northwest Bay of Bengal
-
కొనసాగుతున్న అల్పపీడనం.. రెండ్రోజులు వర్షాలు
సాక్షి, విశాఖపట్నం: వాయవ్య బంగాళాఖాతంలో పశ్చిమ బెంగాల్, ఒడిశా తీరాలకు ఆనుకుని ఏర్పడిన అల్పపీడనం కొనసాగుతోందీనికి అనుబంధంగా సముద్ర మట్టానిక7.6 కిలోమీటర్ల ఎత్తులో ఉపరితల ఆవర్తనం విస్తరించి ఉంది. అల్పపీడనం రానున్న 24 గంటల్లో ఛత్తీస్‌గఢ్ వైపు పయనిస్తుందని భారత వాతావరణ శాఖ (ఐఎండీ) బుధవారం నివేదికలో తెలిపింది. మరోవైపు రుతుపవన ద్రోణి రాజస్తాన్‌లోని జైసల్మేర్ నుంచి అల్పపీడన ప్రాంతం వరకు కొనసాగుతోంది. మరోవైపు రాష్ట్రం మీదుగా పశ్చిమ, వాయవ్య గాలులు వీస్తున్నాయి. వీటి ఫలితంగా రానున్న రెండు రోజులు ఉత్తర, దక్షిణ కోస్తాంధ్రల్లో అనేక చోట్ల, రాయలసీమలో కొన్నిచోట్ల తేలికపాటి నుంచి మోస్తరు వర్షాలు కురుస్తాయని ఐఎండీ తెలిపింది. -
బలహీనపడిన అల్పపీడనం
సాక్షి, విశాఖపట్నం: వాయవ్య బంగాళాఖాతంలో పశ్చిమ బంగాళాఖాతానికి ఆనుకుని ఉత్తరాంధ్రపై ఏర్పడిన అల్పపీడనం బుధవారం బలహీనపడింది. ఈ అల్పపీడనం ఒడిశా, ఛత్తీస్‌గఢ్‌ల వైపు పయనిస్తూ బలహీనపడి ఉపరితల ఆవర్తనంగా మారింది. ప్రస్తుతం ఈ ఆవర్తనం దక్షిణ అంతర్గత ఒడిశా, పరిసర ప్రాంతాల్లో సముద్రమట్టానికి 5.8 కిలోమీటర్ల ఎత్తులో కొనసాగుతూ నైరుతి వైపు వంగి ఉంది. దీని ప్రభావంతో రెండురోజులు ఉత్తర కోస్తాంధ్ర, దక్షిణ కోస్తాంధ్రల్లో కొన్నిచోట్ల, రాయలసీమలో అక్కడక్కడ తేలికపాటి నుంచి మోస్తరు వర్షాలు కురిసే అవకాశం ఉందని భారత వాతావరణ శాఖ (ఐఎండీ) బుధవారం రాత్రి నివేదికలో తెలిపింది. బుధవారం ఉదయం నుంచి రాత్రి వరకు విజయనగరం, శ్రీకాకుళం, పార్వతీపురం మన్యం, అనకాపల్లి జిల్లాల్లో భారీవర్షాలు కురిశాయి. రాష్ట్రంలోకెల్లా అత్యధికంగా విజయనగరం జిల్లా రేగిడి ఆమదాలవలసలో 13.8 సెంటీమీటర్ల వర్షపాతం రికార్డయింది. సరుబుజ్జిలిలో 12 సెంటీమీటర్లు, చిలకలపల్లిలో 10.8, దేవరాపల్లిలో 8.7, డుంబ్రిగుడలో 4.3, పెందుర్తిలో 4, రేచర్లలో 3.7 సెంటీమీటర్ల చొప్పున వర్షపాతం నమోదైంది. అల్పపీడనం బలహీనపడిన నేపథ్యంలో రాష్ట్రంలో వర్షాలు తగ్గుముఖం పట్టే అవకాశం ఉందని వాతావరణ నిపుణులు అంచనా వేస్తున్నారు. మళ్లీ అల్పపీడనంగానీ, ఉపరితల ఆవర్తనం/ద్రోణిగానీ ఏర్పడితే వర్షాలకు ఆస్కారం ఉంటుందని చెబుతున్నారు. -
మూడు రోజులు విస్తారంగా వానలు
సాక్షి, విశాఖపట్నం: వాయవ్య బంగాళాఖాతంలో ఉపరితల ఆవర్తనం కొనసాగుతోంది. దీని ప్రభావంతో సోమవారం ఒడిశా–ఉత్తరాంధ్రకు ఆనుకుని వాయవ్య, పశ్చిమ మధ్య బంగాళాఖాతంలో అల్పపీడనం ఏర్పడనుంది. దీని ప్రభావంతో రానున్న 3 రోజులు కోస్తాంధ్ర, రాయలసీమల్లో భారీ వర్షాలు కురిసే అవకాశం ఉందని భారత వాతావరణ శాఖ శనివారం తెలిపింది. అదే సమయంలో గంటకు 30–40 కి.మీల వేగంతో బలమైన గాలులు కూడా వీస్తాయని తెలిపింది. అల్పపీడనం 2 రోజుల్లో వాయుగుండంగా బలపడ నుందని ఐఎండీ తెలిపింది. అనంతరం పశ్చిమ వాయవ్య దిశగా దక్షిణ ఒడిశా, ఉత్తరాంధ్ర మీదుగా అది పయనిస్తుందని అంచనా వేసింది. -
బంగాళాఖాతంలో అల్పపీడనం.. ఏపీలో రెండు రోజులు వానలు..
