Huzurabad Assembly Constituency
-
ఐదేళ్లలో ఐదు పైసలు కూడా తేలేదు!
కరీంనగర్: ఐదేళ్లకాలంలో కరీంనగర్ ఎంపీగా బండి సంజయ్ ఐదుపైసలు కూడా కేంద్రం నుంచి తేలేదని మాజీ ఎంపీ బోయినపల్లి వినోద్‌కుమార్ విమర్శించారు. శనివారం హుజూరాబాద్‌లో ఎమ్మె ల్యే పాడి కౌశిక్‌రెడ్డి ఆధ్వర్యంలో ఏర్పాటు చేసిన కృతజ్ఞతసభకు కరీంనగర్ ఎమ్మెల్యే గంగుల కమలాకర్, జెడ్పీ చైర్పర్సన్ కనుమల్ల విజయతో కలిసి హాజరయ్యారు. వినోద్‌కుమార్ మాట్లాడుతూ... కేంద్ర ప్రభుత్వం ఉపాధిహామీ పథకానికి ఇచ్చే నిధులు కూడా తానే తెచ్చానని సంజయ్ చెప్పడం హాస్యాస్పదంగా ఉందన్నారు. ఎన్నికలు రాగానే సంజయ్‌కి గ్రామాలు గుర్తొస్తాయని అన్నారు. ఎంపీగా ఒక్క నవోదయపాఠశాల, ట్రిపుల్ ఐటీ కూడా తేలేకపోయాడన్నారు. తాను ఎంపీగా ఉన్న సమయంలో కరీంనగర్‌కు స్టార్ట్సిటీ హోదా తెచ్చి రూ.వెయ్యి కోట్లు మంజూరు చేయించినట్లు వివరించారు. బీఆర్ఎస్ను బొందపెడతామని సీఎం రేవంత్‌రెడ్డి, మంత్రి కోమటిరెడ్డి వెంకట్‌రెడ్డి మాట్లాడుతున్నారని, వీరి గురువులైన చంద్రబాబు, వైఎస్ రాజశేఖరరెడ్డిలతోనే అదిసాధ్యం కాలేదని అన్నారు. పదేళ్లలో బీఆర్ఎస్ సర్కారు చేసిన అభివృద్ధి చూసి ఓర్వలేక బీజేపీ, కాంగ్రెస్ అబద్దాలు ప్రచారం చేసి ప్రజ లను మాయ చేశాయని పేర్కొన్నారు. అబద్దాల పునాదులపై కాంగ్రెస్ ప్రభుత్వం ఏర్పాటైందన్నారు. గత ఎన్నికల్లో హుజూరాబాద్ ప్రజలు 50వేల మెజారిటీ ఇచ్చారని, రాబోయే ఎన్నికల్లో భారీ మెజారిటీ ఇచ్చి ఆశీర్వదించాలని కోరారు. ఇవి చదవండి: బీజేపీలోకి జనార్దన్ రాథోడ్ -
గజ్వేల్‌లో కేసీఆర్ గెలుపు.. హుజూరాబాద్‌లో ఈటల ఓటమి
సాక్షి, హైదరాబాద్: తెలంగాణ అసెంబ్లీ 2023 ఎన్నికల ఫలితాలు కీలక నేతలకు షాక్ ఇస్తున్నాయి. అధికార పార్టీలోని మంత్రులకు, ఎమ్మెల్యేలకు మాత్రమే కాదు.. ఇతర పార్టీల్లోని నేతలకు చేదు అనుభవం మిగల్చబోతున్నాయి ఈ ఎన్నికలు. బీజేపీ తురుపుముక్కగా భావించిన ఈటల.. రెండు చోట్లా ఓటమి పాలయ్యారు. హుజూరాబాద్‌లో ఈటల రాజేందర్, బీఆర్ఎస్ అభ్యర్థి కౌశిక్‌రెడ్డి చేతిలో ఓడారు. ఏకంగా 17వేల ఓట్ల(17,158 ఓట్లు) మెజారిటీతో ఈటలపై కౌశిక్‌రెడ్డి నెగ్గారు. హుజూరాబాద్‌లో ఈటల రెండో స్థానానికే పరిమితం అయ్యారు. మరోవైపు కేసీఆర్‌ను ఓడిస్తానని చాలెంజ్ చేసి మరీ గజ్వేల్ బరిలోనూ ఈటల నిల్చున్నారు. అయితే.. ఇక్కడా కేసీఆర్ చేతిలో ఈటలకు పరాభవం తప్పలేదు. కాకుంటే ఈటల లాంటి బలమైన నేత పోటీ చేయడంతో గత ఎన్నికల కంటే ఈసారి కేసీఆర్ మెజారిటీ తగ్గింది. అయితే గజ్వేల్‌లో కేసీఆర్ హ్యాట్రిక్ విక్టరీ రికార్డు మాత్రం నెలకొల్పారు. కరీంనగర్ ఈసారి కచ్చితంగా నెగ్గుతారనే అంచనాలున్న బండి సంజయ్.. గంగుల కమలాకర్ చేతిలో ఓటమి పాలయ్యారు. స్వల్ప మెజార్టీతోనే ఆయన బండి చేతిలో ఓడారు. దుబ్బాక ఉప ఎన్నికలో విజయం సాధించిన రఘునందన్‌రావు.. ఇప్పుడు ఎన్నికలో ఓటమి పాలయ్యారు. కొత్త ప్రభాకర్(మెదక్ ఎంపీ) భారీ మెజార్టీతో ఇక్కడి నుంచి నెగ్గారు. -
