నమ్మించోట చేస్తే మోసం, నమ్మంచోట చేస్తే లౌక్యవను! | Cheating where we trust them | Sakshi
Sakshi News home page

నమ్మించోట చేస్తే మోసం, నమ్మంచోట చేస్తే లౌక్యవను!

Published Sun, Sep 20 2015 3:31 AM | Last Updated on Sun, Sep 3 2017 9:38 AM

నమ్మించోట చేస్తే మోసం, నమ్మంచోట చేస్తే లౌక్యవను!

నమ్మించోట చేస్తే మోసం, నమ్మంచోట చేస్తే లౌక్యవను!

 పి.ఆర్.జె.పంతులు
 9866039733

 కన్యాశుల్కం షేక్‌స్పియర్ నాటకాలలా బతుకుతుందో లేదో ‘కాలం’ చెప్తుంది. చిత్రంగా షేక్‌స్పియర్ నాటకాలతో అక్కడివాడే అయిన చార్లీ చాప్లిన్ ఏ మాత్రం ఐడెంటిఫై కాలేదు.
 ఈ ‘నిజాన్ని పోలిన అబద్ధం’ ఇవాళ అన్ని రంగాలలో రాజ్యమేలుతోంది,
 మానవ సంబంధాలతో సహా!
 
 ఈ మధ్య గొల్లపూడి మారుతిరావు సమగ్ర సాహిత్యం సంపుటాలు చదివేను. అందులో ఒకటి రెండు చోట్ల ‘కన్యాశుల్కం’ సర్వకాలికం, సర్వజనీనం కాదని సెలవిచ్చేరు. ‘కన్యాశుల్కం గొప్ప నాటకం. కానీ అది సర్వకాలీనమైన నాటకం కాదు. ఎందుకంటే ఆ సమస్య యిప్పుడు లేదు. కన్యాశుల్కం ఓ గొప్ప మైలురాయి మాత్రమే. గొప్పమార్గం కాదు. ఇలా 36 ఏళ్ల క్రితం మాట్లాడితే కాళోజీవారు నన్ను వ్యతిరేకించినట్లు గుర్తు’ అన్నారు. దీనిమీద నా అభిప్రాయాలు వ్యక్తం చేయడానికే ఈ వ్యాసం.
 ‘ఎందుకంటే ఆ సమస్య యిప్పుడు లేదు’ అన్నారాయన. ఆ సమస్యను గురజాడ మొట్టమొదటిగా, నాటకంలో ఎలా ప్రస్తావించేరో గమనించండి:
 కరటకశాస్త్రి: అగ్నిహోత్రావధాన్లూ! కుర్రవాడికి రవ్వంత చదువు చెప్పించడానికి యింత ముందూ వెనకా చూస్తున్నావ్! బుచ్చెమ్మ నమ్మిన పదిహేను వొందల రూపాయ లేంజేశావ్?
 గిరీశం: సెల్లింగ్గర్ల్స్! డామిట్!
 అదండీ అసలు సమస్య. సెల్లింగ్ గర్ల్స్. ఆడపిల్లల్ని అమ్మడం! అది కన్యాశుల్కం కావచ్చు, మరొకటి కావచ్చు. బేసిక్ సమస్య ‘ఆడపిల్లల్ని అమ్మడం’. అగ్నిహోత్రావధాన్లు పిల్లని అమ్ముకోవడం తప్పనుకోడు. అందరూ అనుసరిస్తున్న శిష్టాచారంగానే భావిస్తాడు.
 అగ్నిహోత్రావధాన్లు: మా మేనత్తల్ని అందర్నీ కూడా అమ్మేరండీ! వాళ్లంతా పునిస్త్రీ చావే చచ్చారు. మాతండ్రి మేనత్తల్ని కూడా అమ్మడవే జరిగిందండి. యిప్పుడు ఈ వెధవ యింగిలీషు చదువునుంచి, ఆ పకీరు వెధవ దాన్ని లేవదీసుకు పోయినాడు గాని, వైధవ్యం అనుభవించిన వాళ్లంతా పూర్వకాలంలో యెంత ప్రతిష్టగా బ్రతికేరు కారు?
 ఆ రోజుల్లో వాళ్ల పిల్లల్ని వాళ్లు అమ్ముకున్నారు. మరి ఇవాళ ఆడపిల్లల్ని మాయచేసి, మభ్యపెట్టి, తీసుకెళ్లి వ్యభిచార గృహాలకూ, అరబ్ షేకులకూ, సంపన్న గృహస్థులకూ పనిమనుషులుగా అమ్మేస్తున్నారు. ఆడపిల్లల్ని అంగట్లో వస్తువుల్లాగా అమ్మడం ఏమిటి? అదే గురజాడ ఆవేదన అని నేను తలుస్తాను.
