
మీరిప్పుడు వేధింపుల కథ వింటారు..
*ఆకాశవాణిలో కొందరు పర్మినెంట్ ఉద్యోగుల దౌష్ట్యం
*కాంట్రాక్టు సిబ్బందిపై పెత్తనం
*పోలీసుస్టేషన్‌లో ఫిర్యాదుచేసిన మహిళలు
*నోరెత్తితే ఉద్యోగం ఊడినట్లే
*పట్టించుకోని ఉన్నతాధికారులు
విజయవాడ : నిత్యం జనావళికి వార్తలనందించే ఆకాశవాణి కేంద్రం తాజాగా అదే ఓ వార్తయింది. ఆ విషయాన్ని అది నేరుగా శ్రోతలకు చెప్పకపోయినా ఆనోటా, ఈనోటా పాకి పెద్ద చర్చే జరుగుతోంది. గొప్ప ప్రసారంతోనో, పెద్ద అవార్డు అందుకునో కాదు.. కాంట్రాక్టు సిబ్బందిగా పనిచేస్తున్న మహిళలను వేధించడం ద్వారా కేంద్రం అభాసుపాలవుతోంది.
ఆకాశవాణి కేంద్రంలో పర్మినెంట్ ఉద్యోగులు అడుగడుగునా కాంట్రాక్టు సిబ్బందిపై పెత్తనం చలాయిస్తూ వారిని వేధింపులకు గురిచేస్తున్నారనే ఆరోపణలు వెల్లువెత్తుతున్నాయి. దాదాపు 90 మంది కాంట్రాక్టు సిబ్బంది పనిచేస్తున్నారు. వీరిలో ఎక్కువమంది మహిళలే. వేధిం పులు భరించలేక.. ఎవరికీ చెప్పుకోలేక నరకయాతన అనుభవిస్తున్నామని కొందరు ఉద్యోగినులు వాపోతున్నారు. గతంలో ఇద్దరు మహిళలు ఆత్మహత్యాయత్నానికి పాల్పడ్డారంటే అక్కడున్న పరిస్థితి ఏంటో అర్థం చేసుకోవచ్చు.
వరుస ఫిర్యాదులు.. పర్మినెంట్ న్యూస్‌రీడర్ తనను లైంగిక వేధింపులకు గురిచేశాడంటూ ఒక మహిళా క్యాజువల్ అనౌన్సర్ ఇటీవల సూర్యారావుపేట పోలీస్ స్టేషన్‌లో కేసుపెట్టిన విషయం విదితమే. అప్పట్లో ఆ న్యూస్‌రీడర్‌ను ఆకాశవాణి ఉన్నతాధికారులు తాత్కాలికంగా సస్పెండ్ చేశారు. తాజాగా మరో ఎఫ్‌ఎం జాకీ సైతం ఓ అధికారిపై ఉమెన్ సెల్‌తోపాటు ఢిల్లీలోని ఉన్నతాధికారులకు ఫిర్యాదు చేశారు. ఏడాదిన్నర కిందట కొత్తగా నియమితులైన ఇద్దరు పర్మినెంట్ సిబ్బందిపై పురుష క్యాజువల్ అనౌన్సర్ ఏకంగా భౌతిక దాడికి దిగారు. వారు తన మాట వినడం లేదనే సాకుతోనే ఆయన ఈ దురాగతానికి పాల్పడ్డారు. ఈ ఘటన గురించి ఉన్నతాధికారుల దృష్టికి తీసుకువెళ్లినా పట్టించుకోకపోవడంతో చివరికి వారిద్దరు సూర్యారావుపేట పోలీస్‌స్టేషన్‌లో ఫిర్యాదు చేశారు.
ఆంక్షల చట్రంలో..
పర్మినెంట్ ఉద్యోగుల వేధింపులపై ప్రశ్నిస్తే.. ఇక వారికి ఆకాశవాణిలో అడుగుపెట్టే అవకాశమే ఇవ్వడం లేదని కాంట్రాక్టు సిబ్బంది చెబుతున్నారు. న్యూస్‌రీడర్‌పై కేసు పెట్టిన మహిళా అనౌన్సర్, ఇటీవల మరో అధికారిపై ఫిర్యాదు చేసిన ఎఫ్‌ఎం జాకీకి సైతం కాంట్రాక్టు డ్యూటీలు వేయకుండా ఇబ్బంది పెడుతున్నారని వారు పేర్కొన్నారు. సవాలక్ష ఆంక్షలు పెడుతూ కాంట్రాక్టు సిబ్బంది బానిసలుగా చూస్తున్నారనే ఆరోపణలు వినిపిస్తున్నాయి.
మహిళా అనౌన్సర్లు తమ ముందు సెల్ మాట్లాడకూడదని, అటూఇటూ తిరగకూడదని, ఖాళీగా ఉన్న పర్మినెంట్ ఉద్యోగుల కుర్చీల్లో కూర్చోకూడదంటూ షరతులు విధిస్తూ వేధింపులకు పాల్పడుతున్నారని కాంట్రాక్టు సిబ్బంది వాపోతున్నారు. ఈ గొడవ ముదురుపాకాన పడి మరింత రచ్చ కాకముందే ఉన్నతాధికారులు తగిన చర్యలు తీసుకోవాలని సీనియర్ ఉద్యోగులు కోరుతున్నారు. ఈ ఆరోపణలు, ఫిర్యాదులపై ఆకాశవాణి అధికారులను అడిగితే.. ఎవరికి వారు తమ విభాగాలకు సంబంధం లేదంటూ బదులివ్వడం కొసమెరుపు.