పాడి-పంట: వేరుశనగ సాగు ఇలా...
కడప (అగ్రికల్చర్): ఆంధ్రప్రదేశ్, తెలంగాణ రా ష్ట్రాల్లో ఇప్పటికీ నైరుతి రుతుపవనాల ప్రభావం కన్పించడం లేదు. వరుణుడు ముఖం చాటేస్తున్నాడు. తొలకరి జల్లులు ఎప్పుడు పడతాయా అని రైతులు ఎదురుతెన్నులు చూస్తున్నారు. ఎం దుకంటే ఈ రెండు రాష్ట్రాల్లోనూ తొలకరి వర్షాలు పడిన వెంటనే రైతులు తమ పొలాల్లో వేరుశనగ విత్తనాలు వేసుకుంటారు. ఈ పంటను తెలంగాణ రాష్ట్రంలోనూ, ఆంధ్రప్రదేశ్‌లోని రాయలసీమ ప్రాంతంలోనూ ఎక్కువగా సాగు చేస్తున్నారు. కోస్తాలో సాగు విస్తీర్ణం తక్కువగానే ఉంటోంది. విత్తనాలు వేసింది మొదలు పంట నూర్పిడి వరకు ఎప్పటికప్పుడు తగిన యాజమాన్య, సస్యరక్షణ చర్యలు చేపట్టినట్లయితే నాణ్యమైన, అధిక దిగుబడులు పొందే అవకాశం ఉంది. ఈ నేపథ్యంలో వేరుశనగ సాగులో చేపట్టాల్సిన యాజమాన్య చర్యలపై వైఎస్సార్ జిల్లా ఊటుకూరులోని కృషి విజ్ఞాన కేంద్రం కో-ఆర్డినేటర్ డాక్టర్ భాస్కర పద్మోదయ అందిస్తున్న సూచనలు...
ఎప్పుడు వేసుకోవాలి?
ఆంధ్రప్రదేశ్, తెలంగాణ రాష్ట్రాల రైతులు జూలై నెల వరకు వేరుశనగ విత్తనాలు వేసుకోవచ్చు. ఒకవేళ వర్షాలు ఆలస్యంగా కురిసినట్లయితే దక్షిణ తెలంగాణ ప్రాంతంలోనూ, ఆంధ్రప్రదేశ్‌లోని రాయలసీమలోనూ ఆగస్ట్ 15వ తేదీ వరకు విత్తుకోవచ్చు.
విత్తన మోతాదు-శుద్ధి
వేరుశనగ సాగుకు ఏ రకాన్ని ఎంచుకున్నప్పటికీ లావు గింజ రకాలైతే ఎకరానికి 60 కిలోలు, మధ్యస్థ గింజ రకాలైతే 50 కిలోల చొప్పున విత్తనాలు అవసరమవుతాయి. పంటకాలంలో పైరును ఆశించి నష్టపరిచే చీడపీడల నివారణకు విత్తనశుద్ధి తప్పనిసరి. కిలో విత్తనాలకు 4.8 గ్రాముల ట్రైకోడెర్మా విరిడె లేదా 3 గ్రాముల మాంకోజెబ్ లేదా ఒక గ్రాము టెబుకొనజోల్ (2% డీఎస్) లేదా ఒక గ్రాము కార్బండజిమ్ (50% డబ్ల్యూపీ) చొప్పున పట్టించి విత్తుకోవాలి. వేరు పురుగు ఉధృతి అధికంగా ఉన్న ప్రాంతాల్లో కిలో విత్తనాలకు 6.5 మిల్లీలీటర్ల ఇమిడాక్లోప్రిడ్ (20% ఈసీ) కలపాలి. కాండంకుళ్లు తెగులు, వెర్రి తెగులు తాకిడి ఎక్కువగా ఉండే ప్రాంతాల్లో కిలో విత్తనాలకు 2 మిల్లీలీటర్ల ఇమిడాక్లోప్రిడ్ (17.8% ఈసీ) పట్టించాలి. విత్తనశుద్ధి చేసేటప్పుడు ముందుగా పురుగు మందును కలపాలి. ఆ తర్వాత విత్తనాల్ని ఆరబెట్టి, శిలీంద్ర నాశక మందుల్ని పట్టించాలి. అవసరమైతే రైజోబియం కల్చర్‌ను కూడా కలపవచ్చు.
ఎలా విత్తాలి?
