ఫోన్‌ ట్యాపింగ్‌ కలకలం! | - | Sakshi
Sakshi News home page

ఫోన్‌ ట్యాపింగ్‌ కలకలం!

Published Sat, Mar 16 2024 1:50 AM | Last Updated on Sat, Mar 16 2024 12:38 PM

- - Sakshi

2021లో కరీంనగర్‌లోనే ప్రణీత్‌రావుపై రేవంత్‌ ఆరోపణలు

సీఎం రేవంత్‌ సన్నిహితుడు సత్తు మల్లేశ్‌ ఫోన్‌ ట్యాప్‌

డీఎస్పీ ప్రణీత్‌రావు చాటింగ్‌ రీట్రైవ్‌లో వెల్లడైన విషయం

మల్లేశ్‌ ద్వారా పలువురు కాంగ్రెస్‌ లీడర్ల సంభాషణలు రికార్డ్‌

జాబితాలో మేడిపల్లి, కవ్వంపల్లి, ఆది, అడ్లూరి, చింతకుంట?

సాక్షిప్రతినిధి, కరీంనగర్‌: ఫోన్‌ ట్యాపింగ్‌ కలకలం సృష్టించిన డీఎస్పీ దుగ్యాల ప్రణీత్‌రావు వ్యవహారం ఆరంభం ఉమ్మడి జిల్లాలోనే జరగడం.. ఆయన అరెస్టు కావడం ఇక్కడే కావడం విశేషం.ట్యాపింగ్‌లో కేసులో సస్పెండైన డీఎస్పీ దుగ్యాల ప్రణీత్‌రావు అప్పటి ప్రతిపక్ష నేత, ప్రస్తుత సీఎం రేవంత్‌ లక్ష్యంగా పలువురు కాంగ్రెస్‌ నేతల ఫోన్లను ట్యాపింగ్‌ చేశారన్న కేసులో అరెస్టు అయిన సంగతి తెలిసిందే. ఉగ్ర సంస్థలు, దేశవ్యతిరేక కార్యకలాపాలకు పాల్పడే వారి ఫోన్లను ట్యాప్‌ చేసేందుకు స్పెషల్‌ ఇంటలిజెన్స్‌ బ్యూరో (ఎస్‌ఐబీ) అధికారులకు అనుమతి ఉంటుంది.

ఆ సాకుతో డీఎస్పీ ప్రణీత్‌రావు తన ఉన్నతాధికారులు అందించిన జాబితాలోని రాజకీయ నేతల ఫోన్లను ట్యాప్‌ చేశారన్న విషయం కలకలం రేపుతోంది. దాదాపు 2 లక్షలకుపైగా కాల్స్‌ను రికార్డ్‌ చేసినట్లు అధికారులు గుర్తించారు. ఇటీవల ప్రణీత్‌రావును అరెస్టు చేసిన సమయంలో స్వాధీనం చేసుకున్న ఫోన్‌లో డిలిట్‌ చేసిన వాట్సాప్‌ చాట్‌ను రీట్రైవ్‌ చేయగలిగారు. అందులో ఉమ్మడి జిల్లాకు చెందిన, ముఖ్యంగా ప్రస్తుతం సీఎంకు సన్నిహితుడిగా పేరొందిన కాంగ్రెస్‌ సీనియర్‌ లీడర్‌ సత్తు మల్లేశ్‌ నంబరు ఉండటం కలకలం రేపుతోంది.

ఎవరీ సత్తు మల్లేశ్‌?
జిల్లాలోని కాంగ్రెస్‌ పార్టీలో సీనియర్‌ నేత. అంతకు ముందు టీడీపీలో రేవంత్‌తో కలిసి పనిచేశారు. రేవంత్‌తోపాటు కాంగ్రెస్‌లో చేరారు. అప్పటి నుంచి రేవంత్‌కు సన్నిహితుడిగా, ఆంతరంగికుడిగా కొనసాగుతున్నారు. ఎన్నికల సమయంలో సత్తు మల్లేశ్‌ ఫోన్‌ కూడా ట్యాపింగ్‌ జరిగినట్లు రీట్రైవ్‌ చేసిన వాట్సాప్‌ చాట్‌ ద్వారా వెల్లడైంది. ఇతను ఎన్నికల సమయంలో ఉమ్మడి జిల్లాకు చెందిన పలువురు కాంగ్రెస్‌ నేతలతో పలుమార్లు సంభాషణలు జరిపారు.

అంతేకాకుండా సత్తు మల్లేశ్‌ ఏం మాట్లాడుతున్నారు? ఎవరిని కలుస్తున్నారు? ఏమేం వ్యూహాలు రూపొందిస్తున్నారు? ఎక్కడెక్కడికి వెళ్తున్నారు? అన్న విషయాలను నిరంతరం గమనించారు. ఈ క్రమంలో సత్తు మల్లేశ్‌ ఉమ్మడి జిల్లాకు చెందిన పలువురు కాంగ్రెస్‌ నాయకులతో సంభాషణలు జరిపారు. ఈజాబితాలో ప్రస్తుత చొప్పదండి, మానకొండూర్‌, వేములవాడ, పెద్దపల్లి, ధర్మపురి ఎమ్మెల్యేలు మేడిపల్లి సత్యం, కవ్వంపల్లి సత్యనారాయణ, ఆదిశ్రీనివాస్‌, చింతకుంట విజ యరమణారావు, అడ్లూరి లక్ష్మణ్‌ కుమార్‌ తదితర నాయకులు ఉన్నారని సమాచారం.

