olden days
-
ఆ రోజుల్లో పెళ్లిళ్లంటే... ఎన్ని ఆచారాలూ!
వివాహాల సందర్భంగా అప్పటి రోజులకూ ఇప్పటి రోజులకూసంప్రదాయాల విషయంలో తేడా కొట్టొచ్చినట్లు కనిపిస్తున్నది. అర్ధ శతాబ్దం క్రితం చూసిన ఆచారాలు కూడా నాకింకా గుర్తున్నాయి. పాత రోజుల్లో వివాహ పూర్వరంగంలో సంప్రదాయబద్ధంగా వరుడి ఇంట్లో జరిగే మాటా–మంతీ అయిపోయి... ఒకరి వంశక్రమం గురించి మరొకరు అవగాహనకొచ్చిన తర్వాత జరగవలసిన కార్యక్రమాన్ని ఖరారు చేసుకునేవారు. వీలునుబట్టి ఒకటి–రెండు నెలల తరువాత మంచిరోజు చూసుకుని... ఆడపిల్ల వారింట్లో కలిసి, ముహూర్తాలు పెట్టు కోవాలని సూత్రప్రాయంగా నిర్ణయించుకునేవారు. పురోహి తుడిని సంప్రదించి పెళ్లి ఎన్నడు, ఏ ముహూర్తాన జరిగితే మంచిగుంటుందో తుది నిర్ణయం తీసుకునేవారు. అప్పట్లో, వివాహంలో ముఖ్యమైన ఘట్టాలలో మొద టిది వాగ్దానం. అంటే... పెళ్ళి ఖాయపరచుకోవడం లేదా నిశ్చితార్థం. ఆ తర్వాత వర–వరణం. అంటే వరుడిని లాంఛన ప్రాయంగా అంగీకరించడం. నిశ్చితార్థానికే మరో పేరు ‘నిశ్చయ తాంబూలం’. వైదిక మంత్రాల మధ్య వివాహ ప్రక్రియకు పెద్దల ఆశీస్సులు తీసుకోవడానికే ఈ కార్యక్రమం. అందరికీ ఆమోదయోగ్యమైన శుభ ముహూ ర్తంలో పురోహితుడు బంధుమిత్రుల సమక్షంలో పెళ్ళి ముహూర్తాన్ని ‘లగ్నపత్రిక’గా రాయించిన తదుపరి... వధూ వరుల తల్లితండ్రులు లగ్నపత్రికలు, తాంబూలాలు మార్చు కునేవారు. పెళ్ళి ఒప్పందం లాంటి ఈ వేడుక అప్పట్లో సర్వసాధారణంగా వధువు ఇంటిలోకాని, అరుదుగా వారు ఏర్పాటుచేసుకున్న చిన్నపాటి వసతి గృహంలోకాని, లేదా బంధువుల ఇంటిలో కాని జరిగేది. దీన్నే ఇప్పుడు ‘ఎంగేజ్ మెంట్’ అంటున్నారు. కొందరు ఇటీవలి కాలంలో ఈ తంతును పెళ్లికంటే ఘనంగా జరుపుకొంటున్నారు. నిశ్చి తార్థం రోజున అమ్మాయి, అబ్బాయి ఉంగరాలు మార్చు కోవటంతో సగం పెళ్ళి జరిగినట్టుగానే భావిస్తారు. ఇప్పుడు దండల మార్పిడితో సహా ఈ దాదాపు ఒక పెళ్ళిలాగా ఈ తంతు జరుగుతున్నది. సంప్రదాయ బద్ధంగా, వధూవరుల తల్లిదండ్రుల మధ్యన ఇచ్చి, పుచ్చుకోవడాలు అందరి ఇళ్లల్లో ఒకే రకంగా ఉంటాయి. తాహతును బట్టి కొంచెం మార్పులు, చేర్పులు ఉండొచ్చు. ఇరుపక్షాల వాళ్ళు మరిచిపోవడానికి ఆస్కారం లేకుండా, అరమరికలు లేకుండా ఒక కాగితం మీద... ఇచ్చి పుచ్చుకోవడాలకు సంబంధించిన వివరాలన్నీ రాసుకోవడం కూడా సంప్రదాయమే. వధూవరుల తారా బలం, చంద్ర బలం చూసి ముహూర్తం నిశ్చయిస్తారు. ‘పెళ్లినాటి ప్రమాణాలు’ భవి ష్యత్‌లో దంపతులు తు.