బీఆర్ఎస్ అభ్యర్థి పాడి కౌశిక్‌రెడ్డికి షాక్.. ఈసీ సీరియస్
సాక్షి, హైదరాబాద్: తెలంగాణలో అసెంబ్లీ ఎన్నికలకు రేపు(గురువారం) పోలింగ్ జరుగనుంది. ఈ నేపథ్యంలో అధికారులు అన్ని ఏర్పాట్లుచేశారు. మరోవైపు.. మంగళవారం సాయంత్రంలో ఎన్నికల ప్రచారం ముగిసింది. ఇక. ఓట్ల అభ్యర్థులు తీవ్ర ప్రయత్నలు చేస్తున్నారు. ఈ క్రమంలోనే హుజురాబాద్ బీఆర్ఎస్ అభ్యర్థి పాడి కౌశిక్ రెడ్డి సంచలన వ్యాఖ్యలు చేశారు. అయితే, బీఆర్ఎస్ అభ్యర్థి పాడి కౌశిక్ రెడ్డి వ్యాఖ్యలపై ఎలక్షన్ కమిషన్ సీరియస్ అయ్యింది. కౌశిక్‌రెడ్డి తన వ్యాఖ్యలపై నివేదిక ఇవ్వాలని రిటర్నింగ్ అధికారిని ఎన్నికల కమిషన్ ఆదేశించింది. ఇక, నిన్న హుజురాబాద్‌లో ఎన్నికల ప్రచారంలో ఎమోషనల్ వ్యాఖ్యలు చేసిన కౌశిక్ రెడ్డి. హుజురాబాద్‌లో ఎన్నికల ప్రచారంలో చివరి రోజు తన భార్య, కూతురుతో కలిసి ప్రచారం నిర్వహించారు. ఈ సందర్బంగా కౌశిక్ రెడ్డి మాట్లాడుతూ..‘మీకు దండం పెడతా.. ఒక్క ఛాన్స్ ఇవ్వండి. నాకు ఓటేసి నన్ను గెలిపించండి.. నేను చేయాల్సిన ప్రచారం చేసిన.. ఇక సాదుకుంటరో, సంపుకుంటరో మీ ఇష్టం.. నన్ను, నా భార్య, నా బిడ్డను సాదుకుంటారో.. ఓడించి ఉరేసుకొమ్మంటారో మీ చేతుల్లోనే ఉంది. ఓట్లేసి గెలిపిస్తే విజయ యాత్రకు నేను వస్తా.. లేకపోతే డిసెంబర్ నాలుగో తారీఖు నాడు నా శవయాత్రకు మీరు రండి’ అంటూ కౌశిక్ రెడ్డి సంచలన వ్యాఖ్యలు చేశారు. దీంతో, ఆయన వ్యాఖ్యలను ఈసీ సీరియస్‌గా తీసుకుంది. మరోవైపు. కౌశిక్ రెడ్డి ప్రస్తుతం ఎమ్మెల్సీగా కొనసాగుతుండగా.. ఈ ఎన్నికల్లో ఎమ్మెల్యేగా బరిలోకి దిగుతున్న విషయం తెలిసిందే. -
ఈటల రాజేందర్ సంచలన ప్రకటన
సాక్షి, కరీంనగర్: తెలంగాణ అసెంబ్లీ ఎన్నికలు ఆసక్తికరమైన పోరుకు వేదిక కాబోతోందా? బీజేపీ చేరికల కమిటీ చైర్మన్, హుజరాబాద్ ఎమ్మెల్యే ఈటల రాజేందర్ సంచలన వ్యాఖ్యలు చేశారు. తన నియోజకవర్గంతో పాటు ముఖ్యమంత్రి కల్వకుంట్ల చంద్రశేఖర్‌రావుపైనా తాను పోటీ చేస్తానని ప్రకటించారాయన. గురువారం హుజూరాబాద్‌లో బీజేపీ ముఖ్యకార్యకర్తల సమావేశంలో మాట్లాడుతూ.. తాను తన నియోజకవర్గంతో పాటు సీఎం కేసీఆర్ పై గజ్వేల్‌లో రెండు చోట్లా పోటీ చేస్తానని ప్రకటించారు. ఈ సందర్భంగా హుజురాబాద్ లో మీరే కథానాయకులు అవ్వాలంటూ కార్యకర్తలకు ఆయన పిలుపు ఇచ్చారు. కేసీఆర్ పైసలు కుమ్మరించబోతున్నారు! మానకొండూర్‌లో బీజేపీ జెండా ఎగరడం ఖాయం. కేసీఆర్ ప్రజల విశ్వాసం కోల్పోయారు. ప్రజలనే కాదు.. ఆఫీసర్లను సైతం నమ్మలేని స్థితిలో కేసీఆర్ ఉన్నారు. కేసీఆర్ అంగట్లో సరుకుల్లా నాయకుల్ని కొంటున్నారు. నాయకుడి స్థాయిని బట్టి రేట్ అంటగడుతున్నారు. ఈ ఎన్నికల్లో కేసీఆర్ ఒక్కొక్క నియోజకవర్గంలో రూ.30 నుంచి వంద కోట్ల దాకా ఖర్చు పెట్టి గెలవాలని చూస్తున్నారు అని ఈటల ఆరోపణలు గుప్పించారు. -
హుజురాబాద్: ఆ సెంటిమెంట్ రిపీట్ అయ్యేనా?