 నాటకం సర్వకాలికం అయిపోయే ప్రమాదం ఉంది. ఎందుకో ఈ సమస్యల్ని కొన్నిటిని చూడండి:
 సౌజన్యారావు: సాధారణంగా వకాల్తీలో దురాచారాలు చాలా ఉన్నాయి. ఆంటీనాచ్‌లాగే ఆంటీ వకీల్ అని ఒక మూవ్‌మెంటు మనదేశంలో స్టార్టు చెయ్యడము ఆవశ్యకత కలిగేట్లు కనబడుతోంది.
 కొత్తమనిషి (మగ వేషంలో మధురవాణి): ...వకీళ్లు గనక వేశ్య పెట్టిన చిక్కు విప్పజాలక పోతారా అని మనవి చేశేను.
 సౌజన్యారావు: వేశ్యలకు వకీళ్లు సమదంతా అనా!
 ఆనాడు జాగ్రత్త పడలేకపోయాం. రుజువులు, సాక్ష్యాలు నేరం జరిగినట్లు స్పష్టంగా కనపడుతున్న  కేసుల్ని గూడా, తమ మేధావితనంతో, 18 ఏళ్లు, 20 ఏళ్లు సాగదీయగల ప్రబుద్ధుల్ని ఇవాళ చూస్తున్నాం.
 రామప్పంతులు: కొంచెం బెదిరిస్తేనే నౌఖరీ పోతుందా అన్నా? పోలీసు డ్యూటీ అంటే బెదిరింపే కదా!
 ఈ విషయంలోనూ మనం జాగ్రత్త పడలేదు. యింగ్లీషువాడు భారతీయుల్ని అణగదొక్కి ఉంచడానికి ఏర్పరిచిన పోలీసు వ్యవస్థ స్వతంత్రం వచ్చేక ఎవరి పక్షాన ఎవరిని అణగదొక్కి ఉంచడానికి, ఎవరి నోళ్లు నొక్కడానికి ఉపయోగపడుతుందో మనందరికి తెలుసు.
 మధురవాణి: యేమ్మోసం?
 రామప్పంతులు: లౌక్యం, లౌక్యవను.
 మధురవాణి: రెండింటికీ యేవిటో భేదం?
 రామప్పంతులు: నమ్మించోట చేస్తే మోసం, నమ్మంచోట చేస్తే లౌక్యవను.
 మధురవాణి: తాను చేస్తే లౌక్యం! మరోడు చేస్తే మోసం అనరాదా! అబద్ధానికి అర్థవేవిటి?
 రామప్పంతులు: యావన్నావూ? అబద్ధవనా? ఉద్యోగధర్మం లౌక్యవృత్తీ అని, అది వక వృత్తి భగవంతుడు కల్పించాడు. ఆ లౌక్యవృత్తి యెటువంటిదీ? నిజాన్ని పోలిన అబద్ధవాడి ద్రవ్యాకర్షణ చేసేది. యీ ధర్మసూకా్ష్మలు నీకెలా తెలుస్తాయి.
 ఈ ‘నిజాన్ని పోలిన అబద్ధం’ ఇవాళ అన్ని రంగాలలో రాజ్యమేలుతోంది, మానవ సంబంధాలతో సహా! నెల రోజుల్లో నల్లధనం వెనక్కి, రైతుల రుణ మాఫీ, నవ్యాంధ్రకి స్పెషల్ స్టేటస్, నెల రోజుల్లో ముఖ సౌందర్యం... ఇలా ఎన్నైనా. ఇవాళ ఎవడు అత్యంత చాకచక్యంగా ‘నిజాన్ని పోలిన అబద్ధం’ ఆడి నెగ్గుకు రాగలడో - వోహి సికందర్! జాగ్రత్త పడ్డాం కాదు.
 ‘సార్యజనీనత అదీ ముఖ్యం. అందువల్లనే షేక్‌స్పియర్ హేమ్లెట్, ఒథెల్లో నాటకాలు బ్రతికినట్లు- బహుశా ఏ కన్యాశుల్కం బతకదేమో’ అని కూడా అన్నారు గొల్లపూడి. ‘నాటకాలకు సార్వజనీనత కావాలంటే ఆ నాటకం భవిష్యత్తును చూపేది మాత్రమే కాకుండా, అప్పటి సాంఘిక పరిస్థితులను దాటి, వ్యక్తి సహజమైన మానసిక దౌర్బల్యాలనూ, హృదయవేదననూ, వింతపోకడలనూ నిర్భయంగా చెప్పగలిగేది కావాలి’.