సాక్షి, అమరావతి/విశాఖపట్నం: వాయువ్య బంగాళాఖాతంలో అల్పపీడనం ఏర్పడినట్లు వాతావరణ శాఖ తెలిపింది. దానికి అనుబంధంగా మరో ఉపరితల ఆవర్తనం ఒడిశా, పశ్చిమ బెంగాల్ తీరాల వరకు విస్తరించింది. దీని ఫలితంగా రాబోయే రెండ్రోజుల్లో ఇవి ఉత్తర ఒడిశా, జార్ఖండ్ మీదుగా కదిలే అవకాశముంది. వీటి ప్రభావం రాష్ట్రంపై పెద్దగా ఉండే అవకాశం లేకపోయినా ఓ మోస్తరు వర్షాలు పడతాయని భారత వాతావరణ శాఖాధికారులు (ఐఎండీ) ఆదివారం రాత్రి తెలిపారు. ప్రధానంగా ఉత్తరాంధ్రలో వర్షాలు పడే అవకాశం ఎక్కువగా ఉన్నట్లు పేర్కొన్నారు. మరోవైపు.. నైరుతి రుతుపవనాలు బలంగా ఉండడంతో ఈ నెల 29వ తేదీ వరకు రాష్ట్రవ్యాప్తంగా వర్షాలు కురుస్తాయని వారు తెలిపారు. కాగా, అల్పపీడనం ప్రభావంతో సముద్రం అలజడిగా ఉంటుందని మత్స్యకారులు చేపల వేటకు వెళ్లవద్దని విశాఖ తుపాను హెచ్చరికల కేంద్రం సూచించింది. ఇక ఆదివారం తూర్పుగోదావరి, శ్రీకాకుళం, గుంటూరు, నంద్యాల, పార్వతీపురం మన్యం జిల్లాల్లో మోస్తరు నుంచి భారీ వర్షాలు కురిశాయి. పైడిమెట్ట (తూర్పు గోదావరి)లో 5.9, ఆమదాలవలస (శ్రీకాకుళం)లో 4.1, రావెల (గుంటూరు)లో 4, జియ్యమ్మవలస (పార్వతీపురం మన్యం)లో 4, ముత్తాల (అనంతపురం)లో 3.4, జొన్నగిరి (కర్నూలు) 3.2 సెం.మీ.ల చొప్పున వర్షపాతం నమోదైంది. రాష్ట్రంలో లోటు వర్షపాతం నైరుతి రుతుపవనాల రాక ఆలస్యం ప్రభావం రాష్ట్రంపై స్పష్టంగా కనిపిస్తోంది. వీటి ఆగమనంలో జాప్యం జరగడంతో సకాలంలో వర్షాలు కురవక 20 జిల్లాల్లో లోటు వర్షపాతానికి దారితీసింది. నాలుగు జిల్లాల్లో సాధారణం, రెండు జిల్లాల్లో మాత్రమే అధిక వర్షపాతం నమోదైంది. జూన్ ఒకటి నుంచి మొదౖలెన నైరుతి రుతుపవనాల సీజనులో ఇప్పటివరకు రాష్ట్రంలోకెల్లా అత్యల్పంగా నెల్లూరు జిల్లాలో సాధారణం కంటే 68.1 శాతం లోటు వర్షపాతం రికార్డయింది. ఆ జిల్లాలో 45.8 మి.మీ.ల వర్షపాతం నమోదు కావలసి ఉండగా ఇప్పటివరకు 14.6 మి.మీ.లు మాత్రమే వర్షం కురిసింది. అత్యధికంగా బాపట్ల జిల్లాలో సాధారణంకంటే 38.5 శాతం అధిక వర్షపాతం నమోదైంది. అక్కడ సాధారణ వర్షపాతం 58.2 మి.మీ.లకు గాను 81.2 మి.మీ.ల వర్షపాతం రికార్డయింది. ఇక సాధారణ వర్షపాతం నమోదైన జిల్లాలో కృష్ణా, పల్నాడు, శ్రీసత్యసాయి, చిత్తూరు జిల్లాలున్నాయి. ఈ సీజనులో ఇప్పటివరకు సగటున 84.2 మి.మీల వర్షపాతం కురవాల్సి ఉండగా, 56 మి.మీలు మాత్రమే కురిసింది. -
రెండ్రోజులు మోస్తరు నుంచి భారీ వర్షాలు
సాక్షి, హైదరాబాద్: వాయవ్య బంగాళాఖాతంలో అల్పపీడనంఏర్పడినట్లు వాతావరణ శాఖ తెలిపింది. ఇది సముద్రమట్టం నుంచి 7.6 కి.మీ. ఎత్తువరకు విస్తరించి ఉంది. ఒడిశా, పశ్చిమబెంగాల్ తీర ప్రాంతంలో కొనసాగుతున్న ఈ అల్పపీడన ప్రభావంతో రాష్ట్రంలో పలుచోట్ల వర్షాలు కురిసే అవకాశం ఉన్నట్లు వివరించింది. రానున్న రెండ్రోజులు రాష్ట్రంలో పలుచోట్ల మోస్తరు నుంచి భారీ వర్షాలు నమోదు కానున్నట్లు పేర్కొంది. కుమ్రంభీం–ఆసిఫాబాద్, నిర్మల్, జగిత్యాల, మంచిర్యాల, కరీంనగర్, రాజన్న సిరిసిల్ల, పెద్దపల్లి, జయశంకర్ భూపాలపల్లి, ములుగు, భద్రాద్రి కొత్తగూడెం జిల్లాల్లో అక్కడక్కడ భారీ వర్షాలు సైతం కురుస్తాయని అంచనా వేసింది. ఆదివారం రాష్ట్రవ్యాప్తంగా 0.9 సెం.మీ.వర్షపాతం నమోదైంది. ఈ సీజన్లో ఇప్పటివరకు 5.3 సెం.మీ.వర్షపాతం నమోదు కాగా, 51 శాతం లోటు వర్షపాతం ఉన్నట్లు వాతావరణ శాఖ గణాంకాలు చెబుతున్నాయి. -