గత ఉపఎన్నికల్లో స్థానికత, సానుభూతి, ప్రభుత్వ వ్యతిరేకత ప్రభావం చూపాయి. ఇదే ఈటలకు బాగా కలిసొచ్చింది. ఇచ్చిన హామీలను కొన్ని అమలుపర్చినప్పటికీ డబుల్ బెడ్ రూమ్ ఇండ్ల పంపిణీ చేయలేదు, కొత్త రేషన్ కార్డులు ఇవ్వకపోవడం, పెన్షన్లు అర్హులందరికీ అందినప్పటికీ కమ్యూనిటీ పరంగా కూడా ప్రభావం చూపే అవకాశాలు నియోజకవర్గంలో ఉంటుంది. బీజేపీ బీజేపీ నుంచి ఈటల రాజేందర్ లేదా ఈటల జమున పోటీ చేసే అవకాశం ఉంది. బీఆర్ఎస్ ఎమ్మెల్సీ పాడి కౌశిక్ రెడ్డి మండలాల వారిగా ఓటర్లు హుజురాబాద్- 61,673 జమ్మికుంట- 59,020 కమలాపూర్- 51,282 వీణవంక- 40,099 ఇల్లందకుంట- 24,799 ఈ నియోజకవర్గంలో పోలింగ్ కేంద్రాలు 306 కేంద్రాలు ఉన్నాయి సమస్యత్మక ప్రాంతాలు. 107 సంఖ్యగా అధికారులు గత ఉప ఎన్నికల్లో గుర్తించారు. 6వృత్తులపరంగా. ఈ నియోజకవర్గంలో ప్రభుత్వానికి రైతులు రైతుబంధు సానుకూలంగా ఉన్నప్పటికీ రుణమాఫీ కాలేదని నిరాశతో ఉన్నారు. ఉద్యోగులు ప్రభుత్వానికి వ్యతిరేకమనే చెప్పవచ్చు వ్యాపారస్తులు వారి అవసరాల కోసం అధికార పార్టీని వాడుకుంటున్నప్పటికీ ప్రభుత్వ మార్పు కోరుకుంటున్నారు. కులాలపరంగా ఓటర్లు ఓసీలు- 23 వేలు కాపు- 31 వేల పై చిలుకు గొల్ల కురుమ- 29 వేలు ముదిరాజ్- 30 వేలు ఎస్సీలు- 47 వేలు ఎస్టిలు- 6,500 వేలు మైనార్టీ- 12,300 వేలు ► నియోజకవర్గంలో మానేరు వాగు ,ఇల్లందకుంట దేవాలయం ముఖ్యమైన ప్రదేశాలు -
హుజూర్నగర్ నియోజకవర్గం తదుపరి ఎన్నికల్లో ఎవరు గెలుస్తారు..?
