నారుమడిని నష్టపరిచే పురుగులివే
పెనుగొండ (పశ్చిమ గోదావరి): ఆంధ్రప్రదేశ్, తెలంగాణ రాష్ట్రాల్లో కొంతమంది రైతులు ఇప్పటికే వరి నారుమడులు పోసుకున్నారు. మరికొన్ని చోట్ల ఇప్పుడిప్పుడే నారు పోసుకుంటున్నారు. వరిలో మంచి దిగుబడులు సాధించాలంటే చీడపీడలు ఆశించని ఆరోగ్యవంతమైన నారును పెంచాల్సిన అవసరం ఉన్నదని పశ్చిమ గోదావరి జిల్లా మార్టేరులోని ఆంధ్రప్రదేశ్ వరి పరిశోధనా సంస్థ సీనియర్ కీటక శాస్త్రవేత్త డాక్టర్ కె.వసంతభాను, డెరైక్టర్ డాక్టర్ ఎ.విష్ణువర్ధనరెడ్డి సూచిస్తున్నారు. ఈ నేపథ్యంలో వరి నారుమడిని ఆశించే హిస్పా, కాండం తొలుచు పురుగు, ఉల్లికోడు పురుగుల నివారణకు వారు అందిస్తున్న సూచనలు...
రైతులు ముందుగా తమ ప్రాంతానికి అనువైన, చీడపీడల్ని తట్టుకునే వంగడాల్ని ఎంపిక చేసుకోవాలి. తెగుళ్లు చాలా వరకు విత్తనం ద్వారా వ్యాప్తి చెందుతాయి. కాబట్టి ఆరోగ్యవంతమైన పొలం నుంచే విత్తనాలను సేకరించాలి. లేదా విత్తనాలను విధిగా శుద్ధి చేయాలి. ఇందుకోసం లీటరు నీటిలో ఒక గ్రాము చొప్పున కార్బండజిమ్ కలిపి, ఆ మందు ద్రావణంలో కిలో విత్తనాలను 24 గంటల పాటు నానబెట్టి, ఆ తర్వాత మండె కట్టాలి. నారుమడిని ప్రతి రోజూ గమనిస్తూ ఎప్పటికప్పుడు తగిన సస్యరక్షణ చర్యలు చేపట్టాలి.
ముందుగా గడ్డిని ఆశ్రయించి...
తొలకరిలో కురిసిన వర్షాలకు పొలం గట్ల పైన, పొలంలో గడ్డి బాగా పెరుగుతుంది. నారు పోయకముందే హిస్పా పురుగులు ఈ గడ్డిని ఆశ్రయిస్తాయి. ఆ తర్వాత నారుపై దాడి చేస్తాయి. హిస్పా అనేది నీలం, నలుపు రంగులతో కూడిన పెంకు పురుగు. దీని శరీరంపై ముళ్ల వంటి నిర్మాణాలు ఉంటాయి. తల్లి పెంకు పురుగు కూడా నారుమడిని నష్టపరుస్తుంది. ఈ పురుగులు ఆశించడం వల్ల ఆకులపై తెల్లని మచ్చలు, తెల్లని నిలువు చారలు ఏర్పడతాయి. చివరికి ఆకులు ఎండిపోతాయి.
వర్షాలు ఆలస్యమైతే...
తొలకరి వర్షాలు జూన్ మొదటి వారంలో పడి, నారుమడులు సకాలంలో పోసుకున్నట్లయితే కాండం తొలుచు పురుగు తాకిడి ఉండదు. అయితే ఇప్పుడు పరిస్థితులు అందుకు పూర్తిగా భిన్నంగా ఉన్నాయి. జూలై ప్రవేశించినా వరుణుడు కనికరించడం లేదు. ఒకవేళ ఇప్పుడు వర్షాలు పడినప్పటికీ నారుమడిని కాండం తొలుచు పురుగు ఆశించే ప్రమాదం ఉంది. దీని రెక్కల పురుగులు పసుపు రంగులో ఉంటాయి. రెక్కల ముందు, రెక్కల మధ్యలో నల్లని మచ్చలు కన్పిస్తాయి. ఒక్కో పురుగు ఆకుల చివరి భాగంలో 20-70 గుడ్లను సముదాయాలుగా పెట్టి, వాటిని వెంట్రుకలతో కప్పుతుంది. ఈ గుడ్ల నుంచి వారం రోజుల్లో పిల్ల పురుగులు బయటికి వచ్చి, మూడు రోజుల్లో కాండం లోపలికి చేరి కణజాలాన్ని తినేస్తాయి. దీనివల్ల మొవ్వు ఆకు ఎండి చనిపోతుంది.
