అభిప్రాయం
భారత మాజీ రాష్ట్రపతి, ప్రఖ్యాత శాస్త్రవేత్త అబ్దుల్ కలామ్ బ్రహ్మచారి అని మనందరికీ తెలుసు. ఆయనకు ‘భారతరత్న’ ప్రకటించిన సందర్భంగా వివిధ పత్రికలు కలామ్ తన శాస్త్ర పరిశోధనలకు ఎటువంటి ఆటంకం కలగకూడదనే బ్రహ్మచారిగా ఉండిపోయారని ప్రస్తావించాయి. మాజీ ప్రధాని వాజ్‌పేయి కూడా బ్రహ్మచారే! ప్రజాసేవకు సంసార జీవితం అడ్డు కాకూడదనే భావనతో ఆయన వివాహం చేసుకోలేదని అనేవారు. బ్రహ్మచారిగా మిగిలిపోయిన ప్రతి సెలబ్రిటీ గురించి ఇంచుమించు ఇలాంటి విషయమే చెబుతుంటారు. ఇందుకు తోడు ‘వివాహం విద్య నాశాయ’ అనే సూక్తి వింటూనే ఉంటాం.
కానీ శాస్త్రీయంగా చెప్పాలంటే పెళ్ళి చేసుకోవడం వల్ల సృజనాత్మకత తగ్గిపోతుందని ఎక్కడా నిర్ధారణ కాలేదు. పెళ్ళయి చక్కటి వైవాహిక జీవితం గడుపుతూ సృజనాత్మక రంగంలో ప్రఖ్యాతి గాంచిన వారు చాలామందే ఉన్నారు. ప్రముఖ రచయిత సల్మాన్ రష్దీ మూడు సార్లు వివాహం చేసుకున్నారు. ప్రముఖ తమిళ సినీ గేయ రచయిత, ప్రప్ర«థమ జాతీయ ఉత్తమ సినీ గేయ రచయిత కన్న దాసన్‌కు ముగ్గురు భార్యలన్న విషయం చాలామందికి తెలియకపోవచ్చు. కుశ్వంత్ సింగ్ చక్కటి వైవాహిక జీవితం గడుపు తూనే, ప్రముఖ రచయితగా పేరొందారు. చెప్పుకుంటూ పోతే ఈ జాబితాలో చాలా మంది ప్రముఖులే ఉంటారు.
కాకపోతే సృజనాత్మక రంగాలలో పని చేసేవారికి జీవిత భాగస్వాములుగా, క్రియే టివ్ రంగానికి చెందినవారు లేదా కనీసం దానిపట్ల ఆసక్తి ఉన్న వారు లభించే పక్షంలో ఆయా వ్యక్తులు మరింతగా రాణిస్తారు. క్రియేటివ్ వ్యక్తుల ఆలోచనా ధోరణికి ఇతరుల ఆలోచనా ధోరణులకు కొంత తేడా ఉంటుంది. దాని వల్ల వారి దైనందిన జీవితంలో కొన్ని ఇబ్బందులు ఎదుర్కోవాల్సి రావచ్చు.
కొందరు రచయితలు రాత్రంతా మేల్కొని తమ రచనా వ్యాసంగాన్ని కొనసాగించి పగలు నిద్రపోతుంటారు. కళాకా రులు, నటులు... షూటింగ్‌లు, రిహార్సల్స్ అని అర్ధరాత్రి వరకు కష్టపడి ప్రాక్టీస్ చేసి ఇంటికి వస్తే, ఇంట్లో వారి భాగస్వామి సర్దుకు పోలేక పోవచ్చు. వాస్తవానికి ఆ స్థితికి ఎవర్నీ తప్పు పట్టలేం! పరస్పర విరుద్ధ మైన మనస్తత్వం కలిగినవారు వివాహం చేసుకోవడమే కారణం.
