వర్షాకాలం రాబోతోంది. ఇప్పటికే ఆంధ్రప్రదేశ్, తెలంగాణ రాష్ట్రాల్లో అక్కడక్కడ వానలు పడుతున్నాయి. ఈ వర్షాలకు బయళ్లలో పచ్చిగడ్డి మొలుస్తుంది. వర్షపు జల్లులు పడుతున్నప్పుడు జీవాల పాకల్లోనూ, వాటి పరిసరాల్లోనూ రొచ్చు చేరుతుంది. చెరువులు, కుంటల్లోని నీరు కలుషితమవుతుంది. ఇలాంటి పరిస్థితుల్లో జోరీగలు, దోమలు విజృంభిస్తాయి. ఈదురు గాలులు, వర్షపు జల్లుల్లో ఆరుబయట తిరిగే మందల్లోని జీవాల్లో వ్యాధి నిరోధక శక్తి తగ్గుతుంది. బురద నేలల్లో తిరిగే జీవాల కాలిగిట్టలు మెత్తబడతాయి. మరోవైపు వ్యాధులతో చనిపోయిన గొర్రెలు, మేకల్ని రోడ్డు పక్కన, బొందల్లో, పాడుబడిన బావుల్లో, నీటి ప్రవాహాల్లో పడేస్తుంటారు. వర్షాకాలం ప్రారంభంలో, మధ్యలో ఇలాంటి పరిస్థితుల్ని మనం అన్ని చోట్లా చూస్తూనే ఉంటాం.
కొత్త పచ్చికను మేస్తే...
వేసవిలో మేత దొరక్క, అర్థాకలితో అలమటించిన జీవాలు... వర్షాకాలం ప్రారంభంలో ఆరుబయట బీళ్లలో ఇపుడిపుడే మొలకెత్తుతున్న పచ్చికను చూడగానే ఆత్రంగా, కడుపు నిండా తింటాయి. అలాగే వేసవి దాహంతో అల్లాడిపోయిన గొర్రెలు, మేకలు వర్షాకాలంలో దారి పక్కన గుంతలు, కుంటలు, చెరువుల్లో కలుషితమైన నీటిని చూడగానే గబగబా తాగేస్తుంటాయి. ఇవన్నీ సహజమే అయినప్పటికీ జీవాల ఆరోగ్యానికి గొడ్డలిపెట్టుగా పరిణమిస్తాయి. కొత్తగా పెరిగిన పచ్చికను అతిగా మేయడం వల్ల జీవాల శరీరంలో విష పదార్థాలు విడుదలవుతాయి. ఫలితంగా జీవాలు ‘చిటుక’ వ్యాధికి గురవుతాయి. చిటుక వేసేంత సమయంలోనే చనిపోతాయి.
ఈ వ్యాధులూ రావచ్చు
వర్షాకాలంలో దోమలు, పిడుదులు, జోరీగలు ఎక్కువగా వృద్ధి చెందుతాయి. అవి కుట్టిన గొర్రెలకు ‘నీలి నాలుక’ వ్యాధి సోకుతుంది. వ్యాధి సోకిన జీవాల మూతి, పెదవులు, చిగుళ్లు, నాలుక, ముఖం వాచి ఎర్రబడతాయి. నాలుక నీలి రంగుకు మారుతుంది. కొన్ని జీవాలు ‘సర్రా’ వ్యాధి బారిన కూడా పడతాయి. జీవాలు బురద నేలల్లో తిరిగితే వాటి గిట్టల మధ్య చర్మం మెత్తబడి వాచి చిట్లుతుంది. ఆ భాగంలో చీము పడుతుంది. జీవాలు విపరీతమైన నెప్పితో ముందు కాళ్లపై గెంతుతూ నడుస్తాయి. మేత తినవు. అలాగే అక్కడక్కడ జీవాలకు ‘దొమ్మ’ వ్యాధి కూడా సోకవచ్చు. ఈ వ్యాధి సోకిన జీవాలు అకస్మాత్తుగా చనిపోయే ప్రమాదం ఉంది.
వర్షపు జల్లుల్లో ఎక్కువ సమయం తిరిగే జీవాలు న్యుమోనియా, గొంతువాపు వంటి శ్వాసకోశ వ్యాధుల బారిన పడతాయి. చెరువులు, కుంటల్లో నిల్వ ఉన్న నీటిని తాగడం వల్ల, నత్తలు ఉండే ప్రాంతాల్లో మేయడం వల్ల జీవాలకు ‘జలగ’ వ్యాధి వంటి అంతర పరాన్నజీవుల సమస్యలూ వస్తాయి.
ఏం చేయాలి?
