తల్లిదండ్రులు, పిల్లలతో కోరుకంటి చందర్
సాక్షి ప్రతినిధి, కరీంనగర్: సాధారణ సింగరేణి బొగ్గు కార్మికుడి కొడుకు.. పీజీ చదివినా ఉద్యోగం లేని జీవితం.. వెరసి ఆర్థిక ఇబ్బందులు.. అదే సమయంలో మేన మరదలితో వివాహం.. ఆ వివాహంతో దొరికిన తోడు కష్టసుఖాల్లో ఆలంబనగా నిలిచింది. ఇంట్లో ఖాళీగా కూర్చోలేక ఆటో నడిపినా... కేబుల్ టీవీ ఆపరేటర్‌గా నిలదొక్కుకున్నా... చివరికి రాజకీయాల్లోకి వచ్చి తెలంగాణ ఉద్యమకారుడిగా... కార్పొరేటర్‌గా గెలిచినా... ఆ తాళి కట్టిన తోడే కష్టసుఖాల్లో నీడగా నిలిచింది. ఆమె కోరుకంటి విజయ.
రామగుండం శాసనసభ్యుడు కోరుకంటి చందర్ సతీమణి. రాజకీయంగా ఎదిగిన కోరుకంటి చందర్ ఎమ్మెల్యేగా పోటీ చేసి రెండు సార్లు ఓడిపోయినా వెంట ఉండి ధైర్యం చెప్పిన ఆమె... తీరా ఎమ్మెల్యేగా గెలిచే సమయంలో క్యాన్సర్ బారిన పడి అనంత లోకాలకేగింది. ఆమె లేని లోటును ప్రజలకు సేవ చేయడం ద్వారా తీర్చుకుంటున్నట్లు చెబుతున్న ఎమ్మెల్యే కోరుకంటి చందర్‌తో ‘సాక్షి’ పర్సనల్ టైం ఇంటర్వ్యూ...
సాక్షి: మాతృదినోత్సవం రోజు అమ్మలను సన్మానించే కార్యక్రమం చేపడుతున్నారట. ఎప్పటి నుంచి?
చందర్: సింగరేణి ఏరియాలో నేను చాలా మందిని చూశాను. పెద్దయ్యాక తల్లిదండ్రులను గౌరవించకపోవడాన్ని. అమ్మ మీద ప్రేమ, గౌరవం కల్పించాలనే ఉద్దేశంతో మాతృ దినోత్సవం సందర్భంగా గత సంవత్సరం సింగరేణి స్టేడియంలో వేదిక ఏర్పాటు చేసి 2018 మంది తల్లులకు వారి పిల్లలతో పాదపూజ, సన్మానం చేయించే కార్యక్రమం చేపట్టాను. ఈ సంవత్సరం కూడా ఆదివారం(12వ తేదీ) స్టేడియంలో 2019 మంది మాతృమూర్తులకు సన్మానం చేయిస్తున్నాను. సన్మానం చేసిన వారికి వెండి నాణెం బహుమానంగా ఇస్తున్నాను.
సాక్షి: ఎమ్మెల్యే కావాలనే కోరిక పదేళ్ల తరువాత తీరింది. పార్టీ టికెట్టు ఇవ్వకున్నా... వేరే పార్టీ గుర్తు మీద పోటీ చేసి గెలిచారు. పదవి కోసం వచ్చిన పట్టుదలా?
చందర్: చిన్నప్పటి నుంచి అనుకున్నది సాధించాలనే పట్టుదల నాకుంది. చదువులో గానీ, జీవన పోరాటంలో గానీ అదే పట్టుదలతో లక్ష్యాన్ని సాధించాను. ఎమ్మెల్యే విషయంలో సైతం రెండుసార్లు దక్కకుండా పోయిన పదవిని ప్రజల ఆశీస్సులతోనే సాధించాను. 2009లో టీఆర్‌ఎస్ అభ్యర్థిగా పోటీ చేసి ఓడిపోయాను. రెండోసారి 2014లో పార్టీ టికెట్టు ఇవ్వకపోతే సింహం గుర్తు మీద పోటీ చేసి, స్వల్ప ఓట్ల తేడాతో ఓడాను. ఈసారి కూడా నాకు టికెట్టు ఇవ్వలేదు. దాంతో ఎలాగైనా గెలిచి, టీఆర్‌ఎస్‌లో చేరాలనే మరోసారి ‘సింహం’ గుర్తు మీద పోటీ చేసి విజయం సాధించాను. నా పట్టుదలతోపాటు నా భార్య దివంగత విజయ ప్రోత్సాహం నా విజయాలకు కారణం.
