సాక్షి, పెద్దపల్లి: పెద్దపల్లి జిల్లా పారిశ్రామిక ప్రాంతం రామగుండంలో రాజకీయాలు రక్తి కట్టిస్తున్నాయి. ఎన్నికలకు ఇంకా సమయం ఉన్నా మూడు ప్రధాన పార్టీలు అప్పుడే నువ్వా నేనా అన్నట్టు ప్రచారబరిలోకి దిగాయి. వచ్చే ఎన్నికల్లో అసెంబ్లీ, పార్లమెంట్ ఎన్నికల్లో సత్తా చాటేలా అన్ని పార్టీలు గ్రౌండ్ ప్రిపేర్ చేసుకుంటున్నాయి. కారు జోరుకు బ్రేకులు వేయాలని కాంగ్రెస్, కమలం పార్టీలు ప్లాన్ చేస్తున్నాయి. సింగరేణి కార్మికులే ఇక్కడ గెలుపోటములు డిసైడ్ చేస్తారు.
ఎత్తుకు పై ఎత్తులు
రామగుండం నియోజకవర్గంలో మళ్లీ గులాబీ జెండా ఎగురవేసేలా టీఆర్ఎస్ పావులు కదుపుతోంది. మరోవైపు గులాబీ పార్టీ ఎత్తుకు బీజేపీ పై ఎత్తులు వేస్తోంది. కాంగ్రెస్ మాత్రం ఈ సారి ఎలాగైనా సత్తా చాటుతామని ధీమా వ్యక్తం చేస్తోంది. ఓటరు దేవుళ్ళను ప్రసన్నం చేసుకునేందుకు అప్పుడే ఇంటింటికి తిరుగుతూ ప్రచారం మొదలుపెట్టేశారు మూడు పార్టీల నాయకులు. టీఆర్‌ఎస్‌లో ఎమ్మెల్యే కోరుకంటి చందర్, బీజేపీలో మాజీ ఎమ్మెల్యే సోమారపు సత్యనారాయణ, కాంగ్రెస్‌లో రాజ్ ఠాగూర్ మక్కన్ సింగ్ రానున్న ఎన్నికలు సవాల్తీగాసుకుని తమ పంతం నెగ్గించుకునేలా పావులు కదుపుతున్నారు.
సింగరేణి కార్మికులదే
రామగుండం నియోజకవర్గంలో గోదావరిఖని పట్టణం, రామగుండం, పాలకుర్తి, అంతర్గాం మండలాలు ఉంటాయి. సింగరేణి కార్మికులు మొత్తం గోదావరిఖని 8 ఇంక్లైన్ కాలనీల్లో ఉంటారు. ఇక్కడ కార్మికుల కుటుంబాలు, మహిళా ఓటర్లు ఎక్కువ. సింగరేణి కార్మికులు యూనియన్‌ల పరంగా పోటాపోటీగా ఉంటాయి. కారుణ్య నియామకాలు, పేరు మార్పిడి జీఓ, బోనస్ లాంటి అంశాలు ఎన్నికలను ప్రభావితం చేస్తాయి. పింఛన్లు టీఆర్ఎస్‌కు అనుకూలమే. అయితే టీఆర్ఎస్ ఎమ్మెల్యే చందర్ అనుచరుల తీరు వల్ల కొంత ఇబ్బంది ఉంటుందనే చర్చ నడుస్తోంది. గతంలో ఎమ్మెల్యేగా తాను చేసిన అభివృద్ది కలిసి వస్తుందని బీజీపీ నేత సోమారపు భావిస్తున్నారు.
చదవండి: పార్టీకి గుడ్‌బై! గులాం నబీ ఆజాద్‌పై కాంగ్రెస్ సీనియర్ నేతల సెటైర్లు
ద్విముఖ పోటీనే
మంథని నియోజకవర్గం పేరు వినగానే కాళేశ్వరం ప్రాజెక్టు గుర్తుకొస్తుంది. కాళేశ్వరం ప్రాజెక్టు ఈ నియోజక వర్గంలోనిదే. మహాదేవ్ పూర్ ప్రాంతం భూపాలపల్లి జిల్లాలోకి వెళ్లడంతో కాళేశ్వరం ఆలయం, మేడిగడ్డ బ్యారేజ్ లక్ష్మి పంపు హౌజ్ ఉన్న ప్రాంతాలు ఆ జిల్లా పరిధిలోకి వెళ్లాయి. పార్వతీ బ్యారేజ్ సరస్వతీ పంపు హౌజ్ మంథని నియోజక వర్గంలోనే ఉన్నాయి. ఎన్నికలు మరో ఏడాదిలో జరిగే అవకాశాలు కన్పిస్తుడంతో రాజకీయ నాయకులు ఇప్పటినుంచే సిద్ధమవుతున్నారు. అనేక ఏండ్లుగా ఇక్కడ ద్విముఖ పోటీనే ఎక్కువగా జరుగుతోంది. తెలంగాణ ఏర్పడిన తర్వాత టీఆర్ఎస్, కాంగ్రెస్ అభ్యర్థుల మధ్య గట్టి పోటీ కొసాగుతోంది. కానీ ఈసారి మారిన రాజకీయ పరిణామాల నేపథ్యంలో త్రిముఖ పోటీ జరిగే అవకాశాలు కన్పిస్తున్నాయి.
