సాక్షి, రాజన్న సిరిసిల్ల: బీఆర్‌ఎస్ అభ్యర్థుల జాబితాను సీఎం కేసీఆర్ ప్రకటించిన నేపథ్యంలో టికెట్ ఆశించి భంగపడ్డ సిట్టింగ్ ఎమ్మెల్యేలు అసమ్మతి గళం వినిపిస్తున్నారు. 115 స్థానాలకు బీఆర్‌ఎస్ నుంచి ఎమ్మెల్యే అభ్యర్థులను ప్రకటించిన కేసీఆర్.. 9 స్థానాల్లో సిట్టింగ్‌లను మార్చిన విషయం తెలిసిందే ఈ క్రమంలో చోటు దక్కని నేతలు కేసీఆర్ తీరుపై అసంతృప్తి వ్యక్తం చేస్తూ తిరుగుబావుట ఎగురవేస్తున్నారు.
ఎలాగైనా ఎన్నికల్లో ఎమ్మెల్యేగా పోటీచేయాలనే ఆశతో పార్టీ మారేందుకు యత్నిస్తున్నారు. ప్రత్నామ్నాయ బీజేపీ, కాంగ్రెస్ వైపు చూస్తున్నారు. ఇప్పటికే అసంతృప్తి నేతలను తమవైపు తిప్పుకునేందుకు ప్రతిపక్ష బీజేపీ, కాంగ్రెస్ ప్రయత్నిస్తున్నాయి. బీఆర్‌ఎస్ నుంచి టికెట్ రాని నేతలతో చర్చలు జరుపుతున్నాయి.
ఇక అనుకున్నట్టుగానే వేములవాడ చెన్నమనేనికి కాకుండా పోయింది. అంతా భావించినట్టుగానే చల్మెడ వైద్య విజ్ఞాన సంస్థల చైర్మన్ చల్మెడ లక్ష్మీనర్సింహారావుకే దక్కింది. అయితే, ఇప్పుడు సిట్టింగ్ ఎమ్మెల్యే చెన్నమనేని రమేష్ బాబు దారెటు..? బీఆర్ఎస్ లోనే ఉంటూ చల్మెడ కోరినట్టుగా ఆయనకు సహకరిస్తారా..? లేక, ఇంకో మార్గమేదైనా చూసుకుంటారా..? చెన్నమనేని రాజకీయ వారసత్వానికి కామానో.. లేక, ఫుల్ స్టాప్ పడేందుకు ఆయన సుముఖంగా ఉంటారా..? టిక్కెట్ కొట్లాటకు ముందు ఎంత ఉత్కంఠైతే నెలకొందో.. అదే ఆసక్తి టిక్కెట్ కన్ఫర్మేషన్ తర్వాత కూడా వేములవాడలో కనిపిస్తోంది.
చదవండి: వామపక్షాలతో పొత్తులేదని తేల్చేసిన కేసీఆర్.. కమ్యూనిస్టుల కీలక భేటీ
వేములవాడ అధికార పార్టీ సిట్టింగ్ ఎమ్మెల్యే చెన్నమనేని రమేష్ బాబుకు అంతా ఊహించినట్టుగానే ఈసారి టిక్కెట్ దక్కలేదు. అందుకోసం గులాబీబాస్ కేసీఆర్ చెప్పిన కారణం.. చెన్నమనేనిపై వేములవాడ కాంగ్రెస్ నాయకుడు ఆది శ్రీనివాస్ ఎప్పట్నుంచో పోరాటం చేస్తూ కోర్టుల్లో రచ్చరచ్చగా మారి ద్వంద్వ పౌరసత్వ వివాదమే. అయితే, అది ఆయన్ను పక్కకు పెట్టేందుకు కేవలం సాకు మాత్రమేనని వాదనా ఇప్పుడు రమేష్ బాబు వర్గం నుంచి వినిపిస్తోంది. అలాగైతే.. 2014, 2018కి ముందు నుంచే ఈ వివాదం కొనసాగుతున్నప్పుడు.. అప్పుడెలా మరి రమేష్ బాబు అధికార బీఆర్ఎస్ అభ్యర్థయ్యారో చెప్పాలన్న వాదన ఇప్పుడు రమేష్ బాబు, ఆయన అనుచరవర్గం నుంచి వినిపిస్తోంది.
అయితే గతంలో తన తండ్రి ప్రాతినిథ్యం వహించిన వేములవాడ.. చెన్నమనేని ఫ్యామిలీకి ఓ కంచుకోటగా మారిపోయింది. ఈసారి తమ ప్రాతినిథ్యమే లేకపోతే.. అది కామాగా భావించాలని ఎవరైనా చెప్పినా.. ఆ తర్వాత అదే పూర్తిగా ఫుల్ స్టాప్ అయినా ఆశ్చర్యపోవాల్సిన పని లేదు. ఎందుకంటే మరొకరు వచ్చి జెండా పాతారంటే.. కచ్చితంగా దాన్ని తిరిగి స్వాధీనం చేసుకోవడం అంత సులువు కాదు. ఈ నేపథ్యంలోనే రమేష్ బాబు వేములవాడలో తన తదుపరి భవిష్యత్ కార్యాచరణకై సీరియస్ గా యోచిస్తున్నట్టు తెలుస్తోంది.