ఎన్నికల సందర్భంగా వీరితో మాట్లాడిన ప్రతీ కాల్‌ను ప్రణీత్‌రావు అండ్‌ టీమ్‌ ట్యాప్‌చేసి ఉంటారని పేరు తెలిపేందుకు ఇష్టపడని ఓ ఉన్నతాధికారి వెల్లడించారు. ఇష్టానుసారంగా సాగిన ఈ వ్యవహారంపై కాంగ్రెస్‌ నేతలంతా మండిపడుతున్నారు.

సిరిసిల్లలో నాలుగు రోజులే..
ఇటీవల డీఎస్పీ ప్రణీత్‌రావును సిరిసిల్లకు బదిలీ చేశారు. ఈ క్రమంలో తన కంటే ముందు పనిచేసిన ఓ డీఎస్పీ ఉన్న ఇంట్లోనే ప్రణీత్‌ అద్దెకు దిగినట్లు తెలిసింది. డీసీఆర్‌బీ విభాగంలో రిపోర్ట్‌ చేసిన ఆయన అక్కడ కేవలం నాలుగు రోజులే పనిచేశారు. అనంతరం ఒకరోజు బందోబస్తు విధుల్లోనూ పాల్గొన్నారు. ఈ క్రమంలోనే ఆయనపై సస్పెన్షన్‌ వేటు పడింది. 2007 ఎస్సై బ్యాచ్‌కు చెందిన ప్రణీత్‌రావుకు డీఎస్పీగా పదోన్నతి రావడం అత్యంత గోప్యంగా జరిగింది.

ఆయన బ్యాచ్‌ చెందిన సహచరులు దాదాపు 250 మందికిపైగా ఉండగా.. కేవలం ఇతనికి మాత్రమే డీఎస్పీ పదోన్నతి రావడం వెలుగుచూడగానే అతని బ్యాచ్‌మేట్లు అవాక్కయ్యారు. ప్రణీత్‌రావు ఎస్సైగా పనిచేస్తున్న సమయంలో ఎస్పీగా పనిచేసిన అధికారే అతన్ని ఎస్‌ఐబీలోకి తీసుకుని ప్రోత్సహించినట్లుగా ఉన్నతాధికారులు గుర్తించారు. ఈక్రమంలో ఈనెల 12న సిరిసిల్లలోని ప్రణీత్‌ రావు నివాసం నుంచి ఆయన్ను పోలీసులు అరెస్టు చేసి హైదరాబాద్‌కు తరలించారు.

2021లో ఇక్కడే వెల్లడించిన రేవంత్‌
ఫోన్‌ ట్యాపింగ్‌ ఆరోపణలను 2021, అక్టోబరు 24వ తేదీన అప్పటి పీసీసీ అధ్యక్షుడు రేవంత్‌రెడ్డి కరీంనగర్‌ వేదికగానే సంధించారు. ఆ వేదిక మీద మేడిపల్లి సత్యం, కవ్వంపల్లి సత్యనారాయణలూ ఉన్నారు. హుజూరాబాద్‌ ఉప ఎన్నికల్లో పాల్గొనడానికి వచ్చిన రేవంత్‌ స్థానిక మైత్రీ హోటల్లో జరిగిన పాత్రికేయుల సమావేశంలో తొలిసారిగా ఈ ఫోన్‌ట్యాపింగ్‌పై బాంబు పేల్చారు.

పోలీసు డిపార్ట్‌మెంటు రెండు వర్గాలుగా చీలిపోయిందని, అప్పటి డీజీపీ మహేందర్‌రెడ్డి ఫోన్లు కూడా ట్యాప్‌ అవుతున్నాయని సంచలన ఆరోపణలు చేశారు. అదే వేదిక మీద నుంచి విశ్రాంత డీఎస్పీ వేణుగోపాల్‌రావు, ఇన్‌స్పెక్టర్‌ దుగ్యాల ప్రణీత్‌ రావు (ప్రస్తుతం సస్పెండైన డీఎస్పీ) ట్యాపింగ్‌ వ్యవహారాన్ని 30 మందితో పర్యవేక్షిస్తున్నారని కూడా ధ్వజమెత్తారు. కరీంనగర్‌ వేదికగా రేవంత్‌రెడ్డి అన్న మాటలు.. ఇప్పుడు జరుగుతున్న పరిణామాలు సరిపోలడం గమనార్హం.

ఇవి చదవండి: కలకలం.. ఉత్కంఠ!

Advertisement

Related News By Category

Related News By Tags

Advertisement
 
Advertisement

పోల్

Advertisement