శ్రీధర్‌బాబుపై అసంతృప్తి
మంథని నియోజకవర్గంలో శ్రీధర్ బాబు కాంగ్రెస్ తరపున మూడు సార్లు ఎన్నికయ్యారు. 2018 ఎన్నికల్లో టీఆర్ఎస్ అభ్యర్థి పుట్ట మధుపై శ్రీధర్‌బాబు విజయం సాధించారు. నాటి నుంచి నియోజకవర్గంలో పర్యటిస్తూనే ఉన్నారు. అక్కడక్కడ అయనపై ఇంకా అసంతృప్తి కన్పిస్తోంది. కార్యకర్తల ఫోన్లు లిఫ్ట్ చేయరనే విమర్శలు ఎదుర్కొంటున్నారు శ్రీధర్‌బాబు. ఇక్కడ బీజేపీ అభ్యర్థిగా చందుపట్ల సునీల్ రెడ్డి పేరు ఖరారు చేసే అవకాశాలున్నట్లు చెబుతున్నారు. టీఆర్ఎస్ నుంచి బీజేపీలో చేరిన చందుపట్ల బీజేపీ కార్యక్రమాల్లో చురుకుగా పాల్గొంటూ అధిష్టానం దృష్టిలో వడినట్లు సమాచారం.
పుట్టమధుపై ఆరోపణలు
న్యాయవాది వామన్ రావు హత్య విషయంలో టీఆర్ఎస్‌నేత, జడ్పీ చైర్మన్ పుట్ట మధుపై తీవ్ర ఆరోపణలు వెల్లువెత్తాయి. తమ వద్దే ఉన్న కాళేశ్వరం ప్రాజెక్టు వల్ల తమకు ఇబ్బందులే తప్ప ప్రయోజనం లేదని స్థానికులు భావిస్తున్నారు. ఈ రెండు అంశాలు గులాబీ పార్టీకి మైనస్‌అని భావిస్తున్నారు. పుట్ట మధు బీజేపీ ఎమ్మెల్యే ఈటల రాజేందర్‌కు సన్నిహితంగా ఉంటారనే టాక్ ఉంది. గులాబీ పార్టీ టికెట్ రాకపోతే పుట్ట మధు బీజేపీలోకి వెళ్ళవచ్చనే ప్రచారం కూడా జరుగుతోంది.
రెండుసార్లు పట్టం
వరుసగా రెండుసార్లు ఏ పార్టీని ఆదరించని పెద్దపల్లి ప్రజలు ఒక్క టీఆర్‌ఎస్‌కు మాత్రమే రెండుసార్లు పట్టం కట్టారు. టీఆర్‌ఎస్ సిట్టింగ్ ఎమ్మెల్యే దాసరి మనోహర్ రెడ్డికి కొంత ఇబ్బందికర వాతావరణం ఉన్నందున ఈసారి అధిష్టానం టికెట్ ఇవ్వదని కూడా జోరుగా ప్రచారం సాగుతోంది. టిక్కెట్‌ఇవ్వని పక్షంలో తాను ఇండిపెండెంట్‌గా బరిలో ఉంటానని మనోహర్ రెడ్డి చెబుతున్నట్లు సమాచారం.
బండి సంజయ్ వర్గీయుడికి టికెట్?
ఇక కాంగ్రెస్ నుంచి ఒకసారి గెలిచి రెండుసార్లు ఓడిపోయిన చింతకుంట విజయరమణారావు ఈసారయినా గెలిచి తీరాలనే పట్టుదలగా ఉన్నారు. అయితే ఆయనకు జిల్లా అధ్యక్షుడు ఈర్ల కొమురయ్య, ఓదెల ఎంపిపి గంట రాములు పక్కలో బల్లెంలా తయారయ్యారని టాక్. పెద్దపల్లిలో పోటీలో ఉండే కమలనాధులెవరనే ప్రశ్న వినిపిస్తోంది. మాజీ ఎమ్మెల్యే గుజ్జుల రామకృష్ణారెడ్డికి ఈసారి టికెట్ అనుమానమేనంటున్నారు. బండి సంజయ్ వర్గీయుడు ప్రదీప్ రావుకు పెద్దపల్లి టికెట్ ఇవ్వచ్చని సమాచారం.