రాష్ట్రమంతటా వర్షాలు
సాక్షి, విశాఖపట్నం: రాష్ట్రంలో వాతావరణ పరిస్థితులు వర్షాలకు అనుకూలంగా మారుతున్నాయి. దట్టమైన మేఘాలు అల్లుకోగా.. రాష్ట్రమంతటా వర్షాలు విస్తరించాయి. వాయవ్య బంగాళాఖాతంలో ఏర్పడిన ఉపరితల ఆవర్తనం ప్రభావంతో శనివారం రాష్ట్రంలోని అనేక ప్రాంతాల్లో భారీ వర్షాలు నమోదయ్యాయి. మరో రెండు రోజులపాటు దీని ప్రభావం కొనసాగి, మోస్తరు వర్షాలు కురుస్తాయని భారత వాతావరణ విభాగం (ఐఎండీ) శనివారం రాత్రి విడుదల చేసిన నివేదికలో వెల్లడించింది. వాయవ్య బంగాళాఖాతంలో ఏర్పడిన ఉపరితల ఆవర్తనం ఉత్తరాంధ్ర, దక్షిణ ఒడిశా తీరం వైపు విస్తరిస్తోంది. దీనివల్ల వర్షాల కొనసాగటానికి అనువైన పరిస్థితులు నెలకొన్నాయి. ఈ ఆవర్తనం ఉత్తరాంధ్ర, దక్షిణ ఒడిశా మీదుగా దక్షిణ ఛత్తీస్‌గఢ్ పరిసర ప్రాంతాలకు విస్తరించింది. ఇది సముద్ర మట్టానికి 5.8 కిలోమీటర్ల ఎత్తులో ఉంది. ఇదిలావుంటే.. ఆగ్నేయ బంగాళాఖాతంలో మరో ఉపరితల ఆవర్తనం ఏర్పడింది. ఇది దక్షిణ అండమాన్ సముద్రం వైపు విస్తరించి సముద్ర మట్టానికి 3.1 కిలోమీటర్ల నుంచి 5.8 కిలోమీటర్ల మధ్యలో ఆవరించి ఉంది. అల్పపీడనం ఏర్పడితే తప్ప దీని ప్రభావం రాష్ట్రంపై ఉండబోదని వాతావరణ నిపుణులు స్పష్టం చేస్తున్నారు. ప్రకాశం జిల్లాలో శుక్రవారం రాత్రి నుంచి శనివారం రాత్రి వరకు పలుచోట్ల భారీ వర్షం పడింది. కర్నూలు జిల్లాలో 20 రోజుల తర్వాత వర్షాలు ఆశాజనకంగా కురిశాయి. శ్రీకాకుళం, కృష్ణా, గుంటూరు, రాయలసీమలోని కర్నూలు, కడప జిల్లాల్లో భారీ వర్షాలు కురిశాయి. గడచిన 24 గంటల్లో గుంటూరు, కృష్ణా జిల్లా తిరువూరు, కర్నూలు జిల్లా అవుకు ప్రాంతాల్లో అత్యధికంగా 9 సెంటీమీటర్ల చొప్పున వర్షపాతం నమోదైంది. 28 ప్రాంతాల్లో అత్యల్పంగా ఒక సెంటీమీటర్ చొప్పున కురిసింది. శ్రీకాకుళం జిల్లా వీరఘట్టంలో 8, ప్రకాశం జిల్లా సంతమాగులూరు, కడప జిల్లా ప్రొద్దుటూరులో 7 సెంటీమీటర్లు, గుంటూరు జిల్లా బాపట్ల, కృష్ణా జిల్లా అవనిగడ్డ, అనంతపురం జిల్లా గుత్తి, చిత్తూరు జిల్లా కుప్పంలో 6 సెంటీమీటర్ల చొప్పున నమోదైంది. ప్రకాశం జిల్లా కారంచేడు, గుంటూరు జిల్లా అచ్చంపేట, విజయనగరం జిల్లా కురుపాం, కృష్ణా జిల్లా మచిలీపట్నం, కడప జిల్లా రాజంపేట, చిత్తూరు జిల్లా పలమనేరు, కర్నూలు జిల్లా ఆత్మకూరులో 5 సెంటీమీటర్ల చొప్పున వర్షం కురిసింది. విజయనగరం జిల్లా జియ్యమ్మవలస, గుంటూరు జిల్లా రేపల్లె, కడపజిల్లా పెనగలూరు, వల్లూరులో 4 సెంటీమీటర్ల చొప్పున నమోదైంది. విజయనగరం జిల్లా బాలాజీపేట, ప్రకాశం జిల్లా ఒంగోలు, శ్రీకాకుళం జిల్లా పాలకొండ, విశాఖ జిల్లా చోడవరం, కృష్ణా జిల్లా కైకలూరు, కడప జిల్లా కమలాపురం, చిత్తూరు జిల్లా వెంకటగిరికోట, కర్నూలు జిల్లా ఆళ్లగడ్డ, ఓర్వకల్లులో 3 సెంటీమీటర్ల చొప్పున వర్షం కురిసింది. నెల్లూరు జిల్లా ఆత్మకూరు, విజయనగరం జిల్లా కొమరాడ, ప్రకాశం జిల్లా వెలిగొండ్ల, వండ్లమూరు, యర్రగొండపాలెం, అద్దంకి, చిత్తూరు జిల్లా పాలసముద్రం, కడప జిల్లా వేంపల్లి, పోరుమామిళ్ల, చాపడ్లో 2 సెంటీమీటర్ల చొప్పున వర్షపాతం నమోదైంది. -
రానున్న 24 గంటల్లో కోస్తాంధ్రలో వర్షాలు
