
తాటిచెట్టుకీ తాతపిలకకీ ముడివేసినట్టు– ఈ దేశంలో ప్రతీవ్యక్తీ హిందూమతాన్నీ, హిందుత్వాన్నీ కలిపి రాజకీయ ప్రయోజనానికి వాడటం రోజూ పేపరు తెరిస్తే కనిపించే అసంబద్ధత. రెండింటికీ ఆకాశానికీ భూమికీ ఉన్నంత దూరం ఉంది. అయితే దగ్గర బంధుత్వమూ ఉంది. స్థూలంగా చెప్పాలంటే హిందుత్వం సిమెంట్. హిందూమతం కట్టడం. కట్టడం దేవాలయమా? పాఠశాలా? మరొకటా మరొకటా– మనిష్టం. దేవాలయాన్ని సిమెంట్ అనం. ‘ఆ పెద్ద సిమెంట్ ఉన్నదే!’ అని పాఠశాలని చూపించం. సిమెంట్‌తో రూపుదిద్దుకున్నాక ‘అది పాఠశాల’. దానికి వేరే రూపు, ప్రయోజనం, ప్రత్యేకత, అస్తికత సమకూరింది.
హిందుత్వం ఒక జాతి ప్రాథమిక విశ్వాసాలకు ప్రతీక. ఒక ‘ప్రత్యేకమైన’ ఆలోచనా వ్యవస్థకి రూపు. రామాయణం మతం, రాముడు మతానికి ప్రతీక. కానీ ‘సత్యం’, ధర్మం, పర స్త్రీని కన్నెత్తి చూడని నిష్ఠ– హిందుత్వం. భాగవతం మతం. శ్రీకృష్ణుడు మతానికి ప్రతీక. కానీ– చిలిపితనంతో జీవితాన్ని ప్రారంభించినా చివరలో జాతికి ఆచార్యత్వాన్ని సాధించడం హిందుత్వం. సావిత్రి సత్యవంతుల కథ మతం. కానీ ఓ స్త్రీ మూర్తి అచంచలమైన ఆత్మవిశ్వాసం హిందుత్వం. అందుకే అరవిందులకు మరో స్థాయిలో ‘సావిత్రి’ లొంగింది. అంటే– ఓ జాతి నమ్మిన విలువ– ఆ జాతికి ప్రతీక. ఆ విలువకు ఆయా కాలాలలో ఆయా ప్రవక్తలు– ఆయా కాలాలకు అనుగుణంగా ఇచ్చిన ‘రూపు’ మతం. వేంకటేశ్వరుడు మతం. కానీ వేంకటేశ్వరత్వం హిందుత్వం. మత సామరస్యానికి రామానుజులు అనే ప్రవక్త ‘తీర్చిన’ రూపు మతం. కారుణ్యం ఓ జాతి ప్రాథమిక విలువ. దానికి జీసస్ ప్రవక్త ఇచ్చిన అపూర్వమయిన ‘రూపు’ క్రైస్తవం. సర్వమానవ సౌభ్రాతృత్వం విలువ. దానికి మహమ్మద్ ప్రవక్త ఇచ్చిన ‘రూపు’ ఇస్లాం.
ప్రాథమిక విలువల విస్తృతి ఆ జాతి‘త్వం’ని వికసింపజేస్తుంది. ఆ గుణం Plasticity ప్రపంచంలో అధికంగా ఉన్నది ‘హిందుత్వం’. అందుకనే శతాబ్దాలుగా ఎన్ని మతాలకయినా– అంటే ప్రాథమిక విలువలు పెట్టుబడులుగా, ఆయా ప్రవక్తలు రూపు దిద్దిన అపూర్వ ‘మతా’లకు స్వాగతం పలకగలిగింది. క్రైస్తవం కారుణ్యమా? ‘రండి. మాకు బుద్ధుడు ఉన్నాడు’. ఇస్లాం సర్వమానవ సౌభ్రాతృత్వమా? ‘రండి. మాకు ప్రహ్లాదుడున్నాడు’. అవన్నీ ఒక జాతిని ప్రభావితం చేసిన ఆయా ప్రవక్తలు తీర్చిన మహాద్భుత మేరుశృంగాలు. రామాయణంలో రాముడి పాత్రీకరణలో అభిప్రాయభేదం ఉన్నదా? ఉండవచ్చు. కానీ అది ‘హిందుత్వా’నికి అంటదు. ఏనాడయినా మనం తాజ్‌మహల్ సౌందర్యానికి మురిసిపోయాం. కానీ ‘అందులో వాడిన చెక్క సున్నం ఎంత బాగుందో!’ అనుకున్నామా?
సత్యమును ఆచరించుము– హిందుత్వం. రాముడు సత్యమునే ఆచరించెను– మతం. Hindutva is a way of life. Religion is a way of choice.
కాలగతి, మానవ స్వభావాల వికసనం, కొండొకచో పతనం, ఆనాటి సమాజ హితం, ఆ సమాజానికి మార్గదర్శకం కాగలిగిన ఓ ‘ప్రవక్త’ అపూర్వ సిద్ధాంత నిర్దేశన– మతం. దానికి కవులు, రచయితలు, ప్రవచనకారులు– సమాజ చైతన్యానికిగాను రూపుదిద్దిన ‘చిలవలు–పలవలు’ – మతం.
మరొక్కసారి– రామమందిర పునర్నిర్మాణం హిందుత్వానికి పెట్టుబడి కాదు. రాముడిలోని ‘రామత్వం’ మాత్రమే హిందుత్వం. Hindutva is a definition. Religion is a denami- nation.
గోడ కట్టడంలో ‘గోడ’ స్థాయిలో ఆర్కిటెక్టు అవసరం లేదు. కానీ ఆ గోడ పెట్టుబడిగా నిలిచే కట్టడానికి ఆర్కిటెక్టు అవసరం. కాలగతిలో మన జీవన విధానాన్ని వైభవోపేతం చేసిన ఎందరో ఆర్కిటెక్టులు. శంకరాచార్య, రామానుజాచార్య, మహమ్మద్, జీసస్, మహావీర్, గురునానక్, వీరు ఈ ‘త్వం’కి కాలానుగుణంగా, సమాజానుగుణంగా అద్భుతమైన శిల్పాలను నిర్మించిన కారణజన్ములు.
మరొక్కసారి– రామాయణం మతం. రామత్వం హిందుత్వం. దీనికి వాల్మీకి దిద్దిన రూపు రామాయణం. మరికొన్ని వందలమంది దిద్దిన రూపు మతం. రామారావులూ, రామనాథాలు, రామ్‌సింగులూ, రామశాస్త్రులూ, రామ్ యాదవ్‌లూ– అందరూ ఈ మతాన్ని నెత్తిన పెట్టుకున్నవారు.
విలువ శాశ్వతం. అది హిందుత్వం. విలువకు ఆ జాతి దిద్దుకున్న ‘రూపం’ మతం. కొండొకచో మతానికి కాలదోషం పట్టవచ్చు. రూపం మారవచ్చు. అన్వయం మారవచ్చు. కానీ ‘త్వం’ మారదు. ఒక్కమాటలో చెప్పాలంటే సూర్యరశ్మి హిందుత్వం. ఆ రశ్మిలో వికసించిన పుష్పం మతం.
గొల్లపూడి మారుతీరావు
Comments
Please login to add a commentAdd a comment