వడదెబ్బకు 17 మంది మృతి
సాక్షి, విశాఖపట్నం: ఛత్తీస్‌గఢ్ నుంచి కోస్తాంధ్ర మీదుగా తమిళనాడు వరకు బలహీనమైన అల్పపీడన ద్రోణి స్థిరంగా కొనసాగుతోంది. దీని ప్రభావంతో ఆంధ్రప్రదేశ్, తెలంగాణల్లో ఒకటి రెండు చోట్ల ఉరుములతో కూడిన వర్షాలు కురిసే అవకాశాలున్నట్టు వాతావరణ శాఖ వెల్లడించింది. నైరుతి రుతుపవనాలు రాష్ట్రవ్యాప్తంగా విస్తరించి మూడు రోజులవుతున్నా.. ఉష్ణోగ్రతల్లో తేడా మినహా పెద్దగా చెప్పుకోదగ్గ మార్పులు కనిపించట్లేదు. రుతుపవనాలు చురుగ్గా లేకపోవడమే వర్షాలు పడకపోవడానికి కారణమని వాతావరణ నిపుణులు చెబుతున్నారు. నైరుతి తీవ్రతకు ఆశించిన స్థాయిలో వాతావరణం సహకరించటంలేదని తెలిపారు. మరోవైపు దక్షిణ కోస్తా మీద గంటకు 45 నుంచి 50 కిలోమీటర్ల వేగంగా పశ్చిమ దిశగా గాలులు వీస్తున్నట్టు పేర్కొన్నారు.
వర్షపాతం వివరాలు
శుక్రవారం సాయంత్రం నుంచి శనివారం సాయంత్రం వరకు 24 గంటల్లో రాయలసీమలోని ఆత్మకూరులో 2 సెం.మీ., తెలంగాణలోని జూరాల ప్రాజెక్టు వద్ద 2 సెం.మీ., బయ్యారం, మగనూర్, ఖమ్మంలో ఒక్కో సెం.మీ. చొప్పున వర్షపాతం నమోదైనట్టు భారత వాతావరణ శాఖ వెల్లడించింది. గరిష్ట ఉష్ణోగ్రత తునిలో 41 డిగ్రీలుగా నమోదయింది. మచిలీపట్నంలో 40.6 డిగ్రీలు, విజయవాడ 40, నెల్లూరు, ఒంగోలుల్లో 39.8 డిగ్రీల వంతున, తిరుపతి 39.6, కాకినాడ 38.5, కర్నూలు 36.9, హైదరాబాద్ 36.3, రామగుండం 36.2, అనంతపురం 35.3, విశాఖపట్నం 35.2, కళింగపట్నం 34.4, నిజామాబాద్‌లో 33 డిగ్రీల ఉష్ణోగ్రతలు నమోదయ్యాయి. మరోవైపు రాష్ట్రవ్యాప్తంగా శనివారం వడదెబ్బకు గురై 17 మంది మరణించారు. ప్రకాశం జిల్లాలో తొమ్మిదిమంది, కృష్ణా, చిత్తూరు జిల్లాల్లో ముగ్గురు వంతున, వైఎస్సార్ జిల్లాలో ఇద్దరు వడదెబ్బతో ప్రాణాలు కోల్పోయారు.