కే-6, నారాయణి, ధరణి వంటి గుత్తి రకాలు వేసుకునే వారు వరుసల మధ్య 30 సెంటీమీటర్లు, మొక్కల మధ్య 10 సెంటీమీటర్ల దూరాన్ని పాటించాలి. ఐసీజీయస్-14, 44 వంటి తీగ/పెద్ద గుత్తి రకాలు వేసే వారు వరుసల మధ్య 30 సెంటీమీటర్లు, మొక్కల మధ్య 15 సెంటీమీటర్ల దూరం ఉండేలా చూసుకోవాలి. విత్తనాల్ని గొర్రుతో లేదా నాగలి సాళ్లలో వేసుకోవాలి. ఆ సమయంలో భూమిలో తగినంత తేమ ఉండాలి. విత్తనాన్ని 5 సెంటీమీటర్ల లోతు మించకుండా వేసుకోవాలి.
ఎరువుల యాజమాన్యం
ఆఖరి దుక్కిలో ఎకరానికి 4 టన్నుల బాగా కుళ్లిన పశువుల ఎరువు, 16 కిలోల భాస్వరం (100 కి లోల సూపర్ ఫాస్ఫేట్), 8 కిలోల నత్రజని (18 కిలోల యూరియా), 20 కిలోల పొటాష్ (33 కి లోల మ్యురేట్ ఆఫ్ పొటాష్) వేసుకోవాలి. పూత దశలో లేదా కలుపు తీసే ముందు ఎకరానికి 200 కిలోల జిప్సం వేసుకుంటే కాయల సైజు బాగుంటుంది. నాణ్యమైన గింజలు వస్తాయి.
సూక్ష్మ ధాతువులు లోపిస్తే...
వేరుశనగ పైరులో సూక్ష్మ ధాతువులు... ము ఖ్యంగా జింక్, ఇనుము... లోపించే అవకాశం ఉంది. జింక్ లోపిస్తే ఆకులు చిన్నవిగా మారి, గు బురుగా కన్పిస్తాయి. మొక్కలు గిడసబారతాయి. ఆకు ఈనెల మధ్య భాగం పసుపు రం గుకు మారే అవకాశం ఉంది. ఇక ఇనుము లోపి స్తే లేత ఆకులు ముందుగా పసుపు రంగుకు, ఆ తర్వాత తెలుపు రంగుకు మారతాయి. భూమిలో జింక్ ధాతు లోపం ఉన్నట్లయితే 3 పంటలకు ఒకసారి ఎకరానికి 10 కిలోల చొప్పున జింక్ సల్ఫేట్ వేయాలి. లీటరు నీటికి 2 గ్రాముల చొప్పున జింక్ సల్ఫేట్ కలిపి పైరుపై పిచికారీ చేయాలి. ఇనుప ధాతు లోప నివారణకు లీటరు నీటికి 5 గ్రాముల అన్నభేది + ఒక గ్రాము నిమ్మ ఉప్పు చొప్పున కలిపి పిచికారీ చేసుకోవాలి.
కలుపు నివారణ ఎలా?
చేలో కలుపు మొక్కలు మొలవక ముందే... అంటే విత్తనాలు వేసిన వెంటనే లేదా 3 రోజుల లోపు ఎకరానికి 200 లీటర్ల నీటిలో 1.3-1.6 లీటర్ల పెండిమిథాలిన్ 30% లేదా లీటరు అలాక్లోర్ లేదా 1.25-1.5 లీటర్ల బుటాక్లోర్ కలిపి నేలపై పిచికారీ చేయాలి. చేలో గడ్డి జాతి కలుపు మొక్కలు కన్పిస్తే విత్తనాలు వేసిన 21 రోజుల లోపు ఎకరానికి 200 లీటర్ల నీటిలో 400 మిల్లీలీటర్ల క్విజలాఫాప్ ఇథైల్ కలిపి కలుపు మొక్కలపై మాత్రమే పడేలా సాళ్ల మధ్యలో పిచికారీ చేయాలి. కలుపు మొక్కలు లేత దశలో ఉన్నప్పుడు ఈ మందును పిచికారీ చేస్తే మంచి ఫలితం ఉంటుంది.
వేరుశనగ పైరును వేరు పురుగు, పేనుబంక, తామర పురుగు, పచ్చదోమ, ఆకుముడత పురుగు, ఎర్ర గొంగళి పురుగు, శనగపచ్చ పురుగు, లద్దె పురుగు అధికంగా ఆశించి తీవ్రంగా నష్టపరుస్తాయి. వీటి నివారణకు సకాలంలో సిఫార్సు చేసిన మోతాదులో మందులు పిచికారీ చేసుకోవాలి.