100 కోట్ల ఆదాయం వస్తున్నా అభివృద్ధి సున్నా
దక్షిణ కాశీగా పేరు గాంచిన వేములవాడ రాజ రాజేశ్వర స్వామి కొలువై ఉన్న నియోజక వర్గ కేంద్రం అది. ఏడాదికి 100 కోట్ల ఆదాయం వస్తున్నా రాజన్న ఆలయం అభివృద్ధి కాలేదు. నియోజక వర్గం కూడా ఆశించిన స్థాయిలో అభివృద్ధి చెందలేదు. స్వయానా సీఎం కేసీఆర్ ప్రకటించిన టెంపుల్ మాస్టర్ ప్లాన్ కూడా అమలుకు నోచుకోవడం లేదు. ఇక్కడ 2009 నుంచి చెన్నమనేని రమేష్ బాబు గెలుస్తూ వస్తున్నారు. రమేష్ బాబుకు జర్మనీ పౌరసత్వం ఉండేది. దీనిపై కాంగ్రెస్ నేత ఆది శ్రీనివాస్ ఫిర్యాదు చేయడంతో కోర్టులోను, కేంద్ర హోమ్ శాఖ ఆధ్వర్యంలో కూడా విచారణ జరుగుతోంది.
పోటీలోకి మాజీ గవర్నర్ కొడుకు!
సీనియర్ కాంగ్రెస్ నేత చల్మెడ లక్ష్మీ నరసింహా రావు టీఆర్‌ఎస్ తీర్థం పుచ్చుకున్నారు. వచ్చే ఎన్నికల్లో వేములవాడ టీఆర్ఎస్ టికెట్ చల్మెడకే అనే టాక్ వినిపిస్తోంది. మున్నూరు కాపు రాష్ట్ర అధ్యక్షునిగా ఉన్న కొండ దేవయ్య కూడా టీఆర్ఎస్ టికెట్ ఆశిస్తున్నారు. ఇక బీజేపీ నుంచి మహారాష్ట్ర గవర్నర్‌గా పనిచేసిన సీహెచ్. విద్యాసాగర్ రావు కొడుకు వికాస్ పోటీకి రెడీ అవుతున్నట్టు తెలుస్తోంది. బీజేపీ రాష్ట్ర అధ్యక్షుడు బండి సంజయ్ కూడా పోటీ చేయవచ్చని ప్రచారం జరుగుతోంది. కాంగ్రెస్ నుంచి ఆది శ్రీనివాస్ మరోసారి తన అదృష్టాన్ని పరీక్షించుకునేందుకు సిద్ధం అవుతున్నారు.
సిరిసిల్లలో నేత కార్మికులకు చేతి నిండా పని
సిరిసిల్ల అనగానే చేనేత.. సీనియర్ ఎమ్మెల్యే చెన్నమనేని రాజేశ్వరావు గుర్తుకు వస్తారు. ఇప్పుడు మంత్రి కేటీఆర్ పేరు వినగానే సిరిసిల్ల గుర్తుకు వచ్చే పరిస్తితి వచ్చింది. చెన్నమనేని రాజేశ్వరావు లాగే కేటీఆర్ కూడా సిరిసిల్లలో నాలుగు సార్లు గెలుపొందారు. ఐదోసారి కూడా విజయకేతనం ఎగరేయడానికి సిద్ధంగా ఉన్నారు కేటీఆర్. కేటీఆర్ టీఆర్ఎస్ పార్టీ వర్కింగ్ కమిటీ ప్రెసిడెంట్‌తోపాటు మంత్రి కావడం, ముఖ్యమంత్రి కుమారుడు కావడం సిరిసిల్లకు కలిసి వచ్చింది. ఎన్నడూ లేని విధంగా సిరిసిల్లలో నేత కార్మికులకు చేతి నిండా పని దొరుకుతోంది. సిరిసిల్లలో చాలా అభివృద్ధి పనులు కేటీఆర్ ఆధ్వర్యంలో జరిగాయి.
ఈసారి కూడా కేకేనే
సిరిసిల్ల టీఆర్ఎస్ ద్వితీయ శ్రేణి నాయకుల్లో కుమ్ములాటలు జనాల్లో పార్టీకి చెడ్డపేరు తెస్తోంది.. నాయకుల మధ్య ఐక్యత లేకపోవడం ఇబ్బందికరంగా మారింది. 2009లో ఇండిపెండెంట్‌గా పోటీ చేసిన కకేకే మహేందర్‌రెడ్డి 171 ఓట్ల స్వల్ప తేడాతో కేటీఆర్ చేతిలో ఓడిపోయారు. 2014లో కాంగ్రెస్‌తరపున పోటీచేసినా ఓడారు. కేకేకు కాంగ్రెస్ నేతల నుంచి సహాయ నిరాకరణ కొనసాగుతూనే ఉంది. ఈసారి కూడా కేకే మహేందర్ రెడ్డినే పోటీకి సిద్ధం అవుతున్నారని తెలుస్తోంది. ఇక సిరిసిల్లలో బీజేపీ పుంజుకుంటోంది. ఈసారి బీజేపీ తరపున మృత్యుంజయం లేదా జిల్లా ఉపాధ్యక్షుడు రెడ్డబోయిన గోపి పోటీ చేస్తారని తెలుస్తోంది.
Comments
Please login to add a commentAdd a comment