బాల్య వివాహ నిషేధ చట్టం–2006 అమలులో ఎన్ని లోపాలు ఉన్నప్పటికీ తమకు ఇష్టం లేని పెళ్లిళ్లు చేయవద్దని అమ్మాయిలు తమ తల్లిదండ్రులను నిలదీసి అడగడానికి ఈ చట్టం ఎంతో ప్రేరణనిచ్చిందన్నది వాస్తవం. అదే సమయంలో తమ ఇష్టానికి వ్యతిరేకంగా చేస్తున్న పెళ్లిళ్లపై నిరసన తెలుపుతూ తమకు నచ్చిన వారితో వెళ్లిపోతున్న అమ్మాయిలను, వారు ఎంపిక చేసుకున్న వరులను శిక్షించడానికి ఈ చట్టం తల్లిదండ్రులకే ఎక్కువ అవకాశం ఇస్తోందన్నది కూడా వాస్తవమే. అంటే వివాహ వయస్సు పెంపుదలలో కంటే సమాజ వైఖరి, విధానాల్లోనే పరిష్కారం దాగుంది. మనుగడ కోసం పెళ్లి తప్పనిసరి అనే జంఝాటం నుంచి బాలికలకు విముక్తి కల్పించాలి. విద్య, ఉపాధి, భద్రతతోపాటు పెళ్లి ఎప్పుడు, ఎవరిని చేసుకోవాలో ఎంపిక చేసుకునే స్వేచ్ఛను వారికి అందించాలి. ఇవన్నీ సాధ్యమైతే పెళ్లాడే వయస్సు దానికదే ముందుకెళుతుంది.
భారతీయ మహిళల వివాహ వయస్సును 18 నుంచి 21 సంవత్సరాలకు పెంచుతూ తీసుకున్న నిర్ణయాన్ని కేంద్ర మంత్రిమండలి ఆమోదించింది. ప్రసూతి మరణాల సంఖ్యను, మహిళల్లో పోషకాహార లేమిని తగ్గించడమే తన లక్ష్యంగా కేంద్ర ప్రభుత్వ చెప్పుకుంది. కానీ పెళ్లి వయస్సు పెంపుదల అనేది ప్రసూతి మరణాలు, పోషకాహార లేమికి సంబంధించిన సమస్యలను నిజంగానే పరిష్కరిస్తుందా అన్న సందేహం వస్తోంది. పైగా, ప్రసూతి మరణాల సమస్య అన్ని రాష్ట్రాల్లో సమానంగా లేదు. ఈ సమస్య.. చక్కగా పనిచేసే ప్రజారోగ్య మౌలిక వ్యవస్థ, కనీస దారిద్య్ర స్థాయిలు, మెరుగైన ఆహార భద్రత వంటి ఇతర అభివృద్ధి చర్యలతో అనివార్యంగా ముడిపడి ఉంటుంది.
మహిళల్లో రక్తహీనత సమస్యను తొలగించేందుకు గత రెండు దశాబ్దాలుగా ప్రభుత్వం చేస్తూ వస్తున్న ప్రయత్నాలు ఘోరంగా విఫలమయ్యాయని తాజా డేటా, పరిశోధనలు తెలుపుతున్నాయి. ప్రసవ సమయంలో స్త్రీలు మరణించడానికి సాధారణ కారణం ఏమిటంటే, బిడ్డను కన్నప్పుడు లేక ఆ తర్వాత అధికంగా రక్తస్రావం జరగడమే. దేశంలో 50 శాతం మంది మహిళలు రక్తహీనతతో గర్భం దాలుస్తున్నారని తాజా డేటా చెబుతోంది. మహిళలు త్వరగా గర్భం దాల్చడం వల్లే ప్రసవ మరణాలు ఎక్కువగా సంభవిస్తున్నాయని చెప్పలేం. కుటుంబంలో ఆహార కేటాయింపుల విషయంలో బాలికలకంటే బాలురకు ప్రాధాన్యత ఇవ్వడం అనే బలమైన పితృస్వామిక సంప్రదాయాల ఆచరణ కూడా దీనికి దోహదం చేస్తోంది.