హుజూర్నగర్ నియోజకవర్గం హుజూర్నగర్ నియోజకవర్గంలో పిసిసి అద్యక్షుడు, మాజీ మంత్రి ఉత్తంకుమార్‌రెడ్డి 2018లో ఐదోసారి విజయం సాదించారు. ఆయన గతంలో కోదాడ నుంచి రెండుసార్లు, తదుపరి హుజూర్నగర్ నుంచి వరసగా మూడోసారి అసెంబ్లీకి ఎన్నికయ్యారు. ఉత్తంకుమార్ రెడ్డి తన సమీప టిఆర్ఎస్ అభ్యర్ధి సైదిరెడ్డిపై 7466 ఓట్ల ఆదిక్యతతో విజయం సాదించారు. 2019లో ఉత్తం కుమార్ రెడ్డి లోక్ సభకు ఎన్నిక కాగా, హుజూర్ నగర్ అసెంబ్లీ సీటుకు రాజీనామా చేశారు. ఆ ఉప ఎన్నికలో టిఆర్ఎస్ అభ్యర్ది సైదిరెడ్డి భారీ ఆదిక్యతతో గెలిచారు. అప్పుడు ఉత్తం కుమార్ రెడ్డి సతీమణి పద్మావతి కాంగ్రెస్ ఐ తరపున పోటీచేసి ఓటమి చెందారు. అంతకుముందు 2014లో ఆమె కోదాడ నుంచి ఎమ్మెల్యేగా ఉన్నారు. 2018లో కోదాడలో ఓడిపోయిన తర్వాత హుజూర్‌నగర్‌లో మళ్లీ రంగంలో దిగి ఓటమి చెందారు. తెలంగాణలో 2014 ఎన్నికల తర్వాత ఉత్తం కుమార్ రెడ్డి పిసిసి అద్యక్షుడు అయ్యారు. కాంగ్రెస్ గెలిస్తే ఈయన ముఖ్యమంత్రి అవుతారని అనుకున్నారు. కానీ కాంగ్రెస్ అదికారంలోకి రాలేకపోయింది. 2018 సాదారణ ఎన్నికలో ఉత్తంకుమార్‌రెడ్డికి 92996 ఓట్లు రాగా, సైదిరెడ్డికి 85530 ఓట్లు వచ్చాయి. సైదిరెడ్డి సామాజికవర్గం పరంగా రెడ్డి వర్గానికి చెందినవారు. 2019 ఉప ఎన్నికలో సైదిరెడ్డికి 43358 ఓట్ల ఆదిక్యత వచ్చింది. సైదిరెడ్డికి 113094 ఓట్లు రాగా కాంగ్రెస్ ఐ అభ్యర్ధిగా పోటీచేసిన పద్మావతికి 69737 ఓట్లు మాత్రమే వచ్చాయి. 2018లో ఉత్తం కుమార్ రెడ్డికి 7466 ఓట్ల మెజార్గీ రాగా, ఉప ఎన్నికలో కాంగ్రెస్ ఐ భారీతేడాతో ఓటమి చెందడం విశేషం. ఉప ఎన్నికలో బిజెపి, టిడిపిలు డిపాజిట్లు కోల్పోయాయి. 2014లో ఉత్తం కుమార్ రెడ్డి హుజూర్ నగర్లో గెలిస్తే, ఆయన భార్య పద్మావతి కోదాడ నుంచి గెలుపొందడం విశేషం. 2009 శాసనసభలో మహబూబ్ నగర్ జిల్లాలో దంపతుల జంట దయాకరరెడ్డి, సీతలు మక్తల్,దేవరకద్ర ల నుంచి గెలుపొందగా, 2014లో ఆ అవకాశం ఉత్తంకుమార్ రెడ్డి, ఆయన భార్య పద్మావతిలకు దక్కింది. ఉమ్మడి నల్లగొండ జిల్లాకే చెందిన ఆరుట్ల రామచంద్రారెడ్డి, ఆరుట్ల కమలాదేవీ దంపతులు కూడా 1953,1962లలో ఒకేసారి గెలుపొంది శాసనభకు వెళ్లారు. 2014లో ఆ గౌరవం ఉత్తం దంపతులకు లభించింది. ఉత్తం కుమార్ రెడ్డి 2014లో రాష్ట్రపతి పాలన వచ్చేవరకు కిరణ్ కుమార్ రెడ్డి క్యాబినెట్లో ఉన్నారు. రాజకీయాలలోకి రావడానికి ముందు ఈయన రాష్ట్రపతి భవన్లో బాధ్యతలు నిర్వహించారు. 2014లో ఉత్తంకుమార్ రెడ్డి హుజూర్‌నగర్‌లో తెలంగాణ ఉద్యమం కోసం ఆత్మాహుతి చేసుకున్న శ్రీకాంతాచారి తల్లి శంకరమ్మ పై 23924 ఓట్ల మెజార్టీతో గెలుపొందారు. 1952 నుంచి 1972వరకు ఈ నియోజకవర్గం ఉండేది. మూడుసార్లు పిడిఎఫ్, ఐదుసార్లు కాంగ్రెస్, కాంగ్రెస్ఐ, ఒకసారి టిఆర్ఎస్, ఇండిపెండెంటు ఒకరు గెలిచారు. హుజూర్‌నగర్‌లో రెండుసార్లు గెలిచిన అక్కిరాజు వాసుదేవరావు కోదాడ నుంచి ఒకసారి గెలుపొందారు. ఈయన గతంలో కాసు, పి.