అల్లకల్లోలంగా సముద్రం
పడవలు బోల్తా: ఒకరి మృతి
భీమునిపట్నం/భోగాపురం/బాపట్ల: సముద్రం సోమవారం అల్లకల్లోలంగా మారింది. విశాఖపట్నం జిల్లా భీమిలి వద్ద ఒక ఇల్లు, వృక్షాలు కూలిపోగా విజయనగరం జిల్లాలో నాలుగు పడవలు బోల్తాపడి ఒక మత్స్యకారుడు మృతి చెందాడు. గుంటూరు జిల్లా బాపట్ల మండలం సూర్యలంకలో సముద్రం 30 అడుగులు ముందుకొచ్చింది. భీమిలి తీరం వద్ద ఉదయం ఆరుగంటల నుంచి అలలు బాగా ముందుకు చొచ్చుకొచ్చాయి. మంగమారిపేటలోని ఓ ఇంటితో పాటు, పలు వృక్షాలు కూలిపోయాయి. చేపలుప్పాడ వద్ద భీమిలి-విశాఖ రోడ్డు వరకు సముద్రపు నీరు వచ్చింది. విశాఖపట్నం తీరంలో సముద్రం అలల ఉధృత్జిట ఆక్వా స్పోర్ట్సు కాంప్లెక్స్ ఎదురుగా బంకరొకటి బయటపడింది.
కొనసాగుతున్న ఉపరితల ద్రోణి
వాయవ్య బంగాళాఖాతంలో ఏర్పడ్డ అల్పపీడనం కొనసాగుతోంది. మరోవైపు ఒరిస్సా నుంచి కోస్తాంధ్ర, తెలంగాణ మీదుగా దక్షిణ తమిళనాడు వరకు ఉపరితల ద్రోణి కొనసాగుతున్నట్టు వాతావరణ శాఖ తెలిపింది. వీటి ప్రభావంతో రాగల 24 గంటల్లో తెలంగాణలోని అన్ని జిల్లాల్లోను, కోస్తాంధ్రలోని శ్రీకాకుళం, విజయనగరం, విశాఖపట్నం, ఉభయ గోదావరి, కృష్ణా జిల్లాల్లో భారీ వర్షాలు కురిసే అవకాశాలున్నట్టు వెల్లడించింది. దక్షిణ కోస్తా, రాయలసీమలో కొన్ని ప్రాంతాల్లో ఉరుములతో కూడిన జల్లులు కురుస్తాయని పేర్కొంది.