కరీంనగర్: కాంగ్రెస్‌లో కుమ్ములాటలు మొదలయ్యాయి. అసెంబ్లీ ఎన్నికల సమయంలో మొదలైన అంతర్గత పోరు, లోక్‌సభ ఎన్నికల ముందు తారాస్థాయికి చేరింది. కరీంనగర్ అసెంబ్లీ నియోజకవర్గం పరిధిలో పార్టీ ఇన్‌చార్జి, సీనియర్ల నడుమ నెలకొన్న ఆధిపత్య పోరు పరస్పర ఫిర్యాదులకు దారితీసింది. గత ఎన్నికల్లో కాంగ్రెస్‌కు మూడోస్థానం రావడానికి కారణం, పోటీచేసిన అభ్యర్థేనంటూ పురుమల్ల శ్రీనివాస్‌కు కాంగ్రెస్ క్రమశిక్షణా కమిటీ ఏకంగా షోకాజు నోటీసు జారీ చేయడం చర్చనీయాంశంగా మారింది.
క్రమశిక్షణ కమిటీ షోకాజ్..
గత అసెంబ్లీ ఎన్నికల్లో అనూహ్యంగా టికెట్ దక్కించుకుని కాంగ్రెస్ అభ్యర్థిగా పోటీ చేసిన పురుమల్ల శ్రీనివాస్‌కు పార్టీ గట్టి షాక్ ఇచ్చింది. పార్టీ వ్యతిరేక కార్యకలాపాలకు పాల్పడుతున్నందున మూడు రోజుల్లోగా వివరణ ఇవ్వాలంటూ ప్రదేశ్ కాంగ్రెస్ కమిటీ క్రమశిక్షణాకమిటీ చైర్మన్ జి.చిన్నారెడ్డి గురువారం శ్రీనివాస్‌కు షోకాజు నోటీసు జారీ చేశారు. అసెంబ్లీ ఎన్నికల సమయంలో చురుకుగా వ్యవహరించలేదని, బీఆర్‌ఎస్, బీజేపీలకు లబ్ధి చేకూర్చేలా ప్రవర్తించారని, ఏఐసీసీ కో ఆర్డినేటర్లు, పరిశీలకుల ఆదేశాలను, ఛత్తీస్‌గఢ్ సీఎం పర్యటనను పట్టించుకోలేదని పేర్కొన్నారు. పార్టీ ఫండ్ కూడా ఖర్చు చేయలేదని, షోకాజులో పేర్కొన్న అంశాలపై మూడు రోజుల్లోగా వివరణ ఇవ్వాలని, లేనిపక్షంలో చర్యలు తీసుకోవడం జరుగుతుందని చిన్నారెడ్డి స్పష్టం చేశారు.
చర్య తీసుకోండి: పురుమల్ల
ఎన్నికల్లో తనకు పార్టీ నాయకులు కోమటిరెడ్డి నరేందర్‌రెడ్డి, మెనేని రోహిత్‌రావులు సహకరించడం లేదని, పార్టీ క్యాడర్‌ను తప్పుదోవ పట్టించారంటూ ఈ నెల ఒకటో తేదీన సీఎం రేవంత్‌రెడ్డికి పురుమల్ల శ్రీనివాస్ ఫిర్యాదు చేశారు. డబ్బులు డిమాండ్ చేశారని, రూ.20 లక్షలు ఇచ్చానంటూ తీవ్ర ఆరోపణలు చేశారు. ఎన్నికలు అయిపోయాక కూడా పార్టీ నియోజకవర్గ ఇన్‌చార్జిగా ఉన్న తన ఫొటోను ఎక్కడా ఫ్లెక్సీల్లో పెట్టకుండా అవమానిస్తున్నారని ఆరోపించారు. పార్టీ వ్యతిరేక కార్యకలాపాలకు పాల్పడుతున్నందున వారిపై చర్యతీసుకోవాలని శ్రీనివాస్ కోరారు.
ఓటమికి శ్రీనివాసే కారణం: సీనియర్లు..
అసెంబ్లీ ఎన్నికల్లో పార్టీ ఓటమికి కారణమైన పురుమల్ల శ్రీనివాస్‌ను పార్టీ నుంచి సస్పెండ్ చేయాలంటూ కాంగ్రెస్ సీనియర్లు మంత్రి పొన్నం ప్రభాకర్‌కు ఫిర్యాదు చేశారు. నవంబర్ 22వరకు ప్రచారం అవసరం లేదన్నాడని, చివరి మూడు రోజులు సెల్‌ఫోన్ ఆఫ్ చేసి అభ్యర్థి అందుబాటులో లేకుండా పోయారన్నారు. పార్టీకి మూడోస్థానం రావడానికి కారణమైన శ్రీనివాస్‌ను పార్టీ నుంచి సస్పెండ్‌చేయాలని వారు కోరారు. ఈ ఫిర్యాదుపై కరీంనగర్‌కు చెందిన దాదాపు 12 మంది పార్టీ లీడర్లు సంతకం చేశారు. పార్లమెంట్ ఎన్నికల నేపథ్యంలో పార్టీలో జరుగుతున్న పరిణామాలు కాస్త అధిష్టానానికి చికాకును తెప్పిస్తున్నాయి.
Comments
Please login to add a commentAdd a comment