వి మంత్రివర్గాలలో పనిచేశారు. 1952లో జరిగిన ఉప ఎన్నికలో ప్రముఖ కమ్యూనిస్టు నాయకుడు, కవి ముక్దుం మొహియుద్దీన్ గెలుపొందారు. 1952లో ఈ నియోజకవర్గం ద్విసభ్య నియోజకవర్గంగా ఉండేది. రెండు స్థానాలు పిడిఎఫ్ గెలుచుకుంది. అయితే జయసూర్య మెదక్ నుంచి లోక్‌సభకు కూడా ఎన్నికవడంతో ఏర్పడిన ఖాళీలో మొహియుద్దీన్ ఎన్నికయ్యారు. హుజూర్ నగర్ లో నాలుగుసార్లు రెడ్లు, మూడుసార్లు బ్రాహ్మణ,బిసి,ఎస్.సి, ముస్లిం వర్గాలు ఒక్కోసారి గెలుపొందాయి. హుజూర్నగర్ నియోజకవర్గంలో గెలిచిన.. ఓడిన అభ్యర్థులు వీరే.. -
కరీంనగర్ హుజూరాబాద్ మండలం రాజకీయ చరిత్ర
హుజూరాబాద్ నియోజకవర్గం తెలంగాణ రాజకీయంలో పెద్ద పరిణామమే సంభవించింది. టిఆర్ఎస్ సీనియర్ నేత ఈటెల రాజేందర్‌ను ముఖ్యమంత్రి కెసిఆర్ మంత్రివర్గం నుంచి బర్తరఫ్ చేయడం, ఆయనపై కొన్ని భూ కబ్జా కేసుల విచారణ జరగడం, తదనంతర పరిణామాలలో ఈటెల ఎమ్మేల్యే పదవికి రాజీనామా చేసి, భారతీయ జనతా పార్టీలో చేరిపోవడం జరిగాయి. అ తర్వాత జరిగిన ఉప ఎన్నికలో ఈటెల 23,855 ఓట్ల ఆదిక్యంతో గెలుపొంది సంచలన విజయం సాధించారు. ఈటెల రాజేందర్‌ను ఓడిరచడానికి టీఆర్ఎస్ గానీ, ముఖ్యమంత్రి తీవ్ర ప్రయత్నం చేశారు. కానీ వారికి ఫలితం దక్కలేదు. ఈటెలకు 107022 ఓట్లు రాగా టీఆర్ఎస్ అభ్యర్థి గెల్లు శ్రీనివాస్ యాదవ్‌కు 83,167 ఓట్లే వచ్చాయి. కాగా కాంగ్రెస్ అభ్యర్థికి నర్సింగరావుకు 3,014 ఓట్లు మాత్రమే తెచ్చుకొని డిపాజిట్ కొల్పోవడం జరిగింది. 2018 టీఆర్ఎస్ తరుపున పోటీ చేసిన ఈటెల రాజేందర్‌కు 104840 రాగా, కాంగ్రెస్ అభ్యర్ధిగా పోటీ చేసిన కౌశిక్ రెడ్డికి 61,121 ఓట్లు వచ్చాయి. కాగా ఇక్కడ మిగిలిన అభ్యర్దులకన్నా నోటాకు అధిక ఓట్లు రావడం విశేషం. నోటాకు 2847 ఓట్లు పడ్డాయి. కాగా అప్పట్లో బిజేపీ డిపాజిట్ కొల్పోయింది. కానీ 2021లో ఈ ఉప ఎన్నిక సమయానికి కౌశిక్ రెడ్డి టీఆర్ఎస్లోకి మారాడు. దీనివల్ల కాంగ్రెస్ దెబ్బతిన్నది కానీ టీఆర్ఎస్ మాత్రం గెలవలేకపోయింది. ఈటెల బిజేపిలోకి వెళ్లడం అంతకుముందు అక్కడ బలమే లేని బిజేపి గెలిచి సంచలనంగా మారింది. ఈటెల హుజూరాబాద్‌లో ఐదుసార్లు, అంతకుముందు కమలాపూర్‌లో రెండుసార్లు గెలిచారు. కొంతకాలం క్రితం టిఆర్ఎస్కు సొంతదార్లు ఎవరూ అంటూ వ్యాఖ్యానించి ఈటెల వివాదంలో పడ్డారు. ఆ తర్వాత ఆయన మంత్రి పదవిని కోల్పోయి, పార్టీని వీడవలసి వచ్చింది. ఈటెల రాజేందర్ బిసి వర్గానికి చెందినవారు. ముదిరాజ్ సామాజికవర్గానికి చెందిన నేత. ఈయన 3 ఉప ఎన్నికలతో సహా ఏడు ఎన్నికలలో గెలిచిన కొద్ది మంది నేతలలో ఒకరుగా నమోదు అయ్యారు. 