అంకురం వృద్ధి చెందదు
గతంలో ఆంధ్రప్రదేశ్ రాష్ట్రంలోని ఉత్తర కోస్తాకు, తెలంగాణలోని అన్ని జిల్లాలకు మాత్రమే పరిమితమైన ఉల్లికోడు పురుగు ఇటీవలి కాలంలో ఇతర ప్రాంతాలకూ వ్యాప్తి చెందుతోంది. సాధారణంగా ఉల్లికోడు పురుగులు పిలక దశ తర్వాతే పంటపై తీవ్ర స్థాయిలో దాడి చేస్తుంటాయి. అయితే ప్రతికూల వాతావరణ పరిస్థితుల కారణంగా గత కొన్ని సంవత్సరాలుగా ఖరీఫ్ పంట సాగు ఆలస్యమవుతుండడంతో ఈ పురుగు తాకిడి నారుమడి దశలోనే కన్పిస్తోంది. ఉల్లికోడు పురుగులు ముదురు ఎరుపు రంగులో దోమల మాదిరిగా ఉంటాయి. ఇవి ఆకులపై విడిగా కానీ లేదా 2-3 గుడ్లను కలిపి కానీ పెడతాయి. వీటి నుండి వారం రోజుల్లో పిల్ల పురుగులు బయటికి వస్తాయి. అవి అంకురం వద్దకు చేరి, అక్కడ ఒక రకమైన రసాయనాన్ని విడుదల చేస్తాయి. దీనివల్ల అంకురం ఆకుగా వృద్ధి చెందదు. అది పొడవాటి గొట్టంగా మారి, ఉల్లికోడు మాదిరిగా బయటికి వస్తుంది.
ఇవి కూడా...
నారుమడి పోసిన తర్వాత వర్షాభావ పరిస్థితులు ఎదురైతే... ముఖ్యంగా మెట్ట నారుమడుల్ని తామర పురుగులు ఆశించే అవకాశం ఉంది. ఈ పురుగులు ఆకుల చివర్ల నుండి రసాన్ని పీలుస్తాయి. దీంతో ఆకు చివర్లు ఎండిపోతాయి. ఒకవేళ నారుమడి పోసిన తర్వాత వర్షాలు బాగా కురిసి మొక్కలు ముంపుకు గురైతే వాటిని నారును కత్తిరించే లద్దె పురుగులు ఆశిస్తాయి. ఇవి రాత్రి సమయంలో నారుమడిని ఆశించి, మొక్కల్ని కొరికేస్తాయి. పగటి వేళ కలుపు మొక్కల పైన, భూమిలోనూ ఉంటాయి.
ఏం చేయాలి?
నారు పోసిన ఏడవ రోజు నుంచే తగిన సస్యరక్షణ చర్యలు చేపట్టాలి. లీటరు నీటికి 1.6 మిల్లీలీటర్ల మోనోక్రొటోఫాస్ లేదా 2 మిల్లీలీటర్ల క్లోరిపైరిఫాస్/ప్రొఫెనోఫాస్ చొప్పున కలిపి పిచికారీ చేసుకోవాలి. లేకుంటే నారు తీయడానికి వారం రోజుల ముందు 160 గ్రాముల కార్బోఫ్యూరాన్ 3జీ లేదా 50 గ్రాముల ఫోరేట్ 10జీ గుళికల్ని ఇసుకలో కలిపి సెంటు నారుమడిలో చల్లుకోవాలి. ఆ సమయంలో నారుమడిలో నీరు పలచగా ఉండాలి. నారుమడిని లద్దె పురుగు ఆశిస్తే పైన తెలిపిన మందుల్ని సాయంత్రం వేళ పిచికారీ చేసుకోవాలి.