సాక్షి, విశాఖపట్నం: వాయువ్య బంగాళాఖాతంలో అల్పపీడనం మరింత బలపడి రానున్న 24 గంటల్లో వాయుగుండంగా మారనుంది. దీంతో కోస్తాంధ్రలో పలుచోట్ల వర్షాలు, ఒకటీ రెండు చోట్ల భారీ వర్షాలు పడే అవకాశం ఉంది. తీవ్ర అల్పపీడనం పశ్చిమ బెంగాల్, ఒడిశా తీరానికి అనుకుని వాయువ్య బంగాళాఖాతం లో కేంద్రీకృతమై ఉంది. తీరం వెంబడి గంటకు 45 నుంచి 50 కిమి వేగంతో బలమైన ఈదురుగాలులు వీచే అవకాశం ఉన్న కారణంగా, సముద్రం అల్లకల్లోలంగా ఉంటుంది. మత్స్యకారులు వేటకు వెళ్లరాదని వాతావరణ శాఖ హెచ్చరికలు జారీ చేసింది. -
బంగాళాఖాతంలో కొనసాగుతున్న అల్పపీడనం
సాక్షి, విశాఖపట్నం: వాయువ్య బంగాళాఖాతంలో ఒడిశా తీరానికి ఆనుకొని బలమైన అల్పపీడనం కొనసాగుతోంది. అల్పపీడనం క్రమేనా బలహీన పడే అవకాశం ఉందని వాతావరణశాఖా అధికారులు తెలిపారు. కోస్తాంధ్ర తీరం వెంబడి ఈదురుగాలులు బలంగా వీస్తున్నాయి. సముద్రపు అలలు నాలుగు మీటర్ల ఎత్తు వరకు ఎగసిపడే అవకాశం ఉందని అధికారులు వెల్లడించారు. అలాగే మత్స్యకారులు వేటకు వెల్లరాదని విశాఖ వాతావరణ కేంద్రం హెచ్చరించింది. కోస్తాంధ్ర వ్యాప్తంగా విస్తారంగా వర్షాలు, కొన్నిచోట్ల భారీ వర్షాలు పడుతున్నాయి. అదేవిధంగా నైరుతి రుతుపవనాల ప్రభావంతో తెలంగాణలో కొన్ని చోట్ల భారీ నుంచి అతిభారీ వర్షాలు కురుస్తున్నాయి. -
వాయవ్య బంగాళాఖాతంలో అల్పపీడనం
విశాఖ: వాయవ్య బంగాళాఖాతంలో అల్పపీడనం ఏర్పడింది. ఒడిశా తీరానికి సమీపాన ఏర్పడిన అల్పపీడన ప్రాంతంలో 4.5 కిలోమీటర్ల ఎత్తు వరకు ఉపరితల ఆవర్తనం ఏర్పడినట్టు ఆదివారం విశాఖ వాతావరణ కేంద్రం వెల్లడించింది. దీని ప్రభావంతో కోస్తాకు చెదురుమదురు వర్షాలు, కొన్ని చోట్ల భారీ వర్షాలు పడే అవకాశం ఉన్నట్టు పేర్కొంది. తెలంగాణలోనూ విస్తారంగా వర్షాలు కురవనున్నాయి. ఈ నేపథ్యంలో కోస్తా తీరం వెంబడి పశ్చిమదిశగా గంటకు 45-50 కిలోమీటర్ల వేగంతో ఈదురుగాలులు వీయనున్నాయనీ, మత్య్సకారులు అప్రమత్తంగా ఉండాలని హెచ్చరించింది. కాగా, అయితే రాయలసీమలో మాత్రం వర్షాలు తగ్గుముఖం పట్టనున్నట్టు విశాఖ వాతావరణ కేంద్రం తెలిపింది. -
నేడూ కొనసాగనున్న అల్పపీడన ద్రోణి
సాక్షి,సిటీబ్యూరో: వాయువ్య బంగాళాఖాతంలో ఏర్పడిన అల్పపీడన ద్రోణి ప్రభావంతో గ్రేటర్ పరిధిలో పలు ప్రాంతాల్లో ఆదివారం సాయంత్రం నుంచి సోమవారం రాత్రి పొద్దుపోయే వరకు జడివాన కురిసింది. సరూర్‌నగర్‌లో అత్యధికంగా 5.8 సెంటీమీటర్ల వర్షపాతం నమోదైనట్లు బేగంపేట్‌లోని వాతావరణ శాఖ ప్రకటించింది. మహేశ్వరంలో 1.7 సెంటీమీటర్లు, శామీర్‌పేట్‌లో ఒక సెంటీమీటరు మేర వర్షపాతం నమోదైందని తెలిపింది. భారీ వర్షం కారణంగా సరూర్‌నగర్ పరిధిలోని పలు కాలనీలు,ప్రధాన రహదారులు, లోతట్టు ప్రాంతాలు జలమయమయ్యాయి. కాగా సోమవారం మధ్యాహ్నం నుంచి రాత్రి పొద్దుపోయే వరకు నగరంలో పలు ప్రాంతాల్లో మోస్తరు నుంచి భారీ వర్షం కురిసింది. రాత్రి 8.30 గంటల వరకు 3.2 మిల్లీమీటర్ల వర్షపాతం నమోదైనట్లు వాతావరణ శాఖ తెలిపింది. సాయంత్రం వేళ కురిసిన వర్షంతో రహదారులపై వరదనీరు పోటెత్తింది. పలు ప్రధాన రహదారులపై గంటల తరబడి ట్రాఫిక్ స్తంభించడంతో ఉద్యోగులు,విద్యార్థులు,మహిళలు ట్రాఫిక్ రద్దీతో విలవిల్లాడారు. రాగల 24 గంటల్లో నగరంలో మోస్తరు నుంచి భారీ వర్షాలు కురిసే అవకాశాలున్నట్లు వాతావరణ శాఖ ప్రకటించింది. -
ఇప్పుడు ఏం చేయాలంటే...
