
తెలంగాణ అసెంబ్లీ ఎన్నికల్లో ఆసక్తికరమైన పోరుకు వేదిక కానుందా? ఈటల ప్రకటనతో..
సాక్షి, కరీంనగర్: తెలంగాణ అసెంబ్లీ ఎన్నికలు ఆసక్తికరమైన పోరుకు వేదిక కాబోతోందా? బీజేపీ చేరికల కమిటీ చైర్మన్, హుజరాబాద్ ఎమ్మెల్యే ఈటల రాజేందర్ సంచలన వ్యాఖ్యలు చేశారు. తన నియోజకవర్గంతో పాటు ముఖ్యమంత్రి కల్వకుంట్ల చంద్రశేఖర్‌రావుపైనా తాను పోటీ చేస్తానని ప్రకటించారాయన.
గురువారం హుజూరాబాద్‌లో బీజేపీ ముఖ్యకార్యకర్తల సమావేశంలో మాట్లాడుతూ.. తాను తన నియోజకవర్గంతో పాటు సీఎం కేసీఆర్ పై గజ్వేల్లో రెండు చోట్లా పోటీ చేస్తానని ప్రకటించారు. ఈ సందర్భంగా హుజురాబాద్ లో మీరే కథానాయకులు అవ్వాలంటూ కార్యకర్తలకు ఆయన పిలుపు ఇచ్చారు.
కేసీఆర్ పైసలు కుమ్మరించబోతున్నారు!
మానకొండూర్‌లో బీజేపీ జెండా ఎగరడం ఖాయం. కేసీఆర్ ప్రజల విశ్వాసం కోల్పోయారు. ప్రజలనే కాదు.. ఆఫీసర్లను సైతం నమ్మలేని స్థితిలో కేసీఆర్ ఉన్నారు. కేసీఆర్ అంగట్లో సరుకుల్లా నాయకుల్ని కొంటున్నారు. నాయకుడి స్థాయిని బట్టి రేట్ అంటగడుతున్నారు. ఈ ఎన్నికల్లో కేసీఆర్ ఒక్కొక్క నియోజకవర్గంలో రూ.30 నుంచి వంద కోట్ల దాకా ఖర్చు పెట్టి గెలవాలని చూస్తున్నారు అని ఈటల ఆరోపణలు గుప్పించారు.