ఇప్పుడు ఏం చేయాలంటే...
పాడి-పంట: వాయవ్య బంగాళాఖాతంలో ఏర్పడిన అల్పపీడనం, దానికి అనుబంధంగా కొనసాగుతున్న ఉపరితల ఆవర్తనం, కోస్తాంధ్ర మీదుగా అల్పపీడన ద్రోణి... వీటన్నింటి కారణంగా ఆంధ్రప్రదేశ్, తెలంగాణ రాష్ట్రాల్లోని అనేక ప్రాంతాల్లో వర్షాలు పడుతున్నాయి. రాబోయే రెండు మూడు రోజుల్లోనూ తేలికపాటి నుంచి ఓ మోస్తరు వర్షాలు కురుస్తాయని వాతావరణ శాఖ అధికారులు చెబుతున్నారు. ఈ నేపథ్యంలో రెండు రాష్ట్రాల రైతులు వివిధ పంటల్లో చేపట్టాల్సిన చర్యలపై రాజేంద్రనగర్‌లోని వ్యవసాయ వాతావరణ పరిశోధనా కేంద్రం సంచాలకులు అందజేస్తున్న సూచనలు...
ఈ పంటలు వేసుకోవాలి
ప్రస్తుతం కురుస్తున్న వర్షాలను ఆసరాగా చేసుకొని ఆంధ్రప్రదేశ్ రైతులు పత్తి, మొక్కజొన్న, వేరుశనగ, కంది, సోయాచిక్కుడు విత్తనాలను త్వరగా వేసుకోవాలి. తెలంగాణ రైతులు ఆముదం, పొద్దుతిరుగుడు, కంది పంటలు వేసుకోవాలి. ఏ పంట వేసినా విత్తనశుద్ధి తప్పనిసరి. రైతులు ఇప్పటికే వర్షాధార పంటలు వేసుకున్నట్లయితే మొదటి దఫా పైపాటు ఎరువులు వేయాలి.
రెండు రాష్ట్రాల రైతులు ఇప్పుడు ఆముదం విత్తనాలు వేసుకోవచ్చు. ఇందుకోసం వారు అనువైన లేదా హైబ్రిడ్ రకాలను ఎంచుకోవాలి. ఆముదం విత్తనాలు వేసే సమయంలో ఎకరానికి 25 కిలోల యూరియా, 100 కిలోల సింగిల్ సూపర్ ఫాస్ఫేట్, 20 కిలోల మ్యురేట్ ఆఫ్ పొటాష్ వేయాలి. కలుపు నివారణ కోసం విత్తిన 48 గంటల లోపు ఎకరానికి 200 లీటర్ల నీటిలో 1.3 లీటర్ల పెండిమిథాలిన్ కలిపి పిచికారీ చేయాలి. వర్షాధార వేరుశనగ పైరు విత్తేటప్పుడు ఎకరానికి 18 కిలోల యూరియా, 100 కిలోల సింగిల్ సూపర్ ఫాస్ఫేట్, 33 కిలోల మ్యురేట్ ఆఫ్ పొటాష్ వేయాలి.
పత్తి పైరు 20-25 రోజుల దశలో ఉన్నట్లయితే ప్రస్తుతం కురుస్తున్న వర్షాలను ఆసరాగా చేసుకొని ఎకరానికి 30-35 కిలోల యూరియా, 10 కిలోల మ్యురేట్ ఆఫ్ పొటాష్ వేసుకోవాలి. విత్తనాలు వేసిన 20 రోజుల తర్వాత భాస్వరం ఎరువు వేయకూడదు. ఇక మొక్కజొన్న పైరు 25-30 రోజుల దశలో ఉన్నప్పుడు ఎకరానికి 45-50 కిలోల యూరియాను పైపాటుగా వేసుకోవాలి.