శారదా చట్టానికి సవరణ చేసి తీసుకొచ్చిన ప్రస్తుత విధానం (బాల్యవివాహ నిరోధక చట్టం 1929 కూడా) అమ్మాయిలకు వివాహ వయస్సును 16 నుంచి 18 సంవత్సరాలకు, అబ్బాయిల వయస్సును 21 సంవత్సరాలకు పెంచుతూ 1978లో నిర్ణయించింది. నాలుగు దశాబ్దాలుగా ఇదే విధానం అమలువుతూ వస్తోంది. అయితే 18 ఏళ్లు దాటకముందే తమ కూతుర్లకు తల్లితండ్రులు పెళ్లిళ్లు చేయకుండా ఈ చట్టం నిరోధించలేకపోయిందన్నది స్పష్టం. అయితే కుటుంబాలు తమ కుమార్తెలకు ముందుగానే వివాహాలు చేస్తున్నందుకు కారణాలు ఎన్నో ఉన్నాయి. నగరప్రాంతాల్లోని పేదలు నివాసముండే ప్రాంతాల్లో తమ కుమార్తెల భద్రత గురించిన భీతి కారణంగా బాల్య వివాహాలు వ్యూహాత్మకంగా జరుగుతుండవచ్చు. అయితే పెళ్లి అనేది భద్రతకు హామీ ఇవ్వనప్పటికీ, అమ్మాయికి పెళ్లి చేశాక, ఆమె బాధ్యత తన భర్తది, అత్తామామలదే అవుతుంది. తర్వాత ఆమె భద్రత కానీ శీలం కానీ పుట్టింటివారికి సంబంధించిన సమస్యగా ఉండదు. వివాహ వయస్సు పెంపు నిర్ణయం సమయంలో ఇలాంటి సాధారణమైన అంశాలను కేంద్రం పరిగణనలోకి తీసుకున్నట్లు కనిపించడం లేదు.
ప్రత్యేకించి మహిళలకు సంబంధించిన సున్నితమైన సంబంధాలను నిర్వహించడంలో కేంద్ర ప్రభుత్వ విధానం చాలా కఠినంగా ఉంటోంది. ఇప్పటికే ఉత్తరప్రదేశ్, హిమాచల్‌ప్రదేశ్, మధ్యప్రదేశ్ రాష్ట్రాల్లో మతమార్పిడి వ్యతిరేక చట్టాన్ని అక్కడి బీజేపీ ప్రభుత్వాలు ఆమోదించాయి. యూపీలో, మధ్యప్రదేశ్‌లో లవ్ జిహాద్‌కు వ్యతిరేక చట్టాలను తీసుకొచ్చారు. ఇతర రాష్ట్రాల్లో కూడా వీటిని దూకుడుగా ప్రవేశపెట్టనున్నారు. ఇప్పుడు దేశవ్యాప్తంగా అమ్మాయిల పెళ్లి వయస్సును పెంచడం అంటే తమకిష్టమైన విధంగా పెళ్లిని ఎంపిక చేసుకోవడాన్ని వారికి లేకుండా చేయడమే అవుతుంది. వివాహ వయస్సు పెంపుదల మహిళలకు సాధికారత కల్పించి, వారి ప్రాతినిధ్యం పెంచడమే కాకుండా, గర్భధారణ శక్తిపై వారికి నియంత్రణను సాధ్యం చేస్తుందా అనేది ప్రశ్నార్థకంగా నిలుస్తోంది.
బాల్య వివాహాలకు, బాలికల సాధికారతకు పరిష్కారం వివాహ వయస్సు పెంపుదలలో లేదని మన సమాజంలో చోటు చేసుకుం టున్న మార్పులు సూచిస్తున్నాయి. పైగా జాతీయ కుటుంబ ఆరోగ్య సర్వే తాజా డేటా ప్రకారం 18 సంవత్సరాలకు లోపు పెళ్లాడుతున్న అమ్మాయిల నిష్పత్తి వేగంగా తగ్గుముఖం పడుతోంది. ఇది ఇంకా తగ్గిపోతుందని కూడా సంకేతాలు ఉన్నాయి. బాల్య వివాహ నిషేధ చట్టం 2006 (పీసీఎంఏ) అమలులో ఎన్ని లోపాలు ఉన్నప్పటికీ తమకు ఇష్టం లేని పెళ్లిళ్లు చేయవద్దని అమ్మాయిలు తల్లిదండ్రులను నిలదీసి అడగడానికి ఈ చట్టం ఎంతో ప్రేరణ నిచ్చిందన్నది వాస్తవం. అదేసమయంలో తమ ఇష్టానికి వ్యతిరేకంగా చేస్తున్న పెళ్లిళ్లపై నిరసన తెలుపుతూ తమకు నచ్చిన వారితో వెళ్లిపోతున్న అమ్మాయిలను, వారు ఎంపిక చేసుకున్న వరులను శిక్షించడానికి ఈ చట్టం తల్లిదండ్రులకే ఎక్కువ అవకాశం ఇస్తోందన్నది కూడా వాస్తవమే. అంటే వివాహ వయస్సు పెంపుదలలో కంటే సమాజ వైఖరి, విధానాల్లోనే ఈ సమస్యకు పరిష్కారం దాగుందని స్పష్టమవుతోంది.
