ఓ సినీమాలాంటి కథ | Gollapudi Maruthi Rao Article On Kerala Old Lover Couples | Sakshi
Sakshi News home page

ఓ సినీమాలాంటి కథ

Jan 17 2019 1:04 AM | Updated on Jan 17 2019 1:04 AM

Gollapudi Maruthi Rao Article On Kerala Old Lover Couples - Sakshi

ఇలాంటి కథని రాస్తే చాలామంది నవ్వుతారు. అలాంటి కథలు రాసి ఒప్పించిన ఇద్దరు మహాను భావులు నాకు గుర్తొస్తారు –థామస్‌ హార్డీ (ది మేయర్‌ ఆఫ్‌ కాస్టర్‌ బ్రిడ్జ్‌), ఆంటన్‌ చెఖోవ్‌. అయినా ఇది విచిత్రమైన, అనూహ్యమైన కథ. నిజానికి కన్నూరు ప్రాంతంలో జరిగిన ఈ కథని వాళ్ల మేనకోడలు శాంతా కావుంబాయి నవలని రాసింది. అది 1946 ప్రాంతం. బ్రిటిష్‌ పాలనలో కేరళలో కన్నూరు ప్రాంతంలో భూస్వాముల ఆగడా లను వ్యతిరేకిస్తూ ముమ్మరంగా తిరుగుబాటు జరు గుతున్న సామాజిక–రాజకీయ నేపథ్య విప్లవాన్ని ప్రాతిపదికగా తీసుకుని ఈ కథని అతని మేనకోడలు శ్రీమతి శాంత నవలని రాసింది. ఆ తిరుగుబాటు నేపథ్యంలో జరిగిన ఓ ఉపకథ ఇది.

నారాయణన్‌ పెద్ద విప్లకారుడేం కాదు. కనీసం తన తండ్రిలాగా శాశ్వతమైన కీర్తిని ఆర్జించిన అమ రవీరుడూ కాదు. ఇ.కె. నారాయణన్‌ నంబియార్‌ 30 ఏళ్ల వాడు. తండ్రితో పాటు ఈ తిరుగుబాటు ఉద్య మంలోకి దూకాడు ఆవేశంగా. అప్పుడే అతనికి పెళ్ల యింది. భార్య శారద దూరపుబంధువుల అమ్మాయి. అప్పటికి భార్య శారద 13 ఏళ్ల పిల్ల. నిజానికి వాళ్లి ద్దరూ ఆనాటికి నోరిప్పి కబుర్లు చెప్పుకోలేదు– చెప్పుకోవడం తెలీదు కనుక. పెళ్లయిన కొన్ని నెలలకే ఇద్దరూ విడిపోయారు. అక్కడి రైతులు బ్రిటిష్‌ యాజమాన్యం, భూకామందులను ఎదిరిస్తూ జరిగే ఈ తిరుగుబాటులో చేతులు కలిపారు. డిసెంబర్‌ 29న నంబియార్‌ తన తండ్రి రామన్‌ నంబియార్‌తో కలిసి తాలియన్‌కి వెళ్లాడు. దూరపు కొండల సమీ పంలో ఉన్న కారాకట్టిడం నాయనార్‌ అనే భూస్వామి మీద తిరుగుబాటుకి బయలుదేరిన వందలాది మందితో వీరూ ఉన్నారు. భూస్వామి ఆగడాలను తుదముట్టించి, అతని ఆట కట్టించాలని వారి ప్లాను.