పాడి-పంట: వాయవ్య బంగాళాఖాతంలో ఏర్పడిన అల్పపీడనం, దానికి అనుబంధంగా కొనసాగుతున్న ఉపరితల ఆవర్తనం, కోస్తాంధ్ర మీదుగా అల్పపీడన ద్రోణి... వీటన్నింటి కారణంగా ఆంధ్రప్రదేశ్, తెలంగాణ రాష్ట్రాల్లోని అనేక ప్రాంతాల్లో వర్షాలు పడుతున్నాయి. రాబోయే రెండు మూడు రోజుల్లోనూ తేలికపాటి నుంచి ఓ మోస్తరు వర్షాలు కురుస్తాయని వాతావరణ శాఖ అధికారులు చెబుతున్నారు. ఈ నేపథ్యంలో రెండు రాష్ట్రాల రైతులు వివిధ పంటల్లో చేపట్టాల్సిన చర్యలపై రాజేంద్రనగర్‌లోని వ్యవసాయ వాతావరణ పరిశోధనా కేంద్రం సంచాలకులు అందజేస్తున్న సూచనలు... ఈ పంటలు వేసుకోవాలి ప్రస్తుతం కురుస్తున్న వర్షాలను ఆసరాగా చేసుకొని ఆంధ్రప్రదేశ్ రైతులు పత్తి, మొక్కజొన్న, వేరుశనగ, కంది, సోయాచిక్కుడు విత్తనాలను త్వరగా వేసుకోవాలి. తెలంగాణ రైతులు ఆముదం, పొద్దుతిరుగుడు, కంది పంటలు వేసుకోవాలి. ఏ పంట వేసినా విత్తనశుద్ధి తప్పనిసరి. రైతులు ఇప్పటికే వర్షాధార పంటలు వేసుకున్నట్లయితే మొదటి దఫా పైపాటు ఎరువులు వేయాలి. రెండు రాష్ట్రాల రైతులు ఇప్పుడు ఆముదం విత్తనాలు వేసుకోవచ్చు. ఇందుకోసం వారు అనువైన లేదా హైబ్రిడ్ రకాలను ఎంచుకోవాలి. ఆముదం విత్తనాలు వేసే సమయంలో ఎకరానికి 25 కిలోల యూరియా, 100 కిలోల సింగిల్ సూపర్ ఫాస్ఫేట్, 20 కిలోల మ్యురేట్ ఆఫ్ పొటాష్ వేయాలి. కలుపు నివారణ కోసం విత్తిన 48 గంటల లోపు ఎకరానికి 200 లీటర్ల నీటిలో 1.3 లీటర్ల పెండిమిథాలిన్ కలిపి పిచికారీ చేయాలి. వర్షాధార వేరుశనగ పైరు విత్తేటప్పుడు ఎకరానికి 18 కిలోల యూరియా, 100 కిలోల సింగిల్ సూపర్ ఫాస్ఫేట్, 33 కిలోల మ్యురేట్ ఆఫ్ పొటాష్ వేయాలి. పత్తి పైరు 20-25 రోజుల దశలో ఉన్నట్లయితే ప్రస్తుతం కురుస్తున్న వర్షాలను ఆసరాగా చేసుకొని ఎకరానికి 30-35 కిలోల యూరియా, 10 కిలోల మ్యురేట్ ఆఫ్ పొటాష్ వేసుకోవాలి. విత్తనాలు వేసిన 20 రోజుల తర్వాత భాస్వరం ఎరువు వేయకూడదు. ఇక మొక్కజొన్న పైరు 25-30 రోజుల దశలో ఉన్నప్పుడు ఎకరానికి 45-50 కిలోల యూరియాను పైపాటుగా వేసుకోవాలి. రసాన్ని పీలుస్తాయి ప్రస్తుత వాతావరణ పరిస్థితుల్లో పత్తి పైరును రసం పీల్చే పేనుబంక, పచ్చదోమ ఆశించి నష్టపరిచే ప్రమాదం ఉంది. పిల్ల, పెద్ద పేనుబంక పురుగులు ఆకుల అడుగు భాగాన, కొమ్మల పైన రసాన్ని పీలుస్తూ జీవిస్తాయి. దీనివల్ల మొక్క ఎదగదు. ఈ పురుగులు విసర్జించే తేనె వంటి పదార్థం కారణంగా ఆకులు, కాండం పైన మసి తెగులు వ్యాపిస్తుంది. పచ్చదోమ తల్లి పురుగులు మధ్య ఈనెకు దగ్గరగా లేదా ఆకు తొడిమ లోపలికి గుడ్లను చొప్పిస్తుంది. పిల్ల, పెద్ద దోమలు అడ్డంగా నడుస్తూ ఆకుల అడుగు భాగాన చేరి రసాన్ని పీలుస్తాయి. దీనివల్ల ఆకుల చివర్లు పసుపుపచ్చగా మారతాయి. చివరికి ఆకు మొత్తం ఎర్రబడుతుంది. ఆకులు ముడుచుకొని, దోనె మాదిరిగా కన్పిస్తాయి. రసం పీల్చే పురుగుల నివారణకు తొలి దశలో పురుగు మందులను ఎక్కువసార్లు పిచికారీ చేయకూడదు. కాబట్టి పైరు 20 రోజుల దశలో ఉన్నప్పుడు మోనోక్రొటోఫాస్ + నీటిని 1:4 నిష్పత్తిలో కలిపి, ఆ మందు ద్రావణాన్ని మెత్తని బ్రష్‌తో లేత కాండం మీద పూయాలి. లేత మొక్క చనిపోతుంది పత్తి పైరును రైజోక్టోనియా వేరుకుళ్లు తెగులు సోకే అవకాశాలు ఉన్నాయి. ఈ తెగులు అన్ని దశలలోనూ పైరును నష్టపరుస్తుంది. ముఖ్యంగా భూమిలో తేమ ఎక్కువగా ఉన్నప్పుడు