బాలికల విద్యావకాశాలను మరింతగా పెంచడం, హింసకు తావులేని రక్షిత వాతావరణాన్ని, మెరుగైన ఆరోగ్య సేవలను వారికి కల్పించడం, భవిష్యత్తు కోసం వారికి మంచి అవకాశాలు అందించడం వంటి మౌలిక మార్పులకు దోహదం చేసే పరిస్థితులు మన సమాజంలో ఇప్పటికీ తక్కువగానే ఉన్నాయి. అదే సమయంలో మహిళల సామాజిక, ఆర్థిక హోదాను నిర్ణయించడంలో నేటికీ వివాహమే కేంద్రబిందువుగా ఉంటోంది. ఈనాటికీ మన కుటుంబాలు ఆడపిల్లలకు త్వరగా పెళ్లి చేసి అత్తారింటికి పంపించివేయడానికే ప్రాధాన్యత ఇస్తున్నారు. అమ్మాయిలు సైతం పెళ్లి చేసుకోవడమే తమ విధి అనే భావజాలంలోనే పెరుగుతున్నారు. ఆడపిల్లల వయస్సు పెరిగితే, వారు ఎక్కువ చదివితే కట్నం ఎక్కువగా ఇచ్చుకోవలసి వస్తుందనే భీతి కూడా బలవంతపు పెళ్లిళ్లకు, బాల్య వివాహాలకు ప్రధాన కారణమవుతోంది.
మహిళలు ఇప్పుడు 18 ఏళ్ల వయసులో పార్లమెంటు సభ్యులు కాగలుగుతున్నప్పుడు, తాము ఎప్పుడు పెళ్లి చేసుకోవాలి అనే ఎంపికను వారు నిర్ణయించుకోలేరా అనేది ప్రశ్న. తనకు తగని వ్యక్తిని పెళ్లాడటం ద్వారా అమ్మాయిలు తప్పు చేసినప్పటికీ, ఈ తప్పులను చేసే హక్కు, వాటినుంచి నేర్చుకునే హక్కు వారికి ఉండకూడదా అనేది మరో ప్రశ్న. పెళ్లి అనేది బతికేందుకు ఉపయోగపడే వ్యూహంగా ఉండకూడదు. అయితే దేశంలోని చాలామంది మహిళలు సామాజిక భద్రత లేని దుర్భరపరిస్థితుల్లో ఉంటున్న అసంఘటిత రంగంలో పనిచేస్తున్నారు. దేశంలో మహిళలకు ఉద్యోగావకాశాలు లభిస్తున్న దుస్తుల ఫ్యాక్టరీల్లో, పని, ఆరోగ్య రంగంలో కూడా పరిస్థితులు చాలా ప్రాధమిక స్థితిలో మాత్రమే ఉంటున్నాయి. మహిళలకు ఇప్పుడు ఉంటున్న ఉపాధి పరిస్థితులను మెరుగుపర్చి మౌలికంగా మార్పులను తీసుకురావడం, యువతకు మరిన్ని ఉపాధి అవకాశాలు కల్పించడం చేస్తే, మహిళల పెళ్లికి ప్రత్యామ్నాయాలు లభించి వారు ఉత్పాదక రంగంలో ప్రవేశించి అర్థవంతమైన జీవితాలు గడిపే అవకాశం ఉంటుంది. దీనికి బదులుగా ఎవరు ఎవరిని పెళ్లి చేసుకుంటారు, చేసుకోవాలి అనే వ్యాపారంలోకి ఇప్పుడు ప్రభుత్వం నేరుగా దిగినట్లుగా కనిపిస్తోంది.
– శ్రీపర్ణ ఛటోపాధ్యాయ్,అసోసియేట్ ప్రొఫెసర్, ఫ్లేమ్ యూనివర్సిటీ
(‘ది వైర్’ సౌజన్యంతో)
బాధితులనే శిక్షించే చట్టాలతో మార్పు ఎలా?
