కార్డియాలజిస్ట్‌నని నమ్మించిన కిలేడీ
రోగికి వైద్యం చేయాలని రూ.4.97 లక్షలు వసూలు
సిటీ సైబర్ క్రైమ్ పోలీసులను ఆశ్రయించిన బాధితుడు
ఏపీకి చెందిన యువతితో సహా మరొక నిందితుడు అరెస్టు
సాక్షి, హైదరాబాద్: మ్యాట్రిమోనీలో పరిచయమైన ఓ వ్యక్తిని పెళ్లి చేసుకుంటానని నమ్మించి నిట్టనిలువునా మోసగించిందో కిలేడీ. ఈ కేసులో తిరుపతికి చెందిన తమ్మ హేమమణి అలియాస్ ప్రీతి రెడ్డి..ఆమెకు సహకరించిన కొండారెడ్డిలను హైదరాబాద్ సైబర్ క్రైమ్ పోలీసులు అరెస్టు చేసి, జ్యూడీషియల్ రిమాండ్‌కు తరలించారు. పోలీసులు తెలిపిన వివరాల ప్రకారం..నగరానికి చెందిన 45 ఏళ్ల బాధితుడికి గతేడాది మేలో విడాకుల మ్యాట్రిమోనీ యాప్ ద్వారా హేమమణితో పరిచయం ఏర్పడింది. తాను ఎంబీబీఎస్, ఎండీ అర్హతలు కలిగిన కార్డియాలజిస్ట్ అని పరిచయం చేసుకుంది. విడాకులు తీసుకొని భర్తతో దూరంగా ఉన్నట్లు పేర్కొంది.
దీంతో తక్కువ కాలంలోనే పలు సామాజిక మాధ్యమాలలో ఇరువురూ సన్నిహితులుగా మారిపోయారు. కొంతకాలం తర్వాత నిందితురాలు వివాహ ప్రతిపాదన తీసుకొచ్చింది. దీంతో బాధితుడు అంగీకరించారు. కొన్ని రోజుల తర్వాత ఆమె రోగికి చికిత్స చేయడానికి నిధులు అవసరమని పేర్కొంటూ బాధితుడి నుంచి సొమ్ము వసూలు చేసింది. ఆ మొత్తాన్ని తిరిగి చెల్లించలేదు. తర్వాత ఆమె బాధితుడిని మళ్లీ సంప్రదించి తన తల్లి చనిపోయిందని అత్యవసరంగా ఇంకొంత సొమ్ము అవసరముందని చెప్పింది. పలు లావాదేవీల్లో మొత్తం రూ.4.97 లక్షలు వసూలు చేసింది. ఆ తర్వాత ఆమె నుంచి ఎలాంటి సమాధానం లేకపోవడంతో మోసపోయానని గ్రహించిన బాధితుడు సైబర్ క్రైమ్ పోలీసులను ఆశ్రయించాడు. దీంతో కేసు నమోదు చేసుకున్న ఇన్‌స్పెక్టర్ మధులత నేతృత్వంలోని బృందం ఇద్దరు నిందితులను అరెస్టు చేశారు.
Comments
Please login to add a commentAdd a comment