మళ్లీ భగభగలు! | peoples are suffering with increasing temperature | Sakshi
Sakshi News home page

మళ్లీ భగభగలు!

Published Fri, Jul 4 2014 1:53 AM | Last Updated on Sat, Sep 2 2017 9:46 AM

మళ్లీ భగభగలు!

మళ్లీ భగభగలు!

 ఉత్తరాదిన వర్షాలు, దక్షిణాదిన ఉక్కపోతలు  తెలంగాణ, ఏపీలలో భారీ ఉష్ణోగ్రతలు
 
సాక్షి, విశాఖపట్నం/న్యూఢిల్లీ:  ఢిల్లీతోసహా ఉత్తరాది ప్రాంతాల్లో రెండురోజులుగా వర్షాలు కురుస్తుండగా.. దక్షిణాదిన ముఖ్యంగా తెలంగాణ, ఆంధ్రప్రదేశ్‌లకు మాత్రం ఉక్కపోత పెరుగుతోంది. గత మూడు రోజులుగా అనేకచోట్ల ఉష్ణోగ్రతలు సాధారణం కంటే 5-8 డిగ్రీలు అధికంగా నమోదవుతున్నాయి. వీటికి తోడు వడగాడ్పులు కూడా వీస్తుండటంతో కొన్నిచోట్ల జనాలు బయటికి వచ్చేందుకే జంకుతున్నారు.

తెలంగాణలో ఖమ్మం, మెదక్, అదిలాబాద్, కరీంనగర్, వరంగల్ జిల్లాల్లో, ఆంధ్రప్రదేశ్‌లో కృష్ణా, గుంటూరు, ప్రకాశం జిల్లాల్లోని పలు ప్రాంతాల్లో వడగాడ్పులు తీవ్రంగా వీస్తున్నాయి. రెండు రాష్ట్రాల్లోనూ మరో రెండురోజుల పాటు ఇవే పరిస్థితులుంటాయని వాతావరణ నిఫుణులు చెబుతున్నారు. దక్షిణాయనంలో భానుడి ప్రభావం ఎక్కువ కావడం, దీనికితోడు రుతుపవనాలు బలహీనంగా ఉండటమే ఈ దుర్భర వాతావరణ పరిస్థితులకు కారణమని అంటున్నారు.
 
రుతుపవనాలు చురుగ్గా ఉంటే వర్షాలు కురవకపోయినా ఆకాశం మేఘావృతమై ఉష్ణోగ్రతలు తగ్గేవని, కానీ ప్రస్తుతం ఆ పరిస్థితులూ కనిపించడం లేదని పేర్కొంటున్నారు. అలాగే ఉత్తర బంగాళాఖాతంలో ఏర్పడ్డ అల్పపీడనం పశ్చిమ దిశగా కదిలి పశ్చిమ బెంగాల్, బీహార్, జార్ఖండ్‌లపై ప్రభావం చూపుతోందని వాతావరణ శాఖ వెల్లడించింది. దీని ప్రభావం తెలంగాణ, ఏపీలపై పూర్తిగా లేదని పేర్కొంది. ఒడిశా నుంచి కోస్తాంధ్ర, తెలంగాణ  మీదుగా దక్షిణ తమిళనాడు వరకూ అల్పపీడన ద్రోణి స్థిరంగా కొనసాగుతోందని, దీని ప్రభావంతో ఒకటి రెండు చోట్ల వర్షాలు పడే అవకాశాలున్నాయని తెలిపింది. కాగా, దేశ రాజధాని ఢిల్లీ, ఉత్తరాది ప్రాంతాలకు నైరుతి రుతుపవనాలు గురువారం నాలుగు రోజులు ఆలస్యంగా విస్తరించాయి.
 
ఢిల్లీ, ఉత్తరాదిన అనేక ప్రాంతాల్లో బుధవారం నుంచి వర్షాలు కురుస్తున్నాయని, అరేబియా సముద్రం, బంగాళాఖాతం నుంచి తగినంత తేమ, గాలులు ఉత్తరాదికి అందుతున్నాయని భారత వాతావరణ విభాగం వెల్లడించింది. అయితే రాజస్థాన్‌లో సాధారణంగా జూలై 15న రుతుపవనాలు ప్రవేశిస్తాయని, కానీ అక్కడ నైరుతి ముందుగానే పలకరించిందని ఐఎండీ తెలిపింది. మరోవైపు మధ్యప్రదేశ్, గుజరాత్, బుందేల్‌ఖండ్‌లలో జూన్ 10-16 మధ్యనే రుతుపవనాలు బాగా విస్తరించాల్సి ఉండగా.. ఇప్పటివరకూ దాదాపుగా వర్షాలే లేవ ని వెల్లడించింది. అలాగే జూన్‌లో దేశవ్యాప్తంగా అంచనాల కంటే 42 శాతం తక్కువ వర్షపాతం నమోదైనట్లు పేర్కొంది.
 
చిలుకూరులో వరుణ జపం
వర్షాలు సమృద్ధిగా కురవాలని చిలుకూరు బాలాజీ దేవాలయం ఆధ్వర్యంలో పన్నెండుమంది వేదపండితులతో గురువారం ఆలయ సమీపంలోని గండిపేట చెరువులో వరుణ జపం చేపట్టారు. కలశాల్లో స్వామివారి తీర్థ ప్రసాదాలను తీసుకువెళ్లి చెరువులో కలిపి వరుణ జపం ప్రారంభించారు. నాభి (నడుము భాగం) వరకు నీటిలో నిల్చుని పన్నెండు మంది వేదపండితులు మంత్రోచ్చారణలతో వరుణ జపం చేశారు. చెరువులో నుంచి కలశాలతో నీటిని తీసుకువచ్చి గరుత్మంతుడికి అభిషేకం చేశారు.

భక్తులు వర్షాల కోసం అదనంగా రెండు ప్రదక్షిణలు చేశారు. వర్షాలు లేక దేశం కరువు కోరల్లోకి వెళ్తుందన్న సంకేతాలు వస్తున్న ప్రస్తుత తరుణంలో ప్రతి ఒక్కరూ ఎక్కడికక్కడ దేవాలయాల్లో పూజలు చేయాలని చిలుకూరు బాలాజీ దేవాలయం మేనేజింగ్ కమిటీ చైర్మన్ సౌందరరాజన్ సూచించారు.

Advertisement

Related News By Category

Related News By Tags

Advertisement
 
Advertisement
Advertisement