వైవాహిక పరమైన సమస్యలు సృజనాత్మక రంగంలో పనిచేసే వారిపై తీవ్ర ప్రభావం చూపిస్తాయి. క్రియేటివ్ వ్యక్తులకు ఇంటి బాధ్య తలు, భాగస్వామి కోర్కెలు చిన్న విషయాలుగా కనిపిస్తాయి. సహజంగా రచయితలు తమ రచనలకు సంబంధించి మేధా మథనం చేస్తుంటారు. ఆ సమయంలో భార్య వచ్చి ఇంటి సమస్యలు ఏకరువు పెడితే అతని ఆలోచనలకు ఆటంకం కలగవచ్చు.
ఇంకో ముఖ్య విషయమేటింటే, క్రియేటివ్ వ్యక్తులకు వారి భావాలు వెలికి వచ్చేందుకు ఒక ఉత్ప్రేరకం అవసరం కావచ్చు. ‘మేఘసందేశం’ సినిమాలో నాగేశ్వరరావుకు జయ సుధ ఉత్తమ ఇల్లాలైనప్పటికీ ఆయనలోని రచయితకు, గోదావరి ఒడ్డున నాట్యం చేసే జయప్రద ఉత్ప్రేరకంగా పనిచేస్తుంది.
అయితే జీవిత భాగస్వామి ఏ మాత్రం సహకరించకపోయినా ప్రపంచ ప్రఖ్యాతి గాంచిన మేధావులు ఎందరో వున్నారు. ప్రముఖ శాస్త్రవేత్త ఐన్‌స్టీన్ భార్య పరమ గయ్యాళి అని ఆయనే స్వయంగా చెప్పుకున్నారు. ప్రముఖ రచయిత బెర్నార్డ్ షా భార్యతో కలిసి ఒక పార్టీకి వెళ్ళినపుడు అందరూ ఆనందంగా డాన్స్ చేస్తుంటే, భార్య కూడా చేద్దామని పిలుస్తుంది.
ఆయన ఏదో దీర్ఘంగా ఆలోచిస్తూ, ‘తర్వాత రాసే నవల ప్లాన్ గురించి ఆలోచిస్తున్నాను, నేను రా’నంటాడు. ‘ఎప్పుడూ రచనలేనా, కొంచెం సేపు జీవితంలో ఎంజాయ్‌మెంట్ కూడా ఉండా’లంటుంది. అందుకాయన ‘ఈ డాన్స్ వల్ల వచ్చే ఆనందం క్షణికమైనది. కానీ నేను ఆలోచించి రాసే నవల వల్ల వచ్చే ఆనందం, కీర్తి శాశ్వతంగా ఉంటా’యంటాడు. వృత్తి ముఖ్యమా, ఆనందించడం ముఖ్యమా అంటే, ఎవరికి నచ్చిన దాంట్లోనే వారికి ఆనందం ఉంటుంది.
క్రియేటివ్ రంగంలో ఉన్నవారు తమకు తగిన జీవిత భాగస్వామి లభించలేదని బాధపడాల్సిన పని లేదు. ఇరువురికి ఎలాంటి వాటిల్లో అభిప్రాయ బేధాలు వస్తున్నాయో, సమ స్యలు ఎదురవుతున్నాయో గుర్తించి, ప్రయారిటీ ప్రకారం వాటిని సామ రస్యంగా పరిష్కరించు కోవాలి.
ఒకరి అభిప్రాయాలను మరొకరికి చెప్పు కోవాలి. కార్లు, బంగళాలు లేకపోయినా, క్రియేటివ్ రంగంలో ఉండటం వల్ల సమాజంలో లభించే గౌరవం, కీర్తి గురించి అవతలి వ్యక్తికి తెలియ జెప్పాలి. క్రియేటి విటీకి ఆటంకం కల్గకుండా, వైవాహిక జీవితానికి ఇబ్బందులు కల్గకుండా వర్క్–లైఫ్ బేలన్స్ చేసుకోవాలి. అప్పుడు వైవాహిక జీవితం, సృజనాత్మకత కలకాలం పరిపూర్ణంగా ఉంటాయి.
డా‘‘ ఇండ్ల రామసుబ్బా రెడ్డి
వ్యాసకర్త ప్రముఖ మానసిక వైద్య నిపుణులు ‘ 9348114948
Comments
Please login to add a commentAdd a comment