( ఫైల్ ఫోటో )
ప్రతీ పండుగా ఓ సెంటిమెంటే.. ఎన్నికల కాలంలో ప్రతీ సెంటిమెంటూ ఓ రాజకీయాస్త్రమే. అలాంటి ఆసక్తికర సెంటిమెంట్ రాజకీయాలకు ఇప్పుడు రాఖీ పండుగా ఓ అస్త్రంగా మారుతోందక్కడ. బీఆర్ఎస్ టిక్కెట్ ఆశించి భంగపడటంతో పాటు.. సిట్టింగ్‌పై తిరుగుబావుటా ఎగరేసిన ఆ మహిళా నేత.. అవసరమైతే బీఆర్ఎస్ రెబల్‌గా.. ఇండిపెండెంట్‌గా బరిలో నిలవాలని యోచిస్తున్నారట. అందుకే.. ఇప్పుడక్కడ రాఖీలు కడుతూ.. కార్మిక క్షేత్రంలో సోదరభావాన్ని పెంచే యత్నం చేస్తోంది ఆ మహిళామణి.
రామగుండంలో రాజకీయాలు చాలాకాలంగా హాట్ హాట్‌గా సాగుతున్నాయి. ప్రస్తుత సిట్టింగ్ ఎమ్మెల్యే చందర్‌కు టిక్కెట్ ఇవ్వొద్దని కొందరు అసమ్మతి నేతలు తిరుగుబాటు ప్రకటించినా.. మంత్రి కేటీఆర్ ఆశీస్సులతో గులాబీ బాస్ చందర్‌కే టిక్కెట్ కన్ఫర్మ్ చేశారు. అయితే, మంత్రుల బుజ్జగింపులతో కొంత సద్దుమణిగినట్టు తాత్కాలికంగా కనిపించినా.. అసమ్మతి నేతల్లో ఆ జ్వాలలు మాత్రం ఆరడం లేదు.
అందులో పాలకుర్తి జెడ్పీటీసీ, బీఆర్ఎస్ ఆశావహ నేత కందుల సంధ్యారాణిది కూడా కీలకపాత్రే. అయితే, చందర్‌కు టిక్కెట్ కేటాయించాక.. ఆయన అనుచరులు ఆమెను కించపర్చే విధంగా పోస్టులు పెడుతున్నారంటూ వారం క్రితం సోషల్ మీడియాలో తన ఆవేదన వ్యక్తం చేస్తూ వీడియోస్ కూడా పోస్ట్ చేసిన సంధ్యారాణి.. ఇప్పుడు రామగుండంలో బీఆర్ఎస్ రెబల్‌గా బరిలోకి దిగేందుకు సిద్ధమయ్యారు.
( ఫైల్ ఫోటో )
అవసరమైతే ఇండిపెండెంట్‌గా కూడా బరిలో ఉండేందుకు సిద్ధపడుతున్న నేపథ్యంలో.. సంధ్యారాణి ఇప్పుడు రాఖీపండుగ సెంటిమెంట్‌ను ఉపయోగించుకుంటోంది. కార్మిక క్షేత్రమైన సింగరేణిలో వివిధ సంఘాలకు సంబంధించిన నాయకులతో పాటు.. ప్రతీ గనిలో పర్యటిస్తూ తనకు మద్దతు ప్రకటించాలంటూ రాఖీ కడుతూ సోదరభావంతో కూడిన సెంటిమెంట్ ను వారిలో తీసుకొస్తున్నారు సంధ్యారాణి.
చదవండి: అత్తమీద కోపం.. అల్లుడిపై ప్రతాపం
మొత్తంగా ఎన్నికలు దగ్గరపడుతున్న కొద్దీ రాజకీయాలు రంజుగా మారుతున్న క్రమంలో.. కొంత అసమ్మతి జ్వాలలు ఎగిసిపడుతున్న చోట అవి మరింత రక్తి కట్టిస్తున్నాయి. మరోవైపు నేతలు ఎవరికివారు ప్రజల మద్దతును కూడగట్టి వాటిని ఓట్లుగా మల్చుకునే క్రమంలో ప్రతీ అంశాన్నీ తమకనుకూలమైన అస్త్రంగా మల్చుకునే యత్నాలు చేస్తూనే ఉన్నారు. పైగా ఇండిపెండెంట్లకు కూడా పెద్దపీట వేస్తూ.. ఎమ్మెల్యేలను మార్చే సంప్రదాయాన్ని కొనసాగిస్తున్న కోల్ బెల్ట్ ఏరియా రామగుండంలో ఆ సెంటిమెంట్‌ను అందిపుచ్చుకునేందుకు.. ఇప్పుడు రాఖీ సెంటిమెంట్‌తో ముందుకొచ్చారు కందుల సంధ్యారాణి.
Comments
Please login to add a commentAdd a comment