దీని తాకిడి అధికంగా ఉంటుంది. తెగులు సోకిన లేత మొక్క ఒక్క రోజులోనే అర్థాంతరంగా చనిపోతుంది. ఆ మొక్క చివరి భాగం కొద్దిగా తడిగా, జిగటగా ఉంటుంది. వడలిపోయిన ఆకులు చాలా కాలం వరకూ చెట్టు పైనుంచి కిందికి వేలాడుతూ ఉంటాయి. తెగులు సోకిన మొక్కలు చేలో గుంపులు గుంపులుగా ఎండిపోతాయి. వాటిని పీకితే తేలికగా ఊడివస్తాయి. ఎదిగిన మొక్కలు వడలిపోతాయి. ఆకులు ఎర్రబడతాయి. పీచు వేర్లు కుళ్లి ఊడిపోతాయి. చేలో తెగులు లక్షణాలు కన్పించిన వెంటనే లీటరు నీటిలో 3 గ్రాముల కాపర్ ఆక్సీక్లోరైడ్ లేదా 2.5 గ్రాముల స్ప్రింట్ లేదా 3 గ్రాముల సాఫ్/కంపానియన్/మాస్టర్ చొప్పున కలిపి, ఆ ద్రావణాన్ని 7-10 రోజుల వ్యవధితో 2-3 సార్లు మొక్కల మొదళ్లు బాగా తడిసేలా పాదులో పోయాలి. మొక్కజొన్నలో... మొక్కజొన్న పైరులో కాండం తొలుచు పురుగులు కన్పిస్తే లీటరు నీటికి 1.6 మిల్లీలీటర్ల చొప్పున మోనోక్రొటోఫాస్ కలిపి 10-12 రోజుల వయసున్న పైరుపై పిచికారీ చేయాలి. కూరగాయ పంటల్లో... ప్రస్తుతం వర్షాలు పడుతున్నందున టమాటా, వంగ, మిరప నారుమడులు పోసుకోవాలి. నీటి వసతి ఉన్న ప్రాంతాల్లో బెండ, చిక్కుడు, తీగజాతి కూరగాయ పంటల విత్తనాలు వేసుకోవాలి. కూరగాయ పంటల నారుమడుల్లో రసం పీల్చే పురుగులు కన్పిస్తే లీటరు నీటికి 2 మిల్లీలీటర్ల డైమిథోయేట్ లేదా 1.5 గ్రాముల ఎసిఫేట్ చొప్పున కలిపి పిచికారీ చేసుకోవాలి. నారుకుళ్లు తెగులు సోకితే లీటరు నీటికి 3 గ్రాముల చొప్పున కాపర్ ఆక్సీక్లోరైడ్ కలిపి, ఆ మందు ద్రావణంతో నారుమడిని తడపాలి. -
24 గంటల్లో మరో అల్పపీడనం?
విశాఖపట్నం: వాయువ్య బంగాళాఖాతంలో సముద్రమట్టానికి 1.5 కి.మీ. నుంచి 5.8 కి.మీ. ఎత్తున ఉపరితల ఆవర్తన ద్రోణి ఆవరించి ఉంది. దీని ప్రభావంతో రాగల 24 గంటల్లో అదే ప్రాంతంలో అల్పపీడనం ఏర్పడే అవకాశాలున్నట్టు వాతావరణ నిపుణులు చెబుతున్నారు. దీంతో నైరుతి రుతుపవనాలు మళ్లీ చురుగ్గా మారి ఆంధ్రప్రదేశ్, తెలంగాణల్లో విస్తారంగా వర్షాలు కురిసే అవకాశాలున్నట్టు పేర్కొన్నారు. ఒడిశా నుంచి కోస్తా, తెలంగాణ, రాయలసీమ మీదుగా దక్షిణ తమిళనాడు వరకు అల్పపీడన ద్రోణి కొనసాగుతోంది. దీని ప్రభావంతో ఉత్తర కోస్తాలో పలుచోట్ల మోస్తరు నుంచి భారీ వర్షాలు, దక్షిణ కోస్తా, రాయలసీమ, తెలంగాణల్లో ఒకటి రెండు చోట్ల ఉరుములతో కూడిన జల్లులు పడే అవకాశాలున్నట్టు వాతావరణ శాఖ వెల్లడించింది. శ్రీకాకుళం, విజయనగరం, విశాఖపట్నం, తూర్పు గోదావరి జిల్లాల్లో కొన్ని చోట్ల భారీ వర్షాలు, ఉభయ గోదావరి, కృష్ణా జిల్లాల్లో వర్షాలు కురుస్తాయని తెలిపింది. కోస్తాంధ్రపై గంటకు 45 నుంచి 50 కి.మీ. వేగంతో గాలులు వీస్తాయని తెలిపారు. -
అల్లకల్లోలంగా సముద్రం
పడవలు బోల్తా: ఒకరి మృతి భీమునిపట్నం/భోగాపురం/బాపట్ల: సముద్రం సోమవారం అల్లకల్లోలంగా మారింది. విశాఖపట్నం జిల్లా భీమిలి వద్ద ఒక ఇల్లు, వృక్షాలు కూలిపోగా విజయనగరం జిల్లాలో నాలుగు పడవలు బోల్తాపడి ఒక మత్స్యకారుడు మృతి చెందాడు. గుంటూరు జిల్లా బాపట్ల మండలం సూర్యలంకలో సముద్రం 30 అడుగులు ముందుకొచ్చింది. భీమిలి తీరం వద్ద ఉదయం ఆరుగంటల నుంచి అలలు బాగా ముందుకు చొచ్చుకొచ్చాయి. మంగమారిపేటలోని ఓ ఇంటితో పాటు, పలు వృక్షాలు కూలిపోయాయి. చేపలుప్పాడ వద్ద భీమిలి-విశాఖ రోడ్డు వరకు సముద్రపు నీరు వచ్చింది. విశాఖపట్నం