ప్రతీకాత్మక చిత్రం
సాక్షి,పెద్దపల్లిరూరల్: పెళ్లి సంబంధాల పేరిట మ్యాట్రీమోనిలో మహిళలను....నమ్మిన స్నేహితులను మాయామాటలతో బురిడీ కొట్టించి రూ.కోటికి పైగా కొల్లగొట్టిన ఘరానా మోసగాడిని శుక్రవారం అరెస్ట్ చేశారు. పెద్దపల్లి ఏసీపీ సారంగపాణి విలేకరులకు తెలిపిన వివరాల ప్రకారం.. ఖమ్మం జిల్లా వెంకటాపురం మధిర (ప్రస్తుతం కూకట్‌పల్లి, హైదరాబాద్)కు చెందిన వాసిరెడ్డి రాహుల్ తెలంగాణ, ఆంధ్రప్రదేశ్ రాష్ట్రాలకు చెందిన పలువురితో పరిచయాలు పెంచుకుని వారి నుంచి లక్షల్లో నగదు అప్పుగా తీసుకుని ఎగవేస్తున్నాడు.
► సుల్తానాబాద్‌కు చెందిన ఓ మహిళ భర్త చనిపోవడంతో మరో పెళ్లి కోసం మ్యాట్రీమోని.కామ్‌లో తన వివరాలు పోస్ట్ చేయగా, వాటిని చూసిన రాహుల్ తాను పెళ్లి చేసుకుంటానని ఆమెను నమ్మించాడు. రూ.15.5లక్షల నగదు, ఐదున్నరతులాల బంగారం తీసుకున్నాడు. సుల్తానాబాద్ మహిళ నుంచి అప్పుగా తీసుకుంటూ తిరిగి చెల్లిస్తూ కొంతకాలం నమ్మించిన నయవంచకుడు అమెరికాలో ఉద్యోగం ఇప్పిస్తానని లక్షల్లో డబ్బు వసూలు చేశాడన్నారు. అత్యవసరమంటూ ఐదున్నర తులాల బంగారాన్ని తీసుకుని మణçప్పురం ఫైనాన్స్‌లో కుదువ పెట్టి రూ.లక్షా 30వేల నగదు తీసుకున్నాడు.
► రాహుల్ మోసగించాడని తెలుసుకున్న సదరు మహిళ పోలీసులను ఆశ్రయించింది. మహిళ ఫిర్యాదుతో కేసు నమోదు చేసిన సుల్తానాబాద్ పోలీసులు మూడు ప్రత్యేక బృందాలను ఏర్పాటు చేసి నిందితుడిని పట్టుకున్నారు. నిందితుడు రాహుల్ నుంచి రూ.లక్ష నగదు, చెక్కులు, సెల్‌ఫోన్ స్వాధీనం చేసుకున్నారు.
12 ఏళ్ల నుంచి ఇదేతీరు...
మోసాలు చేయడమే నైజంగా పెట్టుకున్న రాహుల్‌పై 2010లో ఖమ్మంలో, 2012లో హైదరాబాద్‌లోని ఎల్‌బీనగర్‌లో, 2013లో విజయవాడలో చీటింగ్ కేసులు నమోదయ్యాయని ఏసీపీ చెప్పారు. ఇటీవల తనకు ఐటీ సమస్య ఉందని స్నేహితులను నమ్మించి, వారి పేరిట లక్షల రూపాయలు అప్పుగా తీసుకుని మొదటి మూడునెలలు సక్రమంగా చెల్లించి,, ఆ తర్వాత కట్టకపోవడంతో స్నేహితులే అప్పు చెల్లించాల్సి వచ్చిందని ఏసీపీ తెలిపారు.
► రాహుల్ బాధితుల గురించి ఆరా తీయగా.. మంగళగిరికి చెందిన జాస్తి వెంకటేశ్వర్లు నుంచి రూ.50లక్షలు, విజయవాడకు చెందిన బంగారి భాగ్యలక్ష్మి నుంచి రూ.1.80లక్షలు, షేక్‌ఖలీల్ నుంచి రూ.4.86లక్షలు, నాయుడు వెంకటేశ్ నుంచి రూ.1.20లక్షలు, హైదరాబాద్‌కు చెందిన ప్రసన్నలక్ష్మి నుంచి రూ.25లక్షలు, ప్రకాశంకు చెందిన కరీముల్లా నుంచి రూ.1.45లక్షలు, బాచు అప్పన్న నుంచి రూ.2.5లక్షలు, ముప్పిరాజు మణికంఠ నుంచి రూ.2లక్షలు తీసుకుని మోసగించాడని తేలిందని ఏసీపీ చెప్పారు.
ఆన్‌లైన్‌లో వ్యక్తిగత వివరాలొద్దు...
ఆన్‌లైన్‌లో వ్యక్తిగత వివరాలను ఉంచి మోసపోవద్దని ఏసీపీ సారంగపాణి అన్నారు. సెల్‌ఫోన్లలో మాయామాటలతో నమ్మించే మోసగాళ్ల వలలో ఎక్కువగా మహిళలే పడి మోసపోతున్నారన్నారు. ఆన్‌లైన్‌లో చాటింగ్‌లతో మొదలై మాటల దాకా వస్తే అప్రమత్తంగా ఉండాలని గ్రహించుకోవాలన్నారు.
Comments
Please login to add a commentAdd a comment