రసాన్ని పీలుస్తాయి
ప్రస్తుత వాతావరణ పరిస్థితుల్లో పత్తి పైరును రసం పీల్చే పేనుబంక, పచ్చదోమ ఆశించి నష్టపరిచే ప్రమాదం ఉంది. పిల్ల, పెద్ద పేనుబంక పురుగులు ఆకుల అడుగు భాగాన, కొమ్మల పైన రసాన్ని పీలుస్తూ జీవిస్తాయి. దీనివల్ల మొక్క ఎదగదు. ఈ పురుగులు విసర్జించే తేనె వంటి పదార్థం కారణంగా ఆకులు, కాండం పైన మసి తెగులు వ్యాపిస్తుంది. పచ్చదోమ తల్లి పురుగులు మధ్య ఈనెకు దగ్గరగా లేదా ఆకు తొడిమ లోపలికి గుడ్లను చొప్పిస్తుంది. పిల్ల, పెద్ద దోమలు అడ్డంగా నడుస్తూ ఆకుల అడుగు భాగాన చేరి రసాన్ని పీలుస్తాయి. దీనివల్ల ఆకుల చివర్లు పసుపుపచ్చగా మారతాయి. చివరికి ఆకు మొత్తం ఎర్రబడుతుంది. ఆకులు ముడుచుకొని, దోనె మాదిరిగా కన్పిస్తాయి.
రసం పీల్చే పురుగుల నివారణకు తొలి దశలో పురుగు మందులను ఎక్కువసార్లు పిచికారీ చేయకూడదు. కాబట్టి పైరు 20 రోజుల దశలో ఉన్నప్పుడు మోనోక్రొటోఫాస్ + నీటిని 1:4 నిష్పత్తిలో కలిపి, ఆ మందు ద్రావణాన్ని మెత్తని బ్రష్‌తో లేత కాండం మీద పూయాలి.
లేత మొక్క చనిపోతుంది
పత్తి పైరును రైజోక్టోనియా వేరుకుళ్లు తెగులు సోకే అవకాశాలు ఉన్నాయి. ఈ తెగులు అన్ని దశలలోనూ పైరును నష్టపరుస్తుంది. ముఖ్యంగా భూమిలో తేమ ఎక్కువగా ఉన్నప్పుడు దీని తాకిడి అధికంగా ఉంటుంది. తెగులు సోకిన లేత మొక్క ఒక్క రోజులోనే అర్థాంతరంగా చనిపోతుంది. ఆ మొక్క చివరి భాగం కొద్దిగా తడిగా, జిగటగా ఉంటుంది. వడలిపోయిన ఆకులు చాలా కాలం వరకూ చెట్టు పైనుంచి కిందికి వేలాడుతూ ఉంటాయి. తెగులు సోకిన మొక్కలు చేలో గుంపులు గుంపులుగా ఎండిపోతాయి. వాటిని పీకితే తేలికగా ఊడివస్తాయి. ఎదిగిన మొక్కలు వడలిపోతాయి. ఆకులు ఎర్రబడతాయి. పీచు వేర్లు కుళ్లి ఊడిపోతాయి.
చేలో తెగులు లక్షణాలు కన్పించిన వెంటనే లీటరు నీటిలో 3 గ్రాముల కాపర్ ఆక్సీక్లోరైడ్ లేదా 2.5 గ్రాముల స్ప్రింట్ లేదా 3 గ్రాముల సాఫ్/కంపానియన్/మాస్టర్ చొప్పున కలిపి, ఆ ద్రావణాన్ని 7-10 రోజుల వ్యవధితో 2-3 సార్లు మొక్కల మొదళ్లు బాగా తడిసేలా పాదులో పోయాలి.
మొక్కజొన్నలో...
మొక్కజొన్న పైరులో కాండం తొలుచు పురుగులు కన్పిస్తే లీటరు నీటికి 1.6 మిల్లీలీటర్ల చొప్పున మోనోక్రొటోఫాస్ కలిపి 10-12 రోజుల వయసున్న పైరుపై పిచికారీ చేయాలి.
కూరగాయ పంటల్లో...
ప్రస్తుతం వర్షాలు పడుతున్నందున టమాటా, వంగ, మిరప నారుమడులు పోసుకోవాలి. నీటి వసతి ఉన్న ప్రాంతాల్లో బెండ, చిక్కుడు, తీగజాతి కూరగాయ పంటల విత్తనాలు వేసుకోవాలి. కూరగాయ పంటల నారుమడుల్లో రసం పీల్చే పురుగులు కన్పిస్తే లీటరు నీటికి 2 మిల్లీలీటర్ల డైమిథోయేట్ లేదా 1.5 గ్రాముల ఎసిఫేట్ చొప్పున కలిపి పిచికారీ చేసుకోవాలి. నారుకుళ్లు తెగులు సోకితే లీటరు నీటికి 3 గ్రాముల చొప్పున కాపర్ ఆక్సీక్లోరైడ్ కలిపి, ఆ మందు ద్రావణంతో నారుమడిని తడపాలి.