కుటుంబాల్లో, సమాజంలో కొనసాగుతున్న లింగ వివక్ష,, భర్త వైపునుంచి హింస, ఆస్తిపై యాజమాన్యం, సమాన వేతనం వంటివి మహిళలు నేటికీ ఎదుర్కొంటున్న సవాళ్లుగా ఉంటున్నాయి. పైగా అమలవుతున్న చట్టాలు బాధితులను మరింతగా శిక్షించడానికే తప్ప సామాజిక మార్పునకు దారి తీయడం లేదు. బాలికలను చిన్నవయస్సులోనే పెళ్లి చేసుకునేలా ఒత్తిడి చేస్తున్న వ్యవస్థాగత అంశాలను చట్టాలు అసలు పట్టించుకోవు. అందుకే విభిన్న సామాజిక, ఆర్థిక బృందాలు ఉనికిలో ఉంటున్న సమాజంలో చట్టం అనేది ఇప్పటికే సాధికారత కోల్పోయి ఉన్నవారిని శిక్షించే కొలమానంగానే మారుతుండటం విచారకరం. పెళ్లి వయస్సును చట్టం ద్వారా పెంచితే అది బాల్యవివాహాలను నిరోధించడానికి బదులుగా బాధితులను శిక్షించడానికే ఉపయోగపడుతుంది. పైగా అమ్మాయిల పెళ్లి వయస్సును 21 సంవత్సరాలకు పెంచడం అనేది యువతీ యువకులు వ్యక్తిగత నిర్ణయాలు తీసుకునే హక్కును తిరస్కరిస్తుంది. ఇష్టపడిన వారిని పెళ్లి చేసుకోవడం అనే యువత హక్కును చట్టం ఎంత భంగపరుస్తోందో మనందరికీ తెలుసు.
ఏ సమాజానికైనా చట్టం అవసరమే. కానీ సామాజిక బృందాలను శిక్షించడం కాకుండా వారికి సహకారం అందించే చట్టాలు మనకు అవసరం. బాల్యవివాహాల సమస్యను పరిష్కరించడానికి చట్టం మాత్రమే ప్రధాన సాధనంగా ఉండరాదు. వివాహం విషయంలో యువతకు భద్రత, సాధికారత కలిగించే వాతావరణాన్ని సృష్టించడంపై యావత్ సమాజం దృష్టి పెట్టాలి. బాలబాలికలను అణిచిపెడుతున్న నిర్బంధపూరితమైన లైంగికత స్థానంలో బాధ్యతాయుతమైన లైంగిక ప్రవర్తనను పెంచాలి. బాలికల వివాహ వయస్సును పొడిగించడంతోనే సమస్యకు పరిష్కారం లభించదు. గ్రామీణ సమాజంలోని అననుకూలతల నుంచి బాలికలను బయటపడేసి, వారికి తగినన్ని వనరులు, అవకాశాల కల్పనతో సాధికారతవైపు నడిపించాలి.
సామాజిక, ఆర్థికపరంగా మనుగడ కోసం పెళ్లి తప్పనిసరి అనే జంఝాటం నుంచి బాలికలకు విముక్తి కల్పించాలి. విద్య, ఉపాధి, భద్రత, చలనశీలతతోపాటు పెళ్లి ఎప్పుడు, ఎవరిని చేసుకోవాలో ఎంపిక చేసుకునే స్వేచ్ఛను వారికి అందించాలి. ఇవన్నీ సాధ్యపడినప్పుడు పెళ్లాడే వయస్సు దానికదే పెరుగుతూ పోతుంది. కానీ ఈ విషయాన్ని వినేదెవ్వరు? ప్రభుత్వం అయితే అసలు వినదనేది స్పష్టం. మనదేశంలో 18 ఏళ్ల వయస్సులో ఓటు వేయడం, కాంట్రాక్టు మీద సంతకం చేయడం, బతకడానికి పని ప్రారంభించడం సాధ్యపడుతున్నప్పుడు ఎవరిని పెళ్లిచేసుకోవాలో నిర్ణయించే శక్తి వారికి లేదని చెప్పడం వింతల్లోకెల్లా వింతే.
– ఈనాక్షీ గంగూలీ, మానవహక్కుల కార్యకర్త
Comments
Please login to add a commentAdd a comment