రకాల ఎంపికే కీలకం | Crucial in the selection of seeds for Groundnut cultivation | Sakshi
Sakshi News home page

రకాల ఎంపికే కీలకం

Published Tue, Jun 17 2014 11:41 PM | Last Updated on Sat, Sep 2 2017 8:57 AM

రకాల ఎంపికే కీలకం

రకాల ఎంపికే కీలకం

పాడి-పంట: కడప (అగ్రికల్చర్): మరో నాలుగైదు రోజుల్లో ఆంధ్రప్రదేశ్, తెలంగాణ రాష్ట్రాల్ని తొలకరి జల్లులు పలకరించబోతున్నాయి. వర్షాలు పడిన వెంటనే రైతులు పొలాల్లో వేరుశనగ విత్తనాలు వేసుకుంటారు. రకాన్ని బట్టి ఎకరానికి 50-60 కిలోల విత్తనాలు అవసరమవుతాయి. మేలైన రకాల్ని ఎంపిక చేసుకొని, పంటకాలంలో తగిన యాజమాన్య-సస్యరక్షణ చర్యలు చేపట్టినట్లయితే అధిక, నాణ్యమైన దిగుబడులు పొందవచ్చునని ఊటుకూరులోని వైఎస్సార్ జిల్లా కృషి విజ్ఞాన కేంద్రం కో-ఆర్డినేటర్ డాక్టర్ భాస్కర పద్మోదయ సూచిస్తున్నారు. ఈ నేపథ్యంలో వేరుశనగ సాగుకు అనువైన రకాలు, వాటి ప్రత్యేకతలపై ఆయన అందిస్తున్న వివరాలు...
 
 అనువైన ‘తిరుపతి’ రకాలు
 తిరుపతి-1 రకం పంటకాలం 100 రోజులు. ఎకరానికి 7.2-8 క్వింటాళ్ల దిగుబడి వస్తుంది. బెట్ట పరిస్థితుల్ని తట్టుకుంటుంది. ఇది కోస్తా ప్రాంతంలోని ఇసుక భూములకు అనువైనది. తిరుపతి-2 రకం పంటకాలం 105 రోజులు. ఎకరానికి 6.4-8 క్వింటాళ్ల దిగుబడి వస్తుంది. ఊడలు గట్టిగా ఉంటాయి. ఇది తేలికపాటి బంక నేలలకు అనువైన రకం. నులి పురుగును కొంత వరకు తట్టుకుంటుంది. తిరుపతి-4 రకం 105 రోజుల్లో చేతికి వస్తుంది. ఎకరానికి 8-10 క్వింటాళ్ల దిగుబడి అందిస్తుంది. వర్షాభావ పరిస్థితుల్ని కొంత వరకు తట్టుకోగలదు.
 
 ఈ ‘కదిరి’ రకాలు వేసుకోవచ్చు
 కదిరి-6 రకం పంటకాలం 100 రోజులు. కదిరి-9 రకం పంటకాలం 105-110 రోజులు. ఆకుమచ్చ తెగులును తట్టుకుంటుంది. ఆలస్యం గా వర్షాలు కురిసే ప్రాంతాలతో పాటు అధిక వర్షాలు కురిసే ప్రాంతాలకూ అనువైన చిన్న గుత్తి రకం. విత్తనాలకు 30 రోజుల నిద్రావస్థ ఉంటుంది. ఈ రకం రసం పీల్చే పురుగుల్ని తట్టుకోగలదు. కదిరి-8 (బోల్డ్-లావు కాయలు) పంటకాలం 120-125 రోజులు. వర్షాలు బాగా కురిసే ప్రాంతాల్లోనూ, నీటి సౌకర్యం ఉన్న ప్రాంతాల్లోనూ వేసుకోవచ్చు. ఈ రకం ఆకుమచ్చ తెగులును తట్టుకుంటుంది.
 కదిరి-7 (బోల్డ్) రకం పంటకాలం 110 - 120 రోజులు. ఆకుమచ్చ తెగులును తట్టుకుం టుంది. అయితే ఇది ఎక్కువ వర్షపాతం కురిసే ప్రాంతాలకు అనువైన రకం కాదు. కదిరి హరి తాంధ్ర రకం పంటకాలం 105-110 రోజులు. బెట్ట పరిస్థితులతో పాటు తామర పురుగుల్ని, ఆ కుమచ్చ తెగులును తట్టుకుంటుంది. పైరు పక్వ దశకు వచ్చే వరకు ఆకుపచ్చగా ఉండి, ఎక్కువ పశుగ్రాసాన్ని అందిస్తుంది. కదిరి రకాలన్నీ ఎకరానికి 8-10 క్వింటాళ్ల దిగుబడిని ఇస్తాయి.
 
