చిన్న రైతుకు పెద్ద వరం!
రసాయన ఎరువుల్ని విచక్షణారహితంగా వినియోగించడం వల్ల అనేక అనర్థాలు చోటుచేసుకుంటున్నాయి. వీటి బారి నుంచి పంటల్ని కాపాడుకోవాలంటే సేంద్రియ ఎరువుల వినియోగం తప్పనిసరి. ప్రపంచ వాణిజ్య ఒప్పందం నేపథ్యంలో విదేశాల నుంచి ఎదురవుతున్న పోటీని తట్టుకొని, నాణ్యమైన వ్యవసాయోత్పత్తుల్ని అందించడానికి కూడా వీటి వాడకం అవసరమే.
వర్మి కంపోస్ట్ ద్వారా...
గతంలో రైతులు పశువులు/జీవాల ఎరువు, కంపోస్ట్, వేప/వేరుశనగ చెక్క వంటి సేంద్రియ ఎరువులు బాగా వాడేవారు. అయితే ఇప్పుడు వాటి లభ్యత నానాటికీ తగ్గిపోతోంది. ఇలాంటి పరిస్థితుల్లో... పరిమితంగా లభిస్తున్న సేంద్రియ పదార్థాల్ని ఉపయోగించి తక్కువ పెట్టుబడి-శ్రమతో సేంద్రియ ఎరువుల్ని తయారు చేసుకోవాల్సిన అగత్యం ఏర్పడింది. అధిక పోషక విలువలు కలిగిన వర్మి కల్చర్ ద్వారా మాత్రమే ఇది సాధ్యపడుతుంది.
పనికిరాని సేంద్రియ వ్యర్థ పదార్థాల్ని వానపాముల సాయంతో సారవంతమైన ఎరువుగా మార్చడాన్నే వర్మి కంపోస్ట్ అంటారు. వానపాములు సేంద్రియ వ్యర్థ పదార్థాల్ని ఆహారంగా తీసుకొని జీవిస్తూ, మట్టిని సారవంతం చేస్తాయి. వర్మి కంపోస్ట్ తయారీకి భూమి పైపొరల్లో సంచరించే వానపాములు అనువుగా ఉంటాయి.
వర్మి బెడ్ అంటే...
ప్రస్తుతం అమలులో ఉన్న వివిధ పద్ధతుల ద్వారా వర్మి కంపోస్ట్‌ను తయారు చేయడం ఖర్చుతో కూడుకున్న పని. అయితే చిన్న, సన్నకారు రైతులు తక్కువ ఖర్చుతోనే నాణ్యమైన వానపాముల ఎరువును సులభంగా తయారు చేసుకునే అవకాశం ఉంది. ఒక్క మాటలో చెప్పాలంటే ఈ పద్ధతి వారికో పెద్ద వరం. అదే పోర్టబుల్/మొబైల్ ‘వర్మి బెడ్’. దీనికి ఎక్కడికైనా తీసికెళ్లవచ్చు. మనకు అనువైన స్థలంలో, తేలికగా అమర్చుకోవచ్చు. మొబైల్ వర్మి బెడ్‌ను వ్యవసాయ శాఖ సబ్సిడీ మీద రైతులకు అందజేస్తోంది. 12 అడుగుల పొడవు, 4 అడుగుల వెడల్పు, 2 అడుగుల ఎత్తు ఉండేలా వర్మి బెడ్‌ను తయారు చేస్తారు. ఇది దృఢంగా ఉంటుంది కాబట్టి చినిగిపోదు.
ఎండ, వానల్ని తట్టుకుంటుంది. అన్ని వైపుల నుంచి లోపలికి గాలి తగులుతుంది. ఒక్కో వర్మి బెడ్ నుంచి 45-60 రోజుల్లో 1.5 టన్నుల కంపోస్ట్ తయారవుతుంది. వ్యవసాయాధికారుల సూచనల మేరకు వర్మి బెడ్లను అమర్చుకోవాలి. వర్మి కంపోస్ట్ తయారీకి పశువులు/జీవాల ఎరువు, కలుపు మొక్కలు, కూరగాయలు/పండ్ల వ్యర్థాలు, వివిధ పంటల వ్యర్థాలు అవసరమవుతాయి. అయితే ఇనుము, గాజు, రాయి, పాలిథిన్, సింథటిక్ వంటి వాటిని వాడకూడదు.
ఏం చేయాలి?
బెడ్ అడుగున ఎండుటాకులు, గడ్డి, చెత్తాచెదారం వంటి వ్యర్థాల్ని 15 సెంటీమీటర్ల మందాన వేయాలి. వాటి మీద బాగా కుళ్లిన పశువులు/జీవాల ఎరువును 15 సెంటీమీటర్ల మందంతో రెండో పొరగా వేసుకోవాలి. పశువుల మూత్రంలో పశువుల ఎరువు కలిపి, దానిని ఆ పొర మీద చల్లుకోవాలి. దానిని 2 రోజుల పాటు అలాగే ఉంచాలి. ఆ తర్వాత ఒక చదరపు మీటరుకు వెయ్యి వానపాముల చొప్పున వదలాలి. వాటి పైన పాక్షికంగా కుళ్లిపోయిన సేంద్రియ పదార్థాల్ని 20 సెంటీమీటర్ల మందాన పరవాలి.
బెడ్‌లో వానపాముల్ని వదిలిన తర్వాత ప్రతి రోజూ కొద్దికొద్దిగా నీరు చల్లుతూ ఉండాలి. బెడ్‌లో 30-40% తేమ ఉండాలి.
తేమను కాపాడటానికి, పక్షుల దాడి నుంచి వానపాముల్ని రక్షించుకోవడానికి బెడ్ పైన పాత గోనె సంచులు/వరిగడ్డిని పరవాలి. 45-60 రోజుల్లో తయారయ్యే వర్మి కంపోస్ట్ నల్లగా, తేలికగా ఉంటుంది. ఎలాంటి చెడు వాసన రాదు. వానపాములు పైకి వస్తాయి. అప్పుడు బెడ్ పైన 3-4 రోజుల పాటు నీటిని చల్లితే వానపాములు తేమ కోసం బెడ్ అడుగు భాగానికి చేరుకుంటాయి. ఈ విధంగా సంవత్సరానికి 5-6 సార్లు వర్మి కంపోస్ట్‌ను తయారు చేసుకోవచ్చు. ఇందులో సేంద్రియ కర్బనం, నత్రజని, భాస్వరం, పొటాషియం, కాల్షియం, మెగ్నీషియం, గంధకం, ఇనుము, రాగి, జింక్ వంటి పోషకాలు లభిస్తాయి.
ఎలా వాడాలి?
వరి నాట్లు వేసిన తర్వాత ఎకరానికి టన్ను వర్మి కంపోస్ట్ వేసుకోవాలి. పత్తి, మిరప, మొక్కజొన్న పసుపు పంటల్లో టన్ను, చెరకు, పొద్దుతిరుగుడు పంటల్లో 1.5 టన్నులు, బెండ, టమాటా, వంగ పైర్లలో 1-1.5 టన్నుల వర్మి కంపోస్ట్‌ను దుక్కిలో వేయాలి. మామిడి, కొబ్బరి, నిమ్మ, దానిమ్మ తోటల్లో చెట్లు నాటేటప్పుడు ఒక్కో చెట్టుకు 2 కిలోలు, 1-5 ఏళ్ల వయసున్న చెట్టుకు 5 కిలోలు, 6-9 ఏళ్ల వయసున్న చెట్టుకు 10 కిలోలు, పదేళ్ల పైబడిన చెట్టుకు 20 కిలోల చొప్పున వర్మి కంపోస్ట్ వేసుకోవచ్చు.
ఉపయోగాలెన్నో...
వర్మి కంపోస్ట్ నేలను గుల్లబరుస్తుంది. భూసారాన్ని పెంచుతుంది. మొక్కలు ఆరోగ్యవంతంగా పెరగడానికి దోహదపడుతుంది. వాటికి చీడపీడల్ని తట్టుకునే సామర్థ్యం చేకూరుతుంది. పంట దిగుబడి, నాణ్యత పెరుగుతాయి. నేలకు నీటిని పట్టి ఉంచే సామర్ధ్యం కూడా పెరుగుతుంది.
వర్మి వాష్‌ను ఎలా వాడాలంటే...
వర్మి బెడ్ నుంచి వర్మి వాష్ అనే ద్రవ పదార్థాన్ని కూడా సేకరించవచ్చు. దీనిని 4-5 లీటర్ల నీటిలో లీటరు కలిపి పంటపై పిచికారీ చేసుకోవచ్చు. లేదా లీటరు వర్మివాష్, లీటరు ఆవు మూత్రాన్ని 10 లీటర్ల నీటిలో కలిపి పిచికారీ చేయవచ్చు. దీనివల్ల మొక్కలు ఏపుగా పెరుగుతాయి. చీడపీడల్ని తట్టుకునే సామర్ధ్యాన్ని పొందుతాయి.
డాక్టర్ ఎన్.మల్లిఖార్జునరావు
పోగ్రాం కో-ఆర్డినేటర్
ఎం.స్వాతి, రిసెర్చ్ అసోసియేట్
కృషి విజ్ఞాన కేంద్రం, వైరా, ఖమ్మం జిల్లా