నారు పోయలేదా? దిగులొద్దు..!
గుడ్లవల్లేరు (కృష్ణా): ఆంధ్రప్రదేశ్, తెలంగాణ రాష్ట్రాల్లో సాధారణంగా జూన్‌లో వరి నారుమడులు పోసుకుంటారు. అయితే జూలై మొదటి పక్షం పూర్తి కావస్తున్నప్పటికీ రెండు రాష్ట్రాల్లోనూ ఇంకా సరైన వర్షపాతం నమోదు కాలేదు. దీనివల్ల ఇప్పట్లో కాలువలకు సాగు నీరు చేరే పరిస్థితులు కన్పించడం లేదు. మరోవైపు వరి సాగు ఇప్పటికే నెల రోజులు ఆలస్యమవడంతో దిగుబడులు తగ్గే అవకాశం ఉంది. ఈ విధంగా పంట సాగు ఆలస్యమైనప్పుడు రైతులు తగిన యాజమాన్య పద్ధతులు పాటించాలి. ముఖ్యం గా స్వల్పకాలిక రకాలను ఎంచుకంటే పంటకా లం కలిసొస్తుంది. ఈ నేపథ్యంలో ఆలస్యంగా వేసుకునేందుకు అనువైన వరి రకాలు, రైతులు చేపట్టాల్సిన యాజమాన్య చర్యలపై కృష్ణా జిల్లా మచిలీపట్నంలోని వ్యవసాయ పరిశోధనా స్థానం శాస్త్రవేత్తలు డాక్టర్ కాకి నాగేంద్రరావు, డాక్టర్ టి.అనురాధ అందిస్తున్న సూచనలు...
ఆంధ్రప్రదేశ్‌లో...
ఆంధ్రప్రదేశ్ రాష్ట్రంలో వరి సాగు ఆలస్యమైతే... కృష్ణా మండలంలోని కృష్ణా, గుంటూరు, ప్రకాశం జిల్లాల రైతులు, గోదావరి మండలంలోని తూర్పు-పశ్చిమ గోదావరి జిల్లాల రైతులు స్వర్ణ, చైతన్య, విజేత, కాటన్‌దొర సన్నాలు రకా లు వేసుకోవాలి. ఉత్తర కోస్తా మండలానికి చెం దిన శ్రీకాకుళం, విజయనగరం, విశాఖపట్నం జిల్లాల రైతులకు వసుంధర, సురక్ష, వంశి, కాట న్‌దొర సన్నాలు అనువుగా ఉంటాయి. దక్షిణ మండలంలోని నెల్లూరు, చిత్తూరు, వైఎస్‌ఆర్ జిల్లాల రైతులు స్వర్ణముఖి, సత్య, అపూర్వ రకాలను ఎంచుకోవాలి. ఇక వర్షపాతం తక్కువగా ఉండే కర్నూలు, అనంతపురం జిల్లాల రైతులకు సాంబమసూరి, సోనా మసూరి, నంద్యాల సన్నాలు, సత్య, సోమశిల రకాలు అనువుగా ఉంటాయి.
తెలంగాణలో...
తెలంగాణ రాష్ట్రంలో వరి సాగు ఆలస్యమైన పక్షంలో ఉత్తర తెలంగాణ మండలంలోని కరీంనగర్, నిజామాబాద్, ఆదిలాబాద్ జిల్లాల రైతులు కేశవ, సురేఖ, పోతన, భద్రకాళి, ఇందూర్ సాం బ, శివ, ఎర్రమల్లెలు రకాలను ఎంచుకోవాలి. మధ్య తెలంగాణ మండలానికి చెందిన వరంగల్, ఖమ్మం, మెదక్ జిల్లాల రైతులకు కావ్య, సురేఖ, ఎర్రమల్లెలు, సత్య, తెల్లహంస రకాలు అనువుగా ఉంటాయి. దక్షిణ తెలంగాణ మండలంలోని మహబూబ్‌నగర్, రంగారెడ్డి, నల్గొండ జిల్లాల రైతులు సురేఖ, ఎర్రమల్లెలు, సత్య, తెల్లహంస, కృష్ణహంస, రాజవడ్లు రకాలు వేయాలి.
ఏం చేయాలి?
