ఉమ్మడి కరీంనగర్ జిల్లా గులాబీ పార్టీకి కంచుకోటగా మారింది. ప్రత్యర్థులకు ఆనవాళ్ళు కూడా లేకుండా చేశాయి బీఆర్ఎస్ శ్రేణులు. కానీ ఇప్పుడు పార్టీలోనే ప్రత్యర్థులు తయారయ్యారు. ముఖ్యంగా అయిదు సెగ్మెంట్లలో గులాబీ పార్టీ నేతలు కుమ్ములాడుకుంటున్నారు. ప్రతిపక్షాలు లేని కొరతను సొంత పార్టీ వారే తీరుస్తున్నారు. నియోజకవర్గాల్లో రణరంగాన్ని సృష్టిస్తున్నారు. ఇంతకీ ఆ ఐదు సెగ్మెంట్ల కథేంటీ...
ఉత్తర తెలంగాణలో కీలకమైన ఉమ్మడి కరీంనగర్ జిల్లాలోని ఐదు నియోజవర్గాల్లో గులాబీ పార్టీలో అంతర్గత కలహాలు రోజు రోజుకు ముదురుతున్నాయి. రామగుండం నియోజకవర్గంలో ఫార్వర్డ్ బ్లాక్ గుర్తుపై గెలిచిన కోరుకంటి చందర్ తర్వాతి కాలంలో కారెక్కి విహరిస్తున్నారు. వచ్చే ఎన్నికల్లో చందర్‌కు సీటిస్తే మద్దతిచ్చే ప్రసక్తి లేదని ఆయన వ్యతిరేకులు గులాబీ పార్టీ నాయకత్వానికి తేల్చి చెప్పేశారు.
బీఆర్ఎస్‌కు చెందిన పలువురు నేతలు కోరుకంటి చందర్‌కు వ్యతిరేకంగా గళం విప్పుతున్నారు. కేసీఆర్‌ను మళ్ళీ సీఎం చేయాలంటూ ఆశయసాధన పేరుతో యాత్ర చేస్తున్న అసమ్మతి నేతలు ఎమ్మెల్యే ఫోటోను మాత్రం పెట్టలేదు. మరోవైపు ఎమ్మెల్యే వర్గం కూడా పాదయాత్ర నిర్వహించగా.. రెండు వర్గాలు రామగుండంలో వీధిపోరాటానికి దిగాయి.
చదవండి: డోలాయమానంలో గడల శ్రీనివాసరావు రాజకీయ భవిష్యత్
నిర్వేదంతో సిట్టింగ్ ఎమ్మెల్యే
రాజన్న కొలువై ఉన్న వేములవాడలోనూ గులాబీ పార్టీలో గ్రూప్‌లు ఏర్పడి కుమ్ములాడుకుంటున్నాయి. నియోజకవర్గంలో రెండు పార్టీ ఆఫీసులతో భిన్నమైన పరిస్థితి కొనసాగుతోంది. సిట్టింగ్ ఎమ్మెల్యే చెన్నమనేని రమేష్ బాబు టిక్కెట్‌కు చల్మెడ లక్ష్మీనర్సింహారావు అడ్డుపడుతున్నారు. కొద్దికాలంగా రమేష్ బాబు వర్సెస్ చల్మెడ ఎపిసోడ్ వేములవాడ రాజకీయాల్ని రసవత్తరంగా మార్చాయి. ఇద్దరి మధ్యా ఉప్పునిప్పూ అన్నట్టుగా రాజకీయం నడుస్తోంది. ఈ క్రమంలో ఈసారి రమేష్ బాబు టికెట్‌కు గండి కొట్టి.. చల్మెడకే కన్ఫర్మ్ అనే టాక్ వేములవాడలో చాలా రోజులుగా నడుస్తోంది. టికెట్ రాదేమోనన్న నిర్వేదంతో పాటు.. పార్టీలోని ప్రత్యర్థులపై అక్కసు, ఆక్రోశమూ సిట్టింగ్ ఎమ్మెల్యే రమేష్ బాబు మాటల్లో కనిపిస్తోంది.
తనను ధిక్కరించిన ఈటల రాజేందర్‌కు ఈసారి ఎలాగైనా చెక్ పెట్టాలని గులాబీ బాస్ కేసీఆర్ పట్టుదలతో ఉన్నారు. ఈటలతో యుద్ధానికి పంపిన ఎమ్మెల్యే కౌశిక్‌రెడ్డి నిత్యం వివాదాలతో సహవాసం చేస్తూ కేసీఆర్ ఆశల్ని తుంచేస్తున్నారు. కౌశిక్‌రెడ్డిని నియోజకవర్గ ఇంఛార్జ్‌గా తొలగించాలంటూ మార్కెట్ కమిటీ మాజీ చైర్మన్ తుమ్మేటి సమ్మిరెడ్డి వంటివారు మీడియా ముందుకు రావడం.. ఆయనకు షోకాజ్ నోటీసులు జారీ చేస్తే.. మరింత రెబల్‌గా సమ్మిరెడ్డి మాట్లాడిన తీరు ఇప్పుడు హుజూరాబాద్ రాజకీయాల్లో బీఆర్ఎస్ పరిస్థితిని కళ్లకు కడుతోంది. అంతేకాదు కొందరు సర్పంచులు, ఎంపీటీసీలు కూడా కౌశిక్‌కు వ్యతిరేకంగా మీటింగ్స్ ఏర్పాటు చేసుకోవడం కూడా చర్చనీయాంశంగా మారింది. దీంతో హుజూరాబాద్‌లో అభ్యర్థెవ్వరన్న ప్రశ్నలతో పాటు.. ఎవరు అభ్యర్థిగా బరిలో ఉన్నా.. మిగిలిన వర్గాలు ఎంతవరకూ మద్దతిస్తాయన్నది కూడా సందేహమే.
