Vizag district
-
గొల్లలపాలెంలో వింత పెళ్లి..
గొర్రెలు, మేకల జంటల వివాహాలు గురువారం ఘనంగా జరిగాయి. ఈ సామూహిక వివాహతంతుకి గొల్లలపాలెం వేదికయింది. ఆత్మీయులందరూ తరలివచ్చారు. కొత్త జంటల్ని ఆశీర్వదించారు. మీరు చదువుతున్నది నిజమే. ఇదొక సంప్రదాయం. రావికమతం(చోడవరం): మందల్లో ఉండే జంతువులు రోగాలపాలవకుండా.. సంతానాభివృద్ధి కోసం ఇలా పెళ్లిళ్లు జరిపిస్తామని చెబుతున్నారు యాదవులు. తమ పూరీ్వకులు పాటించిన ఆచారాన్నే తాము కొనసాగిస్తున్నామని వివరించారు. పెళ్లి ఇలా.. మందలో ఉండే గొర్రెపోతుతో గొర్రెలకు.. మేకపోతుతో మేకలకు పెళ్లి జరిపిస్తారు. ప్రతీ ఏటా కనుమ పండగ రోజున దీనికి ముహూర్తంగా నిర్ణయిస్తారు. పెళ్లిరోజు ఉదయాన్నే గ్రామంలోని వారు సమీపంలోని పుట్టవద్దకు చేరుకుంటారు. తమ మందల్లోని గొర్రెలు, మేకలకు పసుపురాసి బొట్టుపెడతారు. ధూపం కూడా వేస్తారు. ఆపై ‘మాంగళ్యధారణ’ చేస్తారు. అనంతరం గొర్రెలు, మేకల చెవుల చిగుర్లను కోసి పుట్టలో వేస్తారు. గురువారం కనుమ సందర్భంగా ఈ వేడుక నిర్వహించారు. ఇది తమ వంశాచారమని రైతులు పల్లా చినబాబు,దేముడుబాబు,గోపన్న చెప్పారు. -
నర్సీపట్నం.. సంకల్పానికి సిద్ధం
సాక్షి, విశాఖపట్నం: ప్రజాకంటక పాలనను తుదముట్టించేందుకు.. నూతన అధ్యాయాన్ని లిఖించేందుకు.. తాడిత, పీడిత బతుకుల్లో వెలుగులు నింపే లక్ష్యంతో వైఎస్సార్ కాంగ్రెస్ పార్టీ అధ్యక్షుడు, ఏపీ శాసనసభ ప్రతిపక్ష నేత వైఎస్ జగన్మోహన్రెడ్డి నిర్వహిస్తున్న ప్రజాసంకల్ప యాత్ర శనివారం ఏజెన్సీ ముఖద్వారమైన నర్సీపట్నంలోకి అడుగుపెట్టనుంది. తమ అభిమాననేతకు కనీవినీ ఎరుగని రీతిలో స్వాగతం పలికేందుకు నర్సీపట్నం వాసులు ఉవ్విళ్లూరుతున్నారు. నాతవరం మండలం గన్నవరం మెట్ట వద్ద జిల్లాలో అడుగుపెట్టింది మొదలు జననేత వెంట జనం ఉరుకుతోంది. నాలుగున్నరేళ్ల ప్రస్తుత పాలనలో తాము పడుతున్న కష్టాలను ఎకరవుపెడుతోంది. పాదయాత్ర శనివారం నాతవరం, నర్సీపట్నం మండలాల్లోని గ్రామాల మీదుగా నర్సీపట్నంలోకి అడుగుపెడుతోంది. ఏజెన్సీ ముఖద్వారంలో ఘన స్వాగతం పలికేందుకు నర్సీపట్నం వాసులు ఉరకలేస్తున్నారు. పట్టణ పరిధిలోకి జన హృదయ నేత అడుగు పడగానే ఘన స్వాగతం పలికేందుకు పార్టీ కో ఆర్డినేటర్ పెట్ల ఉమాశంకర్ గణేష్ భారీ ఏర్పాట్లు చేస్తున్నారు. మంగళ వాయిద్యాలు, డప్పు, తీన్ మార్ నృత్యాలు, భజన బృందాలు, కోలాటాలు, తప్పెటగుళ్లు, చిడతమేళాలతో పాటు ఏజెన్సీ సాంప్రదాయ నృత్యమైన థింసా ఇతర గిరిజన కళాప్రదర్శనలతో స్వాగతం పలికేందుకు ఏర్పాట్లు చేశారు. పైగా జిల్లాలో ప్రజాసంకల్పయాత్రలో తొలి సభ నర్సీపట్నంలోనే జరుగనుండడంతో విజయవంతం చేసేందుకు పార్టీ శ్రేణులు విస్తృత ఏర్పాట్లు చేశారు. నియోజకవర్గ పరిధిలోని మారుమూల గ్రామాల నుంచి వేలాదిగా జనం తరలిరానున్నారు. పాదయాత్ర