2008 ఉప ఎన్నికలో గెలిచిన తర్వాత టిఆర్ఎస్ శాసనసభ పక్ష నేతగా ఉన్న ఈటెల రాజేందర్ హుజూరాబాద్‌లో 2014లో ప్రత్యేక తెలంగాణ రాష్ట్రం ఏర్పడిన తర్వాత ముఖ్యమంత్రి కెసిఆర్ క్యాబినెట్లో మంత్రిగా బాద్యతలు చేపట్టారు. కాని ఆ తర్వాత మంత్రి పదవి నుంచి బర్తరఫ్ అయ్యారు. ఆయన అంతకుముందు ఆరేళ్ల వ్యవధిలో నాలుగుసార్లు గెలిచి రికార్డులకెక్కారు. కమలాపూర్ నుంచి 2004, 2008 ఉప ఎన్నిక, హుజూరాబాద్‌లో 2009, 2010 ఉప ఎన్నికలో ఆయన విజయం సాదించారు. హుజూరాబాద్‌లో తదుపరి 2014, 2018, 2021 ఉప ఎన్నికలలో కూడా ఆయన గెలుపొందారు. రెండుసార్లు తెలంగాణ ఉద్యమంలో భాగంగా ఆయన రాజీనామా చేసి విజయం సాదించారు. టిఆర్ఎస్ నేతలు హరీష్‌రావు, కొప్పుల ఈశ్వర్ , ఈటెల రాజేందర్లు మాత్రమే ఇలా ఆరేళ్లలో నాలుగుసార్లు గెలిచిన ఘనత పొందారు. ఈ నియోజకవర్గంలో ఈటెల 2014లో కాంగ్రెస్ సమీప ప్రత్యర్ధి కె.సుదర్శనరెడ్డిని 57037 ఓట్ల తేడాతో ఓడిరచారు. ఆ ఎన్నికలో టిడిపి, బిజెపి కూటమి అభ్యర్ధిగా పోటీచేసిన ముద్దసాని కశ్యప్ రెడ్డికి 15642 ఓట్లు వచ్చాయి. హుజూరాబాద్ నియోజకవర్గంలో నాలుగుసార్లు రెడ్లు, రెండుసార్లు వెలమ, నాలుగుసార్లు బిసి నేతలు, మూడుసార్లు బ్రాహ్మణ, మూడుసార్లు ఇతరులు గెలుపొందారు. మొదట ఈటెల రాజేందర్ కమలాపూర్‌లో 2004లోను, ఆ తరువాత 2008లో రాజీనామా చేసిన టిఆర్ఎస్ ఎమ్మెల్యేలు 16 మందిలో ఒకరిగా ఉన్న ఈయన ఉప ఎన్నికలో పోటీ చేసి తిరిగి గెలుపొందారు. ఆ ఉప ఎన్నికలలో అప్పటి టిఆర్ఎస్ శాసనసభా పక్షనేతగా ఉన్న డాక్టర్ విజయరామారావు ఓటమి పాలవడంతో ఆ పక్ష నేతగా రాజేందర్ ఎంపికయ్యారు. రాజేందర్ తెలంగాణ ఉద్యమంలో భాగంగా పార్టీ నిర్ణయం మేరకు 2010 ఫిబ్రవరిలో మళ్ళీ శాసనసభకు రాజీనామా చేసి తిరిగి ఉపఎన్నికలో టిడిపి నేత ముద్దసాని దామోదరరెడ్డిపై ఘన విజయం సాధించారు. 1952లో ఏర్పడిన ఈ నియోజకవర్గం 1952, 57లలో ద్విసభ్య నియోజకవర్గంగా ఉండేది. 1952లో ఒక స్థానం కాంగ్రెస్, మరోస్థానం సోషలిస్టు పార్టీ గెలుచుకున్నాయి. 1957లో రెండూ ఇండిపెండెంట్లు గెలుచుకున్నారు. 1983 నుంచి ఒక్కసారి కూడా ఇక్కడ కాంగ్రెస్ ఐ గెలుపొందలేదు. 1957లో ఇండిపెండెంటుగా గెలిచిన పి.నర్సింగరావు 1967లో కాంగ్రెస్ పక్షాన గెలిచారు. 1957, 62లలో గెలిచిన గడిపల్లి రాములు 1967లో మేడారం నుంచి గెలిచారు. 1978లో కాంగ్రెస్ పక్షాన గెలిచిన దుగ్గారాల వెంకట్రావు 1985లో టిడిపి అభ్యర్ధిగా గెలిచారు. 1994, 99లలో టిడిపి అభ్యర్ధిగా గెలుపొందిన ఏనుగుల పెద్దిరెడ్డి 2009లో ప్రజారాజ్యం అభ్యర్ధిగా హుస్నాబాద్‌లో పోటీచేసి ఓడిపోయారు. ఇక్కడ ఒకసారి గెలిచిన ఒడితెల రాజేశ్వరరావు, ఒకసారి రాజ్యసభకు ఎన్నికయ్యారు. ఈయన సోదరుడు కెప్టెన్ లక్ష్మీకాంతరావు కమలాపూర్ నుంచి 2004 సాధారణ ఎన్నికలలోను, 2008లో టిఆర్ఎస్ వ్యూహంలో భాగంగా రాజీనామా చేసి రెండోసారి గెలుపొందారు. అయితే 2009లో హుస్నాబాద్ నుంచి పోటీచేసి ఓడిపోయారు. లక్ష్మీకాంతరావు కొంతకాలం వై.ఎస్. క్యాబినెట్లో మంత్రిగా ఉన్నారు. లక్ష్మీకాంతరావు రాజ్యసభ సభ్యుడిగా కూడా ఉన్నారు. హుజూరాబాద్ నియోజకవర్గంలో గెలిచిన.. ఓడిన అభ్యర్థులు వీరే.. -
గులాబీ కోటలో కొత్త టెన్షన్.. ఆ ఐదు సెగ్మెంట్లలో ఏం జరుగుతోంది?
