మోగుతాయా? | MLA Candidates Are Fearing About Rebels | Sakshi
Sakshi News home page

మోగుతాయా?

Published Thu, Nov 22 2018 3:48 PM | Last Updated on Mon, Mar 18 2019 9:02 PM

MLA Candidates Are Fearing About Rebels - Sakshi

సాక్షి ప్రతినిధి, ఆదిలాబాద్‌: పార్టీ టికెట్లు రాని ఆశావహులు రెబల్స్‌గా బరిలోకి దిగడంతో అభ్యర్థుల్లో ఆందోళన పెరుగుతోంది. హోరాహోరీ పోరులో రెబల్స్‌గా పోటీ చేస్తున్న నేతల వల్ల ఓట్లు చీలిపోతాయని భయపడుతున్న అభ్యర్థులు వివిధ మార్గాల ద్వారా ఇంటిపోరు లేకుండా చూసుకునే ‘ఆఖరి’ ప్రయత్నాల్లో మునిగిపోయారు. అదే సమయంలో పార్టీ అధిష్టానాలు కూడా తిరుగుబాటుదారులుగా నామినేషన్లు వేసిన వారిని బుజ్జగించే ప్రయత్నాల్లో ఉన్నాయి. గురువారం సాయంత్రానికి నామినేషన్ల ఉపసంహరణకు గడువు ముగుస్తున్న నేపథ్యంలో రాయబారాలు జోరందుకున్నాయి. పార్టీ అభ్యర్థికి సహకరిస్తే భవిష్యత్తులో మేలు జరిగేలా ఒప్పందాలు సాగుతున్నాయి.
 
తూర్పున టీఆర్‌ఎస్‌ రెబల్స్‌.. 
టీఆర్‌ఎస్‌ అభ్యర్థిత్వాన్ని ఆశించి భంగపడ్డ నేతలు రెండు నెలల నుంచే వ్యూహాత్మకంగా ముందుకు సాగుతున్నారు. ప్రధానంగా మంచిర్యాల, కుమురం భీం జిల్లాల నుంచే టీఆర్‌ఎస్‌కు రెబల్స్‌ బెడద ఉంది. అయితే వారిని ఉపసంహరించుకునేలా ఒత్తిళ్లు లేకపోవడం గమనార్హం. మంచిర్యాల ఎంపీపీ బేర సత్యనారాయణ బీఎస్పీ, మరో నాయకుడు ఆరె శ్రీనివాస్‌  బీఎల్‌ఎఫ్‌ తరుపున గత నెలన్నర రోజులుగా ప్రచారం సాగిస్తున్నారు. తాజాగా చల్లగుల్ల విజయశ్రీ అనే మహిళా నాయకురాలు ఇండిపెండెంట్‌గా నామినేషన్‌ దాఖలు చేశారు. వీరుముగ్గురు పోటీలో కొనసాగనున్నారు.

చెన్నూరు టికెట్టు ఆశించి భంగపడ్డ మాజీ మంత్రి గడ్డం వినోద్‌ బెల్లంపల్లి నుంచి బీఎస్పీ అభ్యర్థిగా బరిలో నిలిచారు. ఆయనను ఉపంసంహరించుకునేలా సోదరుడు వివేక్‌ ఒత్తిడి తెస్తున్నట్లు తెలిసింది. అయితే ఆయన మాత్రం పోటీకే మొగ్గు చూపుతున్నారు. బెల్లంపల్లిలో మాజీ ఎమ్మెల్యే ఎ.శ్రీదేవి ఇండిపెండెంట్‌గా బరిలో నిలిచారు. సిర్పూరులో మాజీ ఎమ్మెల్యే కావేటి సమ్మయ్య ఇండిపెండెంట్‌గా పోటీకి సిద్ధమయ్యారు. మిగతా నియోజకవర్గాల్లో టీఆర్‌ఎస్‌ తరుపున తిరుగుబాటు బెడద పెద్దగా లేదు. బోథ్‌లో టికెట్టు ఆశించి భంగపడ్డ ఎంపీ నగేష్‌ ప్రచారానికి దూరంగా ఉంటున్నారు. గురువారం నాటి సీఎం సభతో ఆయన కూడా కలిసివచ్చే అవకాశం ఉంది. 

రంగంలోకి కాంగ్రెస్‌ పెద్దలు.. 
కాంగ్రెస్‌ టికెట్టు ఆశించి భంగపడ్డ నాయకులు ఇండిపెండెంట్లుగా, వివిధ పార్టీల అభ్యర్థులుగా పోటీ చేస్తున్నారు. వీరి నామినేషన్లు ఉపసంహరించుకునేలా జిల్లా ముఖ్య నాయకులు రంగంలోకి దిగారు. అయితే తాము గెలవకపోయినా, ఓడించే శక్తి ఉందని భావిస్తున్న నాయకులు తదనుగుణంగా పావులు కదుపుతున్నారు. చెన్నూరులో కాంగ్రెస్‌ టికెట్టు ఆశించి భంగపడ్డ మాజీ మంత్రి బోడ జనార్ధన్‌ బీఎల్‌ఎఫ్‌ అభ్యర్థిగా బరిలో నిలిచారు.

సిర్పూరులో రావి శ్రీనివాస్‌ బీఎస్పీ అభ్యర్థిగా పోటీలో ఉన్నారు. వీరిద్దరు నామినేషన్లను ఉపసంహరించుకునే పరిస్థితి కనిపించడం లేదు. సిర్పూరు టీఆర్‌ఎస్‌ అభ్యర్థి కోనప్పకు సమీప బంధువైన రావి శ్రీనివాస్‌ పోటీ చేయడం వల్ల కాంగ్రెస్‌కు కొంతమేర నష్టం కలిగే అవకాశాలున్నాయి. ముథోల్‌లో టికెట్టు కోసం పోటీ పడ్డ మాజీ ఎమ్మెల్యే నారాయణరావు పటేల్‌ ఎన్‌సీపీ నుంచి బరిలో నిలిచారు. 
ఖానాపూర్‌లో గత ఎన్నికల్లో పోటీ చేసిన హరినాయక్‌ ఈసారి టికెట్టు రాక స్వతంత్రుడిగా పోటీ పడుతున్నారు. వీరి నామినేషన్లు ఉప సంహరింపజేసేందుకు కాంగ్రెస్‌ పెద్దలు ప్రయత్నిస్తున్నారు. 

No comments yet. Be the first to comment!
Add a comment

Related News By Category

Related News By Tags

Advertisement
 
Advertisement
Advertisement