తీరంలో సముద్రం అలల ఉధృత్జిట ఆక్వా స్పోర్ట్సు కాంప్లెక్స్ ఎదురుగా బంకరొకటి బయటపడింది. కొనసాగుతున్న ఉపరితల ద్రోణి వాయవ్య బంగాళాఖాతంలో ఏర్పడ్డ అల్పపీడనం కొనసాగుతోంది. మరోవైపు ఒరిస్సా నుంచి కోస్తాంధ్ర, తెలంగాణ మీదుగా దక్షిణ తమిళనాడు వరకు ఉపరితల ద్రోణి కొనసాగుతున్నట్టు వాతావరణ శాఖ తెలిపింది. వీటి ప్రభావంతో రాగల 24 గంటల్లో తెలంగాణలోని అన్ని జిల్లాల్లోను, కోస్తాంధ్రలోని శ్రీకాకుళం, విజయనగరం, విశాఖపట్నం, ఉభయ గోదావరి, కృష్ణా జిల్లాల్లో భారీ వర్షాలు కురిసే అవకాశాలున్నట్టు వెల్లడించింది. దక్షిణ కోస్తా, రాయలసీమలో కొన్ని ప్రాంతాల్లో ఉరుములతో కూడిన జల్లులు కురుస్తాయని పేర్కొంది. -
బంగాళాఖాతంలో అల్పపీడనం
సాక్షి, విశాఖపట్నం: వాయవ్య బంగాళాఖాతంలో ఒడిశా, పశ్చిమ బెంగాల్ మధ్య అల్పపీడనం ఏర్పడింది. అదే ప్రాంతంలో సముద్రమట్టానికి 7.6 కి.మీ. ఎత్తున ఉపరితల ఆవర్తనం నైరుతి దిశగా కొనసాగుతోంది. మరోవైపు ఒడిశా నుంచి ఆంధ్రప్రదేశ్ మీదుగా దక్షిణ తమిళనాడు వరకు అల్పపీడన ద్రోణి కొనసాగుతోంది. వీటి ప్రభావంతో నైరుతి రుతుపవనాలు చురుగ్గా మారాయి. రాగల 24 గంటల్లో ఆంధ్రప్రదేశ్‌లోని శ్రీకాకుళం, విజయనగరం, విశాఖపట్నం, ఉభయ గోదావరి జిల్లాలు, కృష్ణా, తెలంగాణలోని ఆదిలాబాద్, నిజామాబాద్, కరీంనగర్, ఖమ్మం, వరంగల్, రంగారెడ్డి జిల్లాల్లో మోస్తరు నుంచి భారీ వర్షాలు కురిసే అవకాశాలున్నట్టు వాతావరణ శాఖ వెల్లడించింది. ఆంధ్రప్రదేశ్‌లోని రాయలసీమలో మోస్తరు వర్షాలు కురిసే అవకాశాలున్నట్టు పేర్కొంది. ఆదివారంనాటికి అల్పపీడనం మరింత బలపడి ఆంధ్రప్రదేశ్, తెలంగాణల్లో విస్తారంగా వర్షాలు కురుస్తాయని వెల్లడించింది. -
45 మండలాల్లో వర్షం
అత్యధికంగా మిర్యాలగూడలో 81.6 మి.మీ.. - అత్యల్పం బొమ్మలరామారంలో 2 మి.మీ నమోదు - రోహిణీకార్తె ప్రారంభం రోజునే కరుణించిన వరుణుడు - భూమి పదును కావడంతో దుక్కులు దున్నేందుకు సిద్ధమవుతున్న రైతులు నల్లగొండ అగ్రికల్చర్, న్యూస్‌లైన్, వాయువ్య బంగాళాఖాతంలో ఏర్పడిన అల్పపీడన ద్రోణి కారణంగా ఆదివారం అర్ధరాత్రి దాటిన తరువాత ఈదురుగాలులతో కూడిన వర్షం కురిసింది. రోహిణీ కార్తె ప్రారంభం రోజే వర్షం పడడంతో అన్నదాతలు ఖరీఫ్ ఏరువాకకు సిద్ధమవుతున్నారు. చందంపేట, డిండి, మఠంపల్లి, హుజూర్నగర్, మేళ్లచెర్వు, కోదాడ, చిలుకూరు, తుంగతుర్తి, నూతన్‌కల్, ఆత్మకూరు(ఎస్), చివ్వెంల, మోతె, నడిగూడెం, మునగాల మండలాలు మినహా మిగతా 45 మండలాలలో వర్షం కురిసింది. జిల్లాలో సగటు వర్షపాతం 24.8 మిల్లీమీటర్లుగా నమోదైంది. అత్యధికంగా మిర్యాలగూడ మండలంలో 81.6 మిల్లీమీటర్లు, అత్యల్పంగా బొమ్మలరామారం మండలంలో 2 మిల్లీమీటర్లు కురిసింది. తుర్కపల్లిలో 43.6, రాజాపేటలో 56.6, యాదగిరిగుట్టలో 37.6, ఆలేరులో 36, గుండాలలో 60, తిరుమలగిరిలో 28 మిల్లీమీటర్ల వర్షం కురిసింది. అదే విధంగా జాజిరెడ్డిగూడెంలో 36, శాలిగౌరారం 40.4, మోత్కూరులో 56.4, ఆత్మకూర్(ఎం) 19.2, వలిగొండలో 38.2, భువనగిరిలో 43.2, బీబీనగర్‌లో 8.6. మిల్లిమీటర్ల వర్షం కురిసింది. దీంతోపాటు పోచంపల్లిలో 6, చౌటుప్పల్‌లో 19.6, రామన్నపేటలో 28.6, చిట్యాలలో 14, నార్కట్‌పల్లిలో 34.8, సూర్యాపేటలో 10.8, పెన్‌పహాడ్‌లో 3.4, వేములపల్లిలో 62.02, తిప్పర్తిలో 32.8. నల్లగొండలో 