బహుముఖ ప్రజ్ఞాశాలి | Balantrapu rajanikantaravu is a Polymath | Sakshi
Sakshi News home page

బహుముఖ ప్రజ్ఞాశాలి

Published Mon, Apr 23 2018 12:16 AM | Last Updated on Mon, Apr 23 2018 12:16 AM

Balantrapu rajanikantaravu is a Polymath - Sakshi

బాలాంత్రపు రజనీకాంతరావు పేరు చెబితే ఆకాశవాణి గుర్తుకొస్తుంది. ఆకాశవాణి పేరు చెబితే రజనీకాంతరావు గుర్తొస్తారు. ప్రారంభదశలో ఆకాశవాణికి జవం, జీవం ఇచ్చిన రూపశిల్పి ఆయన. తొలినాళ్లలో ఆకాశవాణికి దిశానిర్దేశం చేసిన దార్శనికుడాయన. గొప్ప గొప్ప కళాకారుల్ని పరిచయం చేయడమే కాక, భక్తిరంజని వంటి ఎన్నో కార్యక్రమాలను రూపొందించిన సృజనశీలి... సంగీత, సాహిత్య శిఖరాలను అధిరోహించిన వాగ్గేయకారుడు రజనీకాంతరావుతో కొంతకాలం క్రితం సాక్షి ఎడిటోరియల్‌ డైరెక్టర్‌ కె. రామచంద్రమూర్తి జరిపిన ప్రత్యేక సంభాషణ ఇది...

మీ ఆధ్వర్యంలో ఆకాశవాణికి అంతర్జాతీయ అవార్డులూ వచ్చాయి. అప్పుడు మీ అనుభూతి..?
అంతర్జాతీయ రేడియో కార్యక్రమాల పోటీలో మనం కూడా పాల్గొనాలి అని మా డైరెక్టర్‌ జనరల్‌ చెప్పారు. పోటీకి పంపాల్సిన కార్యక్రమాన్ని తయారు చేయమన్నారాయన. అది పిల్లలకు భౌగోళిక శాస్త్రం బోధించే విధంగా ఉండాలని చెప్పారు. అలా ఉండాలి అంటే... పిల్లలకు ఏ నదుల గురించో పర్వతాల గురించో వివరిస్తూ ఉన్నట్టుగా ఓ యాత్రాకథనాన్ని తయారు చేయాలనిపించింది నాకు. దాంతో ‘కొండ నుంచి కడలి దాకా’ అన్న కార్యక్రమానికి రూపకల్పన చేశాను.

నది కొండల్లో పుట్టి సముద్రంలో కలుస్తుంది. ఆ క్రమంలో అది ఎన్నో ప్రాంతాలను స్పృశిస్తుంది. ఫలితంగా ఆయా ప్రాంతాల్లో ఎన్నో మార్పులు వస్తాయి. కాబట్టి నా కార్యక్రమం ద్వారా ప్రజలకీ నదులకూ ఉన్న సంబంధం పిల్లలకు చెప్పినట్టు అవుతుంది అనిపించింది. అందులో అంతర్జాతీయ ఖ్యాతిని గడించడానికి తగిన అన్ని అంశాలూ ఉండటంతో ఊహించనంత పేరు, అవార్డూ వచ్చాయి ఆకాశవాణికి.

స్వాతంత్య్రం వచ్చేనాటికి మీకు ఇరవయ్యేళ్లు. నాటి జ్ఞాపకాలేవైనా మాతో పంచుకుంటారా?
అప్పట్లో బ్రిటిష్‌వాళ్ల ప్రాభవాన్ని చూశాను. స్వాతంత్య్ర ఉద్యమాన్నీ కళ్లారా చూశాను. రేడియోలో కూడా అందరూ ప్రసంగాలు ఇస్తుండేవారు. దుర్గాబాయ్‌ దేశ్‌ముఖ్‌ తన ప్రసంగం పూర్తయ్యాక జైహింద్‌ అనేవారు. అయితే అది ప్రసారం చేసేవాణ్ని కాదు నేను. జైహింద్‌ అనే సమయానికి స్విచ్‌ కట్టేసేవాణ్ని. అది దేశద్రోహం కాదు. ఆవిడ స్వాతంత్య్ర సమరయోధురాలు కాబట్టి అలా అనేది. కానీ నేను స్టేషన్‌ ఇన్‌చార్జిగా అన్నిటినీ సమానంగా చూడాలి కాబట్టి అలా చేసేవాడిని.

మీరు ఎంతోమందిని పరిచయం చేశారు. పైకి తీసుకొచ్చారు. వారిలో మీరు గర్వంగా ఫీలయ్యే మీ శిష్యులెవరు?
పన్నాల సుబ్రహ్మణ్యభట్టు, నేదునూరి కృష్ణమూర్తి, శ్రీపాద పినాకపాణి... వీళ్లు ముగ్గురూ నాకు మంచి శిష్యులు.

