సాక్షి, అమరావతి/విశాఖపట్నం: వాయువ్య బంగాళాఖాతంలో అల్పపీడనం ఏర్పడినట్లు వాతావరణ శాఖ తెలిపింది. దానికి అనుబంధంగా మరో ఉపరితల ఆవర్తనం ఒడిశా, పశ్చిమ బెంగాల్ తీరాల వరకు విస్తరించింది. దీని ఫలితంగా రాబోయే రెండ్రోజుల్లో ఇవి ఉత్తర ఒడిశా, జార్ఖండ్ మీదుగా కదిలే అవకాశముంది. వీటి ప్రభావం రాష్ట్రంపై పెద్దగా ఉండే అవకాశం లేకపోయినా ఓ మోస్తరు వర్షాలు పడతాయని భారత వాతావరణ శాఖాధికారులు (ఐఎండీ) ఆదివారం రాత్రి తెలిపారు.
ప్రధానంగా ఉత్తరాంధ్రలో వర్షాలు పడే అవకాశం ఎక్కువగా ఉన్నట్లు పేర్కొన్నారు. మరోవైపు.. నైరుతి రుతుపవనాలు బలంగా ఉండడంతో ఈ నెల 29వ తేదీ వరకు రాష్ట్రవ్యాప్తంగా వర్షాలు కురుస్తాయని వారు తెలిపారు. కాగా, అల్పపీడనం ప్రభావంతో సముద్రం అలజడిగా ఉంటుందని మత్స్యకారులు చేపల వేటకు వెళ్లవద్దని విశాఖ తుపాను హెచ్చరికల కేంద్రం సూచించింది.
ఇక ఆదివారం తూర్పుగోదావరి, శ్రీకాకుళం, గుంటూరు, నంద్యాల, పార్వతీపురం మన్యం జిల్లాల్లో మోస్తరు నుంచి భారీ వర్షాలు కురిశాయి. పైడిమెట్ట (తూర్పు గోదావరి)లో 5.9, ఆమదాలవలస (శ్రీకాకుళం)లో 4.1, రావెల (గుంటూరు)లో 4, జియ్యమ్మవలస (పార్వతీపురం మన్యం)లో 4, ముత్తాల (అనంతపురం)లో 3.4, జొన్నగిరి (కర్నూలు) 3.2 సెం.మీ.ల చొప్పున వర్షపాతం నమోదైంది.
రాష్ట్రంలో లోటు వర్షపాతం
నైరుతి రుతుపవనాల రాక ఆలస్యం ప్రభావం రాష్ట్రంపై స్పష్టంగా కనిపిస్తోంది. వీటి ఆగమనంలో జాప్యం జరగడంతో సకాలంలో వర్షాలు కురవక 20 జిల్లాల్లో లోటు వర్షపాతానికి దారితీసింది. నాలుగు జిల్లాల్లో సాధారణం, రెండు జిల్లాల్లో మాత్రమే అధిక వర్షపాతం నమోదైంది.
జూన్ ఒకటి నుంచి మొదౖలెన నైరుతి రుతుపవనాల సీజనులో ఇప్పటివరకు రాష్ట్రంలోకెల్లా అత్యల్పంగా నెల్లూరు జిల్లాలో సాధారణం కంటే 68.1 శాతం లోటు వర్షపాతం రికార్డయింది. ఆ జిల్లాలో 45.8 మి.మీ.ల వర్షపాతం నమోదు కావలసి ఉండగా ఇప్పటివరకు 14.6 మి.మీ.లు మాత్రమే వర్షం కురిసింది.
అత్యధికంగా బాపట్ల జిల్లాలో సాధారణంకంటే 38.5 శాతం అధిక వర్షపాతం నమోదైంది. అక్కడ సాధారణ వర్షపాతం 58.2 మి.మీ.లకు గాను 81.2 మి.మీ.ల వర్షపాతం రికార్డయింది. ఇక సాధారణ వర్షపాతం నమోదైన జిల్లాలో కృష్ణా, పల్నాడు, శ్రీసత్యసాయి, చిత్తూరు జిల్లాలున్నాయి. ఈ సీజనులో ఇప్పటివరకు సగటున 84.2 మి.మీల వర్షపాతం కురవాల్సి ఉండగా, 56 మి.మీలు మాత్రమే కురిసింది.
Comments
Please login to add a commentAdd a comment