35.2, మునుగోడు 20 మిల్లిమీటర్ల వర్షం కురిసింది. అదే విధంగా నారాయణపూర్‌లో 10, మర్రిగూడలో 4.6, చండూరులో 50.8, కనగల్‌లో 31, నిడమనూరులో 62.2, త్రిపురారంలో 60.6, గరిడేపల్లిలో 2.4, నేరేడుచర్లలో 47.2 మిల్లిమీటర్ల వర్షం కురిసింది. దామరచర్లలో 67.2, అనుములలో 54.4, పెద్దవూరలో 15.2, పీఏపల్లి 3, గుర్రంపోడులో 9, నాంపల్లిలో 25.6, చింతపల్లిలో 5, దేవరకొండలో 4.6 మిల్లిమీటర్ల వర్షం కురిసింది. చాలా మండలాలలో పదునయ్యే వర్షం పడడంతో అన్నదాతలు దుక్కులు దున్నడం మొదలుపెట్టారు. జూన్ మొదటివారంలో మృగశిరకార్తె ప్రారంభం కానుంది. దీంతో ఇప్పటినుంచే దుక్కులు దున్నుకుని సిద్ధంగా ఉంచుకుని మరోసారి వర్షం కురవగానే పత్తి విత్తనాలను విత్తుకోవడానికి రైతులు సన్నద్ధమవుతున్నారు. -
వాయవ్య బంగాళాఖాతంలో అల్పపీడనం
వాయవ్య బంగాళాఖాతంలో అల్పపీడనం ఏర్పడింది, దాంతో ఉపరితం ఆవర్తనం కొనసాగుతోందని విశాఖపట్నంలోని వాతావరణ శాఖ బుధవారం ఓ ప్రకటనలో వెల్లడించింది. ఉత్తర కోస్తా, తెలంగాణ, దక్షిణ కోస్తా, రాయలసీమ ప్రాంతాల్లో వర్షాలు పడే అవకాశం ఉందని వాతావరణ శాఖ తెలిపింది. -
స్థిరంగా కొనసాగుత్ను అల్పపీడన ద్రోణి
సాక్షి, విశాఖపట్నం : వాయవ్య బంగాళాఖాతంలో ఒడిశా, పశ్చిమబెంగాల్‌ను ఆనుకుని రెండు రోజుల క్రితం ఏర్పడిన అల్పపీడనం స్థిరంగానే కొనసాగుతోంది. అదే సమయంలో ఒడిశా నుంచి కోస్తాంధ్ర మీదుగా దక్షిణ తమిళనాడు వరకు అల్పపీడన ద్రోణి కొనసాగుతోందని విశాఖలోని తుపాను హెచ్చరికల కేంద్రం అధికారులు తెలిపారు. వీటన్నింటి కారణంగా రాష్ట్రంలో రానున్న 24గంటల్లో ఉత్తర కోస్తాంధ్రలో కొన్ని చోట్ల భారీ వర్షాలు, దక్షిణ కొస్తాంధ్రలోని అక్కడక్కడ విస్తారంగా వర్షాలు పడే అవకాశం ఉందని అధికారులు తెలిపారు. నైరుతి రుతుపవనాలు చురుకుగానే ఉన్నాయన్నారు. రాష్ట్రంలో ఆదివారం ఉదయం నుంచి సోమవారం ఉదయం వరకు కళింగపట్నంలో 5సెం.మీ, సోంపేట, మందసలలో 4, కొమరాడ, నర్సాపురం, పాతపట్నం, టెక్కలి, వీరఘట్టం, బీమునిపట్నం, తెర్లాం ప్రాంతాల్లో 3సెం.మీ చొప్పున వర్షం పడింది. తెలంగాణలో ఇల్లెందులో 7సెం.మీ, దమ్ముగూడెంలో 6, భద్రాచలంలో 4 సెం.మీ వాన పడింది. మంగళవారం సాయంత్రంలోపు కోస్తాంధ్రలో చాలాచోట్ల, తెలంగాణలో కొన్ని చోట్ల, రాయలసీమలో అక్కడక్కడ వర్షాలు పడే అవకాశం ఉంది. శ్రీకాకుళం, విజయనగరం, విశాఖపట్నం, కృష్ణా, గుంటూరు, ఉభయగోదావరి జిల్లాల్లో రానున్న 48గంటల్లో భారీ వర్షాలు పడే అవకాశం ఉందని భారత వాతావరణశాఖ హెచ్చరించింది. ఆకాశం మేఘావృతమై ఉంటుంది. గరిష్ట/కనిష్ట ఉష్ణోగ్రతలు కొన్ని చోట్ల 32, 23డిగ్రీలుగా నమోదయ్యే అవకాశాలున్నాయని తెలిపింది. -
తెలంగాణకు భారీ వర్ష సూచన
సాక్షి, విశాఖపట్నం: ఉత్తర ఒరిస్సా, జార్ఖండ్, పశ్చిమ బెంగాల్‌ను అనుసరించి వాయవ్య బంగాళాఖాతం మీదుగా వాయుగుండం ఏర్పడినట్టు భారత వాతావరణ శాఖ అధికారులు తెలిపారు. ఇది క్రమేపీ పశ్చిమ, వాయవ్య దిశగా పయనించి అల్పపీడన ద్రోణిగా మారే అవకాశాలున్నట్టు పేర్కొన్నారు. అల్పపీడన ద్రోణి కూడా ఒరిస్సా నుంచి దక్షిణ తమిళనాడు వరకు కోస్తాంధ్ర మీదుగా కొనసాగుతున్నట్టు తెలిపారు. దీని ప్రభావంతో చాలాచోట్ల వర్షాలు పడే అవకాశాలున్నాయన్నారు. రాగల 48గంటల్లో కోస్తాంధ్రతో పాటు తెలంగాణలో భారీవర్షం పడే అవకాశాలు ఉన్నాయని వివరించారు.