 కన్యాశుల్కం షేక్‌స్పియర్ నాటకాలలా బతుకుతుందో లేదో ‘కాలం’ చెప్తుంది. మనమెవరం ‘బతకదేమో’ అనడానికి! చిత్రంగా షేక్‌స్పియర్ నాటకాలతో అక్కడివాడే అయిన చార్లీ చాప్లిన్ ఏ మాత్రం ఐడెంటిఫై కాలేదు. తన ఆత్మకథలో ఇలా రాశారు:
 I cannot pretend to enjoy Shakespeare in the theatre. In my pursuit of bread and cheese, honour was seldom trafficked in. I cannot identify myself with a prince's problems. Hamlet's mother could have slept with everyone at court and I would still feel indifferent to the hurt it would have inflicted on Hamlet.
 ‘కన్యాశుల్కం ఓ గొప్ప మైలురాయి మాత్రమే, గొప్ప మార్గం కాదు’ అనీ మారుతిరావు అన్నారు. కన్యాశుల్కం మొదటి కూర్పు(1897) పీఠికలో గురజాడ ఇలా సెలవిచ్చేరు: ‘యిటువంటి ఘోరమైన పరిస్థితి సమాజానికి సిగ్గుచేటు. యిటువంటి దురాచారాన్ని ఎండగట్టి ఉన్నతమైన నైతిక ప్రమాణాలు వ్యాపింపచేయడానికి మించిన కర్తవ్యం సాహిత్యానికి మరొకటిలేదు. అలాటి ఆరోగ్యకర ప్రభావ వ్యాప్తికై నాటకరంగాన్ని ఆశ్రయించాల్సి ఉంటుంది. కన్యాశుల్కం నాటక రచనకు నన్ను ప్రేరేపించింది యిదే!
 నేను ఈ నాటకాన్ని వాడుక భాషలో రాశాను. ఎందువల్లనంటే - యిది గ్రాంథిక భాషకన్నా, నాటకాన్ని చూసే ప్రజలకు బాగా అర్థం అవుతుందనే కాక - ఇది హాస్యరసానికి తగినదని నా అభిప్రాయం’.
 రెండో కూర్పు(1909) పీఠికలో- ‘సమాజ సంస్కరణోద్యమానికి తోడ్పడేందుకు తెలుగుభాష నాటకాలకు తగింది కాదని ప్రజల్లో ఉన్న దురభిప్రాయాన్ని తొలగించేందుకూ రాశేను. కేవలం ప్రసహన ప్రదర్శన కోసం తప్ప, నాటక కర్తలు సమకాలీన జీవితంలోని సంక్లిష్ట పరిస్థితుల్ని పట్టించుకోవడం లేదు’ అన్నారు.
 భాషా సాహిత్యాల ప్రగతి చింతన, సామాజికాభ్యుదయ చింతన దీపస్తంభాలుగా, ఒక నిర్దిష్టమైన మార్గాన్ని ఏర్పరచి, ముందు వారు నడిచి, విజ్ఞులను అనుసరించమని గురజాడ అభ్యర్థించేరని నేను తలుస్తాను. మెరికల్లాంటి యువతరం వారు ఎందరో ఆ మార్గంలో పయనిస్తున్నారని నాకు తెలుసు. అందుకే శ్రీశ్రీ ‘అడుగుజాడ గురజాడది. అది భావికి బాట’ అన్నాడు. సార్వజనీనత అంటే యింకా వేరే ఏమైనా ఉంటుందా అని నా సందేహం.
 (వ్యాసకర్త పుట్రేవు రామ జోగారావు పంతులు
 రంగస్థల నటులు. ‘కన్యాశుల్కం’లో గిరీశం, రామప్పంతులు పాత్రలు పోషించారు.)
 

Advertisement

Related News By Category

Related News By Tags

Advertisement
 
Advertisement

పోల్

Advertisement