
జాతీయ చెత్తబుట్ట
జీవన కాలమ్
ఫెయిలవడం, ఎందుకూ పనికిరాకుండా పోవడం ఈ దేశంలో ఘనత, అవకాశం. రాజకీయాలకు దగ్గర తోవ. మనదేశంలో ఆయా రంగాలలో కాలదోషం పట్టినా కలిసి వచ్చే వ్యాపార రంగం-రాజకీయం.
సినీమా రంగంలో ఒక జోక్ ఉంది. వెనకటికి ఒక నిరు ద్యోగి ఉద్యోగం కోసం ఒక నిర్మాతగారి దగ్గరికి వచ్చా డట. ‘‘నువ్వు ఏం చేస్తా వయ్యా? రచనలేమైనా చేస్తావా?’’ అన్నాడట నిర్మాత. ‘‘అయ్యో, నాకు రాదండీ!’’ అన్నాడట ఈ నిరుద్యోగి. ‘‘పోనీ, నటనలో అనుభవం ఉందా?’’ అనడిగాడట. లేదన్నాడు ఇతను. ‘‘పోనీ సంగీతంలో ప్రావీణ్యం ఉందా?’’ నిస్సహాయంగా తల అడ్డంగా తిప్పాడు. ‘‘మేకప్‌లో?’’ లేదు. ‘‘కెమేరా పనిలో?’’ లేదు. నిర్మాత ఆగి, ‘‘ఎందులోనూ ప్రవేశం లేదం టున్నావు కనుక- ఇక ఒకే ఉద్యోగం ఖాళీగా ఉందయ్యా. ఈ చిత్రానికి డెరైక్టర్‌గా ఉండు’’ అన్నాడట. ఇది కేవలం జోక్. డెరైక్టర్ మీద కడుపు రగిలిన వారెవరో కల్పించినది.
ఏమీ కల్పన లేని నిజం ఈ దేశంలో మరొకటి ఉంది. ఆయా రంగాలలో ఇక రాణించే అవకాశం లేదని నిర్ధారణ అయ్యాక, ఎందుకూ పనికిరాని దశకి వచ్చిన వ్యక్తికి ఒకే ఒక్క చోటు-రాజకీయ రంగం. పాపులారిటీ - అదెంత నీచమయినదయినా, ఎంత నికృష్టమయినా ప్రజాస్వామ్యంలో కొంగుబంగారం. మొన్ననే 33 ఏళ్ల బౌలర్ శ్రీశాంత్ క్రికెట్ అవినీతికి 2013లో అరెస్టయి, ఆట నుంచి బర్తరఫ్ అయ్యాక ప్రస్తుతం ఒకానొక రాజకీయ పార్టీ తీర్థం పుచ్చు కున్నారు. రేపు వారు కేరళ అసెంబ్లీలో మనకి దర్శనం ఇచ్చినా ఆశ్చర్యం లేదు. లోగడ అలాంటి నేరానికే శాశ్వతంగా క్రికెట్ నుంచి తొలగిన మన దేశపు కెప్టెన్ అజారుద్దీన్‌గారు గత పార్లమెంట్‌లో మన నాయ కులు.
సినీరంగంలో కాలం చెల్లిన హేమమాలిని, శత్రుఘ్నసిన్హా గారలు ప్రస్తుతం పార్లమెంట్‌లో విశ్రాంతి తీసుకుంటున్నారు. నాకైతే హేమమాలిని పార్లమెంట్ సభ్యురాలు కావడం వల్ల సామాజికంగా కానీ, రాజకీయంగా కానీ - ఈ దేశానికి ఏం ఉప యోగం జరిగిందో బోధపడదు. సంవత్సరాల కిందట-బందిపోటుగా మనుషుల్ని ఊచకోత కోసిన ఫూలన్‌దేవి ప్రజాప్రతినిధిగా పార్లమెంటులో మనకి దర్శనమిచ్చారు. అర్ధాంతరంగా చచ్చిపోయాడుగాని ఈ లెక్కన వీరప్పన్ ఏ రాష్ట్రానికో ముఖ్యమంత్రి అయ్యే ఆర్హతలున్నవాడు. అజారుద్దీన్ మీద ఎవరో సినీమా తీస్తున్నారని విన్నాం. ఆయన అవినీతితో అన్యాయం అయ్యాక ఈ దేశం, ఆ మాటకి వస్తే ప్రపంచం నెత్తిన పెట్టుకున్న ఈ పెద్దమనిషి ‘‘నేను మైనారిటీ వర్గం వాడిని కనుక నన్ను ఇలాచేశారు’’ అని వాగాడు. సినీమాలో ఈ ఉవాచ ఉంటుందని ఆశిద్దాం.
అయితే ఒట్టిపోయిన సినీ తారల గురించి చెప్తున్నప్పుడు ఒక వ్యక్తి గురించి చెప్పకపోతే అన్యా యమవుతుంది. 1998లో మేం గొల్లపూడి శ్రీనివాస్ మెమోరియల్ ఫౌండేషన్ మొదటి సభకి ముఖ్య అతిథిగా ఆహ్వానించడానికి సునీల్‌దత్‌గారి దగ్గరికి బొంబాయి వెళ్లాను. ఆయన ఆఫీసు చుట్టూ బారులు తీర్చి అతి సాదాసీదా మనుషులున్నారు. సాహెబ్ ద్వారా మాకు మేలు జరుగుతుంది అని వారు తృప్తిగా చెప్పడం నాకు గుర్తుంది. తీరా ఆగస్టు 12కి రెండు రోజుల ముందు ఆయన అమెరికాలో ఉండి పోయారు. సభని రెండు రోజులు వాయిదా వేయ వచ్చా అని సునీల్‌దత్ సెక్రటరీ నాకు ఫోన్ చేశారు. నేను చెప్పాను. అది మా అబ్బాయి కన్నుమూసిన రోజు. రెండు రోజులు దేవుడు వాయిదా వెయ్యగ లిగితే నేను అదృష్టవంతుడినయ్యేవాడిని అన్నాను. 12న సభకి వచ్చారు. అయిదు నక్షత్రాల హోటల్లో సూట్ ఏర్పాటు చేశాను. రాత్రి ఒక గ్లాసు వైన్ పుచ్చుకుని ఆ వైన్‌కి తాను బిల్లు చెల్లించారు.
రాజకీయ రంగం ఈ దేశానికి అక్కర్లేని చెత్తబుట్ట. కుల, వర్గ, విద్య, ప్రమేయం లేకుండా ఎవరైనా ప్రజాసేవ చేయవచ్చునన్న వెసులుబాటుని నూటికి నూరు పాళ్లూ దుర్వినియోగం చేసిన వ్యవస్థ రాజకీయం రంగం. రామ్ మనోహర్ లోహియా, కృపలానీ, పుచ్చలపల్లి సుందరయ్యవంటి మహామహులు ఆ వ్యవస్థని సుసంపన్నం చేయగా శ్రీశాంత్‌లకూ, అజారుద్దీన్, హేమమాలిని వంటివారికీ ఆటవిడు పుగా ప్రస్తుతం వినియోగపడుతోంది.
ఫెయిలవడం, ఎందుకూ పనికిరాకుండా పోవడం ఈ దేశంలో ఘనత, అవకాశం. రాజకీయాలకు దగ్గర తోవ. మనదేశంలో ఆయా రంగాలలో కాలదోషం పట్టినా కలిసి వచ్చే వ్యాపార రంగం- రాజకీయం.
వ్యాసకర్త: గొల్లపూడి మారుతీరావు