రూట్‌మ్యాప్‌లో విశాఖ ఏజెన్సీ లేకపోవడంతో కాస్త నిరుత్సాహానికి గురైనప్పటికీ ఎలాగైనా జననేతను చూడాలన్న పట్టుదలతో ఏజెన్సీ ప్రాంతం నుంచి పెద్దఎత్తున గిరిజనులు స్వచ్ఛందంగా నర్సీపట్నం సభకు తరలి వచ్చేందుకు సిద్ధమవుతున్నారు. గిరిజన ప్రాంతాల నుంచి ఊళ్లకు ఊళ్లు కదలి వచ్చేందుకు సన్నాహాలు చేసుకుంటున్నారు. నర్సీపట్నం సభ కనీవినీ ఎరుగని రీతిలో విజయవంతం చేయాలన్న పట్టుదలతో పార్టీ శ్రేణులు పట్టణ మంతా పార్టీ తోరణాలు, ఫ్లెక్సీలతో ముంచెత్తారు. పట్టణంలో ఎటుచూసినా సందడి వాతా వరణమే నెలకొంది. ఏ నలుగురు కలిసినా జగనన్న ఎప్పుడు వస్తారు? ఏ రూట్లో వస్తారు? ఎన్ని గంటలకు వస్తారు? సభ ఎలా జరుగుతుంది? వంటి అంశాలపైనే చర్చించుకుంటున్నారు. నర్సీపట్నం జనసంద్రమయ్యే అవకాశాలుండడంతో శనివారం ప్రైవేటు కార్పొరేట్ విద్యా సంస్థలకు సెలవు ఇచ్చారు. పాదయాత్ర సాగే, సభ జరిగే ప్రాంతాలను పార్టీ ప్రోగ్రామ్స్ కమిటీ రాష్ట్ర కన్వీనర్ తలశిల రఘురాం, పార్టీ కో ఆర్డినేటర్ పెట్ల ఉమాశంకర గణేష్‌లు పరిశీలించారు. నేటి పాదయాత్ర సాగేదిలా.. నాతవరం మండలం ములగపూడి శివారులో బసచేసిన జననేత శనివారం ఉదయం 7.30 గంటలకు జిల్లాలో మూడో రోజు పాదయాత్రకు శ్రీకారం చుడతారు. 239వ రోజు ములగపూడి నుంచి ప్రారంభం కానున్న పాదయాత్ర నాతవరం మండలం బెన్నవరం మీదుగా మొండికండి క్రాస్ వద్ద నర్సీపట్నం మండలంలోకి అడుగుపెడుతుంది. మొండికండి క్రాస్ దాటగానే కొద్దిదూరంలోనే కళ్లెంపూడి వద్ద నర్సీపట్నం మున్సిపాల్టీ పరిధిలోకి పాదయాత్ర ప్రవేశిస్తుంది. అక్కడ నుంచి కృష్ణాపురం, సీతయ్యపాలెం, పాతబైపురెడ్డిపాలెం మీదుగా కొత్తబైపురెడ్డిపాలెం (దుర్గాడ క్రాస్) వద్ద భోజన విరామానికి ఆగుతారు. అనంతరం మధ్యాహ్నం 3 గంటలకు బయల్దేరి బలిఘట్టం మీదుగా నర్సిపట్నంలోకి పాదయత్ర అడుగు పెడుతుంది. టౌన్‌లోని తుని రోడ్డులోని పెద్ద చెరువు మీదుగా పాతబస్టాండ్, అబిడ్స్ సెంటర్, పాల్ఘాట్ జంక్షన్, ఆర్టీసీ కాంప్లెక్స్ మీదుగా పాదయాత్ర సాగుతుంది. శ్రీకన్యడౌన్ వద్ద ఏర్పాటు చేసిన బహిరంగసభలో సాయంత్రం 3.30 గంటలకు ప్రజలనుద్దేశించి మాట్లాడతారు. అనంతరం పెదబొడ్డేపల్లి గురుకుల పాఠశాల వద్ద ఏర్పాటు చేసిన బసకు చేరుకోవడంతో మూడోరోజు పాదయాత్ర ముగుస్తుంది. -
రెండు లారీలు ఢీ... ఇద్దరికి తీవ్రగాయాలు
నక్కపల్లి: విశాఖ జిల్లా నక్కపల్లిలో సోమవారం రాత్రి ఆగి ఉన్న లారీని వెనుక నుంచి వచ్చిన మరో లారీ ఢీకొంది. విశాఖ వైపు వెళ్లే రోడ్డులో ఈ ప్రమాదం జరిగింది. ఢీకొన్న లారీలో డ్రైవర్, క్లీనర్ ఇరుక్కుపోయారు. వారికి తీవ్ర గాయాలైనట్టు తెలుస్తోంది. స్థానికులు వారిని కాపాడేందుకు చర్యలు చేపట్టారు. -
ట్రాక్టర్ బోల్తా..నలుగురికి తీవ్రగాయాలు