వాతావరణ పరిస్థితులు అనుకూలంగా ఉంటే రెండు రాష్ట్రాల్లోనూ జూన్ 15వ తేదీ లోగా నారుమడులు పోసుకొని, జూలై 15వ తేదీ నాటికి నాట్లు వేసుకోవాలి. అయితే ఈ సంవత్సరం వర్షాభావ పరిస్థితుల కారణంగా పంట సాగు ఆలస్యమవుతోంది. కాబట్టి రైతులు ఇప్పుడు కొన్ని యాజమాన్య పద్ధతులను పాటించాలి. నారుమడుల్లో నీరు తక్కువైతే ప్రతి 4 సెంట్ల నారుమడికి కిలో చొప్పున మ్యురేట్ ఆఫ్ పొటాష్ వేసుకోవాలి. దీనివల్ల మొక్కలు నీటి ఎద్దడిని తట్టుకొని, దృఢంగా పెరుగుతాయి. 50 రోజుల వయసు దాటిన మధ్యకాలిక రకాల నారు, 60 రోజుల వయసు దాటిన దీర్ఘకాలిక రకాల నారు నాటేందుకు పనికిరాదు. అలాంటి పరిస్థితుల్లో స్వల్పకాలిక రకాలను ఎంపిక చేసుకొని, నారు పోసుకోవడం మంచిది. నారు పీకడానికి వారం రోజుల ముందు సెంటు నారుమడిలో 160 గ్రాముల చొప్పున కార్బోఫ్యూరాన్ గుళికలు వేసి, రెండు రోజుల పాటు నీటిని నిలగట్టాలి. లేదా నారు మొక్కలను తీసిన తర్వాత వాటిని ముందుగా క్లోరిపైరిఫాస్ మందు ద్రావణంలో ముంచి ఆ తర్వాత నాటాలి. ఒక్కో కుదురుకు 3-4 మొక్కలు నాటుకోవాలి.
ఎంత ఆలస్యమైనప్పటికీ సెప్టెంబర్ మొద టి వారానికి నాట్లు వేయడం పూర్తయ్యేలా ప్రణాళికను రూపొందించుకోవాలి. ఆ సమయం దాటే లా ఉంటే వేరే పంటను ఎంచుకోవాలి. నారుమడిలో ఇనుప ధాతు లోపం, ప్రధాన పొలంలో జింక్ లోపం కన్పిస్తే వాటి నివారణకు మందులు పిచికారీ చేసుకోవాలి. నారుమడి పైన, ప్రధాన పొలం పైన హిస్పా, ఉల్లికోడు, దీపపు పురుగులు దాడి చేసే అవకాశం ఉంది. కాబట్టి తగిన మందులు పిచికారీ చేసి వాటిని నివారించాలి. నీటి ఎద్దడి ఏర్పడితే కలుపు మొక్కల బెడద కూ డా అధికంగానే ఉంటుంది. వాటిని కూడా సకాలంలో నిర్మూలించేందుకు మందులు వాడాలి.
ముదురు నారు నాటాల్సి వస్తే...
ఒకవేళ ముదురు నారు నాటాల్సి వస్తే కుదుళ్ల సంఖ్యను పెంచాలి. ఒక్కో కుదురుకు 4-5 మొక్కలు నాటాలి. నత్రజని ఎరువును సిఫార్సు చేసిన మోతాదు కంటే 25% పెంచాలి. సాధారణంగా నత్రజనిని మూడు దఫాలుగా వేస్తారు. అయితే ముదురు నారు నాటినప్పుడు రెండు దఫాలుగా... సిఫార్సు చేసిన మోతాదులో 70% దమ్ములోనూ, మిగిలిన 30% అంకురం దశలోనూ... వేసుకోవాలి.
త్వరగా విత్తుకోండి
గత కొద్ది రోజులుగా ఆంధ్రప్రదేశ్, తెలంగాణ రాష్ట్రాల్లోని పలు ప్రాంతాల్లో ఓ మోస్తరు నుంచి భారీ వర్షాలు పడుతున్నాయి. రాబోయే 3-4 రోజుల్లోనూ వర్షాలు కురిసే అవకాశం ఉన్నదని వాతావరణ నిపుణులు చెబుతున్నారు. ఈ వర్షాలను ఆసరాగా చేసుకొని రైతులు పత్తి, మొక్కజొన్న, వేరుశనగ, సొయాచిక్కుడు వంటి పంటల విత్తనాలను త్వరగా వేసుకోవాలి. కూరగాయ పంటల నారుమడులు పోసుకోవాలి. విత్తనాలు విత్తుకోవాలి. బీటీ పత్తి విత్తనాలు విత్తేటప్పుడు ఎకరానికి 20-24 కిలోల భాస్వరాన్ని అందించే ఎరువును వేయాలని రాజేంద్రనగర్‌లోని వ్యవసాయ వాతావరణ పరిశోధనా కేంద్రం వారు సూచిస్తున్నారు.