటీ కావడం గమనార్హం.
ఇదీ చదవండి: తెలంగాణలో కులగజ్జి, మతపిచ్చి లేదు
Comments
Please login to add a commentAdd a comment