సాక్షి, కరీంనగర్ జిల్లా: వేములవాడ సిట్టింగ్ ఎమ్మెల్యే చెన్నమనేని రమేష్ బాబు మరోసారి హాట్ కామెంట్స్ చేశారు. వేములవాడ అర్బన్ మండలం అనుపురంలో.. వేములవాడ బీఆర్ఎస్ అభ్యర్థి చల్మెడ లక్ష్మీనరసింహరావుతో కలిసి గ్రామపంచాయితీ భవన ప్రారంభోత్సవంలో మిడ్ మానేరు ముంపు గ్రామాలనుద్ధేశించి తన మనసులో మాటలన్నీ వెళ్లగక్కారు.
మిడ్ మానేరు ప్రాజెక్ట్ ముంపు గ్రామాల సమస్యలు పరిష్కారం కాకుంటే తానే తిరగబడి పోరాటం చేస్తానంటూ తనదైన ధిక్కారస్వరాన్ని వినిపించిన చెన్నమనేని.. ముంపు గ్రామాలు సిరిసిల్ల నియోజకవర్గంలో ఉండి ఉంటే ఎప్పుడో సమస్యలు పరిష్కారం అయ్యేవన్నారు. ఆ విషయాన్ని సూటిగా కేటీఆర్‌తో కూడా ప్రస్తావించినట్టు చెప్పుకొచ్చారు. అసెంబ్లీలో ముంపు గ్రామాల సమస్యలపై అధికార పక్షంలాగా కాకుండా.. ఓ ప్రతిపక్ష నేతగా పోరాటం చేశానన్న చెన్నమనేని రమేష్ బాబు.. తాను మంత్రినైనా బాగుండేదేమో, ముంపు గ్రామాల సమస్యలు పరిష్కారం సులభమయ్యేదేమోనన్నారు.
మిడ్ మానేరు ముంపు గ్రామాల సమస్యలపై నేను ప్రశ్నించానన్న విషయాలు ప్రజలకు తెలియాల్సిన అవసరం ఉంది కాబట్టే చెబుతున్నానన్న చెన్నమనేని.. ముంపు గ్రామాల సమస్యల పరిష్కారం కోసం ఎక్కని గడప, దిగని గడప లేదన్నారు. కాళ్లు పట్టుకోవడం తప్ప అన్నీ చేశానని.. చెన్నమనేని రాజేశ్వరరావు కూమారుడిని కాబట్టి, ఆత్మగౌరవం ఉంది కాబట్టి, ఆ పని చేయలేకపోయానన్నారు.
సమస్యలు పరిష్కారం కాకుంటే మళ్లీ పోరాటం చేస్తానన్న రమేష్‌బాబు.. మిడ్ మానేరు ముంపు నిర్వాసితుల విషాదగాథల నుండి పాఠాలు నేర్చుకోవాలని తమ అభ్యర్థి చల్మెడకు సూచిస్తున్నానన్నారు. రమేష్ బాబు షాకింగ్ కామెంట్స్‌తో బీఆర్ఎస్ అభ్యర్థి చల్మెడ నిశ్ఛేష్ఠుడై చూస్తూ కూర్చుండిపోయారు. మరోవైపు ముఖ్యమంత్రి వ్యవసాయ సలహాదారుగా చెన్నమనేనిని నియమించాక.. చెన్నమనేని, చల్మెడ మధ్య సయోధ్య కుదిరిందనుకుంటున్న తరుణంలోనూ ఎమ్మెల్యే రమేష్‌బాబు చేస్తున్న వ్యాఖ్యలు ఇప్పుడు హాట్ టాపిక్ గా మారుతున్నాయి.
చదవండి: కాంగ్రెస్ కీలక నిర్ణయం!.. అక్కడి నుంచి బరిలో బండ్ల గణేష్?
Comments
Please login to add a commentAdd a comment