
సాక్షి, మేడ్చల్ జిల్లా/జెడ్పీసెంటర్ (మహబూబ్‌నగర్): తెలంగాణ రాష్ట్రం ఏర్పడిన తర్వాత కూడా బడుగుల బతుకులు మారలేదని, ఎస్సీ, ఎస్టీ, అల్పసంఖ్యాక వర్గాలవారు అన్ని రంగాల్లో వెనుకబడ్డారని బీఎస్పీ జాతీయ అధ్యక్షురాలు మాయావతి అన్నారు. తెలంగాణ ప్రజల ఆకాంక్షలను టీఆర్‌ఎస్ ప్రభుత్వం నెరవేర్చలేకపోయిందన్నారు. కేంద్ర, రాష్ట్ర ప్రభుత్వాలు పేదలకు చేయూతనివ్వటంలో పూర్తిగా విఫలమయ్యాయని ఆమె విమర్శించారు. మేడ్చల్‌లో గురువారం సాయంత్రం జరిగిన బీఎస్పీ ఎన్నికల బహిరంగ సభలో మాయావతి ప్రసంగించారు. రాష్ట్రంలో బీఎస్పీని గెలిపిస్తే ఉత్తరప్రదేశ్ తరహా పాలన అందిస్తామని హామీనిచ్చారు. బీజేపీ, కాంగ్రెస్, టీఆర్‌ఎస్‌లు ప్రజావ్యతిరేక పార్టీలని, ఈ పార్టీలన్నీ బడుగు, బలహీన వర్గాల ప్రజల సంక్షేమాన్ని విస్మరించాయని మాయావతి విమర్శించారు.
రిజర్వేషన్లు తొలగించేందుకు కుట్ర
అణగారిన వర్గాల కోసం అంబేడ్కర్ కల్పించిన రిజర్వేషన్లు తొలగించేందుకు కాంగ్రెస్, బీజేపీలు కుట్ర చేస్తున్నాయని మాయావతి ఆరోపించారు. గురువారం ఆమె మహబూబ్‌నగర్ ఉమ్మడి జిల్లాలో బీఎస్పీ తరఫున పోటీ చేస్తున్న అభ్యర్థులకు మద్దతుగా ప్రచార సభలో మాట్లాడారు. రిజర్వేషన్లు కాపాడుకోవాల్సిన బాధ్యత ప్రతీ బహుజనుడిపై ఉందని అన్నారు. రాష్ట్రంలో రెండు శాతం ఉన్న అగ్రవర్ణాలవారికే అన్ని పార్టీలు టికెట్లు ఇచ్చాయని.. ఆయా పార్టీల నుంచి పోటీ చేస్తున్న అగ్రవర్ణ అభ్యర్థులను ఓడించాలని మాయావతి పిలుపునిచ్చారు.
Comments
Please login to add a commentAdd a comment