విశాఖపట్నం: విశాఖ జిల్లాలో బుధవారం జరిగిన ప్రమాదంలో నలుగురికి తీవ్ర గాయాలయ్యాయి. చోడవరం మండలం వెంకన్నపాలెం జంక్షన్ వద్ద చెరుకు లోడుతో వెళ్తున్న ట్రాక్టర్ బుధవారం మధ్యాహ్నం ప్రమాదవశాత్తూ బోల్తా పడింది. ఈ ఘటనలో నలుగురు వ్యక్తులతో పాటు చిన్నారులు తీవ్రంగా గాయపడినట్లు తెలుస్తుంది. క్షతగాత్రులను చోడవరం ప్రభుత్వాసుపత్రికి తరలించి చికిత్స అందిస్తున్నారు. -
విశాఖజిల్లాలో పురాతన విగ్రహం లభ్యం
యలమంచిలి: విశాఖపట్నం జిల్లాలో శుక్రవారం ఓ పురాతన విగ్రహం బయటపడింది. యలమంచిలి మండలం రామచంద్రమ్మ కొండపై తవ్వకాలు జరుపుతున్న సమయంలో శ్రీ వెంకటేశ్వర స్వామి విగ్రహం లభించింది. ఈ విగ్రహం14వ శతాబ్దానికి చెందిందని స్థానికులు భావిస్తున్నారు. వెంకటేశ్వర స్వామి విగ్రహన్ని చూడటానికి గ్రామస్థుల భారీగా తరలివస్తున్నారు. దీంతో గ్రామస్థులు పురావస్తు శాఖ అధికారులకు సమాచారం అందించారు. -
తెలుగు తమ్ముళ్ల ఢిష్యుం ఢిష్యుం
-
విశాఖ జిల్లాలో స్కూల్ హెడ్మాస్టర్ దారుణహత్య
విశాఖ: జిల్లాలో గురువారం దారుణం చోటుచేసుకుంది. ఓ స్కూల్ హెడ్మాస్టర్ దారుణహత్యకు గురయ్యాడు. ఈ ఘటన విశాఖ జిల్లాలోని సబ్బవరం మండలం అమృతాపురం శివారు ప్రాంతంలో చోటుచేసుకుంది. హెడ్ మాస్టర్ మృతదేహం అమృతాపురం శివారు ప్రాంతంలో లభ్యమైనట్టు పోలీసులు తెలిపారు. సత్యనారాయణ అనే స్కూల్ హెడ్మాస్టర్గా గుర్తించారు. మృతుడు నంగనవరంపాడు పాఠశాల ఉద్యోగిగా పనిచేస్తున్నట్టు పోలీసులు పేర్కొన్నారు. కేసు నమోదు చేసి దర్యాప్తు జరుపుతున్నారు. -
విశాఖ జిల్లాలో రోడ్డుప్రమాదం: ముగ్గురు మృతి
విశాఖ: జిల్లాలో గొడిచర్ల వద్ద శనివారం తెల్లవారుజామున రోడ్డుప్రమాదం సంభవించింది. ఈ రోడ్డుప్రమాదంలో ముగ్గురు అక్కడిక్కడే మృతిచెందగా, మరో ఇద్దరికి తీవ్రగాయాలయ్యాయి. ఆగిఉన్న లారీని వేగంగా వస్తున్న కారు ఢీకొట్టడంతో ఈ ఘటన చోటుచేసుకున్నట్టు తెలుస్తోంది. అతివేగమే ఈ ప్రమాదానికి కారణమని తెలుస్తోంది. సమాచారం అందుకున్న పోలీసులు ఘటనా స్థలికి చేరుకుని పరీశీలించారు. క్షతగాత్రుల పరిస్థితి విషమించడంతో వారిని చికిత్స నిమిత్తం ఆస్పత్తికి తరలించినట్టు పోలీసులు తెలిపారు. పోలీసులు కేసు నమోదు చేసి దర్యాప్తు జరుపుతున్నారు. కాగా, మృతుల వివరాలు ఇంకా తెలియరాలేదు. -
విశాఖ జిల్లాలో గ్రామస్తుల ఆందోళన
విశాఖపట్నం: జిల్లాలోని కాకానినగర్లో మంగళవారం గ్రామస్తులు ఆందోళనకు దిగారు. హుదూద్ తుపాను కారణంగా విశాఖ జిల్లాలో విద్యుత్ నిలిచిపోయింది. దీంతో ఆ ప్రాంతం మొత్తం అందకారమైంది. 10 రోజలు గడిచినా విద్యుత్ ఇవ్వటలేదంటూ వారు వాపోతున్నారు. విద్యుత్ లేక తాము చీకట్లో అవస్థలు పడుతుంటే అధికారులు మౌనం వహించడంపై గ్రామస్తులు మండిపడుతున్నారు. అధికారుల నిర్లక్ష్యానికి నిరసనగా అక్కడి గ్రామస్తులు ఆందోళన వ్యక్తం చేస్తున్నారు. -
ఇది ఏడడుగుల ‘తలకట్టు’..
