కరీంనగర్: ప్రజాపాలనలో వేటికెన్ని అర్జీలొచ్చాయో లెక్క తేలింది. జిల్లాలో ఆన్‌లైన్ ప్రక్రియ ఇటీవలే ముగియగా మహాలక్ష్మి పథకానికి అత్యధిక అర్జీలు వచ్చాయని స్పష్టమవుతోంది. గత నెల 28 నుంచి ఈ నెల 6వరకు గ్రామాల్లో, పట్టణాల్లో రోజూవారీగా అర్జీలు స్వీకరించగా వెల్లువలా దరఖాస్తులు వచ్చిన సంగతి విదితమే. సదరు దరఖాస్తులను ఆన్‌లైన్ ప్రక్రియ పూర్తవగా ఇక క్షేత్రస్థాయి పరిశీలన మిగిలింది.
తస్మాత్ జాగ్రత్త
లక్షల మంది అర్జీలు ఇచ్చిన క్రమంలో ఆరు గ్యారంటీల సాకుతో సైబర్ నేరగాళ్లు మోసాలకు పాల్పడే అవకాశముందని పోలీసులు హెచ్చరిస్తున్నారు. దరఖాస్తుదారులకు ఫోన్లు చేసి ఓటీపీలు అడుగుతున్నట్లు సమాచారముందని అప్రమత్తంగా ఉండాలని సూచిస్తున్నారు. అపరిచితులు పంపించే లింక్‌లను ఎట్టి పరిస్థితుల్లోనూ క్లిక్ చేయొద్దని, ఓటీపీలను చెప్పవద్దని చెబుతు మోసానికి గురైతే స్థానిక పోలీసులకు ఫిర్యాదు చేయాలంటున్నారు.
ఫిబ్రవరిలో క్షేత్రస్థాయి పరిశీలన
అర్హులందరికీ సంక్షేమ ఫలాలు అందించేలా ప్రభుత్వం చర్యలు తీసుకుంటోంది. దరఖాస్తుల ఆన్‌లైన్ ప్రక్రియ పూర్తవగా ఫిబ్రవరిలో అధికార యంత్రాంగం క్షేత్రస్థాయి పరిశీలన చేపట్టనుంది. అనర్హులను ఏరివేసి అర్హులకు ప్రయోజనం చేకూర్చనున్నారు. లబ్ధిదారుల ఎంపికలో క్షేత్రస్థాయి పరిశీలన కీలకమవటంతో ప్రభుత్వం కసరత్తు చేస్తోంది. ఆరు గ్యారంటీల అమలుకు ఉప ముఖ్య మంత్రి మల్లు భట్టివిక్రమార్క చైర్మన్‌గా కేబినెట్ సబ్ కమిటీని నియమించింది. ఇందులో సభ్యులుగా మంత్రులు పొంగులేటి శ్రీనివాస్ రెడ్డి, శ్రీధర్‌బాబు ఉన్నారు. నిజమైన లబ్ధిదారులకు అభయహస్తం పథకాలు అందించటమే లక్ష్యంగా సబ్ కమిటీ పనిచేయనుంది. సదరు కమిటీ గైడ్‌లైన్స్ ప్రకారం క్షేత్రస్థాయిలో అధికారులు చర్యలు తీసుకోనున్నారు.
జిల్లాలో గ్రామాలు: 313, మున్సిపాలిటీలు: 5, వచ్చిన అర్జీలు: 3,22,264 (రేషన్ కార్డులకు కలిపి), గ్యారంటీలకు వచ్చిన అర్జీలు: 3,21,246, మొత్తంగా కవరైన నివాసాలు: 3,12,186
ఆన్‌లైన్‌తో తేలిన లెక్క ఇదీ..
రూ.2500కు వచ్చిన అర్జీలు: 2,26,401
రూ.500కు గ్యాస్‌కు: 2,77,292
ఇందిరమ్మ ఇండ్లకు: 2,17,180
గృహజ్యోతికి: 2,35,091
రైతు భరోసాకు: 1,02,172
రైతు కూలీలకు: 1,11,187
Comments
Please login to add a commentAdd a comment