సాక్షి: ఎన్నికల సమయంలో విజయమ్మ మరణం మీ ఆత్మస్థయిర్యాన్ని దెబ్బతీసిందా?
చందర్: విజయ నాలో సగం. నాకు సర్వస్వం. నా కష్టసుఖాల్లో వెన్నంటి ఉంది. ఆమెకు క్యాన్సర్ అనే విషయం 2016 జనవరిలో తెలిసింది. అప్పటి నుంచి హైదరాబాద్‌లో చికిత్స చేయిస్తున్నాను. కోలుకుంటుందనే భావించాను. ఊపిరితిత్తుల క్యాన్సర్ నాలుగో దశకు చేరడంతో ఆమె మాకు దూరమైంది. సరిగ్గా నా ఎన్నికల ప్రచారం సమయంలో జరిగిన సంఘటన. నేను చాలా కుంగిపోయాను. ప్రచారానికి కూడా వెళ్లలేదు. ప్రజలు, నా స్నేహితులు, బంధువులు నా వెంట నిలిచారు. నన్ను గెలిపించుకున్నారు. నేను ఎమ్మెల్యే కావాలని కలలు కన్న ఆమె తీరా నేను గెలిచేనాటికి లేకుండా పోవడం విధి ఆడిన నాటకం.
సాక్షి: సింగరేణి కార్మికుడి కొడుకుగా మీ చిన్ననాటి జీవితం ఎలా సాగింది?
చందర్: మా నాన్న మల్లయ్య జూలపల్లి దగ్గర్లోని తులసిపల్లె నుంచి సింగరేణి జనరల్ మజ్దూర్ కార్మికుడిగా గోదావరిఖని వచ్చాడు. నాకు ఒక అక్క, ఇద్దరు చెల్లెళ్లు. చిన్ననాటి నుంచి ఇక్కడే పెరిగాను. డిగ్రీ, పీజీ గోదావరిఖనిలోనే. మా నాన్న సంపాదన కుటుంబపోషణకే సరిపోయేది. మా అక్క, చెల్లెళ్ల పెళ్లిళ్లు జరపడమే కష్టంగా గడిచిన పరిస్థితి. ఆర్థిక ఇబ్బందులు వెంటాడేవి. పీజీ అయ్యాక మేన మరదలు విజయతో పెళ్లయింది. ఉద్యోగం లేకపోవడంతో మూడు నెలలు గోదావరిఖనిలో ఆటో నడిపాను. తరువాత కేబుల్ టీవీ రంగంలోకి దిగాను. దాంతో ఆర్థిక కష్టాలు గట్టెక్కాయి. అదే సమయంలో పాపులర్ టీవీ పేరుతో లోకల్ టీవీ ఛానెల్‌ను కూడా నిర్వహించాను.
సాక్షి: ఎమ్మెల్యేగా పోటీ చేసి రెండుసార్లు ఓడిపోయారు. మళ్లీ మూడోసారి పోటీ చేసి గెలిచారు. ఆర్థికంగా చేయూత ఇచ్చిందెవరు?
చందర్: కేబుల్ టీవీ ఆపరేటర్‌గా సంపాదించిన డబ్బులు నా రాజకీయ ఖర్చులకు సరిపోయేవి. ఎమ్మెల్యేగా పోటీ చేసిన ప్రతిసారి నా మిత్రులు నాకు అన్ని రకాల సహకరించారు. అయినా అప్పులయ్యాయి. 2009లో ఓడిపోయిన తరువాత గౌతం నగర్‌లో ఇల్లు ఆమ్మేశాను. నాకు ఖర్చులకు అవసరమైతే నా భార్య నగలు తాకట్టు పెట్టి డబ్బులు తెచ్చిచ్చేది. కష్ట నష్టాలు ఎదురైనా నా భార్య తోడు ఉంది. ఈసారి ఎన్నికల్లో సాధారణ ఖర్చులకు కూడా నా దగ్గర డబ్బులు లేవు. నా ప్రత్యర్థి కోట్లు కుమ్మరించాడు. అయినా రామగుండం ప్రజల అభిమానం, ఆశీస్సులతో ఈసారి ఎమ్మెల్యేగా ఎన్నికయ్యాను.
సాక్షి: ఎమ్మెల్యే అయినా... గోదావరిఖని తిలక్‌నగర్‌లోని ఇరుకు సందుల్లోని చిన్న ఇంట్లోనే ఉంటున్నారు? ఎన్‌టీపీసీ, సింగరేణి క్వార్టర్స్ ఉన్నాయి కదా?
