చంద్రబాబు మార్క్‌ మోసం.. తల్లికి వందనంతో పిల్లిమొగ్గలు! | CM Chandrababu Naidu Drama Starts With Talliki Vandanam Scheme, Know Reasons Inside | Sakshi
Sakshi News home page

చంద్రబాబు మార్క్‌ మోసం.. తల్లికి వందనంతో పిల్లిమొగ్గలు!

Published Thu, Jul 11 2024 4:04 PM | Last Updated on Thu, Jul 11 2024 4:43 PM

CM Chandrababu Drama Starts With Talliki Vandanam

అమరావతి, సాక్షి: ఆంధ్రప్రదేశ్‌లో కూటమి సర్కార్‌ ఎన్నికల హామీలను ఒక్కొక్కటిగా ఎగ్గొట్టే పనిని ప్రారంభించింది. ఉచిత ఇసుక హామీ విషయంలో ఇప్పటికే మోసం జరిగిందని రాజకీయ విమర్శలు వినిపిస్తుండగా .. తాజాగా తల్లికి వందనం విషయంలోనూ పిల్లిమొగ్గలు వేస్తుందనే చర్చా మొదలైంది. 

పిల్లలని స్కూల్ కి పంపే అమ్మలకు ‘తల్లికి వందనం’ పథకం కింద రూ. 15,000 ఆర్థిక సహాయం అంటూ జీవో 29 పేరిట ఉత్తర్వులు జారీ చేసింది చంద్రబాబు సర్కార్‌. అయితే..  ఎన్నికల ముందు ఒక ఇంట్లో ఎంత మంది పిల్లలంటే అందరికి తల్లికి వందనం ఇస్తామని హామీ ఇచ్చిన చంద్రబాబు, అధికారంలోకి వచ్చాక మాట మార్చారు!.

.. పిల్లలను బడికి పంపే తల్లుల విషయంలో జగన్‌ సర్కార్‌ మోసం చేస్తోందని, తాము అధికారంలోకి వస్తే ఇంట్లో ఎంత మంది పిల్లలు ఉంటే.. అంతమంది విద్యార్థులకు తల్లికి వందనం పథకం వర్తింపజేస్తామంటూ చంద్రబాబు గత రెండేళ్లుగా చెబుతూ వచ్చారు. జనసేన అధినేత పవన్‌ కల్యాణ్‌ కూడా దీనిని బాగా ప్రచారం చేశారు. ఎన్నికల టైంలో కూటమి అభ్యర్థులు సైతం ఈ అంశాన్ని తమ ప్రచార అంశంగా మార్చుకున్నారు. అంతెందుకు.. ఒక వీడియో బాగా వైరల్‌ అయ్యింది. ప్రస్తుత  ఇరిగేషన్‌ మంత్రి నిమ్మలరామానాయుడు స్వయంగా ఒక ఇంటి దగ్గరికి వెళ్లి..  ఆ ఇంట్లో పిల్లలను చూపిస్తూ.. నీకు రూ.15 వేలు, నీకు రూ.15 వేలు.. అంటూ ఇంట్లో అందరికీ పథకం వర్తిస్తుందని లెక్కలు సైతం చెప్పారాయన.

కానీ, పథకం విధివిధానాల ప్రకారం.. ఒక్కో తల్లికి రూ.15,000 మాత్రమే ఆర్థిక సహాయం అంటూ మెలిక పెట్టారు. జీవో 29 ప్రకారం.. ఒక ఇంట్లో ఆధార్‌ కార్డు ఆధారంగా (ఆధార్‌ లేకుంటే దరఖాస్తు చేసుకోవాలని.. అది వచ్చేలోపు పది రకాల కార్డుల్ని అనుమతిస్తామని చెప్పారు) తల్లులకు తల్లికి వందనం వర్తింపజేయనున్నట్లు చంద్రబాబు ప్రభుత్వం పేర్కొంది. అంటే.. ఒక ఇంటికి రూ.15వేలు.. ఇంట్లో ఒక్కరికే వర్తింపజేయడమన్నమాట. 

అలాగే.. వైట్ రేష‌న్‌కార్డు ల‌బ్ధిదారుల‌కే ప‌థ‌కం వ‌ర్తిస్తుంద‌ని ప్ర‌భుత్వం తెలిపింది.  ఇంతకు ముందు జగన్‌ ప్రభుత్వం చేసింది కూడా ఇదే కదా!. కాకపోతే ఇప్పుడు ఆధార్‌ కార్డును తప్పనిసరిగా అనుసంధానం చేయాలని ప్రత్యేకంగా పేర్కొనడంతో పాటు విద్యార్థికి 75 శాతం హాజ‌రు త‌ప్ప‌నిస‌రి, పేదరికం దిగువన లాంటి అంశాల్ని ప్రామాణికంగా తీసుకుంటామని చెప్పడం పలు అనుమానాలకు తావిస్తోంది.

ఈ పథకం అమలుపైనా ఎంతో ఆత్రుతగా ఎదురుచూసిన తల్లిదండ్రుల్లో ప్రభుత్వ మార్గదర్శకాలతో గందరగోళం నెలకొనగా, రానున్న రోజుల్లో ఇది లబ్ధిదారులకు కోత పెట్టే చంద్రబాబు మాయేనన్న చర్చ మరోవైపు నడుస్తోంది.

No comments yet. Be the first to comment!
Add a comment
Advertisement

Related News By Category

Related News By Tags

Advertisement
 
Advertisement
 
Advertisement