చిటుక, గొంతువాపు వంటి వ్యాధులు సోకకుండా ముందుగానే టీకాలు వేయించాలి. బాహ్య పరాన్నజీవుల నిర్మూలనకు బ్యూటాక్స్ వంటి మందుల్ని పిచికారీ చేయాలి. దీనివల్ల నీలి నాలుక, సర్రా వంటి వ్యాధుల్ని నివారించవచ్చు. వర్షాకాలం ప్రారంభంలో పేడ పరీక్ష చేయించి, దాని ఫలితాలను బట్టి నట్టల నివారణ మందుల్ని తాగిస్తే జలగ వ్యాధి సోకదు. కొత్తగా మొలిచిన గడ్డిని జీవాలకు అతిగా మేపకూడదు. ఇంటి దగ్గరే తగినంత తాగునీటిని అందిస్తే జీవాలు ఆరుబయట మురుగు నీటిని తాగాల్సిన అవసరం ఉండదు.
జీవాలను బురద నేలల్లో ఎక్కువగా తిరగనీయకూడదు. సాధ్యమైనంత వరకు పొడి ప్రదేశాల్లో తిరిగేలా చూడాలి. వర్షపు జల్లులు, ఈదురు గాలులు, తుపాన్లకు గురి కాకుండా తగిన చర్యలు తీసుకోవాలి. ముఖ్యంగా పిల్లల విషయంలో ప్రత్యేక శ్రద్ధ తీసుకోవాల్సి ఉంటుంది. జీవాలు విద్యుద్ఘాతానికి గురికాకుండా చూడాలి. ఈ సీజన్‌లో ఏ కారణం చేతనైనా జీవాలు మరణిస్తే లోతైన గొయ్యి తీసి పాతిపెట్టాలి. దీనివల్ల అంటువ్యాధులు వ్యాపించకుండా నివారించొచ్చు.
పాకల్లో...
ఆలపాటికి అవార్డు
ఆంధ్రప్రదేశ్‌కు చెందిన ప్రము ఖ వ్యవసాయ శాస్త్రవేత్త ప్రొఫెసర్ ఆలపాటి సత్యనారాయణకు ఇండియా ఇంటర్నేషనల్ ఫ్రండ్‌షిప్ సొసైటీ రాష్ట్రీయ గౌరవ పురస్కారాన్ని అందజేసింది. న్యూఢిల్లీలో జరిగిన ఒక కార్యక్రమంలో మాజీ గవర్నర్ భీష్మ నారాయణ్ సింగ్ ఈ అవార్డును ప్రదానం చేశారు. భారత వ్యవసాయ రంగానికి, ఆర్థికాభివృద్ధికి అందజేసిన సేవలకు సత్యనారాయణను ఈ అవార్డుకు ఎంపిక చేశారు. ఇంతకుముందు పప్పు ధాన్యాల రంగంలో విశేష కృషి చేసినందుకు భారత వ్యవసాయ పరిశోధనా మండలి ఆయనను ప్రతిష్టాత్మక ‘హుకర్’ పురస్కారంతో గౌరవించింది. సత్యనారాయణ గతంలో లాం ఫామ్ ఏడీఆర్‌గా, ఎన్.జి.రంగా వ్యవసాయ విశ్వవిద్యాలయం విస్తరణ సంచాలకులుగా పనిచేశారు. శ్రీవరి సాగు విధానానికి శ్రీకారం చుట్టిన శాస్త్రవేత్తగా ఆయన అందరికీ సుపరిచితులు.
జీవాల పాకను ప్రతి రోజూ శుభ్రం చేయాలి. దానిని పొడిగా ఉంచాలి. వారానికొకసారి పొడి సున్నం చల్లాలి. పేడ కుప్పల్ని దూరంగా ఏర్పాటు చేసుకోవాలి. పాకల్లోకి గాలి, వెలుతురు ధారాళంగా ప్రసరించేలా చూడాలి. సాయంత్రం వేళ పాకల దగ్గర పొగ పెట్టాలి. వీలైతే ఫ్యాన్లు, లైట్లు వేసి ఉంచాలి. జీవాలు ఇంటికి చేరగానే వాటి ఆరోగ్య పరిస్థితిని పరిశీలించాలి. జీవాలకు తౌడు, మొక్కజొన్న, చెక్క, ఖనిజ లవణ మిశ్రమాన్ని అందించడం ద్వారా వాటి ఆరోగ్యాన్ని కాపాడుకోవచ్చు. మందను వేగంగా వృద్ధి చేయవచ్చు.
-డాక్టర్ సి.హెచ్.రమేశ్, హైదరాబాద్
పాడి-పంట: జల్లుల్లో జీవాలు జర భద్రం!
Published Fri, Jun 13 2014 11:19 PM | Last Updated on Sat, Sep 2 2017 8:45 AM
Advertisement
Advertisement