వివాహాల సందర్భంగా అప్పటి రోజులకూ ఇప్పటి రోజులకూసంప్రదాయాల విషయంలో తేడా కొట్టొచ్చినట్లు కనిపిస్తున్నది. అర్ధ శతాబ్దం క్రితం చూసిన ఆచారాలు కూడా నాకింకా గుర్తున్నాయి. పాత రోజుల్లో వివాహ పూర్వరంగంలో సంప్రదాయబద్ధంగా వరుడి ఇంట్లో జరిగే మాటా–మంతీ అయిపోయి... ఒకరి వంశక్రమం గురించి మరొకరు అవగాహనకొచ్చిన తర్వాత జరగవలసిన కార్యక్రమాన్ని ఖరారు చేసుకునేవారు. వీలునుబట్టి ఒకటి–రెండు నెలల తరువాత మంచిరోజు చూసుకుని... ఆడపిల్ల వారింట్లో కలిసి, ముహూర్తాలు పెట్టు కోవాలని సూత్రప్రాయంగా నిర్ణయించుకునేవారు. పురోహి తుడిని సంప్రదించి పెళ్లి ఎన్నడు, ఏ ముహూర్తాన జరిగితే మంచిగుంటుందో తుది నిర్ణయం తీసుకునేవారు.
అప్పట్లో, వివాహంలో ముఖ్యమైన ఘట్టాలలో మొద టిది వాగ్దానం. అంటే... పెళ్ళి ఖాయపరచుకోవడం లేదా నిశ్చితార్థం. ఆ తర్వాత వర–వరణం. అంటే వరుడిని లాంఛన ప్రాయంగా అంగీకరించడం. నిశ్చితార్థానికే మరో పేరు ‘నిశ్చయ తాంబూలం’. వైదిక మంత్రాల మధ్య వివాహ ప్రక్రియకు పెద్దల ఆశీస్సులు తీసుకోవడానికే ఈ కార్యక్రమం. అందరికీ ఆమోదయోగ్యమైన శుభ ముహూ ర్తంలో పురోహితుడు బంధుమిత్రుల సమక్షంలో పెళ్ళి ముహూర్తాన్ని ‘లగ్నపత్రిక’గా రాయించిన తదుపరి... వధూ వరుల తల్లితండ్రులు లగ్నపత్రికలు, తాంబూలాలు మార్చు కునేవారు.
పెళ్ళి ఒప్పందం లాంటి ఈ వేడుక అప్పట్లో సర్వసాధారణంగా వధువు ఇంటిలోకాని, అరుదుగా వారు ఏర్పాటుచేసుకున్న చిన్నపాటి వసతి గృహంలోకాని, లేదా బంధువుల ఇంటిలో కాని జరిగేది. దీన్నే ఇప్పుడు ‘ఎంగేజ్ మెంట్’ అంటున్నారు. కొందరు ఇటీవలి కాలంలో ఈ తంతును పెళ్లికంటే ఘనంగా జరుపుకొంటున్నారు. నిశ్చి తార్థం రోజున అమ్మాయి, అబ్బాయి ఉంగరాలు మార్చు కోవటంతో సగం పెళ్ళి జరిగినట్టుగానే భావిస్తారు. ఇప్పుడు దండల మార్పిడితో సహా ఈ దాదాపు ఒక పెళ్ళిలాగా ఈ తంతు జరుగుతున్నది.
సంప్రదాయ బద్ధంగా, వధూవరుల తల్లిదండ్రుల మధ్యన ఇచ్చి, పుచ్చుకోవడాలు అందరి ఇళ్లల్లో ఒకే రకంగా ఉంటాయి. తాహతును బట్టి కొంచెం మార్పులు, చేర్పులు ఉండొచ్చు. ఇరుపక్షాల వాళ్ళు మరిచిపోవడానికి ఆస్కారం లేకుండా, అరమరికలు లేకుండా ఒక కాగితం మీద... ఇచ్చి పుచ్చుకోవడాలకు సంబంధించిన వివరాలన్నీ రాసుకోవడం కూడా సంప్రదాయమే.
వధూవరుల తారా బలం, చంద్ర బలం చూసి ముహూర్తం నిశ్చయిస్తారు. ‘పెళ్లినాటి ప్రమాణాలు’ భవి ష్యత్‌లో దంపతులు తు.చ. తప్పకుండా అమలు చేయాలంటే ‘ముహూర్త బలం’ ముఖ్యమని పాతరోజుల నాటి నమ్మకం. నిశ్చితార్థంలో ప్రధానంగా విఘ్నేశ్వరుడి పూజ ఉంటుంది. ఇదంతా ‘ఆచారం, పద్ధతి’. పెళ్ళి ముహూర్తం దగ్గర పడుతుంటే, పెళ్లి సరంజామా కొనడం అనేది ఇరు పక్షాల వారికి కూడా పెద్దపని. అప్పట్లో ఇన్ని బంగారం దుకాణాలు ఉండేవి కావు. బంగారం వస్తు వులు తయారుచేసే కంసాలితో పెళ్ళి ఆభరణాలన్నీ తయారు చేయించేవారు.
నిర్ణయించబడిన ముహూర్తానికి వరుని తరఫువారూ, వధువు తరఫువారూ వారివారి కులాచారానుసారం ‘శుభ లేఖలు’గా పిలువబడే ఆహ్వానపత్రికలు ముద్రించుకుంటారు. మంగళ సూచకంగా లేఖకు నాలుగు వైపులా పసుపు పూస్తారు. బంధుగణాన్ని పిలుచు కోవడం పెళ్లిళ్లలో సర్వ సాధారణం. బంధువులందరూ కలుసుకోగలిగే ‘సామాజిక ఏర్పాటు’ పెళ్ళిళ్లు. ఆ కలయికలకు వేదికగా పెళ్ళివారి ఇల్లు (కల్యాణ మంటపం) మారిపోతుంది. స్వయంగా కలిసి శుభలేఖ ఇవ్వడమో, వ్యక్తులకు ఇచ్చి పంపడమో జరిగేది.
ఇప్పటిలాగా ఫోన్ మెసేజులు లేవు. ఎంత శ్రద్ధ తీసుకుని, అందరికీ పంపించే ఏర్పాటుచేసినప్పటికీ, ఆఖరు నిమిషంలో, ఒక్కోసారి ముఖ్యమైన వారితో సహా కొందరిని మరిచిపోవడం సహజంగా జరిగేది. వాళ్లకు కోప–తాపాలు కూడా వచ్చేవి. కాకపోతే వచ్చినంత త్వరగా తగ్గిపోయేవి. ఇవన్నీ అప్పట్లో సర్వసాధారణంగా ప్రతి పెళ్లిలోనూ, ప్రతి వారింటిలోనూ జరిగే మామూలు విషయాలే. ఆ చిరు కోపాలు రాకుంటే పెళ్ళి శోభ రానట్లే. ఇప్పుడు కోపం వచ్చినా పట్టించుకునేవారు లేరు!!
- వనం జ్వాలా నరసింహారావు, తెలంగాణ సీఎం సీపీఆర్‌ఓ
Comments
Please login to add a commentAdd a comment