హుజూరాబాద్‌లో మాట్లాడుతున్న వినోద్‌కుమార్
కరీంనగర్: ఐదేళ్లకాలంలో కరీంనగర్ ఎంపీగా బండి సంజయ్ ఐదుపైసలు కూడా కేంద్రం నుంచి తేలేదని మాజీ ఎంపీ బోయినపల్లి వినోద్‌కుమార్ విమర్శించారు. శనివారం హుజూరాబాద్‌లో ఎమ్మె ల్యే పాడి కౌశిక్‌రెడ్డి ఆధ్వర్యంలో ఏర్పాటు చేసిన కృతజ్ఞతసభకు కరీంనగర్ ఎమ్మెల్యే గంగుల కమలాకర్, జెడ్పీ చైర్‌పర్సన్ కనుమల్ల విజయతో కలిసి హాజరయ్యారు.
వినోద్‌కుమార్ మాట్లాడుతూ... కేంద్ర ప్రభుత్వం ఉపాధిహామీ పథకానికి ఇచ్చే నిధులు కూడా తానే తెచ్చానని సంజయ్ చెప్పడం హాస్యాస్పదంగా ఉందన్నారు. ఎన్నికలు రాగానే సంజయ్‌కి గ్రామాలు గుర్తొస్తాయని అన్నారు. ఎంపీగా ఒక్క నవోదయపాఠశాల, ట్రిపుల్ ఐటీ కూడా తేలేకపోయాడన్నారు. తాను ఎంపీగా ఉన్న సమయంలో కరీంనగర్‌కు స్టార్ట్‌సిటీ హోదా తెచ్చి రూ.వెయ్యి కోట్లు మంజూరు చేయించినట్లు వివరించారు.
బీఆర్‌ఎస్‌ను బొందపెడతామని సీఎం రేవంత్‌రెడ్డి, మంత్రి కోమటిరెడ్డి వెంకట్‌రెడ్డి మాట్లాడుతున్నారని, వీరి గురువులైన చంద్రబాబు, వైఎస్ రాజశేఖరరెడ్డిలతోనే అదిసాధ్యం కాలేదని అన్నారు. పదేళ్లలో బీఆర్‌ఎస్ సర్కారు చేసిన అభివృద్ధి చూసి ఓర్వలేక బీజేపీ, కాంగ్రెస్ అబద్దాలు ప్రచారం చేసి ప్రజ లను మాయ చేశాయని పేర్కొన్నారు. అబద్దాల పునాదులపై కాంగ్రెస్ ప్రభుత్వం ఏర్పాటైందన్నారు. గత ఎన్నికల్లో హుజూరాబాద్ ప్రజలు 50వేల మెజారిటీ ఇచ్చారని, రాబోయే ఎన్నికల్లో భారీ మెజారిటీ ఇచ్చి ఆశీర్వదించాలని కోరారు.
Comments
Please login to add a commentAdd a comment