 ‘ఐసీజీవీ’ రకాల్లో అనువైనవి
 ఐసీజీవీ-91114 రకం పంటకాలం 100 రోజులు. ఎకరానికి 8.2 క్వింటాళ్ల దిగుబడి ఇస్తుంది. తొందరగా నూర్పిడికి వస్తుంది. పంట మధ్యలో, చివర్లో బెట్ట పరిస్థితులు ఎదురైనప్పటికీ తట్టుకుంటుంది. ఐసీజీవీ-00350 రకం పంటకాలం 105-110 రోజులు. ఎకరానికి 8-9 క్వింటాళ్ల దిగుబడి ఇస్తుంది. బెట్ట పరిస్థితుల్ని, ఆకుమచ్చ తెగులును తట్టుకుంటుంది.
 
 అనువైన జేసీజీ-జేఎల్-టీయంవీ రకాలు
 జేసీజీ-88 రకం పంటకాలం 105-110 రోజులు. ఎకరానికి 6 క్వింటాళ్ల దిగుబడి ఇస్తుంది. ఆకుమచ్చ తెగులును తట్టుకుంటుంది. జేఎల్-24 రకం పంటకాలం 100-105 రోజులు. ఎకరానికి 6-7 క్వింటాళ్ల దిగుబడి ఇస్తుంది. మంచి వర్షపాతం, నీటి వసతి ఉన్న ప్రాంతాలకు అనుకూలంగా ఉంటుంది. గింజలు పెద్దవిగా ఉంటాయి. ఇది అన్ని ప్రాంతాలకూ అనువైనది. టీఎంవీ-2 రకం పంటకాలం 90-110 రోజులు. ఎకరానికి 6-7 క్వింటాళ్ల దిగుబడి ఇస్తుంది. ఇది కూడా అన్ని ప్రాంతాలకూ అనువైనది. ఈ మూడూ చిన్న గుత్తి రకాలే.
 
 ఈ రకాలూ వేసుకోవచ్చు
నారాయణి రకం పంటకాలం 100 రోజులు. ఎకరానికి 8-10 క్వింటాళ్ల దిగుబడి వస్తుంది. మొక్కలో అన్ని కాయలూ ఒకేసారి పక్వానికి వస్తాయి. గింజ లేత ఎరుపు రంగులో ఉంటుంది. అభయ రకం పంటకాలం 105-110 రోజులు. ఎకరానికి 9 క్వింటాళ్ల దిగుబడి ఇస్తుంది. ఈ పొట్టి రకం బెట్టను తట్టుకుంటుంది. దీని నీటి వినియోగ సామర్ధ్యం ఎక్కువ. దీనిలో మూడు గింజల కాయలు ఎక్కువగా ఉంటాయి. ఈ రకం తిక్కా ఆకుమచ్చ తెగులును తట్టుకుంటుంది. ప్రసూన రకం 105-110 రోజుల్లో కోతకు వస్తుంది. ఎకరానికి 14-16 క్వింటాళ్ల దిగుబడి ఇస్తుంది. కాళహస్తి తెగులును కొంత వరకు తట్టుకోగలదు.
 
 అనంత రకం పంటకాలం 105-110 రోజులు. ఎకరానికి 8-10 క్వింటాళ్ల దిగుబడి ఇస్తుంది. కోస్తాలోని ఇసుక నేలలకు కూడా అనువైనది. ఈ చిన్న గుత్తి రకం బెట్ట పరిస్థితులతో పాటు రసం పీల్చే పురుగుల్ని, ఆకుమచ్చ తెగులును తట్టుకుంటుంది. రోహిణి రకం పంటకాలం 95-100 రోజులు. ఎకరానికి 8-10 క్వింటాళ్ల దిగుబడి ఇస్తుంది. తగినన్ని వర్షాలు కురిసే ప్రాంతాలకు, నీటి పారుదల సౌకర్యం ఉన్న భూములకు అనువుగా ఉంటుంది.
 భీమ రకం పంటకాలం 110-120 రోజులు. ఎకరానికి 10-12 క్వింటాళ్ల దిగుబడి ఇస్తుంది. గింజలు లావుగా ఉంటాయి. నీటి వసతి ఉన్న ప్రాంతాలకు అనువుగా ఉంటుంది. ధరణి రకం పంటకాలం 100-105 రోజులు. ఎకరానికి 6-10 క్వింటాళ్ల దిగుబడి ఇస్తుంది. ఇది చిన్న గుత్తి రకం. బెట్టను తట్టుకోగలదు.
 వేరుశనగ రకాలకు సంబంధించిన అదనపు సమాచారం కోసం తిరుపతిలోని ప్రాంతీయ వ్యవసాయ పరిశోధనా స్థానాన్ని (ఫోన్ : 0877-2248739) లేదా అనంతపురం జిల్లా కదిరిలోని వ్యవసాయ పరిశోధనా స్థానాన్ని (ఫోన్: 08494-221180) ఆయా ఫోన్ నెంబర్లలో కార్యాలయ పనివేళల్లో సంప్రదించవచ్చు.

Advertisement

Related News By Category

Related News By Tags

Advertisement
 
Advertisement
Advertisement