కానీ వీళ్ల ప్రయత్నం కార్యరూపం దాల్చే లోగా బ్రిటి ష్‌వారి మలబార్‌ స్పెషల్‌ పోలీసు బలగం వీరిని చుట్టుముట్టింది. ఆ తిరుగుబాటుదారుల గుంపుమీద బుల్లెట్ల వర్షం కురిపించింది. అయిదుగురు అక్కడిక క్కడే చనిపోయారు. ఎందరో గాయపడ్డారు. నంబి యార్‌ తండ్రితో తప్పించుకుని అజ్ఞాతంలోకి మాయ మయ్యాడు.కానీ, పోలీసులు అతని ఇంటిమీద దాడిచేసి, స్త్రీలను హింసించి వారి ఉనికి కూపీ లాగారు. శారద అభం శుభం తెలియని పిల్ల కనుక ఆమెని వదిలి పెట్టారు. ఈ సంఘటన తర్వాత కుటుంబం ఆమెని పుట్టింటికి పంపించేసింది. రెండు నెలలు పోలీసు ఆ కుటుంబాన్ని రాసి రంపానబెట్టి, ఈ యజమానుల ఆచూకీ పట్టుకుని ఇద్దరినీ అరెస్టు చేసి జైల్లో పెట్టారు. సంవత్సరాలు గడిచాక ఈ ఖైదీలను అధికారులు కన్నూరు సెంట్రల్‌ జైలు నుంచి వియ్యూరు అటు తర్వాత సేలం జైళ్లకు బదిలీ చేశారు.1950 ఫిబ్రవరి 11న రామా నంబియార్‌ జైల్లోనే జరిగిన కాల్పుల్లో తుపాకీ గుండుకి మరణించాడు. కొడుకు 16 సార్లు ఈ కాల్పులకు గురి అయ్యాడు. అయినా బతికాడు. చచ్చిపోయాడని అంతా నిర్ధారిం చుకున్నారు. కానీ శారదకేమో అతను బతికే ఉంటా డని ఓ నమ్మకం. సంవత్సరాలు తిరిగిపోతున్నాయి. బంధువులు ఆమెకి బలవంతంగా మరో పెళ్లి చేశారు. మరో ఎనిమిదేళ్లకు నారాయణన్‌ని విడుదల చేశారు. ఎక్కడా పెళ్లాం ఆచూకీ లేదు. అతనూ మరో పెళ్లి చేసుకున్నాడు.

అయితే శారద ఎక్కడో ఒకచోట బతికే ఉన్నదని అతని ఊహ. సంవత్సరాల తర్వాత శారదకు కొడుకు పుట్టాడు. పేరు భగవాన్‌ పరాస్సినిక్కడవు. ఈ కుర్రాడు తన తల్లి ఎప్పుడో తన చిన్నతనంలో జరి గిన సంఘటనల గురించి తల్చుకోవడం విన్నాడు. ఈ మేనకోడలు– అంటే నవలా రచయిత్రి శాంత ఈ కుర్రాడిని కలిసింది. నారాయణన్‌ గురించి చెప్పింది. వాళ్లిద్దరినీ ఒకసారి కలపాలని భగవాన్‌ అనుకు న్నాడు. (‘లవకుశ’లాగ ఉన్నదా) ఎన్నాళ్ల తర్వాత? 72 సంవత్సరాల తర్వాత. ఇప్పుడు నారాయణన్‌ తొంభయ్యో పడిలో ఉన్నాడు. శారద దాదాపు డెబ్బ య్యోపడి. భగవాన్‌ ఇంట్లో వారిద్దరూ కలిశారు. తమ స్వాధీనంలో లేని కారణాలకి వారిద్దరూ జీవి తాల్లో దూరమయ్యారు. వైవాహిక జీవితాలూ అలాగే సాగాయి. అతని నిస్సహాయత ఆమెకి తెలుసు. ఆమె గురించి అతను జైల్లో అప్పుడప్పుడూ తలచుకుని ఆమెకి జరిగిన అన్యాయానికి బాధపడ్డాడేమో తెలీదు. అయితే ఒకరిమీద ఒకరికి దురభిప్రాయాలు లేవు. ఇద్దరూ జీవితం చేతుల్లో పావులు. వారి సమా గమం మొన్న డిసెంబర్‌ 26న. 72 సంవత్సరాల తర్వాత దూరమైన ఇద్దరు– ఆనాటి భార్యాభర్తలు ఏం మాట్లాడుకుంటారు? ఇప్పటి ఆమె కొడుకుకి నారాయణన్‌ ఏ విధంగా కృతజ్ఞత చెప్పుకుంటాడు? మేనకోడలు శాంత ఇప్పుడు మరో కొత్త నవలని రాయాలేమో?!

గొల్లపూడి మారుతీరావు

Advertisement

Related News By Category

Related News By Tags

Advertisement
 
Advertisement

పోల్

Advertisement