ఇక పెద్దపెల్లి ఎమ్మెల్యే దాసరి మనోహర్ రెడ్డి తీరుపై కూడా పార్టీలో అంతర్గతంగా అసహనం వ్యక్తమవుతోంది. మున్సిపల్ మాజీ చైర్ పర్సన్ రాజయ్య ఎమ్మెల్యేకు వ్యతిరేకంగా ఓ ప్రెస్‌మీట్ నిర్వహించారు. ఎమ్మెల్యే దాసరి తీరుపై అలిగి ఆయన కీలక అనుచరుడైన ఉప్పు రాజ్ కుమార్ పార్టీనుంచే బయటకు వెళ్ళిపోయాడు. అయితే అతణ్ని బ్రతిమాలి మళ్ళీ పార్టీలోకి తీసుకువచ్చారు.
చదవండి: ఎల్లారెడ్డిలో కాంగ్రెస్, బీఆర్‌ఎస్ పోటాపోటీ...
స్థానిక సంస్థల ఎమ్మెల్సీగా ఉన్న భానుప్రసాద్ రావు కూడా ఈసారి టిక్కెట్ కోసం తీవ్రంగా ప్రయత్నిస్తున్నారు. ఎమ్మెల్యే దాసరి మనోహర్ రెడ్డీతో ఎమ్మెల్సీ భానుప్రసాద్‌కు సఖ్యత లేకపోవడం వల్ల ఆయనకు ప్రత్యర్థులు పెరిగిపోతున్నారు. ఈసారి బీసీలకే పెద్దపెల్లి టిక్కెట్ ఇవ్వాలన్న డిమాండ్ తెరపైకి రావడంతో పాటు.. సామాజిక సమీకరణలు కూడా పార్టీకి తలబొప్పి కట్టిస్తున్నాయి. జూలపల్లి జెడ్పీటీసి లక్ష్మణ్ కేసీఆర్ సేవాదళం పేరుతో కార్యక్రమాలు చేస్తూ.. ఎమ్మెల్యే దాసరిపై కనిపించని యుద్ధం చేస్తున్నారు. జూలపల్లి జడ్‌పీటీసీ కూడా పెద్దపల్లి టికెట్ కోసం ప్రయత్నిస్తున్నారు.
చొప్పదండి నియోజకవర్గంలోనూ ఇదే పరిస్థితి. పైకి సిట్టింగ్ ఎమ్మెల్యేకే టిక్కెట్ అని ప్రచారం జరుగుతున్నా..వెనుక పెద్ద పెద్ద గోతులు తవ్వుతున్నట్టు టాక్ నడుస్తోంది. ఎమ్మెల్యేగా ఎన్నికయ్యాక ఎవ్వరినీ కలుపుకుపోలేని ఆయన తీరు, అవినీతి, అక్రమాల ఆరోపణలతో ఈసారి సిట్టింగ్ ఎమ్మెల్యే సుంకె రవిశంకర్‌కు టిక్కెట్ వస్తుందా, రాదా అనే చర్చ జరుగుతోంది. రవిశంకర్‌కు టిక్కెట్ ఇస్తే పార్టీ పరంగానే మద్దతు లభించని పరిస్థితులు కనిపిస్తున్నాయి. పైగా చొప్పదండిలో పోటీకి రెండు మూడు పేర్లను నియోజకవర్గ నేతలు తెరపైకి తెస్తున్నారు.
మొత్తంగా ఈ ఐదు నియోజకవర్గాల్లో ప్రస్తుతం అధికార బీఆర్ఎస్ పరిస్థితి నివురుగప్పిన నిప్పులా మారింది. క్యాడర్ బలంగా ఉన్నా.. లీడర్స్ మధ్య సమన్వయం లేకపోవడంతో రాబోయే రోజుల్లో ఇక్కడి గులాబీ కోటకు ప్రమాదమే అన్న సంకేతాలు వెలువడుతున్నాయి. మరి గులాబీ బాస్ తన కోటకు మరమ్మతులు చేస్తారా? రాబోయే ప్రమాదాన్ని నివారిస్తారా? వేచి చూడాల్సిందే.
Comments
Please login to add a commentAdd a comment