పొడుగాటి జడ ఆడవారికి అలంకారంగా భావించడం కద్దు. కానీ, ఇక్కడ చిత్రంలో కనబడుతున్న వృద్ధుని జుట్టు చూస్తే ఎవరైనా ఔరా అనకమానరు. జడలు కట్టిన ఇతని జుట్టు అరికాళ్ల వరకూ పెరగడంతో ఆగక నేలపై పారాడుతోంది. విశాఖ జిల్లా బుచ్చియ్యపేట మండ లం విజయరామరాజుపేటకు చెందిన ఆడారి సీతారాం బాబా 30 ఏళ్ల క్రితం సన్యాసం తీసుకున్నారు. అప్పటి నుంచి పెరిగిన ఆయన జుట్టు ఇప్పుడు ఏడడుగులకు చేరింది. గురువారం ఆయన తూర్పు గోదావరి జిల్లా తుని వచ్చారు. అయోధ్యలోని బాబా మణిరామ్ దాజీ కా చోటీ చౌవుని ఆశ్రమంలో గురూపదేశం పొంది, సన్యాసిగా మారానని ‘సాక్షి’కి తెలిపారు. - తుని -
అల్లకల్లోలంగా సముద్రం
పడవలు బోల్తా: ఒకరి మృతి భీమునిపట్నం/భోగాపురం/బాపట్ల: సముద్రం సోమవారం అల్లకల్లోలంగా మారింది. విశాఖపట్నం జిల్లా భీమిలి వద్ద ఒక ఇల్లు, వృక్షాలు కూలిపోగా విజయనగరం జిల్లాలో నాలుగు పడవలు బోల్తాపడి ఒక మత్స్యకారుడు మృతి చెందాడు. గుంటూరు జిల్లా బాపట్ల మండలం సూర్యలంకలో సముద్రం 30 అడుగులు ముందుకొచ్చింది. భీమిలి తీరం వద్ద ఉదయం ఆరుగంటల నుంచి అలలు బాగా ముందుకు చొచ్చుకొచ్చాయి. మంగమారిపేటలోని ఓ ఇంటితో పాటు, పలు వృక్షాలు కూలిపోయాయి. చేపలుప్పాడ వద్ద భీమిలి-విశాఖ రోడ్డు వరకు సముద్రపు నీరు వచ్చింది. విశాఖపట్నం తీరంలో సముద్రం అలల ఉధృత్జిట ఆక్వా స్పోర్ట్సు కాంప్లెక్స్ ఎదురుగా బంకరొకటి బయటపడింది. కొనసాగుతున్న ఉపరితల ద్రోణి వాయవ్య బంగాళాఖాతంలో ఏర్పడ్డ అల్పపీడనం కొనసాగుతోంది. మరోవైపు ఒరిస్సా నుంచి కోస్తాంధ్ర, తెలంగాణ మీదుగా దక్షిణ తమిళనాడు వరకు ఉపరితల ద్రోణి కొనసాగుతున్నట్టు వాతావరణ శాఖ తెలిపింది. వీటి ప్రభావంతో రాగల 24 గంటల్లో తెలంగాణలోని అన్ని జిల్లాల్లోను, కోస్తాంధ్రలోని శ్రీకాకుళం, విజయనగరం, విశాఖపట్నం, ఉభయ గోదావరి, కృష్ణా జిల్లాల్లో భారీ వర్షాలు కురిసే అవకాశాలున్నట్టు వెల్లడించింది. దక్షిణ కోస్తా, రాయలసీమలో కొన్ని ప్రాంతాల్లో ఉరుములతో కూడిన జల్లులు కురుస్తాయని పేర్కొంది.