సాక్షి, హైదరాబాద్: దేశంలో ఒకప్పుడు ఎక్కువగా బాల్యవివాహాలు జరిగినా కొన్నేళ్లుగా సమాజంలో వచ్చిన మార్పులతోపాటు ప్రభుత్వాలు ఆడపిల్లల చదువులకు సైతం అధిక ప్రాధాన్యత ఇస్తుండటంతో ఆ పరిస్థితిలో స్పష్టమైన మార్పు కనిపిస్తోంది. అమ్మాయిలు సైతం అబ్బాయిలతో సమానంగా ఉన్నత విద్యను అభ్యసిస్తుండటంతో దేశంలో అతివల సగటు పెళ్లిళ్ల వయసు పెరుగుతోంది.
నేటికీ అక్కడక్కడా బాల్య వివాహాలు, నగరాల్లో లేటు వయసులో యువతుల పెళ్లిళ్లు జరుగుతున్నప్పటికీ రిజి్రస్టార్ జనరల్ ఆఫ్ ఇండియా కార్యాలయం వివాహ వయసులపై జరిపిన జాతీయ నమూనా సర్వేలో దేశవ్యాప్తంగా మహిళల సగటు వివాహ వయసు 22.7 ఏళ్లుగా వెల్లడైంది. 2020లో ఈ సర్వే జరిగినప్పటికీ వాటి విశ్లేషణ ఆలస్యమైంది. అందుకు సంబంధించిన గణాంకాలను ఆ కార్యాలయం ఇటీవల విడుదల చేసింది. (బ్యూటీషియన్ మృతి.. చక్రవర్తి స్పృహలోకి వస్తేనే అసలు విషయం తెలిసేది?)
దేశ సగటు కంటే తెలంగాణ మెరుగు...
జాతీయ నమూనా సర్వే గణాంకాలను పరిశీలిస్తే 2017 నాటికి దేశంలో మహిళల వివాహ సగటు వయసు 22.1 ఏళ్లుకాగా 2020 నాటికి అది 22.7 ఏళ్లకు చేరింది. ఆయా రాష్ట్రాల సంస్కృతి, సంప్రదాయాల ప్రకారం మహిళలు వివాహం చేసుకొనే వయసు ఆధారపడి ఉన్నందున వివిధ రాష్ట్రాల మధ్య సగటు వయసులో స్పష్టమైన తేడాలు కనిపిస్తున్నాయి. వివాహ సగటు వయసుకు సంబంధించి తెలంగాణ గణాంకాలను పరిశీలిస్తే పట్టణ ప్రాంతాల్లో 2020 నాటికి 24.3 ఏళ్లు, గ్రామీణ ప్రాంతాల్లో 22.8 ఏళ్లుగా తేలింది.
సగటున 23.5 ఏళ్లకు తెలంగాణ మహిళలు వివాహాలు చేసుకుంటున్నారని జాతీయ నమూనా సర్వే వెల్లడించింది. దక్షిణ తెలంగాణతోపాటు తమిళనాడు మహిళలకు కొంత ఆలస్యంగా వివాహాలు జరుగుతున్నాయని ఈ సర్వేలో తేలింది. మరోవైపు దేశంలోనే అత్యధికంగా సగటున 26 ఏళ్లకు కశీ్మర్ మహిళలు వివాహాలు చేసుకుంటుండగా జార్ఖండ్, పశ్చిమ బెంగాల్‌కు చెందిన యువతులు మాత్రం సగటున 21 ఏళ్లలోపే మాంగల్య బంధంలోకి అడుగు పెడుతుండటం గమనార్హం. దేశవ్యాప్తంగా దాదాపు అన్ని రాష్ట్రాల్లో గ్రామీణ మహిళల కంటే పట్టణ ప్రాంతాల్లోని మహిళలు కొంత ఆలస్యంగా వివాహాలు చేసుకుంటున్నారని జాతీయ నమూనా సర్వే వెల్లడించింది.
21 ఏళ్లకు పెంచేందుకు బిల్లు
దేశంలోని మహిళల చట్టబద్ధ కనీస వివాహ వయసు ప్రస్తుతం 18 ఏళ్లుగా ఉండగా దాన్ని పురుషుల చట్టబద్ధ కనీస వివాహ వయసు అయిన 21 ఏళ్లకు సమానంగా పెంచాలని కేంద్రం నిర్ణయించింది. ఇందుకు సంబంధించి బాల్య వివాహాల నిషేధ సవరణ బిల్లును తీసుకొచ్చింది. ప్రస్తుతం ఇది పార్లమెంటరీ స్టాండింగ్ కమిటీ వద్ద పరిశీలనలో ఉంది. అయితే దేశంలో కనీస వివాహ వయసును మార్చాలంటే కేంద్రం 6 చట్టాలకు సవరణలు చేయాల్సి ఉంది. ఇండియన్ క్రిస్టియన్ మ్యారేజ్ యాక్ట్–1872, ది పార్సీ మ్యారేజ్ అండ్ డైవోర్స్ యాక్ట్–1936, ద ముస్లిం పర్సనల్ లా (షరియత్) అప్లికేషన్ యాక్ట్–1937, ది స్పెషల్ మ్యారేజ్ యాక్ట్–1954, ది హిందూ మ్యారేజ్ యాక్ట్–1955, ది ఫారిన్ మ్యారేజ్ యాక్ట్–1969లను సవరించాల్సి ఉంటుంది.
చదవండి: 165 ఎకరాల్లో ఫామ్‌హౌస్ ఎలా?
Comments
Please login to add a commentAdd a comment