చ. తప్పకుండా అమలు చేయాలంటే ‘ముహూర్త బలం’ ముఖ్యమని పాతరోజుల నాటి నమ్మకం. నిశ్చితార్థంలో ప్రధానంగా విఘ్నేశ్వరుడి పూజ ఉంటుంది. ఇదంతా ‘ఆచారం, పద్ధతి’. పెళ్ళి ముహూర్తం దగ్గర పడుతుంటే, పెళ్లి సరంజామా కొనడం అనేది ఇరు పక్షాల వారికి కూడా పెద్దపని. అప్పట్లో ఇన్ని బంగారం దుకాణాలు ఉండేవి కావు. బంగారం వస్తు వులు తయారుచేసే కంసాలితో పెళ్ళి ఆభరణాలన్నీ తయారు చేయించేవారు. నిర్ణయించబడిన ముహూర్తానికి వరుని తరఫువారూ, వధువు తరఫువారూ వారివారి కులాచారానుసారం ‘శుభ లేఖలు’గా పిలువబడే ఆహ్వానపత్రికలు ముద్రించుకుంటారు. మంగళ సూచకంగా లేఖకు నాలుగు వైపులా పసుపు పూస్తారు. బంధుగణాన్ని పిలుచు కోవడం పెళ్లిళ్లలో సర్వ సాధారణం. బంధువులందరూ కలుసుకోగలిగే ‘సామాజిక ఏర్పాటు’ పెళ్ళిళ్లు. ఆ కలయికలకు వేదికగా పెళ్ళివారి ఇల్లు (కల్యాణ మంటపం) మారిపోతుంది. స్వయంగా కలిసి శుభలేఖ ఇవ్వడమో, వ్యక్తులకు ఇచ్చి పంపడమో జరిగేది. ఇప్పటిలాగా ఫోన్ మెసేజులు లేవు. ఎంత శ్రద్ధ తీసుకుని, అందరికీ పంపించే ఏర్పాటుచేసినప్పటికీ, ఆఖరు నిమిషంలో, ఒక్కోసారి ముఖ్యమైన వారితో సహా కొందరిని మరిచిపోవడం సహజంగా జరిగేది. వాళ్లకు కోప–తాపాలు కూడా వచ్చేవి. కాకపోతే వచ్చినంత త్వరగా తగ్గిపోయేవి. ఇవన్నీ అప్పట్లో సర్వసాధారణంగా ప్రతి పెళ్లిలోనూ, ప్రతి వారింటిలోనూ జరిగే మామూలు విషయాలే. ఆ చిరు కోపాలు రాకుంటే పెళ్ళి శోభ రానట్లే. ఇప్పుడు కోపం వచ్చినా పట్టించుకునేవారు లేరు!! - వనం జ్వాలా నరసింహారావు, తెలంగాణ సీఎం సీపీఆర్ఓ -
సండే ఫ్లాష్..: బ్యాక్సినిమాకెళ్తాం నాన్నా!
షూటింగ్‌లు ఆగిపోతాయట.. సినిమా టికెట్లు తగ్గించాలట. కలెక్షన్లు లేవట.. థియేటర్లు ఖాళీ అట. ఇవీ ఇవాళ్టి వార్తలు. కాని థియేటర్లో రిలీజయ్యే సినిమాయే ఏకైక వినోదంగా ఉన్న 1980–90లలో సినిమాకు వెళ్లాలంటే ఎంత తతంగం. ఎంత ప్రిపరేషను. ఎన్ని పర్మిషన్లు. ఎంత హడావిడి. ఎంత సంబరం. జ్ఞాపకం ఉన్నాయా ఆ రోజులు. జ్ఞాపకం చేయమంటారా? నేల డెబ్బయి అయిదు పైసలు. బెంచి రూపాయి. కుర్చీ రూపాయిన్నర. బాల్కనీ రెండు రూపాయలు. ఆ డబ్బులు ఉండేవి కాదు. సినిమాకంటూ కొంత డబ్బు మిగలాలంటే ఇంటి బడ్జెట్లో చాలా కుదరాలి. ఎవరికో హటాత్తుగా జ్వరం రాకూడదు. ఏ ఇంటనో పెళ్లి జరక్కూడదు. ఏదో ఒక బంధువుల ఇంటికి ప్రయాణం పడకూడదు. చుట్టాలు ఊడి పడకూడదు. నోటు పుస్తకాలని, టెక్ట్స్ పుస్తకాలని పిల్లలు డబ్బులు అడక్కూడదు. అన్నీ కుదిరి ఇంట్లో ఐదు రూపాయల వరకూ ఉంటే ఫ్యామిలీ అంతా సినిమాకు పోవచ్చు. సినిమా మారితే గోడ మీద పోస్టర్ పడుతుంది. దానిమీద నీలి సిరాతో థియేటర్ పేరు... ఎన్ని ఆటలో రాసి ఉంటుంది. బండి వీధుల్లో తిరుగుతూ మైక్‌లో ‘మీ అభిమాన థియేటర్ శ్రీ వేంకటేశ్వరలో... రేపటి