ఉమ్మడి కరీంనగర్ జిల్లా గులాబీ పార్టీకి కంచుకోటగా మారింది. ప్రత్యర్థులకు ఆనవాళ్ళు కూడా లేకుండా చేశాయి బీఆర్ఎస్ శ్రేణులు. కానీ ఇప్పుడు పార్టీలోనే ప్రత్యర్థులు తయారయ్యారు. ముఖ్యంగా అయిదు సెగ్మెంట్లలో గులాబీ పార్టీ నేతలు కుమ్ములాడుకుంటున్నారు. ప్రతిపక్షాలు లేని కొరతను సొంత పార్టీ వారే తీరుస్తున్నారు. నియోజకవర్గాల్లో రణరంగాన్ని సృష్టిస్తున్నారు. ఇంతకీ ఆ ఐదు సెగ్మెంట్ల కథేంటీ... ఉత్తర తెలంగాణలో కీలకమైన ఉమ్మడి కరీంనగర్ జిల్లాలోని ఐదు నియోజవర్గాల్లో గులాబీ పార్టీలో అంతర్గత కలహాలు రోజు రోజుకు ముదురుతున్నాయి. రామగుండం నియోజకవర్గంలో ఫార్వర్డ్ బ్లాక్ గుర్తుపై గెలిచిన కోరుకంటి చందర్ తర్వాతి కాలంలో కారెక్కి విహరిస్తున్నారు. వచ్చే ఎన్నికల్లో చందర్‌కు సీటిస్తే మద్దతిచ్చే ప్రసక్తి లేదని ఆయన వ్యతిరేకులు గులాబీ పార్టీ నాయకత్వానికి తేల్చి చెప్పేశారు. బీఆర్ఎస్కు చెందిన పలువురు నేతలు కోరుకంటి చందర్‌కు వ్యతిరేకంగా గళం విప్పుతున్నారు. కేసీఆర్‌ను మళ్ళీ సీఎం చేయాలంటూ ఆశయసాధన పేరుతో యాత్ర చేస్తున్న అసమ్మతి నేతలు ఎమ్మెల్యే ఫోటోను మాత్రం పెట్టలేదు. మరోవైపు ఎమ్మెల్యే వర్గం కూడా పాదయాత్ర నిర్వహించగా.. రెండు వర్గాలు రామగుండంలో వీధిపోరాటానికి దిగాయి. చదవండి: డోలాయమానంలో గడల శ్రీనివాసరావు రాజకీయ భవిష్యత్ నిర్వేదంతో సిట్టింగ్ ఎమ్మెల్యే రాజన్న కొలువై ఉన్న వేములవాడలోనూ గులాబీ పార్టీలో గ్రూప్‌లు ఏర్పడి కుమ్ములాడుకుంటున్నాయి. నియోజకవర్గంలో రెండు పార్టీ ఆఫీసులతో భిన్నమైన పరిస్థితి కొనసాగుతోంది. సిట్టింగ్ ఎమ్మెల్యే చెన్నమనేని రమేష్ బాబు టిక్కెట్‌కు చల్మెడ లక్ష్మీనర్సింహారావు అడ్డుపడుతున్నారు. కొద్దికాలంగా రమేష్ బాబు వర్సెస్ చల్మెడ ఎపిసోడ్ వేములవాడ రాజకీయాల్ని రసవత్తరంగా మార్చాయి. ఇద్దరి మధ్యా ఉప్పునిప్పూ అన్నట్టుగా రాజకీయం నడుస్తోంది. ఈ క్రమంలో ఈసారి రమేష్ బాబు టికెట్‌కు గండి కొట్టి.. చల్మెడకే కన్ఫర్మ్ అనే టాక్ వేములవాడలో చాలా రోజులుగా నడుస్తోంది. టికెట్ రాదేమోనన్న నిర్వేదంతో పాటు.. పార్టీలోని ప్రత్యర్థులపై అక్కసు, ఆక్రోశమూ సిట్టింగ్ ఎమ్మెల్యే రమేష్ బాబు మాటల్లో కనిపిస్తోంది. తనను ధిక్కరించిన ఈటల రాజేందర్‌కు ఈసారి ఎలాగైనా చెక్ పెట్టాలని గులాబీ బాస్ కేసీఆర్ పట్టుదలతో ఉన్నారు. ఈటలతో యుద్ధానికి పంపిన ఎమ్మెల్యే కౌశిక్‌రెడ్డి నిత్యం వివాదాలతో సహవాసం చేస్తూ కేసీఆర్ ఆశల్ని తుంచేస్తున్నారు. కౌశిక్‌రెడ్డిని నియోజకవర్గ ఇంఛార్జ్‌గా తొలగించాలంటూ మార్కెట్ కమిటీ మాజీ చైర్మన్ తుమ్మేటి సమ్మిరెడ్డి వంటివారు మీడియా ముందుకు రావడం.. ఆయనకు షోకాజ్ నోటీసులు జారీ చేస్తే.. మరింత రెబల్‌గా సమ్మిరెడ్డి మాట్లాడిన తీరు ఇప్పుడు హుజూరాబాద్ రాజకీయాల్లో బీఆర్ఎస్ పరిస్థితిని కళ్లకు కడుతోంది. అంతేకాదు కొందరు సర్పంచులు, ఎంపీటీసీలు కూడా కౌశిక్‌కు వ్యతిరేకంగా మీటింగ్స్ ఏర్పాటు చేసుకోవడం కూడా చర్చనీయాంశంగా మారింది. దీంతో హుజూరాబాద్‌లో అభ్యర్థెవ్వరన్న ప్రశ్నలతో పాటు.. ఎవరు అభ్యర్థిగా బరిలో ఉన్నా.. మిగిలిన వర్గాలు ఎంతవరకూ మద్దతిస్తాయన్నది కూడా సందేహమే. ఇక పెద్దపెల్లి ఎమ్మెల్యే దాసరి మనోహర్ రెడ్డి తీరుపై కూడా పార్టీలో అంతర్గతంగా అసహనం వ్యక్తమవుతోంది. మున్సిపల్ మాజీ చైర్ పర్సన్ రాజయ్య ఎమ్మెల్యేకు వ్యతిరేకంగా ఓ ప్రెస్‌మీట్ నిర్వహించారు. ఎమ్మెల్యే దాసరి తీరుపై అలిగి ఆయన కీలక అనుచరుడైన ఉప్పు రాజ్ కుమార్ పార్టీనుంచే బయటకు వెళ్ళిపోయాడు. అయితే అతణ్ని బ్రతిమాలి మళ్ళీ పార్టీలోకి తీసుకువచ్చారు. చదవండి: ఎల్లారెడ్డిలో కాంగ్రెస్, బీఆర్ఎస్ పోటాపోటీ... స్థానిక సంస్థల ఎమ్మెల్సీగా ఉన్న భానుప్రసాద్ రావు కూడా ఈసారి టిక్కెట్ కోసం తీవ్రంగా ప్రయత్నిస్తున్నారు. ఎమ్మెల్యే దాసరి మనోహర్ రెడ్డీతో ఎమ్మెల్సీ భానుప్రసాద్‌కు సఖ్యత లేకపోవడం వల్ల ఆయనకు ప్రత్యర్థులు పెరిగిపోతున్నారు. ఈసారి బీసీలకే పెద్దపెల్లి టిక్కెట్ ఇవ్వాలన్న డిమాండ్ తెరపైకి రావడంతో పాటు.. సామాజిక సమీకరణలు కూడా పార్టీకి తలబొప్పి కట్టిస్తున్నాయి. జూలపల్లి జెడ్పీటీసి లక్ష్మణ్ కేసీఆర్ సేవాదళం పేరుతో కార్యక్రమాలు చేస్తూ.. ఎమ్మెల్యే దాసరిపై కనిపించని యుద్ధం చేస్తున్నారు. జూలపల్లి జడ్పీటీసీ కూడా పెద్దపల్లి టికెట్ కోసం ప్రయత్నిస్తున్నారు. చొప్పదండి నియోజకవర్గంలోనూ ఇదే పరిస్థితి. పైకి సిట్టింగ్ ఎమ్మెల్యేకే టిక్కెట్ అని ప్రచారం జరుగుతున్నా..వెనుక పెద్ద పెద్ద గోతులు తవ్వుతున్నట్టు టాక్ నడుస్తోంది. ఎమ్మెల్యేగా ఎన్నికయ్యాక ఎవ్వరినీ కలుపుకుపోలేని ఆయన తీరు, అవినీతి, అక్రమాల ఆరోపణలతో ఈసారి సిట్టింగ్ ఎమ్మెల్యే సుంకె రవిశంకర్‌కు టిక్కెట్ వస్తుందా, రాదా అనే చర్చ జరుగుతోంది. రవిశంకర్‌కు టిక్కెట్ ఇస్తే పార్టీ పరంగానే మద్దతు లభించని పరిస్థితులు కనిపిస్తున్నాయి. పైగా చొప్పదండిలో పోటీకి రెండు మూడు పేర్లను నియోజకవర్గ నేతలు తెరపైకి తెస్తున్నారు. మొత్తంగా ఈ ఐదు నియోజకవర్గాల్లో ప్రస్తుతం అధికార బీఆర్ఎస్ పరిస్థితి నివురుగప్పిన నిప్పులా మారింది. క్యాడర్ బలంగా ఉన్నా.. లీడర్స్ మధ్య సమన్వయం లేకపోవడంతో రాబోయే రోజుల్లో ఇక్కడి గులాబీ కోటకు ప్రమాదమే అన్న సంకేతాలు వెలువడుతున్నాయి. మరి గులాబీ బాస్ తన కోటకు మరమ్మతులు చేస్తారా? రాబోయే ప్రమాదాన్ని నివారిస్తారా? వేచి చూడాల్సిందే.