చందర్: నేను పుట్టి పెరిగిన ఇల్లు అది. బస్తీవాళ్లు, చుట్టుపక్కల వాళ్లతో ఉన్న బంధాలు ఇక్కడి నుంచి వెళ్లనివ్వవు. కులమతాలకు అతీతంగా వావి వరుసలతో పిలుచుకుంటాం. ఈ ఇంటితో, ప్రాంతంతో ఉన్న అనుబంధంతోనే నేనెక్కడికి వెళ్లను. ఎన్‌టీపీసీ, సింగరేణి క్వార్టర్స్‌కు వెళితే ప్రజలతో దూరం పెరుగుతుంది. ఇంట్లో, క్యాంపు కార్యాలయంలో నిత్యం ప్రజలకు అందుబాటులో ఉంటా.
సాక్షి: కేబుల్ ఆపరేటర్‌గా డబ్బులు సంపాదిస్తున్న సమయంలో రాజకీయాల్లోకి ఎందుకు వచ్చారు?
చందర్: నేను రాజకీయాల్లోకి రావడానికి ఇనిస్పిరేషన్ మంత్రి కొప్పుల ఈశ్వర్. నాకు తోబుట్టువు వంటి వారు. 1994 ప్రాంతంలో ఆయన టీడీపీలో కీలక నాయకుడిగా ఉన్నప్పుడు ప్రజలతో, కార్మికులతో ఆయనకున్న సంబంధాలు చూసి స్ఫూర్తి పొందా. నేను ఆయన వెంటే టీడీపీలో చేరి రాజకీయ ఓనమాలు దిద్దుకున్నా. కార్మికుల హక్కుల కోసం సాగిన ఉద్యమాల్లో ఈశ్వరన్నతో కలిసి పనిచేశా. ఆయన 1994లో ఎమ్మెల్యేగా పోటీ చేసినప్పుడు వెంట ఉన్నా. 2004లో టీఆర్‌ఎస్‌లోకి వచ్చినప్పుడు ఆయనతోపాటు టీఆర్‌ఎస్‌లో చేరా. టీఆర్‌ఎస్‌లో తెలంగాణ కోసం ఉద్యమ నాయకుడిగా ఈశ్వరన్న స్ఫూర్తితో ఎన్నో కార్యక్రమాల్లో పాల్గొన్నా. 45 రోజులు జైలుకు వెళ్లిన. నా మీద పీడీ యాక్ట్ కూడా పెట్టారు. పోలీసులకు దొరకలేదనుకోండి.
సాక్షి: ఫార్వర్డ్ బ్లాక్ నుంచి గెలిచి టీఆర్‌ఎస్‌లో చేరిన తరువాత మీకెలా ఉంది?
చందర్: సింహం గుర్తు కోసం ఫార్వర్డ్ బ్లాక్ నుంచి పోటీ చేశా. 2014లో కూడా నా గుర్తు అదే. గెలిచిన తరువాత యువనేత కేటీఆర్‌ను కలిసి పార్టీలో చేరా. కేసీఆర్ నాయకత్వం అంటే నాకిష్టం. ఆయన నేతృత్వంలో పనిచేయడం నాగ్గావాలి. కేటీఆర్ సమయస్ఫూర్తి, నాయకత్వ లక్షణాలు మాలాంటి యువ నాయకులకు స్ఫూర్తిదాయకం. కేసీఆర్, కేటీఆర్ ఇద్దరూ నాకు ప్రాధాన్యత ఇచ్చారు. నేను ఏ పదవుల కోసమో టీఆర్‌ఎస్‌లో చేరలేదు. టీఆర్‌ఎస్ అంటే నాకు రాజకీయ జీవితాన్నిచ్చిన పార్టీ.
సాక్షి: మీ పిల్లలేం చేస్తున్నారు?
చందర్: మాకు ఇద్దరు పిల్లలు. అమ్మాయి ఉజ్వల బయో టెక్నాలజీలో ఇంజనీరింగ్ పూర్తి చేసింది. 2015 డిసెంబర్‌లో పెళ్లయింది. కొడుకు మణిదీప్, మైనింగ్ డిప్లొమా చదివాడు. వాళ్ల అమ్మ చనిపోయిన తరువాత నా కూతురు నన్ను కంటికి రెప్పలా కాపాడుకుంటుంది. అల్లుడు చాలా మంచోడు. ఇంజనీర్. ప్రస్తుతం నా దగ్గరే ఉంటున్నారు. అమ్మ నాన్న కూడా నాతోనే ఉంటారు. నా భార్య పేరిట విజయమ్మ చారిటబుల్ ట్రస్ట్ ఏర్పాటు చేశాను. మహిళా సాధికారికత, శిక్షణ కోసం కార్యక్రమాలు చేపడుతున్నా.
Comments
Please login to add a commentAdd a comment