సినిమాల్లో అవకాశాలొచ్చినా రేడియోలోనే ఎందుకు కొనసాగారు?
నిజమే. కానీ నేను అప్పటికే రేడియోకి అలవాటు పడిపోయాను. పైగా అందులోనే ఉద్యోగం కాబట్టి వేరే దాని గురించి ఆలోచించడం అంతగా కుదరలేదు. పైగా ఒక రేడియో ఆఫీసర్‌గా నేను చాలా సంతోషాన్ని, గౌరవాన్ని అనుభవించాను. అందుకే నాకు రేడియోని వదిలిపెట్టబుద్ధి కాలేదు.

అప్పటితో పోలిస్తే ఇప్పుడు ఆకాశవాణిలో వచ్చిన మార్పులేంటి?
అప్పట్లో మేము ఏదైనా రాస్తే... అది కచ్చితంగా అందరికీ ఉపయోగపడాలి అని ప్రతిజ్ఞ చేసి రాసేవాళ్లం. ఒకరి కంటే ఒకరు బాగా రాయాలని పోటీ పడేవాళ్లం. కానీ ఇప్పుడలా లేదు.

కేంద్ర సాహిత్య అకాడెమీ అవార్డు, సంగీత నాటక అకాడెమీ అవార్డు... ఈ రెండు అవార్డుల్నీ అందుకున్నవారు దేశం మొత్తంలో మీరొక్కరే. ఆ అనుభూతి గురించి చెప్తారా?
సర్వేపల్లి రాధాకృష్ణన్‌గారు రాష్ట్రపతిగా ఉన్నప్పుడు సాహిత్య అకాడెమీ అవార్డు వచ్చింది. రాధాకృష్టన్‌గారు సాహితీ ప్రియులు. ఆయన వరండాలో ఉన్న ర్యాక్స్‌ నిండా పుస్తకాలే. అవన్నీ దాటుకుని, పైన ఉన్న ఆయన గదిలోకి వెళ్తే... ఆ గది నిండా కూడా పుస్తకాలే.

ఆయన దగ్గర అన్ని ఉన్నా కూడా, నా చేతిలో ఉన్న పుస్తకం ఏంటా అని ఆయన ఆసక్తిగా చూసిన చూపుని నేను మర్చిపోలేను. అప్పుడు నా చేతిలో ఉన్నది ‘ఆంధ్ర వాగ్గేయకారుల చరితము’. దాన్ని తీసుకుని, అందులో ఉన్న ఓ పాటను పాడటం మొదలుపెట్టారాయన. అది మర్చిపోలేని అనుభవం. సంగీత నాటక అకాడెమీ అవార్డు కూడా వచ్చింది. అది కూడా చాలా సంతోషాన్ని కలిగించిన విషయం.

చేయాలనుకుని చేయలేకపోయింది ఏదైనా ఉందా?
జీవితంలో చేయాలనుకున్నవన్నీ చేశాను. ఏ వెలితీ లేదు. ఏ అసంతృప్తీ లేదు.

టంగుటూరి సూర్యకుమారి, రావు బాలసరస్వతి, ఘంటసాల, రాజేశ్వరరావు వంటివాళ్లందరితో మీరు పాటలు పాడించారు. వాళ్లంతా తర్వాత చాలా ఖ్యాతి గడించడం మీకు గర్వంగా అనిపించిందా?
కచ్చితంగా గర్వించదగ్గ విషయమే. ఆగస్ట్‌ పదిహేను, అర్ధరాత్రి నెహ్రూగారి ప్రసంగం ‘ట్రిస్ట్‌ విత్‌ డెస్టినీ’ ప్రసారం పూర్తి కాగానే మద్రాస్‌ స్టేషన్‌లో డి.కె.పట్టమ్మాళ్‌ పాటను, తర్వాత నా పాటను ప్రసారం చేయాలి అనుకున్నారు. ఆ సందర్భం కోసం మంచి దేశభక్తి గీతాన్ని రాసి సూర్యకుమారితో పాడించాను.

శంకరంబాడి సుందరాచారి రాసిన ‘మా తెలుగు తల్లికి మల్లెపూదండ’ పాటను కూడా ఆమె నా ఆధ్వర్యంలోనే పాడింది. ఠాగూర్‌ పుట్టినరోజు కోసం‘ఓ నవ యువకా’ అనే పాట రాశాను. దానిని సరళ అనే ఆవిడతో పాడించాను.

No comments yet. Be the first to comment!
Add a comment
Advertisement

Related News By Category

Related News By Tags

Advertisement
 
Advertisement

పోల్

Advertisement