నుండి’... అని అనౌన్స్మెంట్ వినిపిస్తుంది. అది ఫ్యామిలీ సినిమా అయితే అమ్మ మనసు లాగుతుంది. ఫైటింగ్ సినిమా అయితే పిల్లలకు తబ్బిబ్బవుతుంది. నాన్నకు ఏ సినిమా అయినా ఒకటే. ఆయన ఉదయం వెళ్లి రాత్రివరకూ పని చేస్తూనో ఉద్యోగం చేస్తూనో షాపు నడుపుతూనో బిజీ. సినిమా మారినట్టే తెలియదు. చూద్దామనే ఆసక్తీ ఉండదు. కాని పర్మిషన్ ఇవ్వాల్సిందీ డబ్బు చేతిలో పెట్టాల్సిందీ ఆయనే. కొందరు నాన్నలు ఎప్పుడూ ధుమధుమలాడుతూ ఉంటారు. వారిని సినిమాకు పర్మిషన్ అడగాలంటే భయం. కాని ఆ నాన్నలే పిల్లల మాట వింటారు. ‘రేయ్... సినిమాకెళ్తామని మీ నాన్నని అడగండిరా’ అని తల్లులు పిల్లల్ని రాయబారానికి పంపుతారు. కొందరు నాన్నలు చుట్టాలు ఇంటికి రాగానే పొంగిపోతారు. ‘అందరు కలిసి సినిమాకు పోండి’ అని డబ్బులిచ్చి పంపుతారు. కొందరు నాన్నలు చాలా వింత. వాళ్లకై వాళ్లు ఏ మ్యాట్నీయో చూసేసి ఏమెరగనట్టు ఉంటారుగాని ఇంట్లోవాళ్లు సినిమాకు వెళతామంటే మాత్రం ఒప్పుకోరు. కొందరు నాన్నలు అందరూ కలిసి వెళ్లేలా టికెట్లు ముందే తెచ్చి తీసుకువెళతారు. వీళ్లు మాత్రం చాలా మంచి నాన్నలు. ఈ రోజు ఫస్ట్ షోకు వెళ్లాలంటే పొద్దున్నుంచే హడావిడి. ఇరుగమ్మకు పొరుగమ్మకు అవసరం ఉన్నా లేకపోయినా ‘ఇవాళ మేము సినిమాకు వెళుతున్నాం’ అని చెప్తుంది అమ్మ. మంచి చీరా జాకెట్టు వెతుక్కోవడం, వంట తొందరగా ముగించడం, నాన్నకోసం తాళం పక్కింట్లో ఇవ్వడం.... పిల్లలు స్కూల్లో ఫ్రెండ్స్ దగ్గర గొప్పలు పోతారు– సినిమాకు వెళుతున్నామని. ఇంట్లో నానమ్మ ఉంటే ఆమె మెల్లగా నడుస్తుంది కనుక చాలా ముందే బయలుదేరాలి. ఆమె వేలు పట్టుకుని నడిపించడానికి మనవడు తెగ తొందర పడుతుంటాడు. ట్రైల్పార్ట్ ఉంటుందని కొందరు ఆరాంగా బయలుదేరుతారు. మరికొందరు ‘డింగ్డింగ్ డింగ్డింగ్’ అని మ్యూజిక్ వచ్చి కుచ్చుల తెర పైకి లేచేప్పటి నుంచి చూడాలని ముందే వచ్చేస్తారు. చివరి నిమిషంలో టికెట్లు అయిపోయాయని వెనక్కు వెళ్లేవాళ్లు కొందరైతే... సినిమాకు గంట ముందే వచ్చి ముందు జాగ్రత్తగా ఖాళీ క్యూలో నిల్చునేవారు కొందరు. ఇంటర్వెల్లో ఏం తినాలి? దాని బడ్జెట్ ఎంత? అనేదానికి కూడా ఒక లెక్క ఉంటుంది. పిల్లలకు పావలా ఇవ్వడం పెద్ద విషయం. కొందరు తల్లులు ఏ జామకాయనో, బొరుగులనో జేబుల్లో పోసి ఇవి తిను అంటారు. ఉప్పుజల్లిన రేక్కాయలు పది పైసలకు కూడా దొరుకుతాయి హాలు బయట. లోపలకు తీసుకెళ్లి తినడమే. వడలు, బజ్జీలు తింటే అదో తృప్తి. పెద్ద కుటుంబాల వారు ఇంటర్వెల్లో గోల్డ్‌స్పాట్ కొనుక్కుని మెల్లమెల్లగా తాగుతూ చూస్తారు. అన్నింటికంటే ముఖ్యం స్టిల్స్ డబ్బా ముందు నిలబడి ఎన్ని స్టిల్స్ ఫస్ట్ హాఫ్‌లో ఉన్నాయో ఎన్ని స్టిల్స్ సెకండ్ హాఫ్‌లో రానున్నాయో చూసుకోవడం. రాబోయే సినిమాల పోస్టర్లను నోరు వెళ్లబెట్టి చూడటం. తెలిసిన ఏ ఒక్కరు కనిపించినా ‘ఏవోయ్... సినిమాకు వచ్చావా?’ అని అడగడం. సినిమాహాల్లో కనిపించినవాడు సినిమాకు రాక టిఫిన్ తినడానికి వస్తాడా? సినిమాలో మనం కట్టుకోలేని బట్టలు హీరో హీరోయిన్లు కట్టుకుంటారు. మనం చేయలేని సాహసాలు హీరోలు చేస్తారు. మనం చూడని ప్రదేశాలు అందంగా చూపిస్తారు. మనం నవ్వే ఏడ్చే సందర్భాలను రక్తి కట్టిస్తారు. అద్దె ఇళ్లు, రేషన్ సరుకు, చాలీ చాలని ఆదాయం, స్లిప్పర్లు కూడా లేని జీవితం, బయట టీ తాగడానికి కూడా ఆలోచించే బతుకు... వీటిమధ్య మూడు గంటలసేపు ఒక పెద్ద రిలీఫ్ సినిమా. అది చాలా మందిని బతికించింది. చాలామందిని చేదు వాస్తవాల నుంచి కలల్లోకి పంపింది. చాలామందికి ఆత్మబంధువుగా ఒక హీరోను ఇచ్చింది. తక్కువ తక్కువగా ఉన్నది ఏదైనా రుచిగా ఉంటుంది. అపురూపంగా ఉంటుంది. ఇవాళ? చేతిలో కంప్యూటర్లో టీవీలో ఎన్ని కావాలంటే అన్ని ఎప్పుడు కావాలంటే అప్పుడు ఎటువంటి సినిమాలు కావాలంటే అటువంటివి ఉంటే... అంతా అతి అయిపోతే కొద్దిపాటి రుచిలోని మాధుర్యం పోయింది. ఎంతో గొప్ప వంటకం తెర కోసం తయారైందని తెలిస్తే తప్ప హాలు వైపు నడవడం లేదు ఎవరూ. కొత్తొక రోత. పాతొక వింత. మూడు గంటలసేపు ఒక పెద్ద రిలీఫ్ సినిమా. అది చాలా మందిని బతికించింది. చాలామందిని చేదు వాస్తవాల నుంచి కలల్లోకి పంపింది. చాలామందికి ఆత్మబంధువుగా ఒక హీరోను ఇచ్చింది. తక్కువ తక్కువగా ఉన్నది ఏదైనా రుచిగా ఉంటుంది. అపురూపంగా ఉంటుంది. -
నేనెక్కడున్నానో చెప్పుకోండి: భారత కెప్టెన్
దూకుడే మంత్రంగా చెలరేగిపోయే ఆటగాడు విరాట్ కోహ్లీ. ప్రస్తుతం కోహ్లీ టెస్టు కెప్టెన్సీతో పాటు వన్డే, టి-20 ఫార్మాట్లలోనూ సారథ్యం వహించనున్నాడు. వన్డే, టి-20 కెప్టెన్ ధోనీ గతవారం అనూహ్యంగా రిటైర్మెంట్ ప్రకటించిన సంగతి తెలిసిందే. దీంతో ధోనీ వారసుడిగా కోహ్లీ జట్టు సారథ్య బాధ్యతలు స్వీకరించడంతో ఒక్కసారిగా తన పాత రోజులను నెమరు వేసుకుంటున్నాడు. కోచ్ చెప్పే సూచనలు తీక్షణంగా వింటున్న కోహ్లీ కిందే మిగతా ఆటగాళ్లతో కలిసి కూర్చొన్న ఫోటోను తన ఇన్‌స్టాగ్రామ్‌లో పోస్ట్ చేశాడు. అంతేనా తానెక్కడున్నాడో చెప్పగలరా అంటూ..తన అభిమానులకు సవాలు కూడా విసిరాడు. పాత రోజులు చాలా మధురమైనవి అంటూ కామెంట్ పెట్టాడు. ఇంతకీ కోహ్లీ ఎక్కడున్నాడో మీరు గుర్తుపట్టారా? అదేనండి ముందు వరుసలో ఎడమవైపు చివరకు కూర్చొన్న యువకుడే మన భారత జట్టు రథసారధి. Good old days.