
వైఎస్ జగన్‌మోహన్‌రెడ్డి ఫైల్ ఫోటో ..
సాక్షి, విశాఖపట్నం: ప్రజాకంటక పాలనను తుదముట్టించేందుకు.. నూతన అధ్యాయాన్ని లిఖించేందుకు.. తాడిత, పీడిత బతుకుల్లో వెలుగులు నింపే లక్ష్యంతో వైఎస్సార్ కాంగ్రెస్ పార్టీ అధ్యక్షుడు, ఏపీ శాసనసభ ప్రతిపక్ష నేత వైఎస్ జగన్‌మోహన్‌రెడ్డి నిర్వహిస్తున్న ప్రజాసంకల్ప యాత్ర శనివారం ఏజెన్సీ ముఖద్వారమైన నర్సీపట్నంలోకి అడుగుపెట్టనుంది. తమ అభిమాననేతకు కనీవినీ ఎరుగని రీతిలో స్వాగతం పలికేందుకు నర్సీపట్నం వాసులు ఉవ్విళ్లూరుతున్నారు.
నాతవరం మండలం గన్నవరం మెట్ట వద్ద జిల్లాలో అడుగుపెట్టింది మొదలు జననేత వెంట జనం ఉరుకుతోంది. నాలుగున్నరేళ్ల ప్రస్తుత పాలనలో తాము పడుతున్న కష్టాలను ఎకరవుపెడుతోంది. పాదయాత్ర శనివారం నాతవరం, నర్సీపట్నం మండలాల్లోని గ్రామాల మీదుగా నర్సీపట్నంలోకి అడుగుపెడుతోంది. ఏజెన్సీ ముఖద్వారంలో ఘన స్వాగతం పలికేందుకు నర్సీపట్నం వాసులు ఉరకలేస్తున్నారు. పట్టణ పరిధిలోకి జన హృదయ నేత అడుగు పడగానే ఘన స్వాగతం పలికేందుకు పార్టీ కో ఆర్డినేటర్ పెట్ల ఉమాశంకర్ గణేష్ భారీ ఏర్పాట్లు చేస్తున్నారు. మంగళ వాయిద్యాలు, డప్పు, తీన్ మార్ నృత్యాలు, భజన బృందాలు, కోలాటాలు, తప్పెటగుళ్లు, చిడతమేళాలతో పాటు ఏజెన్సీ సాంప్రదాయ నృత్యమైన థింసా ఇతర గిరిజన కళాప్రదర్శనలతో స్వాగతం పలికేందుకు ఏర్పాట్లు చేశారు.
పైగా జిల్లాలో ప్రజాసంకల్పయాత్రలో తొలి సభ నర్సీపట్నంలోనే జరుగనుండడంతో విజయవంతం చేసేందుకు పార్టీ శ్రేణులు విస్తృత ఏర్పాట్లు చేశారు. నియోజకవర్గ పరిధిలోని మారుమూల గ్రామాల నుంచి వేలాదిగా జనం తరలిరానున్నారు. పాదయాత్ర రూట్‌మ్యాప్‌లో విశాఖ ఏజెన్సీ లేకపోవడంతో కాస్త నిరుత్సాహానికి గురైనప్పటికీ ఎలాగైనా జననేతను చూడాలన్న పట్టుదలతో ఏజెన్సీ ప్రాంతం నుంచి పెద్దఎత్తున గిరిజనులు స్వచ్ఛందంగా నర్సీపట్నం సభకు తరలి వచ్చేందుకు సిద్ధమవుతున్నారు. గిరిజన ప్రాంతాల నుంచి ఊళ్లకు ఊళ్లు కదలి వచ్చేందుకు సన్నాహాలు చేసుకుంటున్నారు.
నర్సీపట్నం సభ కనీవినీ ఎరుగని రీతిలో విజయవంతం చేయాలన్న పట్టుదలతో పార్టీ శ్రేణులు పట్టణ మంతా పార్టీ తోరణాలు, ఫ్లెక్సీలతో ముంచెత్తారు. పట్టణంలో ఎటుచూసినా సందడి వాతా వరణమే నెలకొంది. ఏ నలుగురు కలిసినా జగనన్న ఎప్పుడు వస్తారు? ఏ రూట్‌లో వస్తారు? ఎన్ని గంటలకు వస్తారు? సభ ఎలా జరుగుతుంది? వంటి అంశాలపైనే చర్చించుకుంటున్నారు. నర్సీపట్నం జనసంద్రమయ్యే అవకాశాలుండడంతో శనివారం ప్రైవేటు కార్పొరేట్ విద్యా సంస్థలకు సెలవు ఇచ్చారు. పాదయాత్ర సాగే, సభ జరిగే ప్రాంతాలను పార్టీ ప్రోగ్రామ్స్ కమిటీ రాష్ట్ర కన్వీనర్ తలశిల రఘురాం, పార్టీ కో ఆర్డినేటర్ పెట్ల ఉమాశంకర గణేష్‌లు పరిశీలించారు.
నేటి పాదయాత్ర సాగేదిలా..
నాతవరం మండలం ములగపూడి శివారులో బసచేసిన జననేత శనివారం ఉదయం 7.30 గంటలకు జిల్లాలో మూడో రోజు పాదయాత్రకు శ్రీకారం చుడతారు. 239వ రోజు ములగపూడి నుంచి ప్రారంభం కానున్న పాదయాత్ర నాతవరం మండలం బెన్నవరం మీదుగా మొండికండి క్రాస్ వద్ద నర్సీపట్నం మండలంలోకి అడుగుపెడుతుంది. మొండికండి క్రాస్ దాటగానే కొద్దిదూరంలోనే కళ్లెంపూడి వద్ద నర్సీపట్నం మున్సిపాల్టీ పరిధిలోకి పాదయాత్ర ప్రవేశిస్తుంది. అక్కడ నుంచి కృష్ణాపురం, సీతయ్యపాలెం, పాతబైపురెడ్డిపాలెం మీదుగా కొత్తబైపురెడ్డిపాలెం (దుర్గాడ క్రాస్) వద్ద భోజన విరామానికి ఆగుతారు.
అనంతరం మధ్యాహ్నం 3 గంటలకు బయల్దేరి బలిఘట్టం మీదుగా నర్సిపట్నంలోకి పాదయత్ర అడుగు పెడుతుంది. టౌన్‌లోని తుని రోడ్డులోని పెద్ద చెరువు మీదుగా పాతబస్టాండ్, అబిడ్స్ సెంటర్, పాల్‌ఘాట్ జంక్షన్, ఆర్టీసీ కాంప్లెక్స్ మీదుగా పాదయాత్ర సాగుతుంది. శ్రీకన్యడౌన్ వద్ద ఏర్పాటు చేసిన బహిరంగసభలో సాయంత్రం 3.30 గంటలకు ప్రజలనుద్దేశించి మాట్లాడతారు. అనంతరం పెదబొడ్డేపల్లి గురుకుల పాఠశాల వద్ద ఏర్పాటు చేసిన బసకు చేరుకోవడంతో మూడోరోజు పాదయాత్ర ముగుస్తుంది.
Comments
Please login to add a commentAdd a comment