చదవండి: ఖానాపూర్‌లో నా సత్తా ఏంటో చూపిస్తా: రేఖా నాయక్ సంచలన వ్యాఖ్యలు
పైగా నిన్న తనకు టిక్కెట్ దక్కదన్న ప్రచారం నేపథ్యంలోనే.. కేసీఆర్ ప్రకటన కంటే ముందే ఓ భావోద్వేగంతో.. ఒకింత నిర్వేదంతో తన తండ్రి మాటలను ఉటంకిస్తూ.. ఆత్మగౌరవం అనే పదాన్ని వాడుతూ చేసిన సోషల్ మీడియా పోస్ట్ ఆయన అంతరగాన్ని తెలియజెప్పింది. ఈ క్రమంలో అనుకున్నట్టుగానే వేములవాడ టిక్కెట్ ను కేటీఆర్ కు సన్నిహితంగా ఉన్న చల్మెడకు కేటాయించడంతో వేములవాడలో ఒకవైపు చల్మెడ అనుచరుల్లో ఆనందం కనిపిస్తే.. ఇంకోవైపు ఒకింత నైరాశ్యం, మరింత స్తబ్దత వాతావరణం కనిపించింది.
తన తండ్రి నుంచి కొనసాగుతూ వస్తున్న రాజకీయ వారసత్వాన్ని వదలుకోవడానికి చెన్నమనేని ఫ్యామిలీ సిద్ధంగా లేదన్నట్టుగా తెలుస్తోంది. ఈ క్రమంలో ఇప్పటికే బాబాయ్ అబ్బాయ్ తో పాటు.. చెన్నమనేని ఫ్యామిలీ సభ్యుల్లో కీలకమైనవారంతా వేములవాడలో నెక్స్ట్ జరుగబోయే రాజకీయమెలా ఉండబోతోంది.. తామేం చేయాలనే సమాలోచనల్లో పడ్డట్టుగా సమాచారం అందుతోంది. ఈ క్రమంలోనే బీజేపి ఎన్నికల మేనేజ్ మెంట్ కమిటీ చైర్మన్ ఈటెల రాజేందర్.. చెన్నమనేనితో మాట్లాడినట్టు తెలుస్తోంది.
ప్రస్తుతం జర్మనీలో ఉన్న రమేష్ బాబు.. ఈనెల ఆగస్ట్ 25వ తేదీన వేములవాడకు రానున్నారు. మొత్తంగా రమేష్ బాబు చూపు కూడా బీజేపీ వైపు పడినట్టుగా తెలుస్తోంది. అందుకు తన బాబాయ్ సపోర్ట్ తో పాటు.. ఈటెల కూడా చొరవ తీసుకోవడంతో.. వేములవాడ నుంచి బీజేపి అభ్యర్థిగా బరిలోకి దిగాలన్న యోచనలో రమేష్ బాబు కూడా యోచిస్తున్నట్టుగా తెలుస్తోంది.
నర్సాపూర్‌లో నువ్వా నేనా? సిట్టింగ్ మదన్‌రెడ్డి, సునీతా లక్ష్మారెడ్డి మధ్య పోటీ
ఇప్పటికే ఈ విషయాన్ని బీజేపీ అధిష్ఠానం పెద్దలకు కూడా ఈటెల చేరవేసినట్టు తెలుస్తుండగా.. మరి రమేష్ బాబు పయనమెటు...? ప్రచారం జరుగుతున్నట్టుగా ఆయన బీజేపీలో చేరతారా...? ఈసారి తన టిక్కెట్ కు గండికొట్టే సాకుగా మారిన ద్వంద్వ పౌరసత్వ వివాదాన్నీ.. కేంద్రంలో ఉన్న పార్టీతో కలిస్తే ఏమైనా తొలగించుకునే అవకాశం దొరుకుతుందా వంటి పలు విశ్లేషణలతో కూడిన చర్చలకు ఇప్పుడు తెర లేస్తోంది.
మొత్తంగా టిక్కెట్ కన్ఫర్మేషన్‌కు ముందు రసవత్తరంగా సాగిన రాజన్న క్షేత్రంలోని రాజకీయం.. టిక్కెట్ కన్ఫర్మేషన్ తర్వాత కూడా అంతకంతకూ రసకందాయంగా మారుతుండటం ఇక్కడి విశేషం.
Comments
Please login to add a commentAdd a comment