సాక్షి, హైదరాబాద్: రాష్ట్ర అసెంబ్లీ ఎన్నికల్లో ముక్కోణపు పోటీ ఎదుర్కొంటున్న అభ్యర్థుల గుండెల్లో రైళ్లు పరుగెడుతున్నాయి. కొన్ని చోట్ల టీఆర్‌ఎస్, కాంగ్రెస్, బీజేపీ తలపడుతుండగా, మరికొన్ని చోట్ల టీఆర్‌ఎస్, కాంగ్రెస్; బీఎస్పీ, స్వతంత్రుల పోటీ తీవ్ర ఉత్కంఠకు దారితీసేలా కనిపిస్తోంది. దీనితో మూడు పార్టీల్లో ముక్కోణపు పోటీ ఎవరిని గెలుపు తీరాన నడిపిస్తుంది? ఎవరిని ఓటమి చీకట్లోకి నెట్టేస్తుందన్న అంశంపై ప్రధాన రాజకీయ పక్షాల్లో తీవ్ర ఆందోళన వ్యక్తమవుతోంది.
హంగ్ వ్యూహంతో బరిలో బీజేపీ...
రాష్ట్ర ఎన్నికల్లో హంగ్ వస్తుందని భావిస్తున్న బీజేపీ అదే వ్యూహంతో ప్రచారాన్ని విస్తృతం చేసింది. టీఆర్‌ఎస్ తరఫున ఆ పార్టీ అధినేత, ఆపద్ధర్మ సీఎం కేసీఆర్ నిత్యం సభలతో ప్రచార హోరు సాగిస్తుండగా, అనూహ్యంగా బీజేపీ జాతీయ నేతలు, ఏకంగా ప్రధాని మోదీ సైతం రంగంలోకి దిగడం అటు కాంగ్రెస్‌ను, ఇటు టీఆర్‌ఎస్‌ను ఉక్కిరిబిక్కిరి చేస్తోంది. బీజేపీ తాము కనీసం 10 నుంచి 12 స్థానాల్లో విజయం సాధించి హంగ్‌లోకి పరిస్థితిని నెట్టి ప్రభుత్వ ఏర్పాటులో కీలకం కావాలనే ఎత్తుగడతో వెళ్తోంది. ఇందులో భాగంగా ఆదిలాబాద్ అర్బన్ అసెంబ్లీ, నిజామాబాద్ అర్బన్, కరీంనగర్ అర్బన్ అసెంబ్లీ సీట్లతో పాటు నిర్మల్, కామారెడ్డి, భూపాలపల్లి, కల్వకుర్తి, సూర్యాపేట్, జుక్కల్, చొప్పదండి, హుస్నాబాద్, ఆంధోల్, మల్కాజ్‌గిరి, ఉప్పల్, శేరిలింగంపల్లి, ముషీరాబాద్ ప్రాంతాల్లో త్రిముఖ పోటీ అభ్యర్థులను ఒత్తిడిలో పడేసింది. వీటిలో బీజేపి సిట్టింగ్ స్థానాలు రెండు ఉన్నాయి. అదేవిధంగా గతంలో గెలిచిన స్థానాలు కూడా ఉండటంతో గెలిచేందుకు గట్టి ప్రయత్నాలే చేస్తుండటం ప్రధాన పార్టీ అధినేతలను సైతం కలవరపెడుతోంఇ. ప్రభుత్వ వ్యతిరేక ఓట్లతో పాటు పార్టీకి బలంగా ఉన్న ఓట్లు చీలితే తమకు లబ్ధి చేకూరుతుందన్న అంచనాలు వేసుకుంటూ బీజేపీ అభ్యర్థులు ప్రచారంలో దూసుకుపోతున్నారు.
ఇక్కడ మరో రకంగా...
ఆ మూడు పార్టీల్లో బీజేపీ కాకుండా మరికొన్ని ప్రాంతాల్లో ఇండిపెండెంట్లు, ఇతర జాతీయ పార్టీ అభ్యర్థుల పోటీ త్రిముఖ పోరు తీవ్రంగా కనిపిస్తోంది. ఆదిలాబాద్ జిల్లాలోని బెల్లంపల్లిలో బీఎస్పీ, రామగుండంలో ఆలిండియా ఫార్వర్డ్ బ్లాక్, చెన్నూర్‌లో బీఎల్‌ఎఫ్, ఇబ్రహీంపట్నంలో బీఎస్పీ, మహబూబ్‌నగర్‌లో ఎన్సీపీ, వికారాబాద్‌లో స్వతంత్ర అభ్యర్థి, మిర్యాలగూడలో సీపీఎం, ఆలేరులో బీఎల్‌ఎఫ్, తుంగతుర్తిలో ఇండిపెండెంట్ అభ్యర్థి, కొత్తగూడెంలో బీఎల్‌పీ, భద్రాచలంలో ఇండిపెండెంట్, ఇల్లందు బీఎల్‌ఎఫ్ అభ్యర్థుల మధ్య త్రిముఖ పోటీ కనిపిస్తోంది. దీనితో ఇక్కడ ప్రధాన పార్టీల్లో టికెట్లు దక్కని వ్యక్తులు ఎక్కువగా ఉండటంతో ఆయా పార్టీ ఓట్లు చీలుతాయన్న ఆందోళన అన్ని ముఖ్య పక్షాల్లో కనిపిస్తోంది.
Published Thu, Nov 29 2018 3:33 AM | Last Updated on Mon, Mar 18 2019 7:55 PM
Advertisement
Advertisement
Comments
Please login to add a commentAdd a comment