సాక్షి, మేడ్చల్ జిల్లా: ప్రధాన పార్టీల నుంచి టికెట్లు ఆశించి భంగపడిన నేతలు ఏనుగెక్కారు. బీఎస్పీ నుంచి ఎన్నికల రణరంగంలోకి దూకారు. ఈ పార్టీ తరఫున మేడ్చల్ నియోజకవర్గం నుంచి నక్కా ప్రభాకర్‌గౌడ్, ఇబ్రహీంపట్నంలో మల్‌రెడ్డి రంగారెడ్డి, కూకట్‌పల్లిలో హరీష్ చంద్రారెడ్డి, ఖైరతాబాద్‌లో మన్నె గోవర్ధన్‌రెడ్డి తదితరులు తమ అదృష్టాన్ని పరీక్షించుకుంటున్నారు. మేడ్చల్‌లో బీఎస్పీ ప్రధాన పార్టీలతో తలపడుతుండడంతో... ప్రజా మద్దతు కోసం ఈ నెల 28న నియోజకవర్గంలో అధినేత్రి మాయావతితో ఎన్నికల బహిరంగ సభకు సన్నాహాలు చేస్తున్నారు. మేడ్చల్‌లో టీఆర్‌ఎస్ టికెట్ ఆశించి భంగపడిన ఆ పార్టీ రాష్ట్ర సహాయ కార్యదర్శి నక్కా ప్రభాకర్‌గౌడ్ బీఎస్పీ నుంచి బరిలో నిలిచారు.
టీఆర్‌ఎస్ గ్రేటర్ అధ్యక్షుడు మైనంపల్లి హన్మంతరావుకు ప్రధాన అనుచరుడైన ప్రభాకర్‌గౌడ్.. శామీర్‌పేట్ జడ్పీటీసీగా పని చేశారు. 2009 ఎన్నికల్లో మేడ్చల్ నుంచి టీడీపీ అభ్యర్థిగా పోటీ చేసి.. ప్రస్తుత కాంగ్రెస్ అభ్యర్థి కేఎల్‌ఆర్‌పై 5,000 ఓట్ల తేడాతో ఓడిపోయారు. 2014 వరకు నియోజకవర్గ టీడీపీ ఇన్‌చార్జ్‌గా పనిచేసిన ఆయనకు టికెట్ ఇవ్వకపోవడంతో గత ఎన్నికల్లో రెబల్‌గా పోటీ చేశారు. అప్పటి టీఆర్‌ఎస్ అభ్యర్థి ఎం.సుధీర్‌రెడ్డికి మద్దతుగా ప్రచారం చేశారు. దీంతో ప్రభాకర్‌గౌడ్‌కు టీఆర్‌ఎస్‌లో కీలక బాధ్యతలు అప్పగించారు. అయితే ఈసారి పార్టీ టికెట్ ఇవ్వకపోవడంతో బీఎస్పీ నుంచి బరిలోకి దిగారు.
♦ ఇబ్రహీంపట్నం నుంచి బరిలో నిలిచిన మల్‌రెడ్డి రంగారెడ్డి చివరి వరకు కాంగ్రెస్ టికెట్ కోసం ప్రయత్నించారు. ప్రజాకూటమి పోత్తులో భాగంగా ఈ స్థానం టీడీపీకి కేటాయించడంతో బీఎస్పీ అభ్యర్థిగా బరిలో నిలిచారు. ఈయన 1994, 2004 ఎన్నికల్లో మలక్‌పేట్ నుంచి కాంగ్రెస్ ఎమ్మెల్యేగా గెలుపొందారు.
♦ ఖైరతాబాద్ నుంచి బీఎస్పీ అభ్యర్థిగా బరిలో నిలిచిన మన్నె గోవర్ధన్‌రెడ్డి టీఆర్‌ఎస్ టికెట్ ఆశించి భంగపడ్డారు. టీఆర్‌ఎస్ నియోజకవర్గ ఇన్‌చార్జ్‌గా పనిచేసిన గోవర్ధన్‌రెడ్డి తన సత్తా చూపేందుకు సిద్ధమయ్యారు.
♦ కూకట్‌పల్లి నియోజకవర్గం నుంచి బీఎస్పీ అభ్యర్థిగా పోటిలో నిలిచిన హరీష్ చంద్రారెడ్డి కూడా టీఆర్‌ఎస్ టికెట్ ఆశించి భంగపడ్డారు. ఈయన సతీమణి కావ్యారెడ్డి బాలాజీనగర్‌టీఆర్‌ఎస్ కార్పొరేటర్.
బరిలో మరికొందరు..
ఈ నలుగురితో పాటు సికింద్రాబాద్ నుంచి మదన్‌మోహన్, సనత్‌నగర్ నుంచి సంజీవాచారి, గోషామహల్ నుంచి సాయికుమార్, అంబర్‌పేట్‌లో కుసురు రాజపాల్ యాదవ్, యాకుత్‌పురాలో సయ్యద్ ఇనాయతుల్లా, జూబ్లీహిల్స్‌లో మహతాబ్‌ఖాన్, ఎల్‌బీనగర్‌లో ధర్మేంద్ర, మహేశ్వరంలో శేఖర్ ఇబ్రాం, ముషీరాబాద్‌లో పి.ప్రదీప్‌కుమార్,
శేరిలింగంపల్లిలో నక్కల ప్రవీణ్‌కుమార్ తదితరులు బరిలో ఉన్నారు.
Comments
Please login to add a commentAdd a comment